ఆకు రసాలతోనే కలుపు నిర్మూలన! | Weed Control With Leaf Juice Agriculture In Sakshi Sagubadi | Sakshi
Sakshi News home page

ఆకు రసాలతోనే కలుపు నిర్మూలన!

Published Tue, Sep 29 2020 8:03 AM | Last Updated on Tue, Sep 29 2020 8:03 AM

Weed Control With Leaf Juice Agriculture In Sakshi Sagubadi

కలుపు మందు అంటే.. రసాయనిక కలుపు మందులే ఇటు శాస్త్రవేత్తలు, అటు రైతుల మదిలో మెదులుతాయి. అయితే, కొన్ని రకాల రసాయనిక కలుపు మందులు కేన్సర్‌ కారకాలని తేలటంతో సేంద్రియ కలుపు మందుల ఆవశ్యకత ఏర్పడింది. ప్రకృతి/సేంద్రియ వ్యవసాయంలో కలుపు యాజమాన్యం సమస్యాత్మకంగా మారిన నేపథ్యంలో గ్రామీణ ఆవిష్కర్తలు రసాయనాల్లేని కలుపు మందును ఆవిష్కరించటం, దీనిపై శాస్త్రవేత్తల బృందం పండ్ల తోటలు, ఖాళీ భూముల్లో క్షేత్రస్థాయి ప్రయోగాలకు ఉపక్రమించటం హర్షదాయం. 

రైతు కుటుంబంలో పుట్టిన గళ్లా చంద్రశేఖర్‌ తదితర గ్రామీణ ఆవిష్కర్తల బృందం చాలా ఏళ్లుగా స్వతంత్రంగా పరిశోధనలు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి దగ్గరలోని కారాకొల్లు గ్రామానికి చెందిన వీరు తమ గ్రామ పరిసరాల్లో వుండే రకరకాల మొక్కలతో పంటలపై చీడపీడల నివారణకు ఏమైనా అవకాశం ఉందా అనే రీతిలో సొంత ఖర్చుతోనే పరిశోధనలు కొనసాగించారు. ఈ బృందంలో చంద్రశేఖర్‌తోపాటు చిరంజీవులు, భాస్కర్, బత్తినాయుడు, మురళి, వెంకటేశ్వర్లు, శివ, శ్రీధర్‌ ఉన్నారు. ఈ పరిశోధనల క్రమంలో గతంలో ఆకురసాలతో నులిపురుగుల నిర్ములన ద్రావణం తయారు చేయటం వంటి అనేక ఆవిష్కరణలను వెలువరించారు.

హెర్బల్‌ కలుపు మందు 
కొన్ని రకాల మొక్కల రసాలు కలుపు మొక్కల మీద వేసినప్పుడు అవి చనిపోయాయి. ఆ విధంగా పరిశోధించి కలుపు నిర్మూలన మందును కనుగొన్నామని ఇన్నోవేటర్‌ చంద్రశేఖర్‌ ‘సాక్షి’తో చెప్పారు. ‘రసాయనిక కలుపు మందులు చల్లితే కలుపు చనిపోయినా అవి ప్రధాన పంట పెరుగుదలను కొన్ని రోజుల పాటు నిరోధిస్తున్నాయి. కానీ, ఆకురసాలతో తాము తయారు చేసిన కలుపు మందు వల్ల కలుపు నిర్మూలన జరగడమే కాకుండా పంట ఏపుగా పెరగడానికి ఉపయోగపడుతుందని, 15–20 శాతం అధికంగా దిగుబడి వస్తుండటం గమనించాం..’ అని ఆయన వివరించారు. 

శాస్త్రవేత్తల పర్యవేక్షణలో ప్రయోగాలు
రైతులకు ఉపకరించే గ్రామీణ ఆవిష్కరణలను ఎంపిక చేసి, వాటి పనితీరుపై వ్యవసాయ శాస్త్రవేత్తల పర్యవేక్షణలో క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయటం ద్వారా ఆ ఆవిష్కరణలను మరింత పరిపుష్టం చేసి, విస్తృతంగా రైతాంగానికి అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ఆధ్వర్యంలో ‘రఫ్తార్‌’ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. తిరుపతిలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ యూనివర్సిటీకి చెందిన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఇంక్యుబేషన్‌ విభాగం ఉంది. 

‘పండ్ల తోటల్లో, బంజరు, ఖాళీ భూముల్లో కలుపును నిర్మూలించే కలుపు మందును ఆకు రసాలతో చంద్రశేఖర్, ఆయన మిత్రులు రూపొందించి, మాకు చూపించారు. ఇది మంచి ఫలితాలనే ఇస్తున్నప్పటికీ, మరింత లోతుగా పరిశోధించాల్సిన అవసరం ఉంది అని ‘రఫ్తార్‌’ ఇంక్యుబేషన్‌ విభాగం ప్రిన్సిపల్‌ ఇన్వెస్టిగేటర్‌ డా. పోలు బాలహుస్సేన్‌ రెడ్డి ‘సాక్షి’తో చెప్పారు. కలుపు యాజమాన్య నిపుణులు, సీనియర్‌ శాస్త్రవేత్తలు డా. మహేశ్వరరెడ్డి, డా. సుబ్రమణ్యం పర్యవేక్షణలో ఈ కలుపు మందు పనితీరుపై మరింత లోతైన పరిశోధనకు ఇటీవలే శ్రీకారం చుట్టామన్నారు. కలుపు మొక్కలపై ఈ మందును ప్రయోగించి ఫలితాలను అనేక కోణాల్లో నమోదు చేస్తామన్నారు. దీని ఉత్పాదక వ్యయాన్ని తగ్గిం^è డంపై కూడా దృష్టి సారిస్తున్నామని డా. పోలు బాలహుస్సేన్‌ రెడ్డి వివరించారు. అన్నీ సవ్యంగా జరిగితే.. కొద్ది నెలల్లో తక్కువ ధరలోనే ప్రకృతికి నష్టం కలిగించని హెర్బల్‌ కలుపు మందు రైతులకు అందుబాటులోకి వస్తుంది. విషరసాయనాలతో కూడిన కలుపు మందులను పూర్తిగా  వదిలించుకునే దిశగా విప్లవాత్మక మార్పునకు నాంది పలుకుతుందని ఆశిద్దాం. గ్రామీణ ఆవిష్కర్తల బృందానికి ‘సాక్షి సాగుబడి’ జేజేలు పలుకుతోంది. 

ఇది సమర్థవంతంగా పనిచేస్తోంది
చంద్రశేఖర్‌ బృందం తయారు చేసిన హెర్బల్‌ కలుపు మందు వినూత్నమైన ఆవిష్కరణ. ఇది పండ్ల తోటల్లో, బంజరు భూములు, ఖాళీ స్థలాల్లో వాడటానికి ఉద్దేశించినది. ఇది నాన్‌ సెలక్టివ్, కాంటాక్ట్‌ హెర్బిసైడ్‌. ఇది ఏ మొక్క మీద పడితే ఆ మొక్క చనిపోతుంది. పంట మొక్కలు సహా ఏ మొక్కనైనా చంపేస్తుంది. ప్రాధమిక పరిశీలనలో ఇది సమర్థవంతంగా∙పనిచేస్తున్నట్లు గ్రహించాం. అయితే, క్షేత్రస్థాయిలో ఎలా పనిచేస్తున్నదీ అనేక కోణాల్లో పరీక్షించదలచాం. ‘రఫ్తార్‌’ ప్రోగ్రామ్‌లో భాగంగా ఇద్దరు కలుపు శాస్త్ర నిపుణుల పర్యవేక్షణలో అందుకు ఏర్పాట్లు చేశాం. రూ. 6 లక్షల నిధుల కేటాయింపు కూడా జరిగింది. ఇది ఏయే కలుపు మొక్కలపై, ఎంత ఉష్ణోగ్రత ఉన్నప్పుడు పనిచేస్తుంది? వర్షం పడినప్పుడు, మబ్బులు ఉన్నప్పుడు పనిచేస్తుందా లేదా? దీని ప్రభావం ఎన్ని రోజులుంటుంది? వర్షం వచ్చిన వారం తర్వాత ప్రభావం చూపుతుందా? ఇలాంటి విషయాలన్నిటినీ 6–9 నెలల్లో పరిశీలిస్తాం. ఇప్పుడైతే దీని ధర ఎక్కువగా ఉంది. ధర తగ్గించగలిగే మార్గాలేమిటో కూడా పరిశీలిస్తాం. ఈ హెర్బల్‌ కలుపు మందును రైతులు పండ్ల చెట్ల మీద పడకుండా జాగ్రత్తగా చల్లుకోవాలి. సేంద్రియ/ప్రకృతి వ్యవసాయదారులకు ఈ కలుపు మందు ఉపయోగపడుతుంది.  
– డా. పోలు బాలహుస్సేన్‌ రెడ్డి(98484 20373), ప్రిన్సిపల్‌ ఇన్వెస్టిగేటర్, రఫ్తార్‌ ప్రోగ్రామ్, ఇంక్యుబేషన్‌ సెంటర్, ఆర్‌.ఎ.ఆర్‌.ఎస్‌., తిరుపతి

తొలి హెర్బల్‌ కలుపు మందు!
కేవలం 3 రకాల ఆకుల రసాలతోనే ఈ కలుపు మందును తయారు చేశాం. కెమికల్స్‌ కలప లేదు. పండ్ల తోటల్లో చెట్ల మధ్య ఖాళీలో, ఖాళీ భూముల్లో కలుపు మొక్కలపై వాడి చూశాం. ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి. ఇదే తొట్టతొలి హెర్బల్‌ కలుపు మందు. పండ్ల తోటల్లో కలుపు నిర్మూలనకు ఇది బాగా పని చేస్తోంది. కానీ ఎకరాకు రూ. 8 వేల నుంచి రూ. 10 వేల వరకు ఖర్చవుతోంది. ఇంత ఖర్చు రైతులు భరించ లేరు. కాబట్టి ఈ ఖర్చు తగ్గించడానికి తిరుపతిలోని వ్యవసాయ శాస్త్రవేత్తల సహకారం తీసుకుంటున్నాం. ‘రఫ్తార్‌’ కార్యక్రమంలో భాగంగా తదుపరి దశ పరిశోధనలు ప్రారంభమయ్యాయి. ఇది పూర్తయ్యాక రైతులకు అందుబాటులోకి తెస్తాం.  – గళ్లా చంద్రశేఖర్‌ (98495 41674), గ్రామీణ ఆవిష్కర్త, కారాకొల్లు, చిత్తూరు జిల్లా
– పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement