సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 అమల్లోకి వచ్చిన తేదీ నాటికి ఉమ్మడి రాష్ట్రంలో పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ప్రాతిపదికన గోదావరి జలాల పంపిణీకి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. నీటి లభ్యత 75 శాతం కంటే అధికంగా ఉన్న మిగులు జలాలపై పూర్తి అధికారాన్ని దిగువ రాష్ట్రానికే బచావత్ ట్రిబ్యునల్ కట్టబెట్టడాన్ని ప్రస్తావించనుంది. విభజన నేపథ్యంలో దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కే మిగులు జలాలపై పూర్తి హక్కులు కల్పించడాన్ని కూడా గోదావరి ట్రిబ్యునల్ ఏర్పాటుకు ప్రాతిపదికగా తీసుకోవాలని కోరాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య గోదావరి, కృష్ణా నదీ జలాల వినియోగంలో తలెత్తిన విభేదాలను పరిష్కరించేందుకు ఈనెల 6న కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశాన్ని నిర్వహించిన విషయం విదితమే. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం(ఐఆర్‌డబ్ల్యూడీఏ)–1956 ప్రకారం ప్రతిపాదనలు పంపితే గోదావరి జలాల పంపిణీకి ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని షెకావత్ పేర్కొన్నారు. ఇందుకు ఏపీ, తెలంగాణ సీఎంలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కె.చంద్రశేఖరరావు అంగీకరించారు.
సీఎంల ఒప్పందాలే ప్రాతిపదికగా..
దేశవ్యాప్తంగా నదీ జలాల వివాదాలను పరిష్కరించి పరీవాహక ప్రాంతాలకు నీటిని కేటాయించేందుకు 1969 ఏప్రిల్ 10న ఆర్‌ఎస్ బచావత్ నేతృత్వంలో డీఎం బండారీ, డీఎం సేన్ సభ్యులుగా ట్రిబ్యునల్ ఏర్పాటైంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు చేసుకున్న ఒప్పందాలు ప్రాతిపదికగా బచావత్ ట్రిబ్యునల్ గోదావరి జలాలను పంపిణీ చేసింది. 75 శాతం నీటి లభ్యత ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌కు 1,430 టీఎంసీల నికర జలాలను కేటాయిస్తూ 1980లో ట్రిబ్యునల్ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పర్ గోదావరి(జీ–1) నుంచి శబరి(జీ–12) వరకు నదీ పరీవాహక ప్రాంతాన్ని 12 ఉప పరీవాహక ప్రాంతాలుగా ట్రిబ్యునల్ విభజించింది. ప్రతి ఉప పరీవాహక ప్రాంతంలో రాష్ట్రాలకు కేటాయించగా మిగులుగా ఉన్న నికర జలాలను వినియోగించుకునే వెసులుబాటును దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు కట్టబెట్టింది. 75 శాతం కంటే అధికంగా నీటి లభ్యత ఉన్న మిగులు జలాలపై పూర్తి హక్కును ఆంధ్రప్రదేశ్‌కే కలి్పంచింది. 25 ఏళ్ల పాటు ఈ తీర్పు అమల్లో ఉంటుందని, ఆ తర్వాత సమీక్షించుకోవచ్చని సూచించింది.
రెండో జీడబ్ల్యూడీటీ తెరపైకి..
అపెక్స్ కౌన్సిల్ రెండో భేటీలో తీసుకున్న నిర్ణయంతో జీడబ్ల్యూడీటీ–2 తెరపైకి వచ్చింది. జీడబ్ల్యూడీటీ–2 ఏర్పాటుకు ప్రాతిపదికగా తీసుకోవాల్సిన అంశాలపై కేంద్రానికి మూడు ప్రతిపాదనలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఏపీ ప్రతిపాదనలు ఇవీ..
► ఉమ్మడి రాష్ట్రం విడిపోయే నాటికి అంటే 2014 జూన్ 2 నాటికి గోదావరి జలాల్లో 660 టీఎంసీలను వినియోగించుకునేందుకు ఆంధ్రప్రదేశ్, 472 టీఎంసీలు వినియోగించుకోవడానికి తెలంగాణ ప్రాజెక్టులను పూర్తి చేశాయి. మరో 116 టీఎంసీలను వాడుకునే సామర్థ్యంతో ఆంధ్రప్రదేశ్, 178 టీఎంసీలు ఉపయోగించుకునేలా తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. అంటే పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు 776, తెలంగాణకు 650 వెరసి 1,426 టీఎంసీలను కేటాయించాలి.
► బచావత్ ట్రిబ్యునల్ ఉత్తర్వుల మేరకు జీ–1 నుంచి జీ–12 వరకు పరీవాహక రాష్ట్రాలకు కేటాయించగా మిగులుగా ఉన్న నికర జలాలను దిగువ రాష్ట్రమైన ఏపీకే కేటాయించాలి.
► 75 శాతం కంటే నీటి లభ్యత అధికంగా ఉండే మిగులు జలాలపై పూర్తి అధికారాన్ని బచావత్ ట్రిబ్యునల్ దిగువ రాష్ట్రమైన ఏపీకే ఇచ్చింది. ఆ మేరకు నీటి కేటాయింపులు చేస్తే, జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) ప్రతిపాదించిన మేరకు నదుల అనుసంధానం ప్రాజెక్టు పనులు చేపడతాం.
Comments
Please login to add a commentAdd a comment