బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కట్టి తీరుతాం
► శాసనసభ స్వల్పకాలిక చర్చలో కేటీఆర్
► అవసరమైతే ఛత్తీస్‌గఢ్ నుంచీ ఇనుప ఖనిజం తీసుకుంటాం
► బిల్ట్, సిర్పూర్ పేపర్ మిల్లులను పరిరక్షిస్తాం..
► టీఎస్–ఐపాస్ ప్రపంచ పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తోంది
► నూతన పరిశ్రమలతో 1.95 లక్షల మందికి ఉపాధి
► అమెరికా అధ్యక్షుడి హెలికాప్టర్ క్యాబిన్ మన దగ్గరే తయారవుతోందని వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: కొత్తగూడెం జిల్లా బయ్యారంలో ఇనుము–ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు వెల్లడించారు. పక్కనే ఉన్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని ఇనుప గనులు కూడా తీసుకుని బయ్యారం పరిశ్రమకు అనుసంధానం చేస్తామని తెలిపారు. బయ్యారంలో ఇప్పటికే అధ్యయనం చేసిన జీఎస్‌ఐ.. అక్కడ తక్కువ నాణ్యత ఉన్న ఇనుప ఖనిజ నిక్షేపాలున్నట్లు నిర్ధారించిందని చెప్పారు. అది కూడా 200 ఎంటీసీలోపే నాణ్యత ఉందని, పరిశ్రమ నెలకొల్పడానికి కనీసం 300 ఎంటీసీ ఉండాలని.. ఈ వ్యత్యాసాన్ని పూడ్చి, పరిశ్రమ నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు.
సోమవారం శాసనసభలో టీఎస్–ఐపాస్, సులభతర–సరళీకృత వ్యాపార విధానంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత జానారెడ్డి, కిషన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, సంపత్, సండ్ర వెంకటవీరయ్య, అక్బరుద్దీన్ ఒవైసీ తదితరులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. బిల్ట్, సిర్పూర్ పేపర్ మిల్లులను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు. నూతన పరిశ్రమలకు ఇచ్చే రాయితీలను ఈ పరిశ్రమలకు కూడా ఇచ్చి కాపాడుకుంటామన్నారు. బిల్ట్ పరిశ్రమ నుంచి వచ్చిన ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ లేకపోవటంతో సమస్య ఏర్పడిందని.. ఆ ఉత్పత్తులను ఐటీసీ ద్వారా విక్రయించేందుకు ఉన్న మార్గాలను అన్వేషిస్తున్నామని చెప్పారు.
లక్షల మందికి ఉపాధి
టీఎస్–ఐపాస్ ప్రపంచ పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తోందని, తెలంగాణ రాష్ట్రం పారిశ్రామికవేత్తల విశ్వాసం పొందటంతో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న ఐదు సంస్థల్లో నాలుగు సంస్థలు హైదరాబాద్‌కు వచ్చాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. గత ప్రభుత్వాలు రెడ్‌టేపిజంతో పారిశ్రామికవేత్తలను ఇబ్బందులకు గురి చేస్తే.. తాము రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానిస్తున్నామని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు ఉపయోగించే హెలికాçప్టర్ క్యాబిన్ కూడా హైదరాబాద్‌లోనే తయారవుతోందని, సికార్స్‌కి అనే సంస్థ దీన్ని రూపొందిస్తోందని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తరువాత ఇప్పటివరకు 2,929 పరిశ్రమలకు అనుమతులిచ్చామని, రూ. 49.46 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు.
ఇప్పటివరకు 1,138 యూనిట్లు వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించాయని, మరో 405 యూనిట్లు నిర్మాణం పూర్తయ్యే దశలో ఉన్నాయని... ఈ పరిశ్రమల ద్వారా 1.95 లక్షల మందికి ప్రత్యక్షంగా, మరో మూడు లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. ఇక రాష్ట్రం ఉత్పత్తి చేసే పత్తికి దేశంలోనే నంబర్ వన్‌గా గుర్తింపు ఉందని చెప్పారు. ఏటా రాష్ట్రంలో 60 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తవుతుంటే, ఇక్కడ కేవలం 10 లక్షల బేళ్లను మాత్రమే వినియోగించుకుంటున్నామని... భవిష్యత్తులో మన పత్తిని మనమే వినియోగించుకుని, వస్త్రాలు రూపొందించేలా 2 వేల ఎకరాల్లో మెగా టెక్స్‌టైల్ పార్కును ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అందులో స్పిన్నింగ్, జిన్నింగ్ మిల్లులతో పాటు టెక్స్‌టైల్ విశ్వవిద్యాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. మరోవైపు రాష్ట్రంలో డ్రైపోర్టుల నిర్మాణం చేపడుతున్నామని కేటీఆర్ చెప్పారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా నాలుగు ప్రాంతాలను గుర్తించారని, వాటిలో ఒకదానిని ఎంపిక చేసి పనులు ప్రారంభిస్తామని తెలిపారు.