వ్యాపార నిబంధనల సరళీకరణపై దృష్టిపెట్టండి
ప్రభుత్వానికి నాస్కామ్ సూచన
న్యూఢిల్లీ: ‘వ్యాపారాన్ని ప్రారంభించేందుకు భారత్‌లో ఉన్న నిబంధనల సరళీకరణపై ప్రభుత్వం దృష్టిసారించాలి. మంచి ఊపు మీదున్న స్టార్టప్ రంగంలో పెట్టుబడులు పెట్టే ప్రయత్నంపై కాదు’ అని నాస్కామ్ సూచించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నా, పలు అనుమతులు, క్లియరెన్సులు వ్యాపారాల ప్రారంభానికి ఆటంకంగా ఉన్నాయని నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్.చంద్రశేఖర్ తెలిపారు.
భారత్‌లో పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ సందర్భంగా ఆయన వివరించారు. ‘చక్కని వ్యాపార ఆలోచనలు, ఔత్సాహిక వ్యాపారవేత్తల సంఖ్య కంటే పెట్టుబడి చేయదగ్గ డబ్బే అధికంగా ఉంది. వ్యాపారాల్లో పెట్టుబడికి ప్రపంచవ్యాప్తంగా ఇబ్బడిముబ్బడిగా నగదు ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కంపెనీల్లో పెట్టుబడి చేయాల్సిన అవసరం లేదు. వ్యాపార ప్రారంభం, నిబంధనల అమలు భారం, మూసివేతలో ఇబ్బందులు పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్నే చూపుతున్నాయి’ అని వివరించారు.
ఆ చర్చే లేదిక్కడ..: వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ఎన్ని గంటల సమయం తీసుకుంటుంది అన్న అంశంపై పలు దేశాలు పోటీపడుతున్నాయి. అసలు భారత్‌లో ఆ చర్చే లేదని చంద్రశేఖర్ అన్నారు. ‘3-4 ఉద్యోగులతో కొత్త వ్యాపారం ఏర్పాటుకు పారిశ్రామికవేత్త 50-60 అనుమతులు, క్లియరెన్సులు వివిధ శాఖల నుంచి తీసుకోవాల్సి వస్తోంది. సులభతర నిబంధనలు తీసుకురావడం చాలా సులువు. నిబంధనలు వద్దని నేను చెప్పడం లేదు. టెక్నాలజీ స్టార్టప్స్ వంటి కొన్ని రంగాల కంపెనీలకు ఇన్ని అనుమతులు, క్లియరెన్సులు అవసరం లేదు. స్టార్టప్‌ల ప్రాముఖ్యతను ప్రభుత్వం గుర్తించింది. నిబంధనలను ఒకే పరిధి కిందకు తెచ్చే పథకాన్ని తీసుకు రావాల్సిన అవసరం ఉంది’ అని వివరించారు.