బీజింగ్: చైనాలో కోవిడ్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతూ లక్షల మందికి సోకుతోంది. కొద్ది రోజుల్లోనే దేశంలోనే 60 శాతం జనాభాకు ఈ వైరస్ సోకే ప్రమాదం ఉందనే నివేదికలు కలవర పెడుతున్నాయి. అందుకు ప్రధానంగా ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బీఎఫ్.7తో పాటు మరో మూడు వేరియంట్లు కారణమని గుర్తించారు. ఈ క్రమంలోనే ఓ షాకింగ్ న్యూస్ యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. కోవిడ్-19 విజృంభణతో చైనా కొత్త వేరియంట్ల పుట్టుకకు బలమైన కేంద్రంగా మారబోతోందని ఆరోగ్య విభాగం నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రజాగ్రహంతో జీరో కోవిడ్ పాలసీకి మంగళం పాడిన చైనా ప్రభుత్వం, జనవరి 8 నుంచి విదేశీ ప్రయాణికుల క్వారంటైన్ నిబంధనలనూ ఎత్తివేసింది. మరోవైపు.. రోజువారీ కోవిడ్ నివేదికలను వెల్లడించటాన్ని ఆపివేసింది చైనా జాతీయ ఆరోగ్య కమిషన్. కొద్ది రోజులుగా వేలాది మంది వైరస్ బారినపడినట్లు తెలుస్తోంది. వైద్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. వ్యాక్సినేషన్ సరిగా లేకపోవటం, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల చైనాలో.. ప్రపంచ జనాభాలోని ఐదోవంతు మందిలో ఈ వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. దీంతో కొత్త వేరియంట్లు అభివృద్ధి చెందేందుకు చైనా కేంద్ర బిందువుగా మారబోతోందని ఇతర దేశాల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కొత్తవారిలోకి వైరస్ ప్రవేశించినప్పుడు అది మ్యూటేషన్ చెందేందుకు అవకాశం ఉంటుందని జెనీవా యూనివర్సిటీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ డైరెక్టర్ ఆంటోయిన్ ఫ్లాహాల్ట్ పేర్కొన్నారు. ‘ఒక్కసారిగా సుమారు 1.4 బిలియన్ ప్రజలు సార్స్ కోవ్2 బారినపడ్డారు. ఇది కచ్చితంగా కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే వాతావరణాన్ని కల్పిస్తుంది. కొద్ది నెలల్లోనే 500లకుపైగా ఒమిక్రాన్ కొత్త వేరియంట్లను గుర్తించాం. అయితే, అవి తొలుత ఎక్కడ మ్యుటేట్ అయ్యాయనే విషయాన్ని చెప్పడం చాలా కష్టం.’ అని పేర్కొన్నారు ఆంటోయిన్. మరోవైపు.. వైరస్‌కు వంశవృద్ధి కోసం చైనా బలమైన కేంద్రంగా మారనుందని ఫ్రాన్స్‌కు చెందిన వైరాలజీ ప్రొఫెసర్ బ్రూనో లీనా ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: Corona In China: చైనాలో కరోనా వ్యాప్తికి ఒకటి కాదు.. నాలుగు వేరియంట్లు కారణం!
Comments
Please login to add a commentAdd a comment