సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని హామీల అమలు కోరుతూ కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌లో కేంద్ర ప్రభుత్వం బుధవారం కౌంటర్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌లో ప్రతివాదులైన ఉక్కు శాఖ, ఆదాయపు పన్ను విభాగం ఈ కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేశాయి. ఏపీలోని వైఎస్సార్ జిల్లా, తెలంగాణలోని బయ్యారంలో స్టీలు ఫ్యాక్టరీల ఏర్పాటుకు గల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తూ విభజన చట్టం అమలులోకి వచ్చిన ఆరు నెలల్లో యోగ్యత నివేదిక ఇవ్వాలని మాత్రమే చట్టం చెప్పిందని, ఆయా ఫ్యాక్టరీల ఏర్పాటుకు అనుకూలత లేదని సెయిల్ నివేదిక ఇచ్చిందని ఉక్కు శాఖ పేర్కొంది.
తదుపరి 2016లో టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటైందని వివరించింది. 2017 డిసెంబర్ 12న ఈ కమిటీ చివరిసారిగా సమావేశమైందని, యోగ్యతపై అధ్యయనం చేస్తున్న మెకాన్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వాలు తగిన సమాచారాన్ని పంచుకోవాలని కమిటీ సూచించిందని వివరించింది. అలాగే విభజన చట్టంలో పేర్కొన్న మేరకు పన్ను రాయితీల విషయంలో అదనపు డిప్రిసియేషన్‌ను సాధారణంగా ఇచ్చే 20 శాతానికి అదనంగా మరో 15 శాతం ప్రకటించామని, అలాగే అదనపు పెట్టుబడి భత్యం కింద 15 శాతం ప్రకటించామని ఆదాయపు పన్ను శాఖ తన అఫిడవిట్‌లో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment