కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి (పాత ఫొటో)
సాక్షి, హైదరాబాద్ : ఏపీ పునర్విభజన చట్టాన్ని రెండు రాష్ట్రాల్లో అమలు చేయాలని సీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రం ఈ చట్టాన్ని సరిగ్గా అమలు చేయనందు వల్లే కోర్టుకు వెళ్లామన్నారు. ప్రతిపక్షం బాధ్యతగా తాము చేయాల్సిందింతా చేస్తున్నామని.. రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసమే సుప్రీం కోర్టులో పిటిషన్ వేశామన్నారు. ఇందుకు ప్రతిగా కేంద్రం వివిధ శాఖల ద్వారా కౌంటర్ దాఖలు చేయిస్తోందన్నారు. రెండు రాష్ట్రాల ప్రయోజనం కోసం తన సొంత ఖర్చుతో కేసుకు సంబంధించిన వ్యవహారాలు నిర్వహిస్తున్నానన్న ఆయన.. ఉద్యమ పార్టీ అని చెప్పుకునే టీఆర్‌ఎస్ ఈ విషయంలో ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పొలిటికల్, పర్సనల్ అజెండాతోనే అధికార పార్టీ వ్యవహరిస్తున్నట్లు కనబడుతోందని విమర్శించారు.
శ్వేతపత్రం విడుదల చేయాలి..
ఏపీ పునర్విభజన చట్టం కింద తెలంగాణకు ఎంత మేలు జరిగిందనే విషయాలపై శ్వేతప్రతం విడుదల చేయాలని సుధాకర్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. బయ్యారం ఉక్కు కర్మాగారం సాధన కోసం ముఖ్యమంత్రి, ప్రధానమంత్రికి లక్ష పోస్టు కార్డులు రాసే కార్యక్రమాన్ని చేపట్టామని ఆయన తెలిపారు. బయ్యారం గనులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. రెండు రాష్ట్రాల ప్రయోజనం కోసం కాంగ్రెస్ పార్టీ పాటుపడుతోంటే తెలంగాణ, ఆంధ్ర పరిస్థితులు వేరంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం సరైంది కాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment