ప్రత్యేక ఆర్థిక మండళ్లకు (సెజ్) ప్రోత్సాహం కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
న్యూఢిల్లీ: ప్రత్యేక ఆర్థిక మండళ్లకు (సెజ్) ప్రోత్సాహం కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సెజ్‌లలో ప్రాసెసింగ్‌కి ఉపయోగించని స్థలంలో పాఠశాలలు, ఆస్పత్రులు, హోటళ్లు వంటి వాటిని ఏర్పాటు చేసేందుకు డెవలపర్లను అనుమతిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. మరిన్ని పెట్టుబడులు ఆకర్షించేందుకు, లాభాలు మెరుగుపర్చుకునేందుకు ఈ మేరకు అనుమతులు ఇవ్వాలని సెజ్ డెవలపర్లు చాలాకాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఈ తరహా మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి డెవలపర్లకు పన్నులు మొదలైన వాటి రూపంలో ఎటువంటి మినహాయింపులూ లభించవు. సెజ్‌లలో ఇప్పటికే ఉత్పాదక, సర్వీసు కార్యకలాపాలు నిర్వహిస్తున్నవారు మాత్రమే ఉపయోగించుకునేలా ఒక భాగంలోనూ, బయటివారు కూడా వినియోగించుకునేలా మరో భాగంలోనూ సామాజిక.. వ్యాపారావసరాల మౌలిక సదుపాయాల కల్పనకు అనుమతి ఉంటుంది.
తాజా నోటిఫికేషన్ బట్టి .. సెజ్‌లలోని నాన్-ప్రాసెసింగ్ స్థలంలో గృహ నిర్మాణాలకు 25 శాతాన్ని మించి ఉపయోగించకూడదు. వాణిజ్యపరమైన ఇన్‌ఫ్రా ఏర్పాటు కోసం 10 శాతానికి మించి వాడుకోకూడదు. నాన్-ప్రాసెసింగ్ స్థలంలో 45 శాతం ఓపెన్ ఏరియా ఉండాలి. మిగతా స్థలంలో పాఠశాలలు, కాలేజీలు, సాంస్కృతిక కేంద్రాలు, శిక్షణా సంస్థలు, బ్యాంకులు, పోస్టాఫీసులు మొదలైనవి ఏర్పాటు చేసుకోవచ్చు.