కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు జ్ఞాపికను అందజేస్తున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ ప్రాజెక్టు పోలవరానికి సవరించిన వ్యయ అంచనాల మేరకు సత్వరమే నిధులు మంజూరు చేయాలని కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. ఢిల్లీ పర్యటనలో రెండో రోజు బుధవారం ఉదయం షెకావత్‌ను కలుసుకుని సీఎం అరగంటపాటు సమావేశమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పక్ష నేత వి.విజయసాయిరెడ్డి, లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి, ఎంపీలు వైఎస్ అవినాష్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మోపిదేవి వెంకటరమణారావు ముఖ్యమంత్రి వెంట ఉన్నారు. షెకావత్‌తో సీఎం చర్చించిన అంశాలు ఇవీ..
భారీగా పునరావాసం, భూసేకరణ వ్యయం..
పోలవరాన్ని గడువులోగా పూర్తి చేసి సత్వరమే ప్రజలకు ఫలాలను అందించేందుకు తగిన సహాయం అందించాలని సీఎం జగన్ కోరారు. 2017–18 ధరల ప్రకారం సవరించిన వ్యయ అంచనాలు –2 (ఆర్‌సీఈ) మేరకు పోలవరానికి రూ.55,656 కోట్ల మేర వ్యయం అవుతుందన్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం భూ సేకరణ, పునరావాస పనులకు గణనీయమైన మొత్తాన్ని వెచ్చించాల్సి వస్తోందని, 2021 డిసెంబర్‌కు వీటిని పూర్తి చేయాలని వివరించారు. 2005–06తో పోలిస్తే 2017–18 నాటికి తరలించాల్సిన కుటుంబాల సంఖ్య 44,574 నుంచి 1,06,006కి పెరిగిందని తెలిపారు. ముంపునకు గురవుతున్న ఇళ్ల సంఖ్య కూడా భారీగా పెరిగిందని చెప్పారు. పోలవరం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో ఇంకా రూ. 1,779 కోట్ల మేర రీయింబర్స్ చేయాల్సి ఉందని వివరించారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఆలస్యం జరిగితే అంచనా వ్యయం పెరిగిపోతుందని, ఏపీకి ప్రాణాధారమైన ప్రాజెక్టు ఫలాలు వీలైనంత త్వరగా అందించాల్సిన అవసరం ఉందని షెకావత్‌కు నివేదించారు.
అపెక్స్ కౌన్సిల్ అంశాలపై..
అక్టోబర్‌లో జరిగిన ‘అపెక్స్’ సమావేశంలో చర్చకు వచ్చిన పలు అంశాలను సీఎం ప్రస్తావించినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించిందని వివరించినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.
అనుసంధానానికి సహకరించండి: షెకావత్
కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన నదుల అనుసంధానం ప్రాజెక్టుకు సహకరించాలని జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ముఖ్యమంత్రి జగన్‌ను కోరారు. గోదావరి–కావేరీ అనుసంధానంపై జలశక్తి శాఖ సలహాదారు శ్రీరామ్ వెదిరె త్వరలో ఏపీకి వస్తారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment