దేశీ ఆవుకు ఆలంబన కామధేను | National Kamdhenu Breeding Center Special Story In Nellore | Sakshi
Sakshi News home page

దేశీ ఆవుకు ఆలంబన కామధేను

Published Tue, Feb 18 2020 7:21 AM | Last Updated on Tue, Feb 18 2020 7:25 AM

National Kamdhenu Breeding Center Special Story In Nellore - Sakshi

అపురూపమైన దేశీయ గో జాతులు, గేదె జాతుల అభ్యున్నతికి నిర్మాణాత్మక కృషికి శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చింతలదేవిలో ఏర్పాటైన జాతీయ కామధేను బ్రీడింగ్‌ కేంద్రం చిరునామాగా మారుతోంది. ప్రస్తుతం 12 దేశీయ గో జాతులు, 5 దేశీ గేదె జాతుల పశువులను పరిరక్షిస్తున్నారు. అంతరించిపోతున్న పుంగనూరు వంటి గోజాతుల నుంచి మేలైన పశుజాతులను అతి తక్కువ సమయంలో పునరుత్పత్తి చేసి రైతులకు అందించడం ఈ బ్రీడింగ్‌ కేంద్రం ముఖ్య లక్ష్యం. ఈ కేంద్రంలో సుమారు 6 నెలల క్రితం పుట్టిన ఒంగోలు గిత్త దూడ చూపరుల దృష్టిని ఆకర్షిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగినన్ని నిధులతోపాటు నీటిని అందించి ప్రోత్సహిస్తే మేలైన పశుజాతుల ద్వారా రైతుల అభివృద్ధికి దోహదపడినట్టవుతుంది. 

దేశీ పశుజాతులు ఇటు వ్యవసాయానికి అటు పాల దిగుబడికి పట్టుగొమ్మల్లాంటివి. రైతులకు, ముఖ్యంగా చిన్న–సన్నకారు రైతాంగానికి, పశుపోషణ నిరంతర ఆదాయానికి పెట్టింది పేరు. మెట్ట రైతుకు అరకలే ఆధారం. వ్యవసాయంపై ఆదాయం కన్నా పాడి మీదనే ఎక్కువ ఆదాయం పొందే రైతు కుటుంబాలు ఉన్నాయి. అయితే, దేశీ గోజాతుల్లో పాలధార తక్కువగా ఉండటం వల్ల సంకరజాతి పశువుల వైపు మొగ్గాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలో అత్యాధునిక పశుగణాభివృద్ధి పద్ధతుల ద్వారా మంచి పాలధార కలిగిన దేశీ గోజాతులను త్వరితగతిన అభివృద్ధి చేసుకోవడం ఒక్కటే మార్గం.

చింతలదేవిలోని కామథేను బ్రీడింగ్‌ కేంద్రం సంరక్షణలో ఉన్న దేశీ జాతుల ఆవులు

ఇందుకోసమే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ కామధేను బ్రీడింగ్‌ కేంద్రం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొండాపురం మండలం చింతలదేవిలో 2015 ఏప్రిల్‌ 4న ఏర్పాటైంది. దేశీ పశుసంపదను నిర్మాణాత్మకంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో ఏర్పాటైన కామథేను ప్రాజెక్టుకు ఆనాటి కేంద్ర మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు శంకుస్థాపన చేశారు. ఇటువంటి ప్రతిష్టాత్మక బ్రీడింగ్‌ కేంద్రం చింతలదేవితోపాటు మధ్యప్రదేశ్‌లోని ఔరంబాదాద్‌ జిల్లా హిటాచిలో మరొకటి ఉంది. కామధేను ప్రాజెక్టుకు మొదటి దశలో రూ. 25 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో పశు వైద్యశాల, పశుమేత ఉత్పత్తికేంద్రం, బయోగ్యాస్‌ ప్లాంటు, పాల ఉత్పత్తి కేంద్రం, పశువులకు షెడ్లు, రోడ్లు, నీటి సౌకర్యం కోసం బోర్లు, నీటి కుంటలు తదతర పనులు చేపట్టారు. ప్రస్తుతం ఈ పనుల్లో కొన్ని తుది దశకు చేరుకోగా మరికొన్ని పనులు జరుగుతున్నాయి. ప్రాజెక్టు విస్తరణ కోసం మరో రూ.100 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపారు. 

ఒక మేలు జాతి పశువు నుంచి 60 దూడలు
మేలు జాతి పశు సంపదను వృద్ధి చేసుకునే ప్రక్రియలో రైతుల దగ్గర ఇప్పటికే ఉన్న సాధారణ ఆవులు, గేదెల గర్భాలనే ఉపయోగించుకునే పద్ధతిని అనుసరిస్తుండటం విశేషం. మేలు జాతి దేశీ ఆవులు, గేదెల నుంచి సేకరించిన అండాలను, మేలుజాతి దేశీ ఆబోతుల నుంచి సేకరించిన వీర్యాన్ని అత్యాధునిక సదుపాయాలున్న ప్రయోగశాలలో ఫలదీకరణ చెందించి మేలు జాతి పిండాలను ఉత్పత్తి చేస్తారు. ఆ పిండాలను స్థానికంగా రైతుల వద్ద నున్న పశువుల గర్భంలో ప్రవేశపెట్టి మేలు జాతి దూడలను ఉత్పత్తి చేస్తారు.

చింతలదేవిలోని కామథేను బ్రీడింగ్‌ కేంద్రం సంరక్షణలోని వివిధ జాతుల గేదెలు

సాధారణంగా ఒక మేలురకం దేశీ ఆవు జీవిత కాలంలో 10–11 దూడలకు జన్మనిస్తుంది.  అయితే, ఆవు ఒకసారి విడుదల చేసే అండంతో 18 వరకు పిండాలను ఉత్పత్తి చేయవచ్చు. ఏడాదిలో నాలుగు, ఐదుసార్లు ఈ ప్రక్రియ చేపట్టి.. ఒక మేలు జాతి ఆవు ద్వారా ఏడాదికి 50 నుంచి 60 మేలు రకం దూడలను పుట్టించవచ్చని, కామధేను బ్రీడింగ్‌ కేంద్రంలో ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నామని జాయింట్‌ డైరెక్టర్‌ డా. రామన్‌ ‘సాక్షి’కి వివరించారు. ఇలా దేశీ గోజాతులను, గేదె జాతుల సంతతిని తక్కువ కాలంలోనే చాలా ఎక్కువ సంఖ్యలో వృద్ధి చేయవచ్చు.

పుంగనూరు వంటి అంతరించిపోతున్న గోజాతుల పరిరక్షణకు ఈ పద్ధతి చాలా బాగా ఉపకరిస్తుంది. అదేవిధంగా పాలధార అధికంగా ఉన్న ఒంగోలు తదితర గోజాతుల సంతతిని తక్కువ కాలంలోనే ఇబ్బడిముబ్బడిగా పెంపొందించడానికి కామధేను ప్రాజెక్టు ద్వారా వీలవుతుంది. ఇలా పుట్టించిన మేలైన దూడలను అడపాదడపా వేలం ద్వారా రైతులకు అందిస్తారు. మేలైన గోజాతుల పిండాలను రైతులకు విక్రయిస్తారు. తమ దగ్గర ఉన్న సాధారణ ఆవుల గర్భాలలోకి ఈ మేలుజాతి పిండాలను చేర్చి.. మేలైన దూడలను రైతులే ఉత్పత్తి చేసుకునేలా ప్రోత్సహించాలన్నది ప్రభుత్వ భావన. తద్వారా దేశీ గో జాతుల ద్వారా అధిక పాల దిగుబడి సాధించడం, దుక్కి దున్నే ఎద్దులను అందుబాటులోకి తేవడం లక్ష్యం. ఈ విధానంపై మన రైతులకు అవగాహన కల్పించి మేలుజాతి పశువుల పోషణను ప్రోత్సహించి వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే కామధేను బ్రీడింగ్‌ కేంద్రం పరమ లక్ష్యమని డా. రామన్‌ చెప్పారు. 

12 దేశీ గోజాతులు.. 5 గేదె జాతులు..
కామధేను బ్రీడింగ్‌ కేంద్రంలో ప్రస్తుతం 12 దేశీ గోజాతులు, 5 గేదె జాతులపై పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రతి 18 ఆవులు/గేదెలతోపాటు ఒక దున్నను పెంచుతున్నారు. ఈ 19 పశువులను ఒక యూనిట్‌గా పరిగణిస్తారు. ఒంగోలు, పుంగనూరు, కంగాయమ్, కాంక్రెజ్, మల్నాడ్‌ గిడ్డ, షాహివాల్, గిర్, రతి, థార్‌పార్కర్, రెడ్‌సింధి, దియోని, కృష్ణవేణి వంటి దేశీ గోజాతులతోపాటు.. ముర్రా, మోహతానా, పండిపురి, బాఫర్‌బాది, బన్ని గేదె జాతులను కామథేను బ్రీడింగ్‌ కేంద్రంలో ప్రస్తుతానికి సంరక్షిస్తున్నారు. 2017లో మొత్తం 119 ఆవులు, గేదెలతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టులో వీటి సంఖ్య ప్రస్తుతం 464కు పెరిగింది. ప్రతి ఏటా కొన్ని మేలైన దూడలను వేలం వేస్తుంటారు. ఈ ఏడాది కూడా త్వరలో వేలం తేదీలను ప్రకటిస్తామని డా. రామన్‌ వివరించారు. 2,450 ఎకరాలు విస్తీర్ణం గల చింతలదేవి పశుగణాభివృద్ధి క్షేత్రంలో కామధేను బ్రీడింగ్‌ కేంద్రానికి 500 ఎకరాలు కేటాయించారు. ఇందులో పశువులకు అవసరమైన పచ్చిగడ్డి పెంచుతున్నారు. ప్రస్తుతం పిండోత్పత్తి కేంద్రం నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. బయోగ్యాస్‌ ప్లాంటు ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారు. త్వరలో పాల ఉత్పత్తి కేంద్రం కూడా పూర్తికానుంది.

థార్‌పార్కర్‌ ఆవు కడుపున పుట్టి, ఆరోగ్యంగా పెరుగుతున్న∙ఒంగోలు గిత్త దూడ తాజా చిత్రం

వెంటాడుతున్న నీటి కొరత
రాళ్లపాడు రిజర్వాయరు నుంచి పైప్‌లైను ద్వారా లిఫ్ట్‌ ద్వారా కామధేను బ్రీడింగ్‌ కేంద్రానికి నీరు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. లిఫ్ట్, పైప్‌లైను పనులు 75 శాతం పనులు పూర్తయ్యాయి. అయితే, నీటితరలింపును కొందరు ప్రజాప్రతినిధులు అడ్డుకోవడంతో ఈ బ్రీడింగ్‌ కేంద్రానికి నీటి సమస్య తలెత్తింది. ఆంధ్రప్రదేశ్‌కు తలమానికంగా ఉన్న కామధేను బ్రీడింగ్‌ కేంద్రంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధవహించాలని  ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు. ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టును ప్రారంభించాలని కోరుతున్నారు. 

థార్‌పార్కర్‌ ఆవు కడుపున ఒంగోలు దూడ!
కామధేను బ్రీడింగ్‌ కేంద్రంలో థార్‌పార్కర్‌ ఆవు కడుపున పుట్టిన ఒంగోలు గిత్త దూడ సందర్శకుల దృష్టిని ఆకర్షిస్తోంది. మేలైన ఒంగోలు జాతి ఆవు అండం, మేలైన ఒంగోలు గిత్త వీర్యంతో తయారైన పిండాన్ని.. అధిక పాలధార కలిగిన థార్‌పార్కర్‌ ఆవు(ఎదకు వచ్చిన ఏడో రోజున) గర్భంలోకి ఐవిఎఫ్‌ పద్ధతిలో పెట్టారు. అలా పుట్టిన గిత్త దూడకు నూటికి నూరు శాతం ఒంగోలు జాతి లక్షణాలే వచ్చాయి. థార్‌పార్కర్‌ ఆవు కడుపులో పెరిగినప్పటికీ ఈ ఆవు లక్షణాలు అసలు రావని, పూర్తి స్వచ్ఛతతో కూడిన ఒంగోలు గిత్త దూడే పుట్టిందని డా. రామన్‌ తెలిపారు. గత ఏడాది ఆగస్టు 25న పుట్టిన ఈ దూడ ఇప్పటికే దాదాపు తల్లి ఎత్తుకు ఎదిగిందన్నారు. ఈ విధంగా రైతులు తమ వద్ద ఉన్న ఏ ఆవు కడుపులోనైనా తమకు అవసరమైన మేలైన పాలధార కలిగిన గోజాతి పిండాన్ని పెట్టించుకొని.. మేలైన ఆవులను లేదా గిత్తల సంతతిని వృద్ధి చేసుకోవడానికి కామధేను బ్రీడింగ్‌ కేంద్రం రైతులకు ఉపయోగపడతుందని డా. రామన్‌ అంటున్నారు. ఈ కేంద్రానికి అల్ట్రాసౌండ్‌ త్రీడీ కలర్‌ డాప్లర్‌ పరికరాలు ఇటీవల సమకూరటం విశేషం.


దేశీ పశుజాతుల అభివృద్ధిలో ఐదారేళ్లలో అద్భుత ప్రగతి సాధ్యం
ఒంగోలు మేలు జాతి పశువులు మన దగ్గర ఎక్కువగా లేవని మనం చింతించనవసరం లేదు. కామథేను బ్రీడింగ్‌ కేంద్రానికి తగినన్ని నిధులతో పాటు పుష్కలంగా నీటిని అందించి ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఐదారేళ్లలోనే మేలైన పాలధార కలిగిన ఒంగోలు ఆవులు, మేలైన సామర్థ్యం కలిగిన ఒంగోలు గిత్తలను పెద్ద సంఖ్యలో మనమే ఉత్పత్తి చేసుకోవచ్చు. పుంగనూరు వంటి గోజాతి సంతతిని సులువుగా పెంపొందించుకోవచ్చు. దేశీ గోజాతులు, గేదె జాతుల అభివృద్ధి జరుగుతుంది. తద్వారా రైతులకు, ప్రభుత్వానికి కూడా ఎంతో ఆదాయం వస్తుంది. 
– డా. రామన్‌ (94923 37017), జాయింట్‌ డైరెక్టర్, జాతీయ కామధేను బ్రీడింగ్‌ కేంద్రం, చింతలదేవి, కొండాపురం మండలం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా


23న కొర్నెపాడులో తేనెటీగల పెంపకంపై శిక్షణ
రైతునేస్తం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గర కొర్నెపాడు రైతు శిక్షణా కేంద్రంలో ఈ నెల 23(ఆదివారం)న వ్యవసాయంలో తేనెటీగల ప్రాముఖ్యత – తేనెటీగల పెంపకం – ప్రభుత్వ రాయితీలపై ఉద్యాన శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రాజా కృష్ణారెడ్డి, తేనెటీగల పెంపకంలో నిపుణులు కోటేశ్వరరావు రైతులకు ఉ. 10 గం. నుంచి సా. 4 గం. వరకు అవగాహన కల్పిస్తారని ఫౌండేషన్‌ చైర్మన్‌ డా. యడ్లపల్లి వేంకటేశ్వరరావు తెలిపారు. ముందుగా పేర్లు నమోదు చేసుకోగోరే వారు 97053 83666, 0863–2286255 నంబర్లలో సంప్రదించవచ్చు. 
 – మేడగం భాస్కర్‌రెడ్డి, సాక్షి, ఉదయగిరి, నెల్లూరు జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement