breeding centre
-
షాకింగ్ రిపోర్ట్: కోవిడ్ కొత్త వేరియంట్ల తయారీ కేంద్రంగా చైనా!
బీజింగ్: చైనాలో కోవిడ్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతూ లక్షల మందికి సోకుతోంది. కొద్ది రోజుల్లోనే దేశంలోనే 60 శాతం జనాభాకు ఈ వైరస్ సోకే ప్రమాదం ఉందనే నివేదికలు కలవర పెడుతున్నాయి. అందుకు ప్రధానంగా ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బీఎఫ్.7తో పాటు మరో మూడు వేరియంట్లు కారణమని గుర్తించారు. ఈ క్రమంలోనే ఓ షాకింగ్ న్యూస్ యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. కోవిడ్-19 విజృంభణతో చైనా కొత్త వేరియంట్ల పుట్టుకకు బలమైన కేంద్రంగా మారబోతోందని ఆరోగ్య విభాగం నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజాగ్రహంతో జీరో కోవిడ్ పాలసీకి మంగళం పాడిన చైనా ప్రభుత్వం, జనవరి 8 నుంచి విదేశీ ప్రయాణికుల క్వారంటైన్ నిబంధనలనూ ఎత్తివేసింది. మరోవైపు.. రోజువారీ కోవిడ్ నివేదికలను వెల్లడించటాన్ని ఆపివేసింది చైనా జాతీయ ఆరోగ్య కమిషన్. కొద్ది రోజులుగా వేలాది మంది వైరస్ బారినపడినట్లు తెలుస్తోంది. వైద్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. వ్యాక్సినేషన్ సరిగా లేకపోవటం, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల చైనాలో.. ప్రపంచ జనాభాలోని ఐదోవంతు మందిలో ఈ వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. దీంతో కొత్త వేరియంట్లు అభివృద్ధి చెందేందుకు చైనా కేంద్ర బిందువుగా మారబోతోందని ఇతర దేశాల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్తవారిలోకి వైరస్ ప్రవేశించినప్పుడు అది మ్యూటేషన్ చెందేందుకు అవకాశం ఉంటుందని జెనీవా యూనివర్సిటీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ డైరెక్టర్ ఆంటోయిన్ ఫ్లాహాల్ట్ పేర్కొన్నారు. ‘ఒక్కసారిగా సుమారు 1.4 బిలియన్ ప్రజలు సార్స్ కోవ్2 బారినపడ్డారు. ఇది కచ్చితంగా కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే వాతావరణాన్ని కల్పిస్తుంది. కొద్ది నెలల్లోనే 500లకుపైగా ఒమిక్రాన్ కొత్త వేరియంట్లను గుర్తించాం. అయితే, అవి తొలుత ఎక్కడ మ్యుటేట్ అయ్యాయనే విషయాన్ని చెప్పడం చాలా కష్టం.’ అని పేర్కొన్నారు ఆంటోయిన్. మరోవైపు.. వైరస్‌కు వంశవృద్ధి కోసం చైనా బలమైన కేంద్రంగా మారనుందని ఫ్రాన్స్‌కు చెందిన వైరాలజీ ప్రొఫెసర్ బ్రూనో లీనా ఆందోళన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: Corona In China: చైనాలో కరోనా వ్యాప్తికి ఒకటి కాదు.. నాలుగు వేరియంట్లు కారణం! -
దక్షిణ భారతదేశంలో తొలిసారి..
సాక్షి, నిర్మల్ : కనిపించిన చెట్టునల్లా మనిషి నరుక్కుంటూ పోవడంతో వానరానికి తీరని కష్టమొచ్చింది. వనాలు అంతరించి పోతుండటంతో అవి జనాల్లోకి వచ్చాయి. ఒకప్పుడు పచ్చని చెట్లపై.. నచ్చిన పండ్లు తింటూ అడవుల్లో హాయిగా బతికిన కోతులు.. ఇప్పుడు ఇళ్ల ముందు పడేసిన ఎంగిలి మెతుకులను ఏరుకుని తింటున్నాయి. ఆకలికి తాళలేక కొన్నిచోట్ల ఇళ్లలోకి చొరబడుతున్నాయి. పంటచేలపైనా దాడి చేస్తున్నాయి. దీనిపై నాలుగేళ్ల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. సాక్షాత్తు సీఎం కేసీఆర్ పలు సభలు, సమావేశాల్లో కోతుల వల్ల దెబ్బతింటున్న పంటలపైన మాట్లాడారు. ఇల్లు పీకి పందిరి వేసినట్లే అటవీశాఖ 2016లో నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని చించోలి(బి) శివారులోని అటవీ ప్రాంతంలో పైలట్ ప్రాజెక్టుగా కోతుల సంతాన నియంత్రణ కేంద్రానికి స్థల నిర్ధారణ చేసింది. ఆ కేంద్రం ఎట్టకేలకు ఈ నెల 8న(మంగళవారం) రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఇది దక్షిణ భారత్‌లోనే తొలి కేంద్రం కానుంది. ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే.. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో వీటి సంఖ్య విపరీతంగా ఉంది. ఒక్కో జిల్లాలో ప్రతీ సీజన్లో దాదాపు 200–300 ఎకరాల వరకు పంట నష్టం చేస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. పెంకులు ఉన్న ఇంటిపై కోతులు పడ్డాయంటే ఇక ఇల్లు పీకి పందిరి వేసినట్లే. కూరగాయలు, పండ్ల తోటలకు కోతులతో మరింత నష్టం జరుగుతోంది. దేశంలో రెండో రాష్ట్రం.. మన రాష్ట్రంలో ఉన్నట్లే దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో కోతుల సంఖ్య విపరీతంగా ఇబ్బంది పెడుతోంది. విరివిగా ఆపిల్‌పండ్లను పండించే హిమాచల్‌ప్రదేశ్‌లో వానరాలతో నష్టాలు పెరగడంతో అక్కడి ప్రభుత్వం వాటి సంతానోత్పత్తి నియంత్రణకు కేంద్రాలను ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని అనుసరించాలని నిర్ణయించింది. నిర్మల్ జిల్లా కేంద్రానికి సమీపంలో సారంగపూర్ మండలం చించోలి(బి) వద్ద అటవీ ప్రాంతంలో 2016లో మంకీ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్(ఎంఆర్‌ఆర్‌సీ) ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఎట్టకేలకు ఈ ఏడాది పూర్తయ్యాయి. కేంద్రంలో ఏర్పాట్లు ఇలా.. చించోలి(బి) వద్ద ఉన్న గండిరామన్న హరితవనంలో నిర్మించిన ఈ కేంద్రం లో ఒకేసారి 50 కోతులను ఉంచేలా ఎన్‌క్లోజర్స్‌ను ఏర్పాటు చేశారు. వారం పది రోజులుగా ట్రయల్స్‌లో భాగంగా 27 కోతులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. ఆపరేషన్ చేసిన తర్వాత మూడు రోజుల వరకు కేంద్రంలో ఉంచి, మళ్లీ అటవీ ప్రాంతంలో వదిలేస్తారు. ప్రస్తుతానికి కోతులను ఇక్కడికి తీసుకురావాలి్సన బాధ్యత సంబంధిత గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలదే. ట్రయల్స్ ప్రారంభించాం ఇప్పటికే కోతుల ట్యూబెక్టమీ, వేసక్టమీ ఆపరేషన్ ట్రయల్స్ ప్రారంభించాం. రోజుకు ఆడ కోతులైతే 25–30 వరకు, మగ కోతులైతే 50 వరకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయవచ్చు. మూడు రోజుల వరకు కేంద్రంలోనే ఉంచి, ఆ తర్వాత అటవీ ప్రాంతంలో వదిలివేయవచ్చు. ఈనెల 8న అధికారికంగా ప్రారంభమైన తర్వాత రోజూ ఆపరేషన్లు కొనసాగిస్తాం. – డాక్టర్ శ్రీకర్రాజు, ఏడాదికి రెండు కాన్పులు... కోతులతో ఇబ్బందులు తగ్గాలంటే.. ముందుగా వాటి సంతతిని నియంత్రించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోతుల గర్భధారణ కాలం (గర్భం నుంచి ప్రసవం వరకు) 164 రోజులు. అంటే సగటున ఐదు నెలలకో వానరం పుడుతోంది. మన ప్రాంతాల్లో నివసించే కోతుల జీవితకాలం 15–20 ఏళ్ల మధ్య ఉంటుంది. ఈ లెక్కన ఒక్కో ఆడ కోతి ఏడాదికి రెండు చొప్పున పిల్లలకు జన్మనిస్తూ పోతుండటంతో వాటి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. వెటర్నరీ డాక్టర్, ఎంఆర్‌ఆర్‌సీ -
దేశీ ఆవుకు ఆలంబన కామధేను
అపురూపమైన దేశీయ గో జాతులు, గేదె జాతుల అభ్యున్నతికి నిర్మాణాత్మక కృషికి శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చింతలదేవిలో ఏర్పాటైన జాతీయ కామధేను బ్రీడింగ్ కేంద్రం చిరునామాగా మారుతోంది. ప్రస్తుతం 12 దేశీయ గో జాతులు, 5 దేశీ గేదె జాతుల పశువులను పరిరక్షిస్తున్నారు. అంతరించిపోతున్న పుంగనూరు వంటి గోజాతుల నుంచి మేలైన పశుజాతులను అతి తక్కువ సమయంలో పునరుత్పత్తి చేసి రైతులకు అందించడం ఈ బ్రీడింగ్ కేంద్రం ముఖ్య లక్ష్యం. ఈ కేంద్రంలో సుమారు 6 నెలల క్రితం పుట్టిన ఒంగోలు గిత్త దూడ చూపరుల దృష్టిని ఆకర్షిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగినన్ని నిధులతోపాటు నీటిని అందించి ప్రోత్సహిస్తే మేలైన పశుజాతుల ద్వారా రైతుల అభివృద్ధికి దోహదపడినట్టవుతుంది. దేశీ పశుజాతులు ఇటు వ్యవసాయానికి అటు పాల దిగుబడికి పట్టుగొమ్మల్లాంటివి. రైతులకు, ముఖ్యంగా చిన్న–సన్నకారు రైతాంగానికి, పశుపోషణ నిరంతర ఆదాయానికి పెట్టింది పేరు. మెట్ట రైతుకు అరకలే ఆధారం. వ్యవసాయంపై ఆదాయం కన్నా పాడి మీదనే ఎక్కువ ఆదాయం పొందే రైతు కుటుంబాలు ఉన్నాయి. అయితే, దేశీ గోజాతుల్లో పాలధార తక్కువగా ఉండటం వల్ల సంకరజాతి పశువుల వైపు మొగ్గాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలో అత్యాధునిక పశుగణాభివృద్ధి పద్ధతుల ద్వారా మంచి పాలధార కలిగిన దేశీ గోజాతులను త్వరితగతిన అభివృద్ధి చేసుకోవడం ఒక్కటే మార్గం. చింతలదేవిలోని కామథేను బ్రీడింగ్ కేంద్రం సంరక్షణలో ఉన్న దేశీ జాతుల ఆవులు ఇందుకోసమే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ కామధేను బ్రీడింగ్ కేంద్రం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొండాపురం మండలం చింతలదేవిలో 2015 ఏప్రిల్ 4న ఏర్పాటైంది. దేశీ పశుసంపదను నిర్మాణాత్మకంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో ఏర్పాటైన కామథేను ప్రాజెక్టుకు ఆనాటి కేంద్ర మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు శంకుస్థాపన చేశారు. ఇటువంటి ప్రతిష్టాత్మక బ్రీడింగ్ కేంద్రం చింతలదేవితోపాటు మధ్యప్రదేశ్‌లోని ఔరంబాదాద్ జిల్లా హిటాచిలో మరొకటి ఉంది. కామధేను ప్రాజెక్టుకు మొదటి దశలో రూ. 25 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో పశు వైద్యశాల, పశుమేత ఉత్పత్తికేంద్రం, బయోగ్యాస్ ప్లాంటు, పాల ఉత్పత్తి కేంద్రం, పశువులకు షెడ్లు, రోడ్లు, నీటి సౌకర్యం కోసం బోర్లు, నీటి కుంటలు తదతర పనులు చేపట్టారు. ప్రస్తుతం ఈ పనుల్లో కొన్ని తుది దశకు చేరుకోగా మరికొన్ని పనులు జరుగుతున్నాయి. ప్రాజెక్టు విస్తరణ కోసం మరో రూ.100 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపారు. ఒక మేలు జాతి పశువు నుంచి 60 దూడలు మేలు జాతి పశు సంపదను వృద్ధి చేసుకునే ప్రక్రియలో రైతుల దగ్గర ఇప్పటికే ఉన్న సాధారణ ఆవులు, గేదెల గర్భాలనే ఉపయోగించుకునే పద్ధతిని అనుసరిస్తుండటం విశేషం. మేలు జాతి దేశీ ఆవులు, గేదెల నుంచి సేకరించిన అండాలను, మేలుజాతి దేశీ ఆబోతుల నుంచి సేకరించిన వీర్యాన్ని అత్యాధునిక సదుపాయాలున్న ప్రయోగశాలలో ఫలదీకరణ చెందించి మేలు జాతి పిండాలను ఉత్పత్తి చేస్తారు. ఆ పిండాలను స్థానికంగా రైతుల వద్ద నున్న పశువుల గర్భంలో ప్రవేశపెట్టి మేలు జాతి దూడలను ఉత్పత్తి చేస్తారు. చింతలదేవిలోని కామథేను బ్రీడింగ్ కేంద్రం సంరక్షణలోని వివిధ జాతుల గేదెలు సాధారణంగా ఒక మేలురకం దేశీ ఆవు జీవిత కాలంలో 10–11 దూడలకు జన్మనిస్తుంది. అయితే, ఆవు ఒకసారి విడుదల చేసే అండంతో 18 వరకు పిండాలను ఉత్పత్తి చేయవచ్చు. ఏడాదిలో నాలుగు, ఐదుసార్లు ఈ ప్రక్రియ చేపట్టి.. ఒక మేలు జాతి ఆవు ద్వారా ఏడాదికి 50 నుంచి 60 మేలు రకం దూడలను పుట్టించవచ్చని, కామధేను బ్రీడింగ్ కేంద్రంలో ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నామని జాయింట్ డైరెక్టర్ డా. రామన్ ‘సాక్షి’కి వివరించారు. ఇలా దేశీ గోజాతులను, గేదె జాతుల సంతతిని తక్కువ కాలంలోనే చాలా ఎక్కువ సంఖ్యలో వృద్ధి చేయవచ్చు. పుంగనూరు వంటి అంతరించిపోతున్న గోజాతుల పరిరక్షణకు ఈ పద్ధతి చాలా బాగా ఉపకరిస్తుంది. అదేవిధంగా పాలధార అధికంగా ఉన్న ఒంగోలు తదితర గోజాతుల సంతతిని తక్కువ కాలంలోనే ఇబ్బడిముబ్బడిగా పెంపొందించడానికి కామధేను ప్రాజెక్టు ద్వారా వీలవుతుంది. ఇలా పుట్టించిన మేలైన దూడలను అడపాదడపా వేలం ద్వారా రైతులకు అందిస్తారు. మేలైన గోజాతుల పిండాలను రైతులకు విక్రయిస్తారు. తమ దగ్గర ఉన్న సాధారణ ఆవుల గర్భాలలోకి ఈ మేలుజాతి పిండాలను చేర్చి.. మేలైన దూడలను రైతులే ఉత్పత్తి చేసుకునేలా ప్రోత్సహించాలన్నది ప్రభుత్వ భావన. తద్వారా దేశీ గో జాతుల ద్వారా అధిక పాల దిగుబడి సాధించడం, దుక్కి దున్నే ఎద్దులను అందుబాటులోకి తేవడం లక్ష్యం. ఈ విధానంపై మన రైతులకు అవగాహన కల్పించి మేలుజాతి పశువుల పోషణను ప్రోత్సహించి వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే కామధేను బ్రీడింగ్ కేంద్రం పరమ లక్ష్యమని డా. రామన్ చెప్పారు. 12 దేశీ గోజాతులు.. 5 గేదె జాతులు.. కామధేను బ్రీడింగ్ కేంద్రంలో ప్రస్తుతం 12 దేశీ గోజాతులు, 5 గేదె జాతులపై పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రతి 18 ఆవులు/గేదెలతోపాటు ఒక దున్నను పెంచుతున్నారు. ఈ 19 పశువులను ఒక యూనిట్‌గా పరిగణిస్తారు. ఒంగోలు, పుంగనూరు, కంగాయమ్, కాంక్రెజ్, మల్నాడ్ గిడ్డ, షాహివాల్, గిర్, రతి, థార్పార్కర్, రెడ్‌సింధి, దియోని, కృష్ణవేణి వంటి దేశీ గోజాతులతోపాటు.. ముర్రా, మోహతానా, పండిపురి, బాఫర్బాది, బన్ని గేదె జాతులను కామథేను బ్రీడింగ్ కేంద్రంలో ప్రస్తుతానికి సంరక్షిస్తున్నారు. 2017లో మొత్తం 119 ఆవులు, గేదెలతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టులో వీటి సంఖ్య ప్రస్తుతం 464కు పెరిగింది. ప్రతి ఏటా కొన్ని మేలైన దూడలను వేలం వేస్తుంటారు. ఈ ఏడాది కూడా త్వరలో వేలం తేదీలను ప్రకటిస్తామని డా. రామన్ వివరించారు. 2,450 ఎకరాలు విస్తీర్ణం గల చింతలదేవి పశుగణాభివృద్ధి క్షేత్రంలో కామధేను బ్రీడింగ్ కేంద్రానికి 500 ఎకరాలు కేటాయించారు. ఇందులో పశువులకు అవసరమైన పచ్చిగడ్డి పెంచుతున్నారు. ప్రస్తుతం పిండోత్పత్తి కేంద్రం నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. బయోగ్యాస్ ప్లాంటు ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. త్వరలో పాల ఉత్పత్తి కేంద్రం కూడా పూర్తికానుంది. థార్పార్కర్ ఆవు కడుపున పుట్టి, ఆరోగ్యంగా పెరుగుతున్న∙ఒంగోలు గిత్త దూడ తాజా చిత్రం వెంటాడుతున్న నీటి కొరత రాళ్లపాడు రిజర్వాయరు నుంచి పైప్‌లైను ద్వారా లిఫ్ట్ ద్వారా కామధేను బ్రీడింగ్ కేంద్రానికి నీరు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. లిఫ్ట్, పైప్‌లైను పనులు 75 శాతం పనులు పూర్తయ్యాయి. అయితే, నీటితరలింపును కొందరు ప్రజాప్రతినిధులు అడ్డుకోవడంతో ఈ బ్రీడింగ్ కేంద్రానికి నీటి సమస్య తలెత్తింది. ఆంధ్రప్రదేశ్‌కు తలమానికంగా ఉన్న కామధేను బ్రీడింగ్ కేంద్రంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధవహించాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు. ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టును ప్రారంభించాలని కోరుతున్నారు. థార్పార్కర్ ఆవు కడుపున ఒంగోలు దూడ! కామధేను బ్రీడింగ్ కేంద్రంలో థార్పార్కర్ ఆవు కడుపున పుట్టిన ఒంగోలు గిత్త దూడ సందర్శకుల దృష్టిని ఆకర్షిస్తోంది. మేలైన ఒంగోలు జాతి ఆవు అండం, మేలైన ఒంగోలు గిత్త వీర్యంతో తయారైన పిండాన్ని.. అధిక పాలధార కలిగిన థార్పార్కర్ ఆవు(ఎదకు వచ్చిన ఏడో రోజున) గర్భంలోకి ఐవిఎఫ్ పద్ధతిలో పెట్టారు. అలా పుట్టిన గిత్త దూడకు నూటికి నూరు శాతం ఒంగోలు జాతి లక్షణాలే వచ్చాయి. థార్పార్కర్ ఆవు కడుపులో పెరిగినప్పటికీ ఈ ఆవు లక్షణాలు అసలు రావని, పూర్తి స్వచ్ఛతతో కూడిన ఒంగోలు గిత్త దూడే పుట్టిందని డా. రామన్ తెలిపారు. గత ఏడాది ఆగస్టు 25న పుట్టిన ఈ దూడ ఇప్పటికే దాదాపు తల్లి ఎత్తుకు ఎదిగిందన్నారు. ఈ విధంగా రైతులు తమ వద్ద ఉన్న ఏ ఆవు కడుపులోనైనా తమకు అవసరమైన మేలైన పాలధార కలిగిన గోజాతి పిండాన్ని పెట్టించుకొని.. మేలైన ఆవులను లేదా గిత్తల సంతతిని వృద్ధి చేసుకోవడానికి కామధేను బ్రీడింగ్ కేంద్రం రైతులకు ఉపయోగపడతుందని డా. రామన్ అంటున్నారు. ఈ కేంద్రానికి అల్ట్రాసౌండ్ త్రీడీ కలర్ డాప్లర్ పరికరాలు ఇటీవల సమకూరటం విశేషం. దేశీ పశుజాతుల అభివృద్ధిలో ఐదారేళ్లలో అద్భుత ప్రగతి సాధ్యం ఒంగోలు మేలు జాతి పశువులు మన దగ్గర ఎక్కువగా లేవని మనం చింతించనవసరం లేదు. కామథేను బ్రీడింగ్ కేంద్రానికి తగినన్ని నిధులతో పాటు పుష్కలంగా నీటిని అందించి ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఐదారేళ్లలోనే మేలైన పాలధార కలిగిన ఒంగోలు ఆవులు, మేలైన సామర్థ్యం కలిగిన ఒంగోలు గిత్తలను పెద్ద సంఖ్యలో మనమే ఉత్పత్తి చేసుకోవచ్చు. పుంగనూరు వంటి గోజాతి సంతతిని సులువుగా పెంపొందించుకోవచ్చు. దేశీ గోజాతులు, గేదె జాతుల అభివృద్ధి జరుగుతుంది. తద్వారా రైతులకు, ప్రభుత్వానికి కూడా ఎంతో ఆదాయం వస్తుంది. – డా. రామన్ (94923 37017), జాయింట్ డైరెక్టర్, జాతీయ కామధేను బ్రీడింగ్ కేంద్రం, చింతలదేవి, కొండాపురం మండలం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 23న కొర్నెపాడులో తేనెటీగల పెంపకంపై శిక్షణ రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గర కొర్నెపాడు రైతు శిక్షణా కేంద్రంలో ఈ నెల 23(ఆదివారం)న వ్యవసాయంలో తేనెటీగల ప్రాముఖ్యత – తేనెటీగల పెంపకం – ప్రభుత్వ రాయితీలపై ఉద్యాన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రాజా కృష్ణారెడ్డి, తేనెటీగల పెంపకంలో నిపుణులు కోటేశ్వరరావు రైతులకు ఉ. 10 గం. నుంచి సా. 4 గం. వరకు అవగాహన కల్పిస్తారని ఫౌండేషన్ చైర్మన్ డా. యడ్లపల్లి వేంకటేశ్వరరావు తెలిపారు. ముందుగా పేర్లు నమోదు చేసుకోగోరే వారు 97053 83666, 0863–2286255 నంబర్లలో సంప్రదించవచ్చు. – మేడగం భాస్కర్‌రెడ్డి, సాక్షి, ఉదయగిరి, నెల్లూరు జిల్లా -
మహిళా రైతు ‘శ్వేతా’నందం!
ప్రొఫెషనల్ డిగ్రీ చేసినా మేకల పెంపకం చేపట్టారు శ్వేత. ఎన్.ఐ.ఎఫ్.టి.లో ఫ్యాషన్ టెక్నాలజీలో డిగ్రీ చేసింది. పెళ్లయ్యాక బెంగళూరులో నివాసం. భర్త ఆఫీసుకు వెళ్లాక ఇంటి వద్ద ఖాళీగా గడుపుతూ ఉండేది. భర్తతో విహారయాత్రకు వెళ్లినప్పుడు ఒక మేకల పెంపక క్షేత్రాన్ని చూసి ముచ్చటపడింది. అంతే.. చిన్న జీవాలు పెంచే మహిళా రైతుగా మారిపోయింది. విశేషమేమిటంటే.. భర్తకు నచ్చజెప్పి డెహ్రాడూన్ దగ్గర్లోని రాణిపోక్రి గ్రామానికి మకాం మార్చి మరీ.. మేకల పెంపకం చేపట్టింది. ఆన్లైన్ అమ్మకాలతో ఏటా రూ. 25 లక్షల టర్నోవర్ చేస్తోంది! హేట్సాఫ్ శ్వేతా!! -
జాతీయపక్షి కోసం..వైఎస్సార్ సంకల్పం
-
చూడీ లేదు..పాడీ లేదు
వట్టిపోయిన పశుపిండోత్పత్తి కేంద్రం శిథిలావస్థకు చేరిన ప్రయోగశాలలు బీడుగా మారిన 530 ఎకరాలు పశువుల పెంపకానికే పరిమితం భూములపై కన్నేసిన కబ్జాదారులు గడ్డిపెంపక కేంద్రంగా ప్రతిపాదనలు సాక్షి, నరసరావుపేట మేలుజాతి పశువుల పునరుత్పత్తి కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బఫెలో బ్రీడింగ్ సెంటర్ (పశు పిండోత్పత్తి కేంద్రం) వట్టిపోయింది. కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన భవనాలు, ప్రయోగశాలలు శిధిలావస్థకు చేరాయి. ఐదు దశాబ్దాల కిందట నాగార్జున సాగర్ ప్రాంతంలో అప్పటి ప్రభుత్వం బఫెలో బ్రీడింగ్ సెంటర్ నెలకొల్పింది. అయితే సాగర్ నిర్మాణ సమయంలో ఈ కేంద్రం ముంపు బారినపడటంతో నకరికల్లు మండలం నర్సింగపాడు శివారులోని 530 ఎకరాల అటవీ భూముల్లోకి దీనిని మార్పు చేసింది. దీని అవసరాల కోసం త్రిపురాపురం వద్ద 130 ఎకరాల భూమిని కేటాయించింది. గుజరాత్‌లోని ఆనంద్ కేంద్రంగా పనిచేసే జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ(ఎన్డీడీబీ) ఏర్పాటు చేసిన బఫెలో బ్రీడింగ్ సెంటర్ సహకారంతో ఇక్కడ మేలు జాతి ముర్రా గేదెలను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. వీటి కోసం నర్సింగపాడు శివారులో ప్రయోగశాలలు నిర్మించారు. విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇక్కడ పనిచేసే శాస్త్రవేత్తలు, డాక్టర్లు, సిబ్బందికి ప్రత్యేక సదుపాయాలు కలిగిన గృహ సముదాయాలు నిర్మించారు. త్రిపురాపురంలోని130 ఎకరాల్లో షెడ్లు ఏర్పాటు చేశారు. విదేశాల నుంచి తీసుకువచ్చిన గేదెలను పరీక్షల నిమిత్తం ఇక్కడ ఉంచేవారు. ఆరు,ఏడు నెలల అనంతరం వాటికి ఎలాంటి జబ్బులు లేవని నిర్ధారించుకున్న తరువాత మాత్రమే బీబీసీ కేంద్రానికి తీసుకొచ్చి పునరుత్పత్తి జరిపేవారు. ఈమేలు రకం గేదెల గర్భాశయంలో పిండాలను వృద్ధి చేసి ఏడు రోజుల తరువాత వాటిని ఎదకు వచ్చిన స్థానిక గేదెల గర్భాశయంలో ప్రవేశపెట్టడం ద్వారా ఎక్కువ పాలు ఇచ్చే మేలు జాతి గేదెలను ఉత్పత్తి చేయడమే ఈ సెంటర్ లక్ష్యం. మొదట్లో బ్రహ్మాండంగా కొనసాగిన ఈ కేంద్రం రానురాను పాలకులు, అధికారుల అలసత్వంతో లక్ష్యాన్ని చేరుకోలేక 1992లో మూతపడింది. దీంతో ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ పాడిపరిశ్రమాభివృద్థి సంస్థ ఆధీనంలోకి వచ్చింది. అప్పటి నుంచి ఈ సంస్థకు క్షీణదశ మొదలైంది. కొన్నాళ్లు పాడిగేదెల కేంద్రంగా, మరికొన్నాళ్లు గడ్డి విత్తనాల ఉత్పత్తి కేంద్రంగా ఈ సంస్థను మార్చారు. పశువుల పెంపకానికే పరిమితం వేల కోట్ల విలువైన పొలాలు, కట్టడాలు, అధునాతన సాంకేతిక పరికరాలు ఉన్న బీబీసీ కేంద్రం ప్రస్తుతం సామాన్య పశువుల పెంపక కేంద్రంగా మారింది. ఐదేళ్ళపాటు వీర్యం ఉత్పత్తి కేంద్రంగా పనిచేసిన బీబీసీ 2005 నుంచి కేవలం ముర్రాజాతి దున్నలు, జెర్సీ, ఒంగోలు జాతి కోడెదూడల కేంద్రంగా మారింది. గతంలో డిప్యూటీ డెరైక్టర్, అడిషనల్ డిప్యూటీ డెరైక్టర్, శాస్త్రవేత్తలు, వైద్యులు, వందమంది సిబ్బంది, 10 ట్రాక్టర్లతో కళకళలాడిన బీబీసీ కేంద్రం నేడు వెలవెలబోతోంది. ప్రస్తుతం ఒక డాక్టర్ మాత్రమే ఇక్కడ పనిచేస్తున్నారు. భూములపై కన్ను... త్రిపురాపురంలో ఉన్న 130 ఎకరాల భూములను ఆక్రమించుకునేందుకు పలువురు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికైనా ఈ కేంద్రంపై ప్రభుత్వం శ్రద్ధ వహించి పశుపరిశోధనా సంస్థగా మారిస్తే కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పశువులకు అవసరమైన వీర్యాన్ని ఇక్కడి నుంచే అందించే వీలుంటుందని పశువైద్యాధికారులు చెబుతున్నారు. అయితే ఈ కేంద్రంలో గడ్డి పెంచి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సరఫరా చేసే ఆలోచనలో ఉన్నతాధికారులు ఉన్నట్లు ఇక్కడి వైద్యులు చెబుతున్నారు. ఈ ఆలోచన కార్యరూపం దాల్చినా వేసవిలో పశువులకు మేతలేక ఇబ్బందులు పడుతున్న రైతుల కష్టాలు తీరడంతో పాటు పాడిపరిశ్రమ అభివృద్ధి చెందుతుందని చెప్పవచ్చు.