సుల్తాన్‌పేట్‌లో ఇంటిపై కూలిన వేపచెట్టును చూపుతున్న కుటుంబం, మొఘాలో రాలిపోయిన మామిడి కాయలు
సాక్షి, మద్నూర్: జిల్లాలో పలు ప్రాంతాలలో గురువారం రాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షంతో పంటలకు నష్టం వాటిల్లింది. ముఖ్యంగా మామిడి కాయలు రాలిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని మేనూర్, మొఘా, సుల్తాన్‌పేట్ తదితర గ్రామాల్లో మామిడి తోటలకు ఎక్కువ నష్టం వాటిల్లింది. సుల్తాన్‌పేట్ మాజీ సర్పంచ్ రాములు ఇంటిపై చెట్టు కూలిపడింది. ఇల్లు పాక్షికంగా ధ్వంసమైంది. ఎన్నికల సందర్భంగా సలాబత్‌పూర్ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు టెంట్లు గాలికి కొట్టుకుపోయాయి.
నేలరాలిన మామిడి కాయలు
రెంజల్: ఈదురు గాలులతో కూడిన వర్షానికి బోధన్ డివిజన్‌లోని పలు గ్రామాలలో మామిడి కాయలు రాలిపడ్డాయి. సుమారు ఎనభై శాతం పంటకు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం జిల్లా క్లస్టర్ లెవల్ హార్టికల్చర్, సెరీకల్చర్ అధికారి పండరి మండలంలో పర్యటించి, నష్టం వివరాలను సేకరించారు. బోధన్ మండలంలో 122 ఎకరాలు, ఎడపల్లి మండలంలో 46 ఎకరాలు, రెంజల్ మండలంలో 43 ఎకరాలు, నవీపేట్ మండలంలో 112 ఎకరాలు, కోటగిరి మండలంలో 146 ఎకరాలు, రుద్రూర్ మండలంలో 40 ఎకరాలు, వర్ని మండలంలో 65 ఎకరాల్లో మామిడి పంటను సాగు చేస్తున్నారు. పంట నష్టం తీవ్రంగా ఉందని పండరి పేర్కొన్నారు. 33 శాతం నష్టం వాటిల్లితే ప్రభుత్వం పరిహారం అందిస్తుందన్నారు. నష్టం అంచనాపై జిల్లా ఉన్నతాధికారులకు నివేదిస్తానన్నారు. ఆయన వెంట మండల ఉద్యాన అధికారి అస్రార్, రైతులు ఉన్నారు.
వర్షంతో దెబ్బతిన్న పంటలు
బీర్కూర్: అకాల వర్షంతో బీర్కూర్ మండలంలో పంటలు దెబ్బతిన్నాయి. గురువారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షంతో సంబాపూర్, అన్నారం, దామరంచ, కిష్టాపూర్ తదితర గ్రామ శివారులలోని వరి పంట కొంత నేలవాలింది. రైతునగర్ గ్రామశివారులోని మామిడి తోటలో కాయలు రాలిపోయాయి. అన్నారంలో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. బీర్కూర్ మండలంలో సుమారు 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
అకాల వర్షంతో భారీ నష్టం
బాల్కొండ: బాల్కొండ, ముప్కాల్, మెండోరా మండలాల పరిధిలో గురువారం రాత్రి చిరు జల్లులతో కూడిన గాలి వీచింది. అకాల వర్షంతో ఎక్కువగా మామిడి పంటకు నష్టం వాటిల్లింది. చిట్టాపూర్, ముప్కాల్, బాల్కొండలలో అధికంగా మామిడి వనాలున్నాయి. బలమైన ఈదురు గాలులు వీయడంతో కాయలు రాలిపోయాయి. దీంతో నష్టపోతున్నా మని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment