కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్ : మేడారం జాతరను జాతీయ ఉత్సవంగా గుర్తించే అంశంపై కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
మేడారం జాతరకు కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జువాల్ ఓరా, జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ నందకిశోర్, మరికొందరు కేంద్ర మంత్రులు రానున్నట్లు వెల్లడించారు.
సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుందని చెప్పారు. బడ్జెట్ కేటాయింపుల్లో పేద, దళిత, బడుగు, బలహీన వర్గాల వారికి అధిక నిధులు కేటాయిస్తుందని తెలిపారు. తెలంగాణ సర్కారుకు కూడా కేంద్ర బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉందని చెప్పారు.
ఓబీసీ కమిషన్ బిల్లు రాజ్యసభలో పాస్ అయ్యేందుకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలు జాతీయ స్థాయిలో ఒత్తిడి తేవాలని అన్నారు. లేకపోతే బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌కు ఉండదని అన్నారు. రాష్ట్రంలో 24 గంటల విద్యత్ సరఫరాకు కేంద్రం రూ. 5,658 కోట్లను విడుదల చేసిందని చెప్పారు. 24 గంటల విద్యుత్ సరఫరా... అనేది రాష్ట్రంలలో ఒక నినాదం కాకూడదని, క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పనితీరును సమీక్షించాలని అన్నారు.
ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన(పీఎమ్‌ఎఫ్‌బీవై) పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం సరిగా అమలు చేయడం లేదని విమర్శించారు. ఇప్పటివరకూ కేవలం 15 శాతం మంది రైతులకు మాత్రమే పథకం ఫలాలు అందాయని చెప్పారు. కౌలు రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయూత నివ్వాలని అన్నారు.
506, 507 సెక్షన్లను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం చాలా బాధాకరమని, ఇది ప్రజల గొంతు నొక్కడమేనని అన్నారు. నల్గొండ మున్సిపల్ చైర్మన్ భర్త శ్రీనివాస్ హత్యను తీవ్రంగా ఖండించారు. రాజకీయ హత్యలు జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్ర హోం మంత్రి నాయిని నరసింహారెడ్డిని కలిసి ఈ విషయంపై చర్చిస్తానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment