హోటళ్లు, ఆసుపత్రుల్లో భారీ లావాదేవీలపై ఐటీ నిఘా! | Check High Value Cash Transactions At Hotels, Hospitals | Sakshi
Sakshi News home page

హోటళ్లు, ఆసుపత్రుల్లో భారీ లావాదేవీలపై ఐటీ నిఘా!

Published Sat, Aug 17 2024 5:01 PM | Last Updated on Sat, Aug 17 2024 5:34 PM

Check High Value Cash Transactions At Hotels, Hospitals

హోటళ్లు, లగ్జరీ బ్రాండ్‌ విక్రయాలు, ఆసుపత్రులు, ఐవీఎఫ్‌ క్లినిక్‌లు వంటి చోట్ల జరుగుతున్న భారీ నగదు లావాదేవీలపై నిఘా పెట్టాలని దేశంలోని ప్రత్యక్ష పన్నుల నిర్వహణకు సంబంధించిన అత్యున్నత సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఆదాయపు పన్ను శాఖను కోరింది.

అదే విధంగా గత ఆర్థిక సంవత్సరం నుంచి భారీగా పెరుగుతున్న పన్ను బకాయిలను రికవరీ చేయడానికి సమష్టి ప్రయత్నాలు చేపట్టాలని ఐటీ శాఖను సీబీడీటీ కోరింది. ఈ మేరకు సీబీడీటీ ఇటీవల సెంట్రల్ యాక్షన్ ప్లాన్ (CAP) 2024-25 అనే వార్షిక కార్యాచరణ ప్రణాళిక పత్రాన్ని విడుదల చేసింది.

రూ.2 లక్షలకు పైబడిన నగదు లావాదేవీలను ఆర్థిక లావాదేవీల స్టేట్‌మెంట్ రూపంలో ఆర్థిక సంస్థలు రిపోర్ట్ చేయాల్సి ఉన్నా అది జరగడం లేదని సీనియర్ అధికారులు వార్తా సంస్థ పీటీఐకి తెలిపారు. ఆ రిపోర్ట్‌లను పరిశీలిస్తున్నప్పుడు ఈ నిబంధనల అతిక్రమణ విస్తృతంగా ఉన్నట్లు గుర్తించామని సీబీడీటీ ఐటీ శాఖకు తెలిపింది.

అలాగే సెక్షన్ 139A ప్రకారం నిర్దిష్ట లావాదేవీలలో పాన్ కార్డు నంబర్‌ అందించడం లేదా తీసుకోవడం తప్పనిసరి అయినప్పటికీ దీన్ని నిర్ధారించే వ్యవస్థ లేదని సీబీడీటీ పేర్కొంది. ఏదైనా అధిక మొత్తంలో వ్యయాన్ని పన్ను చెల్లింపుదారు సమాచారంతో ధ్రవీకరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.

హోటళ్లు, బాంక్వెట్ హాళ్లు, లగ్జరీ బ్రాండ్ రిటైలర్లు, ఐవీఎఫ్ క్లినిక్‌లు, ఆసుపత్రులు, డిజైనర్ బట్టల దుకాణాలు, ఎన్‌ఆర్‌ఐ కోటా మెడికల్ కాలేజీ సీట్ల వంటి చోట్ల నిబంధనలు పాటించకుండా పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు జరుగుతున్నాయని గుర్తించిన సీబీడీటీ.. అ‍క్కడ ఎలాంటి అంతరాయం కలిగించకుండా నిఘా పెట్టాలని ఆదాయపు పన్ను శాఖకు సూచించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement