మధుర ఫలం.. చైనా హాలాహలం! | Six ethephon packets are being used for 10 kg of mangoes in Nunna Market | Sakshi
Sakshi News home page

మధుర ఫలం.. చైనా హాలాహలం!

Published Tue, May 11 2021 4:42 AM | Last Updated on Tue, May 11 2021 4:42 AM

Six ethephon packets are being used for 10 kg of mangoes in Nunna Market - Sakshi

తేనెలూరే మామిడి, నోరూరించే బొప్పాయి, పోషకాలిచ్చే అరటి కనిపిస్తే చాలు కొనేస్తాం. కానీ ఈ పండ్ల వెనుక దాగిన కాలకూట విషం ఆరోగ్యాలను హరిస్తోంది. సహజసిద్ధంగా పండాల్సిన వాటిని 24 గంటల్లో రసాయనాలతో కృత్రిమంగా మగ్గబెట్టి కొందరు వ్యాపారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఉద్యానశాఖ అధికారులు తరచూ తనిఖీలు జరిపి వీటికి అడ్డుకట్ట వేయాల్సి ఉంది. చైనా నుంచి దొడ్డిదారిన మార్కెట్‌లోకి వస్తున్న ఈ విష రసాయనాల ద్వారా మగ్గించిన పండ్లను తినడం వల్ల కలిగే దుష్పరిణామాలపై ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కధనం..  
 – సాక్షి, అమరావతి

విజయవాడలోని ‘నున్న’ మ్యాంగో మార్కెట్‌ కరోనా ఉధృతిలోనూ ప్రభుత్వం ఇస్తున్న తోడ్పాటుతో మామిడి రైతులతో, వివిధ రాష్ట్రాల వ్యాపారులతో కళకళలాడుతోంది. ఫుడ్‌ సేప్టీ, ఉద్యాన శాఖాధికారులతో కలిసి ‘సాక్షి బృందం’ మార్కెట్‌ను పరిశీలించగా విస్తుపోయే విషయాలు కనిపించాయి. మామిడి కాయలను కృత్రిమంగా మగ్గించేందుకు చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న నిషేధిత గోల్డ్‌ రైప్, ఎఫ్‌వైకే ఎథెఫాన్‌ రెపైనింగ్‌ పౌడర్‌ వినియోగిస్తున్నట్లు వెల్లడైంది. యశస్విని ప్రసన్న లక్ష్మి ఫ్రూట్‌ కంపెనీ, ఎస్‌డీఎఫ్‌ మ్యాంగో షాపుల నుంచి నాలుగు శాంపిల్స్‌ సేకరించి పరీక్షల కోసం పంపిన అధికారులు కేసులు నమోదు చేశారు. నూజివీడు, గంపలగూడెం, విస్సన్నపేట, ఆగిరిపల్లి, ఏ.కొండూరు, ఈదర లోకల్‌ మార్కెట్లలో కూడా ‘సాక్షి బృందం’ క్షేత్రస్థాయి పరిశీలనలో ఇదే రీతిలో నిషేధిత ఎథెఫాన్‌ పౌడర్‌ను వాడుతున్నట్లు తేలింది.  

ఏటా రూ.100 కోట్ల ఎథెఫాన్‌ దిగుమతి 
పురుగుల మందుల జాబితా కింద 10 శాతం పేస్ట్‌రూపంలో, 39 శాతం లిక్విడ్, 20 శాతం పౌడర్‌ రూపంలో ఎథెఫాన్‌ మార్కెట్‌లోకి వçస్తుంది. మార్కెట్‌కు వచ్చే ఈ ఎథెఫాన్‌కు అధికారికంగా ఎలాంటి అనుమతుల్లేవు. పెస్టిసైడ్స్‌ కింద ఏటా చైనా నుంచి రూ.100 కోట్ల విలువైన ఎథెఫాన్‌ పౌడర్‌ దేశీయ మార్కెట్‌లోకి గుట్టు చప్పుడు కాకుండా వస్తోంది. ఎఫ్‌వైకే, గోల్డ్‌ రైప్‌ ఎథెఫాన్‌ ప్యాకెట్లను మామిడి, అరటి, బొప్పాయి మగ్గపెట్టేందుకు విచ్చలవిడిగా వాడుతున్నారు. నున్నతో పాటు నూజివీడు, రాయచోటి, కేదారేశ్వరపేట, ఉలవపాడు, బంగారపాలెం, దామల చెరువు, ఒంగోలు, కాకినాడ, విశాఖ, విజయనగరంతో పాటు చిత్తూరు, కర్నూలు, అనంతపురం, నెల్లూరు, గుంటూరు, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లోని గ్రామ స్థాయి మార్కెట్లలో సైతం పండ్లను మగ్గపెట్టేందుకు ఎథెఫాన్‌ను వినియోగిస్తున్నట్టు తెలుస్తోంది. మూడు గ్రాములుండే ఒక్కో ప్యాకెట్‌లో 20 శాతం (600 మిల్లీ గ్రాములు) మించి ఎథెఫాన్‌ ఉండ కూడదు. ఎథెఫాన్‌తో పాటు మిగిలిన మిశ్రమంపై స్పష్టత లేదు. సాచెట్‌ మొత్తం ఎథెఫాన్‌తోనే మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. నున్న మార్కెట్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఒక్కో బాక్సులో ఏకంగా ఆరేడు ప్యాకెట్లు వినియోగిస్తున్నారు.


అవయవాలపై తీవ్ర ప్రభావం 
ఎథెఫాన్‌ ముట్టుకున్న చేతులతో కంటిని తాకితే కంటి చూపు పోతుంది. గొంతులోకి వెళ్తే శ్వాసకోస వ్యవస్థ దెబ్బ తింటుంది. మాగబెట్టే సమయంలో నేరుగా పండు లోపలికి వెళ్లడం వల్ల వీటిని తిన్నవారి నరాల వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. శరీరంలోకి వెళ్తే లివర్, నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. క్యాన్సర్‌ వంటి దీర్ఘకాలిక రోగాలకు దారితీస్తుంది. చిన్నపిల్లలు, గర్భిణీలు, వృద్ధులకు ఇది అత్యంత ప్రమాదకరమని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. చివరకు టమోటా లాంటి కూరగాయలను మగ్గపెట్టేందుకు ఎథెఫాన్‌ లిక్విడ్‌ను వాడుతున్నారు.ఇటీవల వెలుగు చూసిన ఏలూరు ఘటనలో వందలాదిమంది ఆస్పత్రి పాలవడానికి కారణం వారి శరీరంలో పెస్టిసైడ్స్‌ రెసిడ్యూస్, ఆర్గనోక్లోరైన్, ఆర్గనోఫాస్పేట్‌ కెమికల్స్‌ శాతం ఎక్కువగా ఉండడమేనని ఎయిమ్స్, ఐఐసీడీ, ఎన్‌ఐఎన్‌ వంటి జాతీయ ఆరోగ్య సంస్థలు గుర్తించాయి.  

రాష్ట్రంలో 280 రైపనింగ్‌ చాంబర్లు 
రాష్ట్రంలో 7.40లక్షల హెక్టార్లలో పండ్లతోటలు సాగవుతున్నాయి. ఏటా కోటి 82 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడులొస్తున్నాయి.కూరగాయలు 2.64లక్షల హెక్టార్లలో సాగవుతుండగా 75.38లక్షల ఎంటీల దిగుబడులు వస్తున్నాయి. వీటిని మగ్గబెట్టేందుకు 53,923 ఎంటీల సామర్థ్యంతో 280 ఎథిలీన్‌ రైపనింగ్‌ చాంబర్స్, 19.60లక్షల ఎంటీల సామర్థ్యంతో 394 కోల్డ్‌ స్టోరేజ్‌లున్నాయి. ఎలాంటి హాని కలిగించని ఎథిలిన్‌ గ్యాస్‌ ద్వారా పండ్లను మగ్గబెట్టేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలిస్తోంది. ఈమేరకు రైపనింగ్‌ చాంబర్స్‌ను ఏర్పాటు చేసింది. రైపనింగ్‌ చాంబర్స్‌  నెలకొల్పేందుకు వ్యక్తిగతంగా ముందుకొచ్చే వారికి 50 శాతం, ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్‌కు 75 శాతం సబ్సిడీ అందచేస్తోంది.  

ఎథెఫాన్‌.. ఓ పురుగుల మందు 
ఎథెఫాన్‌తో మగ్గబెడితే 24 గంటల్లోనే ఏ పండైనా నిగనిగలాడుతూ కంటికి ఇంపుగా కనిపిస్తుంది. ఎథెఫాన్‌ కృత్రిమంగా తయారు చేసిన సింథసైజ్డ్‌ కెమికల్‌. మొక్కల పెరుగుదలకు ఉపయోగించే దీన్ని ఆర్గానో ఫాస్పారిక్‌ (శాస్త్రీయ నామం సీ 2హెచ్‌ 6 సీఎల్‌ ఒ 3పీ), ఇౖథెల్‌ ఫాస్పానిక్‌ యాసిడ్‌ అని కూడా అంటారు. దీని పీహెచ్‌ విలువ 2 కంటే తక్కువ. కడుపులో ఉండే డైల్యూట్‌ హైడ్రోలిక్‌ క్లోరిక్‌ యాసిడ్స్‌ కంటే పవర్‌ ఫుల్‌ యాసిడ్స్‌ దీంట్లో ఉంటాయి. 1975లో ఎథెఫాన్‌ను పురుగుల మందుల జాబితాలో చేర్చారు. ఏదైనా పురుగుల మందును కోతలకు ముందు వాడితే డీకంపోజ్‌ అవుతుంది. తినే ముందు వాడితే అవయవాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. 

 చాలా ప్రమాదకరం... 
‘నున్న మార్కెట్‌లో 10 కిలోల మామిడికి ఏకంగా ఆరేడు ఎథెఫాన్‌ ప్యాకెట్లు వినియోగిస్తున్నారు. ఏకంగా 18 నుంచి 21 గ్రాముల ఎథెఫాన్‌ను వినియోగిస్తున్నారు. ఇది కాల్షియం కార్బైడ్‌ కంటే ప్రమాదకరం. రెండు కేసులు పెట్టాం. మిగిలిన మార్కెట్లలో తనిఖీలు చేస్తాం’ 
–ఎన్‌.పూర్ణచంద్ర రావు, జోనల్‌ ఫుడ్‌ కంట్రోలర్, విజయవాడ 

 అవయవాలపై తీవ్ర ప్రభావం  
‘ఎథెఫాన్‌ అత్యంత ప్రమాదకరమైనది. దీనివల్ల గొంతు, ఊపిరితిత్తులు, లివర్‌ దెబ్బతింటాయి. నాడీ వ్యవస్థను దెబ్బతీస్తాయి. స్కిన్‌ అలర్జీలొస్తాయి. పిల్లలు, వృద్ధులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పక్షవాతం కూడా వచ్చే ప్రమాదం ఉంది. క్యాన్సర్‌ లాంటి దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుంది’ 
–డాక్టర్‌ సూర్యదీప్తి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్, ప్రముఖ న్యూట్రిషనిస్ట్‌

యాసిడ్స్‌ విడుదల 
‘ఒక పదార్థం కానీ పండు కానీ తింటే లోపలకు వెళ్లగానే అమైనోయాసిడ్స్‌గా విడిపోవాలి. ఆ తరా>్వత కార్బోహైడ్రేట్స్‌గా మారి శరీరంలోకి అబ్జార్వ్‌ అవుతాయి. విషపూరిత రసాయనాలను వినియోగించి బలవంతంగా మగ్గించిన పండ్లను తినడం వల్ల అవసరమైనవి కాకుండా ప్రమాదకరమైన యాసిడ్స్‌ శరీరంలోకి చేరతాయి. మోతాదు పెరిగే కొద్ది అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. చివరికి క్యాన్సర్‌ కారకంగా మారుతుంది’ 
– ప్రొ.ఎం.వి బసవేశ్వరరావు, కెమిస్ట్రీ విభాగం, కృష్ణా యూనివర్శిటీ 

రైపనింగ్‌ చాంబర్స్‌కు చేయూత 
‘కాల్షియం కార్బైడ్‌ను పూర్తిగా కట్టడి చేశాం.ఎథిలిన్‌ రైపనింగ్‌ చాంబర్స్‌ను ప్రోత్సహిస్తున్నాం. వాటి ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి చేయూతనిస్తున్నాం. కొందరు వ్యాపారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ నిబంధనలకు విరుద్ధంగా చైనా నుంచి దిగుమతి అవుతున్న ఎథెఫాన్‌ వినియోగిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. వాటి నియంత్రణకు ఉద్యాన శాఖ ద్వారా తగిన చర్యలు తీసుకుంటాం’ 
– ఎం.వెంకటేశ్వర్లు, అదనపు సంచాలకులు, ఉద్యాన శాఖ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement