
‘కోడ్’ కొండెక్కిందా?
సాక్షి ప్రతినిధి, కాకినాడ :ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండగానే రెవెన్యూ అధికారులు కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (కేఎస్‌ఈజడ్) భూములపై సమావేశమవడం చర్చనీయాంశమైంది. సమావేశం నిర్వహించడంతో జిల్లాలో ఎన్నికల కోడ్ కొండెక్కిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కోడ్‌ను అమలు చేయాల్సిన రెవెన్యూ అధికారులే ఉల్లంఘించడానికి కలెక్టరేట్ సాక్షిగా నిలిచిందంటున్నారు. ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నెల 11న ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. నాటి నుంచే రెండు జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అరుణ్‌కుమార్ విషయాన్ని ప్రకటించి, ప్రవర్తనా నియమావళిని విధిగా అమలుచేయాలని ఆదేశించారు.
కాగా ఆదివారం కలెక్టరేట్లోని విధాన గౌతమి హాలులో కేఎస్‌ఈజడ్ భూ సేకరణపై రెవెన్యూ అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ భూ సేకరణ విషయంలో చాలా కాలంగా కొన్ని ప్రతిబంధకాలున్నాయి. కేఎస్‌ఈజడ్ పరిధిలోని రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు భూ సేకరణకు చెల్లించే ప్యాకేజీపై అభ్యంతర పెట్టడంతో వివాదం నెలకొంది. ఆ క్రమంలో కేఎస్‌ఈజడ్ ప్రాంతానికి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు, ఆర్డీఓలతో జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ నిర్వహించిన సమావేశంలో కాకినాడ, పెద్దాపురం ఆర్డీఓలు అంబేద్కర్, విశ్వేశ్వరరావు, కేఎస్‌ఈజడ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కోరా జయరాజ్ పాల్గొన్నారు. ఈ సమావేశం నిర్వహణ ఎన్నికల కోడ్ పరిధిలోకి వస్తుందనే వాదనతో అధికారుల్లో ఆందోళన మొదలైంది.
అధికార పార్టీ నాయకులూ హాజరయ్యారు..
మరో ఐదు నెలల్లో ప్రారంభం కానున్న గోదావరి పుష్కరాలకు కోట్లాది రూపాయలతో పనులు చేపట్టాల్సి ఉంది. సుమారు రూ.900 కోట్ల పనులకు ఇప్పుడిప్పుడే టెండర్లు పిలుస్తున్నారు. ఆ టెండర్లు పిలవవచ్చా, లేదా అనే సందేహాన్ని ఇటీవల జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అరుణ్‌కుమార్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో వెల్లడించి నివృత్తి చేసుకున్నారు. పుష్కరాలు మహా పర్వం కావడంతో ప్రజాప్రతినిధులు, నేతలను పిలవకుండా పనులు చేపట్టే వెసులుబాటును ఎన్నికల ప్రధానాధికారి కల్పించారని కలెక్టర్ రాజమండ్రిలో స్పష్టం చేశారు. అలాంటిది కేఎస్‌ఈజడ్ భూ సేకరణపై రెవెన్యూ అధికారులు సమావేశమవడం, దానికి ప్రభుత్వం నామినేట్ చేసిన అధికారపార్టీకి చెందిన నాయకులు, సెజ్ ప్రాంతానికి చెందిన స్థానిక నేతలు కూడా హాజరవడం చర్చనీయాంశమైంది. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికలు ఉపాధ్యాయ వర్గానికి మాత్రమే పరిమితమైనవి కావడంతో ఆ కోడ్ నిబంధనలు వర్తించవనే వాదన కూడా వినిపిస్తోంది.
ఆ సమావేశం కోడ్ ఉల్లంఘన కాదు..
కేఎస్‌ఈజడ్ విషయమై సమావేశం గురించి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అరుణ్‌కుమార్‌ను ‘సాక్షి’ సంప్రదిం చింది. ఆ సమావేశం ఎన్నికల కోడ్ పరిధిలోకి రాదని, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు కావడంతో ఉపాధ్యా య, విద్య, విద్యా సంస్థలకు సంబంధించిన అనుమతు లు, వాటిని ప్రభావితం చేసే సమావేశాలు నిర్వహిస్తేనే కోడ్ పరిధిలోకి వస్తుందని చెప్పారు.