వేసవిలో ఇల్లు చల్లగా ఉండాలంటే.. | Home Protection With Cool Roofs From Heat Wave | Sakshi
Sakshi News home page

వేసవిలో ఇల్లు చల్లగా ఉండాలంటే..

Published Thu, Feb 29 2024 12:44 PM | Last Updated on Thu, Feb 29 2024 1:18 PM

Home Protection With Cool Roofs From Heat Wave - Sakshi

ఇంకా వేసవికాలం పూర్తిగా రానేలేదు. ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం దాదాపు 12 నుంచి సాయంత్రం 4 వరకు విపరీతమైన వేడి ఉంటుంది. దాంతో బయట పనులకు వెళ్లలేని పరిస్థితులున్నాయి. అలా అని ఇంట్లో ఉందామంటే కూడా వేడి తాళలేకపోతున్నారు.

ఒకవేళ తప్పని పరిస్థితిలో బయటకు వెళ్లినా ఇంటికి వస్తే హాయిగా చల్లగా ఉండాలి.. రాత్రిపూట ఉక్కపోత లేకుండా ప్రశాంతంగా నిద్రపట్టాలి.. ఏసీ వేసుకుంటే సరిపోతుంది కదా అంటారా? నిజమే కానీ అందరి ఇళ్లలో ఆ సౌకర్యం ఉండదు కదా.. దాన్ని భరించే స్థోమత చాలామందికి లేదు. ఇలాంటి వారు తక్కువ ఖర్చుతో వేసవిలో ఇంటిని చల్లగా ఉండేలా చూసుకోవచ్చు. అందుకు మార్కెట్లో రకరకాల పద్ధతులను పాటిస్తున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

చల్లదనాన్ని ఇచ్చే పెయింట్‌లు..

దాదాపు అన్ని ఇళ్లు నిర్మాణానికి కాంక్రీటే వినియోగిస్తున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో సిమెంట్‌, ఇతర రేకుల ఇళ్లు ఉన్నాయి. ఇవి ఎక్కువ వేడిని గ్రహిస్తాయి. దాంతో ఆ ఇళ్ల లోపల ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. దీనికి పరిష్కారంగా పైకప్పులపై తెల్లని పెయింట్‌ను వేసుకోవడం ద్వారా చాలావరకు ఉపశమనం కల్గుతుంది. ఇంటిపై పడిన కిరణాలు తెలుగు రంగు కారణంగా పరావర్తనం చెంది వాతావరణంలో కలిసిపోతాయి. ఇందుకోసం పైకప్పుపై సున్నం మొదలు మార్కెట్లో దొరికే కూల్‌ రూఫ్‌ పెయింట్స్‌ వరకు వినియోగించవచ్చు. దీనివల్ల భవనంపైన 20 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతను తగ్గుతుంది. ఇంటి లోపల 2.1 నుంచి 4.3 డిగ్రీల వరకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

ప్లాస్టిక్‌ షీట్స్‌తో రక్షణ..

బస్తీల్లో బిల్డింగ్‌లతోపాటు చాలావరకు రేకుల ఇళ్లు ఉంటాయి. వాటిలోనే ఎక్కువ మంది జీవిస్తుంటారు. వీరు తక్కువ ఖర్చుతో పైకప్పుపై ప్లాస్టిక్‌ షీట్స్‌ను పరిస్తే చాలు. గాలులకు ఎగిరిపోకుండా చూసుకోవాలి. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని దేవరకొండ బస్తీలో కొన్ని ఇళ్లపై ప్లాస్టిక్‌ షీట్స్‌ను పరిచి వేడి తగ్గించడం ద్వారా బస్తీవాసుల్లో అవగాహన కల్పించారు. ఆరేడు డిగ్రీల వరకు లోపల వేడి తగ్గినట్లు గుర్తించారు.

సోలార్‌ ప్లేట్‌లతో..

ఇంటిని చల్లగా ఉంచడంతోపాటు విద్యుత్తును ఉత్పత్తిచేస్తూ అవసరాలకు వాడుకునేలా సోలార్‌ ప్లేట్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. మూడు కిలోవాట్లకు సబ్సిడీ పోను రూ.1.10 లక్షలు ఖర్చువుతుంది. నెలకు 360 యూనిట్ల వరకు ఉత్పత్తి అవుతుంది. ఇంటికి అవసరమైన విద్యుత్తును వాడుకుని మిగిలిన దాన్ని గ్రిడ్‌కు అనుసంధానం చేయవచ్చు. డిస్కం నుంచి యూనిట్‌కు రూ.5 లపైన తిరిగి పొందవచ్చు.

ఇదీ చదవండి.. కదిలే ఇళ్లు.. సకల సౌకర్యాలు!

మొక్కలను పెంచడంతో..

ఇంటిపైన ఖాళీ స్థలంలో మొక్కలను పెంచవచ్చు. దాంతో వేసవిలో చల్లగా ఉండేలా చూసుకోవచ్చు. రకరకాల పూలు, అలంకరణ మొక్కలు, కూరగాయలు పెంచుకోవచ్చు. అయితే అంతకంటే ముందు వాటర్‌ లీకేజీలు లేకుండా వాటర్‌ఫ్రూపింగ్‌ చేయించాలి. ఇంటి చుట్టూ మొక్కలు, నీడనిచ్చే చెట్లు ఉంటే చల్లగా ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement