Weed control
-
ఆకు రసాలతోనే కలుపు నిర్మూలన!
కలుపు మందు అంటే.. రసాయనిక కలుపు మందులే ఇటు శాస్త్రవేత్తలు, అటు రైతుల మదిలో మెదులుతాయి. అయితే, కొన్ని రకాల రసాయనిక కలుపు మందులు కేన్సర్ కారకాలని తేలటంతో సేంద్రియ కలుపు మందుల ఆవశ్యకత ఏర్పడింది. ప్రకృతి/సేంద్రియ వ్యవసాయంలో కలుపు యాజమాన్యం సమస్యాత్మకంగా మారిన నేపథ్యంలో గ్రామీణ ఆవిష్కర్తలు రసాయనాల్లేని కలుపు మందును ఆవిష్కరించటం, దీనిపై శాస్త్రవేత్తల బృందం పండ్ల తోటలు, ఖాళీ భూముల్లో క్షేత్రస్థాయి ప్రయోగాలకు ఉపక్రమించటం హర్షదాయం. రైతు కుటుంబంలో పుట్టిన గళ్లా చంద్రశేఖర్ తదితర గ్రామీణ ఆవిష్కర్తల బృందం చాలా ఏళ్లుగా స్వతంత్రంగా పరిశోధనలు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి దగ్గరలోని కారాకొల్లు గ్రామానికి చెందిన వీరు తమ గ్రామ పరిసరాల్లో వుండే రకరకాల మొక్కలతో పంటలపై చీడపీడల నివారణకు ఏమైనా అవకాశం ఉందా అనే రీతిలో సొంత ఖర్చుతోనే పరిశోధనలు కొనసాగించారు. ఈ బృందంలో చంద్రశేఖర్‌తోపాటు చిరంజీవులు, భాస్కర్, బత్తినాయుడు, మురళి, వెంకటేశ్వర్లు, శివ, శ్రీధర్ ఉన్నారు. ఈ పరిశోధనల క్రమంలో గతంలో ఆకురసాలతో నులిపురుగుల నిర్ములన ద్రావణం తయారు చేయటం వంటి అనేక ఆవిష్కరణలను వెలువరించారు. హెర్బల్ కలుపు మందు కొన్ని రకాల మొక్కల రసాలు కలుపు మొక్కల మీద వేసినప్పుడు అవి చనిపోయాయి. ఆ విధంగా పరిశోధించి కలుపు నిర్మూలన మందును కనుగొన్నామని ఇన్నోవేటర్ చంద్రశేఖర్ ‘సాక్షి’తో చెప్పారు. ‘రసాయనిక కలుపు మందులు చల్లితే కలుపు చనిపోయినా అవి ప్రధాన పంట పెరుగుదలను కొన్ని రోజుల పాటు నిరోధిస్తున్నాయి. కానీ, ఆకురసాలతో తాము తయారు చేసిన కలుపు మందు వల్ల కలుపు నిర్మూలన జరగడమే కాకుండా పంట ఏపుగా పెరగడానికి ఉపయోగపడుతుందని, 15–20 శాతం అధికంగా దిగుబడి వస్తుండటం గమనించాం..’ అని ఆయన వివరించారు. శాస్త్రవేత్తల పర్యవేక్షణలో ప్రయోగాలు రైతులకు ఉపకరించే గ్రామీణ ఆవిష్కరణలను ఎంపిక చేసి, వాటి పనితీరుపై వ్యవసాయ శాస్త్రవేత్తల పర్యవేక్షణలో క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయటం ద్వారా ఆ ఆవిష్కరణలను మరింత పరిపుష్టం చేసి, విస్తృతంగా రైతాంగానికి అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ఆధ్వర్యంలో ‘రఫ్తార్’ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. తిరుపతిలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ యూనివర్సిటీకి చెందిన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఇంక్యుబేషన్ విభాగం ఉంది. ‘పండ్ల తోటల్లో, బంజరు, ఖాళీ భూముల్లో కలుపును నిర్మూలించే కలుపు మందును ఆకు రసాలతో చంద్రశేఖర్, ఆయన మిత్రులు రూపొందించి, మాకు చూపించారు. ఇది మంచి ఫలితాలనే ఇస్తున్నప్పటికీ, మరింత లోతుగా పరిశోధించాల్సిన అవసరం ఉంది అని ‘రఫ్తార్’ ఇంక్యుబేషన్ విభాగం ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డా. పోలు బాలహుస్సేన్ రెడ్డి ‘సాక్షి’తో చెప్పారు. కలుపు యాజమాన్య నిపుణులు, సీనియర్ శాస్త్రవేత్తలు డా. మహేశ్వరరెడ్డి, డా. సుబ్రమణ్యం పర్యవేక్షణలో ఈ కలుపు మందు పనితీరుపై మరింత లోతైన పరిశోధనకు ఇటీవలే శ్రీకారం చుట్టామన్నారు. కలుపు మొక్కలపై ఈ మందును ప్రయోగించి ఫలితాలను అనేక కోణాల్లో నమోదు చేస్తామన్నారు. దీని ఉత్పాదక వ్యయాన్ని తగ్గిం^è డంపై కూడా దృష్టి సారిస్తున్నామని డా. పోలు బాలహుస్సేన్ రెడ్డి వివరించారు. అన్నీ సవ్యంగా జరిగితే.. కొద్ది నెలల్లో తక్కువ ధరలోనే ప్రకృతికి నష్టం కలిగించని హెర్బల్ కలుపు మందు రైతులకు అందుబాటులోకి వస్తుంది. విషరసాయనాలతో కూడిన కలుపు మందులను పూర్తిగా వదిలించుకునే దిశగా విప్లవాత్మక మార్పునకు నాంది పలుకుతుందని ఆశిద్దాం. గ్రామీణ ఆవిష్కర్తల బృందానికి ‘సాక్షి సాగుబడి’ జేజేలు పలుకుతోంది. ఇది సమర్థవంతంగా పనిచేస్తోంది చంద్రశేఖర్ బృందం తయారు చేసిన హెర్బల్ కలుపు మందు వినూత్నమైన ఆవిష్కరణ. ఇది పండ్ల తోటల్లో, బంజరు భూములు, ఖాళీ స్థలాల్లో వాడటానికి ఉద్దేశించినది. ఇది నాన్ సెలక్టివ్, కాంటాక్ట్ హెర్బిసైడ్. ఇది ఏ మొక్క మీద పడితే ఆ మొక్క చనిపోతుంది. పంట మొక్కలు సహా ఏ మొక్కనైనా చంపేస్తుంది. ప్రాధమిక పరిశీలనలో ఇది సమర్థవంతంగా∙పనిచేస్తున్నట్లు గ్రహించాం. అయితే, క్షేత్రస్థాయిలో ఎలా పనిచేస్తున్నదీ అనేక కోణాల్లో పరీక్షించదలచాం. ‘రఫ్తార్’ ప్రోగ్రామ్‌లో భాగంగా ఇద్దరు కలుపు శాస్త్ర నిపుణుల పర్యవేక్షణలో అందుకు ఏర్పాట్లు చేశాం. రూ. 6 లక్షల నిధుల కేటాయింపు కూడా జరిగింది. ఇది ఏయే కలుపు మొక్కలపై, ఎంత ఉష్ణోగ్రత ఉన్నప్పుడు పనిచేస్తుంది? వర్షం పడినప్పుడు, మబ్బులు ఉన్నప్పుడు పనిచేస్తుందా లేదా? దీని ప్రభావం ఎన్ని రోజులుంటుంది? వర్షం వచ్చిన వారం తర్వాత ప్రభావం చూపుతుందా? ఇలాంటి విషయాలన్నిటినీ 6–9 నెలల్లో పరిశీలిస్తాం. ఇప్పుడైతే దీని ధర ఎక్కువగా ఉంది. ధర తగ్గించగలిగే మార్గాలేమిటో కూడా పరిశీలిస్తాం. ఈ హెర్బల్ కలుపు మందును రైతులు పండ్ల చెట్ల మీద పడకుండా జాగ్రత్తగా చల్లుకోవాలి. సేంద్రియ/ప్రకృతి వ్యవసాయదారులకు ఈ కలుపు మందు ఉపయోగపడుతుంది. – డా. పోలు బాలహుస్సేన్ రెడ్డి(98484 20373), ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్, రఫ్తార్ ప్రోగ్రామ్, ఇంక్యుబేషన్ సెంటర్, ఆర్.ఎ.ఆర్.ఎస్., తిరుపతి తొలి హెర్బల్ కలుపు మందు! కేవలం 3 రకాల ఆకుల రసాలతోనే ఈ కలుపు మందును తయారు చేశాం. కెమికల్స్ కలప లేదు. పండ్ల తోటల్లో చెట్ల మధ్య ఖాళీలో, ఖాళీ భూముల్లో కలుపు మొక్కలపై వాడి చూశాం. ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి. ఇదే తొట్టతొలి హెర్బల్ కలుపు మందు. పండ్ల తోటల్లో కలుపు నిర్మూలనకు ఇది బాగా పని చేస్తోంది. కానీ ఎకరాకు రూ. 8 వేల నుంచి రూ. 10 వేల వరకు ఖర్చవుతోంది. ఇంత ఖర్చు రైతులు భరించ లేరు. కాబట్టి ఈ ఖర్చు తగ్గించడానికి తిరుపతిలోని వ్యవసాయ శాస్త్రవేత్తల సహకారం తీసుకుంటున్నాం. ‘రఫ్తార్’ కార్యక్రమంలో భాగంగా తదుపరి దశ పరిశోధనలు ప్రారంభమయ్యాయి. ఇది పూర్తయ్యాక రైతులకు అందుబాటులోకి తెస్తాం. – గళ్లా చంద్రశేఖర్ (98495 41674), గ్రామీణ ఆవిష్కర్త, కారాకొల్లు, చిత్తూరు జిల్లా – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
రోహిణీలోనే దేశీ వరి
దేశీ వరి విత్తనాలను ఇంటి ఆహారపు అవసరాల కోసం కనీసం ఒక ఎకరంలో నైనా వేసుకొంటే మంచిదని, దేశీ వరి విత్తనాలను ఆరు తడి పద్ధతిలో మామూలు పద్ధతితో పోల్చితే 10 శాతం నీటితోనే సాగు చేయవచ్చని ప్రకృతి వ్యవసాయదారుడు, సేవ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు విజయరామ్ తెలిపారు. ఈ పద్ధతిలో 90 శాతం నీటిని ఆదా చేయవచ్చు. కలుపు నియంత్రణ కోసం మొక్కకు మొక్కకు దూరం, అలానే వరుసకు, వరుసకు మధ్య దూరం 45 సెం.మీ. ఉండేటట్లు నాటుకోవాలి. ఆరు తడి పద్ధతిలో వరిలో అంతర పంటలను కూడా వేయవచ్చు. అలా వేద్దాం అనుకున్న వారు మొక్కకు మొక్కకు దూరం, అలానే వరుసకు, వరుసకు మధ్య దూరం 60 సెం.మీ. ఉండేటట్లు నాటుకోవాలన్నారు. 180 నుంచి 210 రోజుల పంట కాలం ఉండే వరి రకాలు (మా పిళ్లై సాంబ, మొలగొలుకులు, మడుమురంగి లాంటివి) రోహిణి కార్తె (మే 25 నుంచి ప్రారంభం)లో నాట్లు వేసుకుంటేనే అనుకూలం. అలా అయితేనే 2వ పంటకు వీలు దొరుతుందన్నారు. జనవరి ఆఖరు లోపు నేల స్వభావం, నీటి వసతిని బట్టి పుచ్చకాయ, దోస, కూరగాయలు, నువ్వులు లేక పశుగ్రాసపు పంటలు వేసుకోవచ్చు. కొత్తగా ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు మొదట ఏడాది ఒక ఎకరంలో మాత్రమే ఈ పద్ధతిని అనుసరించాలన్నారు. దేశీ వరి విత్తనాలతో మొదటి సంవత్సరం దిగుబడి 10 బస్తాల నుండి 20 బస్తాల వరకు రావచ్చని, తదుపరి కొంత పెరుగుతుందన్నారు. కేవలం వరిని మాత్రమే కాకుండా పప్పు ధాన్యాలు, కూరగాయలు, నూనె గింజలు పండించే ప్రయత్నమూ చేయాలి. వర్షము పడినప్పుడు పొలములో కొన్ని రోజుల వరకూ నీరి నిలిచిపోయే పరిస్థితి ఉన్న వారు (మాగాణి భూముల వారు, కోస్తా ప్రాంతాల వారు) కనీసం 200 గజాల స్థలంలోనైనా 2 అడుగుల ఎత్తులో మట్టిని వేసి ఇంటి అవసరాల కోసం కూరగాయలు పెంచుకోవాలన్నారు. దేశీ వరి విత్తనాలను పండించే రైతులు ఇప్పుడు ప్రతి జిల్లాలోనూ ఉన్నారని, వారి దగ్గరి నుంచి విత్తనాలు తీసుకోవచ్చని విజయరామ్ వివరించారు. వివరాలకు హైదరాబాద్‌లోని సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయం కేంద్ర కార్యాలయానికి (04027654337 , 04027635867) ఫోన్ చేయవచ్చు. పొద్దున 10 గం. నుంచి సా. 6 గం. వరకు. గురువారం సెలవు. -
కలుపుతోనే కలుపు నిర్మూలన!
ఏ పంటకైనా కలుపు సమస్యే. కలుపు నివారణకు సంప్రదాయకంగా కూలీలతో తీయించడం లేదా గుంటక తోలటం చేస్తుంటారు. అయితే, కొద్ది సంవత్సరాలుగా కూలీల కొరత నేపథ్యంలో కలుపు నిర్మూలనకు రసాయనిక కలుపు మందుల పిచికారీ పెరిగిపోయింది. గ్లైఫొసేట్ వంటి అత్యంత ప్రమాదకరమైన కలుపు మందుల వల్ల కేన్సర్ వ్యాధి ప్రబలుతోందని నిర్థారణ కావడంతో ప్రభుత్వాలు కూడా దీని వాడకంపై తీవ్ర ఆంక్షలు విధించడం మనకు తెలుసు. ఈ నేపథ్యంలో కొందరు ప్రకృతి వ్యవసాయదారులు సేంద్రియ కలుపు మందులపై దృష్టిసారిస్తున్నారు. కలుపుతోనే కలుపును నిర్మూలించవచ్చని ఈ రైతులు అనుభవపూర్వకంగా చెబుతుండటం రైతాంగంలో అమితాసక్తిని రేకెత్తిస్తోంది. ఒక పొలంలో ఏవైతే కలుపు రకాలు సమస్యగా ఉన్నాయో.. ఆ కలుపు మొక్కలు కొన్నిటిని వేర్లు, దుంపలతో సహా పీకి, ముక్కలు చేసి, పెనం మీద వేపి, బూడిద చేసి దానికి పంచదార, పాలు కలిపి మురగబెడితే తయారయ్యే ద్రావణాన్ని ‘గరళకంఠ ద్రావణం’ అని పిలుస్తున్నారు. ఈ ద్రావణాన్ని పొలం అంతటా పిచికారీ చేస్తే.. చల్లిన 12 రోజుల నుంచి 30 రోజుల్లో కలుపు మొక్కలు ఎండిపోతున్నాయని చెబుతున్నారు. ఈ ద్రావణంలో కలపని మొక్కలకు అంటే.. పంటలకు ఈ ద్రావణం వల్ల ఏమీ నష్టం జరగక పోవడం విశేషం. సీజన్లో రెండుసార్లు ఇలా కలుపు మొక్కల బూడిద నీటిని చల్లితే కలుపు తీయాల్సిన లేదా కలుపు మందులు చల్లాల్సిన అవసరమే ఉండదని ఈ రైతులు నొక్కి చెబుతున్నారు. ఇది తాము కనిపెట్టిన పద్ధతి కాదని, 6వ శతాబ్దం నాటి ‘వృక్షాయుర్వేదం’లో పేర్కొన్నదేనంటున్నారు. పర్యావరణానికి, ఆరోగ్యానికి, భూసారానికి హాని కలిగించని ‘కలుపుతోనే కలుపును నిర్మూలించే పద్ధతి’పై రైతుల అనుభవాలు వారి మాటల్లోనే.. ‘సాగుబడి’ పాఠకుల కోసం..! ఇరవై రోజుల్లో కలుపు మాడిపోతుంది! నా పేరు మర్కంటి దత్తాద్రి (దత్తు). ఎనిమిదేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా. ఎన్.ఐ.ఆర్.డి. ద్వారా ఇతర రాష్ట్రాలకు వెళ్లి సేంద్రియ వ్యవసాయంపై రైతులకు శిక్షణ ఇచ్చి వస్తూనే.. నా వ్యవసాయం నేను చేసుకుంటున్నాను. ఈ ఏడాది పత్తి చేనులో కలుపు బాగా పెరిగింది. వృక్షాయుర్వేదంలో చెప్పినట్టు ఆచరించి ఫలితాలు పొంది సీనియర్ రైతులు మేకా రాధాకృష్ణమూర్తి, కొక్కు అశోక్ కుమార్ సూచించిన విధంగా నేను కలుపు మొక్కల బూడిద ద్రావణంతో నా ఎకరం పత్తి చేనులో కలుపును విజయవంతంగా నిర్మూలించుకుంటున్నాను. జూలై 15న ఈ ద్రావణాన్ని పత్తి పంటలో పిచికారీ చేశాను. నేలలో తేమ ఉన్నప్పుడు మాత్రమే పిచికారీ చేయాలి. అలాగే జూలై 15వ తేదీన పిచికారీ చేశాను. ఫలితాలు చాలా బాగున్నాయి. గడ్డి జాతి కలుపు మొక్కలు తొందరగా మాడిపోతున్నాయి. వెడల్పు ఆకులు/ వేరు వ్యవస్థ బలంగా ఉన్న మొక్కలు కొంచెం నెమ్మదిగా చనిపోతున్నాయి. మామూలుగా గరిక పీకినా రాదు. ఈ ద్రావణం చల్లిన ఆరో రోజు తర్వాత పట్టుకొని పీకగానే వస్తుంది. అప్పటికే దాని వేరు వ్యవస్థ మాడిపోయి ఉంది. 8–12 రోజుల నుంచి మొండి జాతుల కలుపు మొక్కలు చనిపోతాయి. కలుపు మొక్కల బూడిద ద్రావణం తయారీ ఇలా.. ఎకరం పత్తి చేను కోసం నేను ద్రావణం తయారు చేసుకున్న విధానం ఇది.. గరిక, బెండలం, వయ్యారిభామ, గూనుగ అనే నాలుగు రకాల కలుపు మొక్కలను.. రకానికి కిలో చొప్పున వేర్లు, దుంపలతో సహా పచ్చి మొక్కలను పీకి, మట్టిని కడిగేయాలి. నీటి తడి ఆరిపోయే వరకు కొద్దిసేపు ఆరబెట్టి.. ముక్కలు చేసి.. పెనం మీద వేసి.. బూడిద చేశాను. ఇలా తయారు చేసిన బూడిద 200 గ్రాములు, చక్కెర 200 గ్రాములు, లీటరు ఆవు పాలు కలిపితే.. నల్లటి ద్రావణం తయారవుతుంది. దీన్ని రెండు రోజులు బాగా, అనేకసార్లు కలియదిప్పాలి. మిక్సీలో పోసి.. తిప్పాలి. లేదా కవ్వంతో బాగా గిలకొట్టాలి. మూడో రోజు ఈ ద్రావణాన్ని.. ప్లాస్టిక్ డ్రమ్ములో 200 లీటర్ల నీటిలో ఈ ద్రావణాన్ని కలిపి.. 2 రోజులు బాగా కలియబెడుతూ మురగబెట్టాలి. నీరు నీలి రంగుకు మారుతుంది. 3వ రోజు ఈ నీటిని నేరుగా కలుపుతో నిండిన పొలంలో పవర్ స్ప్రేయర్‌తో కలుపు మొక్కలు నిలువెల్లా బాగా తడిచి వేర్లలోకి కూడా ద్రావణం నీరు చేరేలా పిచికారీ చేయాలి. దీన్ని పిచికారీ చేసేటప్పుడు కచ్చితంగా భూమిలో తేమ ఉండాలి. తేమ లేనప్పుడు పిచికారీ చేస్తే దీని ప్రభావం ఉండదు. పంట కాలంలో రెండు సార్లు పిచికారీ చేసుకుంటే.. ఏయే రకాల కలుపు మొక్కలను పీకి మసి చేసి ద్రావణం తయారు చేసి వాడామో.. ఆయా రకాల కలుపు జాతుల నిర్మూలన అవుతుంది. ఇంకా మిగిలిన రకాలేమైనా ఉంటే.. వాటితో మరోసారి ద్రావణం తయారు చేసి చల్లితే.. అవి కూడా పోతాయి. ఆ భూమిలో పంటలకు ఎటువంటి హానీ ఉండదు. అయితే, ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రధాన, అంతర పంటల మొక్కలను ఈ ద్రావణంలో వాడకూడదు. ఒక్కోసారి కలుపు మొక్కల విత్తనాలు గాలికి కొట్టుకు వచ్చి పడినప్పుడు, ఆ రకాల కలుపు మళ్లీ మొలవొచ్చు. అలాంటప్పుడు మరోసారి ద్రావణం తయారు చేసి వాడాలి. ప్రమాదకరమైన రసాయనిక కలుపు మందులు చల్లకుండానే కలుపు సమస్య నుంచి ఈ గరళకంఠ ద్రావణంతో నిస్సందేహంగా బయటపడొచ్చు. ఇది నా అనుభవం. ఒకసారి ఏవైనా తప్పులు జరిగితే, ఫలితాలు పూర్తిగా రావు.. అలాంటప్పుడు మళ్లీ ప్రయత్నించండి. చల్లిన తర్వాత ఫలితాలు పూర్తిగా కంటికి కనపడాలంటే.. కనీసం 20 రోజులు వేచి ఉండాలి. గరళకంఠ ద్రావణంతో కలుపు నిర్మూలన అద్భుతంగా జరుగుతుంది. లేత కలుపు మొక్కలను త్వరగా నిర్మూలించవచ్చు. ముదిరిన కలుపు మొక్కల నిర్మూలనకు ఎక్కువ రోజులు వేచి ఉండాల్సి వస్తుంది. బాగా ముదిరి విత్తనం వచ్చిన కలుపు మొక్కల నిర్మూలన కష్టం. – మర్కంటి దత్తాద్రి (దత్తు) (80084 84100), సేంద్రియ పత్తి రైతు, విఠోలి, ముదోల్ మండలం, నిర్మల్ జిల్లా (ఫొటోలు: బాతూరి కైలాష్, సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్) వయ్యారి భామ, తుంగ, గరిక నిర్మూలన! ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో అరెకరంలో ఆకుకూరలు, తీగజాతి కూరగాయలు సాగు చేస్తూ.. కలుపు నిర్మూలనకు గరళకంఠ ద్రావణం పిచికారీ చేశాను. ఏ కలుపు రకాలను తీసుకొని, బూడిద చేసి చల్లానో ఆ రకాల కలుపు మొక్కలన్నీ నూటికి నూరు శాతం చనిపోయాయి. తుంగ, గరికతోపాటు వయ్యారిభామ కూడా చనిపోయాయి. అయితే, కలుపు మొక్కలను పీకి బూడిద చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ పంటకు సంబంధించిన మొక్కలు కలవకుండా చూసుకోవాలి. అవి కూడా కలిస్తే ఈ ద్రావణం చల్లినప్పుడు పంట కూడా చనిపోతుంది. పిచికారీ చేసిన 48 గంటలు దాటాక.. వేర్ల దగ్గర నుంచి ప్రభావం కనిపించింది. కలుపు ఎదుగుదల అప్పటి నుంచే ఆగిపోయింది. 20–30 రోజుల్లో కలుపు మొక్కలు చనిపోయాయి. ఆ పంట కాలంలో ఆ కలుపు మళ్లీ పుట్టదు. – తుపాకుల భూమయ్య (96767 18709), జూలపల్లి, పెద్దపల్లి జిల్లా చిన్న, పెద్ద రైతులెవరైనా అనుసరించవచ్చు! కలుపు మొక్కలతో తయారు చేసిన గరళకంఠ ద్రావణంతో ప్రధాన పంట మొక్కలకు ఎటువంటి హానీ జరగదు. కలుపు మొక్కలు వేర్ల నుంచి మురిగిపోతాయి. కొద్ది రోజుల్లోనే పెరుగుదల ఆగిపోయి.. కలుపు మొక్కలు ముట్టుకుంటే ఊడిపోతాయి. తర్వాత కొద్ది రోజులకు ఎండిపోతాయి. ఎన్ని ఎకరాలకైనా బెల్లం వండే బాండీల్లో/పాత్రల్లో ఒకేసారి భారీ ఎత్తున కలుపు బూడిదను తయారు చేసుకొని.. దానితో ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు. ఇది చిన్న, పెద్ద రైతులు ఎవరైనా ఆచరించదగిన ఖర్చులేని, పర్యావరణానికి, ప్రజారోగ్యానికి హాని లేని కలుపు నిర్మూలన పద్ధతి అని అందరూ గుర్తించాలి. కలుపు మొక్కల బూడిదను ఎప్పటికప్పుడు వాడుకోవాలన్న నియమం ఏమీ లేదు. ఈ బూడిదను నిల్వ చేసుకొని.. ఆ తర్వాతయినా వాడుకోవచ్చు. – కొక్కు అశోక్‌కుమార్ (98661 92761), సేంద్రియ రైతు, జగిత్యాల తుంగ వేర్లు 3 రోజుల్లో మాడిపోతాయి! 2011 నుంచి ప్రకృతి వ్యవసాయంలో వరి, తదితర పంటలు పండిస్తున్నాను. వరిలో తుంగ కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. వృక్షాయుర్వేదంలో చెప్పిన ప్రకారం.. కలుపును కలుపుతోనే నిర్మూలించడం సాధ్యమేనని అనుభవపూర్వకంగా మేం తెలుసుకున్నాం. తుంగ, గరిక వంటి కలుపును సమర్థవంతంగా నిర్మూలించాను. కిలో తుంగ గడ్డలతో సహా వేర్లు, మొక్కలు మొత్తం పీకి.. వేర్ల మట్టిని కడిగి.. పెనం మీద కాల్చి బూడిద చేయాలి. 100 గ్రా. కలుపు మొక్కల బూడిద, 100 గ్రా. పంచదార, అర లీటరు నాటావు పాలు కలిపి.. రెండు రోజులు తరచూ కలియదిప్పుతూ ఉండాలి. 2 రోజుల తర్వాత ఆ ద్రావణాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి మరో రెండు రోజులు పులియబెట్టాలి. తరచూ కలియదిప్పుతూ ఉండాలి. మూడో రోజున ఆ ద్రావణాన్ని వరి పొలంలో అంతటా పిచికారీ చేయాలి. ఈ ద్రావణం కలుపును దుంపను నాశనం చేస్తుంది. మొదట దుంపను, వేర్లను ఎండిపోయేలా చేస్తుంది. క్రమంగా మొక్క కాండం, ఆకులు కూడా ఎండిపోతాయి. తుంగ మొక్కను పట్టుకొని పీకితే తేలిగ్గా రాదు. నేను ద్రావణం చల్లిన తర్వాత మూడో రోజు తుంగ మొక్కను పట్టుకుంటే చాలు ఊడి వస్తుంది. దుంప, వేర్లు మాడిపోయాయి. ఇలా నిర్మూలించిన తర్వాత మా పొలంలో మళ్లీ ఇంత వరకు తుంగ రాలేదు. వరి మొక్కలకు ఎటువంటి హానీ జరగలేదు. గరికను పెనం మీద మాడ్చి ద్రావణం తయారు చేసి చల్లితే 10 రోజులకు వడపడింది. పీకి చూస్తే వేరు ఎండిపోయింది. సాధారణంగా రసాయనిక కలుపు మందులు పిచికారీ చేసిన తర్వాత 48 గంటల్లో మొదట ఆకులు, కొమ్మలు, కాండం, వేర్లు.. పై నుంచి కిందకు ఎండిపోతాయి. ఈ ద్రావణం చల్లితే ఇందుకు భిన్నంగా.. మొదట వేర్లు, గడ్డలు, కాండం, కొమ్మలు, ఆకులు చివరగా ఎండుతాయి. అయితే, భూమిలో తేమ ఉన్నప్పుడు మాత్రమే ఈ కలుపు నిర్మూలన ద్రావణాన్ని పిచికారీ చేయాలి. చల్లిన ద్రావణం వేరు ద్వారా కిందికి దిగాలంటే భూమిలో పదును ఉండాలి. అప్పుడే ఇది సక్సెస్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో రైతులంతా రసాయనిక కలుపు మందులు వాడి భూములను నాశనం చేసుకోకుండా, స్వల్ప ఖర్చుతో ఈ ద్రావణం తయారు చేసుకొని వాడుతూ కలుపు నిర్మూలన చేసుకుంటున్నారు. – మేకా రాధాకృష్ణమూర్తి (84669 23952), మంత్రిపాలెం, నగరం మండలం, గుంటూరు జిల్లా. -
సిరుల వేరుశనగ!
విత్తన శుద్ధి ఇలా.. విత్తనాలు పురుగు పట్టినవి కాకుండా చూసుకోవాలి. ఎకరానికి 60 నుంచి 75 కిలోలు విత్తుకోవాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల మంకోజబ్ పొడి మందును పట్టించి విత్తనశుద్ధి చేసుకోవాలి. దీంతో పాటు విత్తనానికి రైజోబియం లేక 6.5 మిల్లిలీటర్ల క్లోరో ఫైరిఫాస్ కానీ, రెండు మిల్లీ లీటర్ల ఇమిడాక్లోప్రిడ్ కానీ కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి. దుక్కి తయారీ దుక్కి మెత్తగా చదును చేసుకున్న తర్వాత చివరి దుక్కిలో 4, 5 టన్నుల సేంద్రియ ఎరువులు వేయాలి. నీటి పారుదలకు కింద అయితే ఎకరానికి వంద కిలోల సూపర్‌ఫాస్పెట్, 33 కిలోల మ్యూరెట్ఆఫ్ పొటాష్ మరియు 20 కిలోల యూరియాను విత్తే సమయంలోనే వేయాలి. 9 కిలోల యూరియా, ఎకరానికి 200 కిలోల జిప్సంను పంట విత్తిన 30 రోజుల త ర్వాత అంటే తొలిపూత దశలో వేసుకోవాలి. కలుపు నివారణ కలుపు నివారణ కొరకు ఫ్లూక్లోరాలిన్ 45 శాతం ఎకరాకు లీటరు చొప్పున దుక్కిపై పిచికారీ చేసి కలియ దున్నాలి. విత్తిన 20 నుంచి 25 రోజుల సమయంలో గొర్రుతో అంతరకృషి చేయాలి. విత్తిన 45 రోజులలోపు ఎలాంటి కలుపు మొక్కులూ లేకుండా చూడాలి. 45 రోజుల తర్వాత ఎలాంటి అంతరకృషి చేయకూడదు. ఆకుముడత తెగులు పురుగు ఆకు పొరల మధ్య తొలుస్తూ పత్రహరిత పదార్థాన్ని తింటుంది. దీంతో ఆకులు గోధుమ రంగులోకి మారి ముడతలుగా మారుతాయి. పురుగు లార్వా దశలో రెండు ఆకులను దగ్గరకు చేర్చి వాటి మధ్య గూడును ఏర్పాటు చేసుకుంటుంది. ఆకుపై పొరకు, కింది పొరకు మధ్య ఉన్న కణజాలాన్ని తింటుంది. దీంతో ఆకులు ఎక్కువ సంఖ్యలో రాలిపోయి మొక్కల పెరుగుదల కాయల అభివృద్ధి తగ్గుతుంది. నివారణ ప్రతి సంవత్సరం ఒకే పొలంలో వేరుశనగ పంట వేయకుండా పంట మార్పిడి చేయాలి. లీటర్ నీటికి 1.6 మిల్లిలీటర్ల మొనోక్రోటోఫాస్, రెండు మిల్లిలీటర్ల క్వినాల్ఫాస్ లీటర్ నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చేసుకోవాలి. లద్దె పురుగు.. లద్దె పురుగు నివారణకు వేసవిలో దుక్కి లోతుగా దున్ని నత్రజని, వేపపిండి వేసుకోవాలి. పురుగు తొలి దశ లలో ఐదు శాతం వేప గింజల కషాయాన్ని కలిపి పిచికారీ చేయాలి. లేదా లీటరు నీటికి ఐదు మిల్లీ లీటర్ల వేపనూనే పిచికారీ చేసుకోవాలి. పురుగు లార్వా దశకు ఎదిగాక ఐదు కిలోల తవుడు, అరకిలో బెల్లం, అరలీటర్ మోనోక్రోటోఫాస్ లేదా అర లీటర్ క్లోరోపైరిఫాస్ కలిపి విషపు ఎరువు తయారు చేసుకోవాలి. వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసి మొక్క మొదళ్ల వద్ద వేసినట్లయితే లద్దె పురుగును నివారించవచ్చు. తెగుళ్లు.. నివారణ చర్యలు పంటకు జింకులోపం ఏర్పడితే ఆకులు చిన్నవిగా మారి గుబురుగా కనిపిస్తాయి. ఈ లోపాన్ని నివారించడానికి ఎకరాకు 400 గ్రాముల జింక్‌సల్ఫేట్‌ను 200 లీటర్ల నీటిలో కలిపి వారం వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి. లేత ఆకుమచ్చ తెగులు.. మొక్కలు 20 నుంచి 30 రోజుల వయసులో ఉన్నప్పుడు ఆకుపై మచ్చలు కనిపి స్తే ఒక లీటరు నీటికి 2.5 గ్రామాలో మంకొజెబ్, లీటరు నీటికి ఒక గ్రాము కార్బడిజం కలిపి 200 లీటర్ల ద్రావణాన్ని తయారు చేసుకొని ఒక ఎకరానికి స్ప్రే చేయాలి. ముదురు ఆకుమచ్చ తెగులు.. ఈ తెగులు విత్తిన 30 రోజుల తర్వాత వంద రోజుల్లోపు ఆశించే అవకాశం ఉంది. తెగులు ఆశించిన వెంటనే లీటరు నీటికి 2.5 గ్రాముల మంకోజెబ్ గానీ లీటరు నీటికి గ్రాము కార్బడిజం గానీ కలిపిన ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. -
ఇలా చేస్తే.. కలుపుపై మనదే గెలుపు
వరిలో కలుపు నివారణకు ప్రస్తుతం ఎన్నో రసాయనిక మందులు అందుబాటులో ఉన్నాయి. ఆయా పద్ధతుల్లో వరి సాగుకు సంబంధించి కలుపు నివారణకు ఏఏ మందులు వాడాలో బాపట్ల మండల వ్యవసాయాధికారి పి. రఘు (8886614161) రైతులకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. కాస్తంత దృష్టి పెడితే వరిలో కలుపు నివారణ చాలా తేలికైన పని అని చెప్పారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. బాపట్లటౌన్: వర్షాభావ పరిస్థితులు నేపథ్యంలో ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా వరిలో కలుపు సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. కూలీల కొరత కారణంగా కలుపు తీయడం ఖర్చుతో కూడుకున్న పనిగా మారుతోంది. ఈ నేపథ్యంలో కలుపు నివారణకు రైతులు రసాయనాలు వినియోగించాల్సిన అవసరం ఉంది. పలు పద్ధతుల్లో సాగు చేస్తున్న వరిలో కలుపు నివారణకు సంబంధించి రైతులు వేర్వేరు మందులు వాడాల్సి ఉంది. ప్రత్యేక పద్ధతులు అవలంబించాల్సి ఉంది. మెట్టవరిలో కలుపు యాజమాన్యం మెట్టపొలాల్లో వరిని రెండు పద్ధతుల్లో సాగుచేస్తున్నారు. వెదజల్లడం, గొర్రుతో విత్తడం.. ఇవే ఆ పద్ధతులు. ఇలా సాగుచేసిన పైరులో కలుపు నివారణకు వరి విత్తిన రెండు లేక మూడు రోజుల్లోగా లీటరు నీటికి ఐదు నుంచి ఆరు మిల్లీ లీటర్ల ఫెండీమిథాలిన్గానీ, రెండు మిల్లీలీటర్ల ప్రిటిలాక్లోర్ 50 శాతం ద్రావకాన్నిగానీ, 1.5 మిల్లీలీటర్ల అనిలోఫాస్గానీ పిచికారీ చేయాలి. ఊదలాంటి గడ్డిజాతి మొక్కలు ఉంటే.. - విధ పద్దతుల్లో సాగుచేసిన వరిలో విత్తిన 15 నుంచి 20 రోజుల మధ్య ఊదలాంటి గడ్డిజాతి మొక్కలు ఎక్కువుగా ఉంటే ఎకరాకు 400 మిల్లీలీటర్లసైహాలోపాప్ బ్యూటైల్‌ను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. - గడ్డిజాతి మొక్కలు, వెడల్పాటి మొక్కలు ఎక్కువగా ఉంటే ఎకరాకు 80 నుంచి 100 మి.లీ బీస్పైరి బాక్ సోడియంను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. - విత్తినా, నాటిన 25 నుంచి 30 రోజుల్లో ఎకరాకు 400 గ్రాముల 2.4-డి సోడియం సాల్టుగానీ, 50 గ్రాములు ఇథాక్సి సల్ఫ్యూరాన్నుగానీ 15 శాతం పొడి మందుతో, 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేస్తే ఎలాంటి కలుపునైనా సమర్థంగా నివారించుకోవచ్చు. డ్రమ్‌సీడర్ సాగులో వరి విత్తిన మూడు నుంచి ఐదు రోజుల్లోగా పొలంలో నీరు పలుచగా ఉన్నప్పుడు ఎకరాకు 35 నుంచి 50 గ్రాముల ఆక్సాడయార్టిల్ పొడి మందు చల్లుకోవాలి. లేదంటే 80 గ్రాముల ఫైరజో సెల్ఫూరాన్ ఇథైల్‌ను అరలీటరు నీటిలో కరిగించి దానికి 20 కిలోల పొడి ఇసుక కలిపి పొలంలో చల్లుకోవాలి. వరి విత్తిన 3 నుంచి 4 రోజుల్లోగా ఎకరాకు 80 గ్రాముల పైరజోసల్ఫూరాన్ ఇథైల్‌ను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.