సాక్షి, హైదరాబాద్: సచివాలయంలో పనిచేస్తున్న రెవెన్యూ సిబ్బంది అలసత్వం ప్రదర్శిస్తున్నారా? విధులకు హాజరయ్యే విషయంలో సమయ పాలన పాటించడం లేదా? ఇష్టారాజ్యంగా సెలవులు తీసుకుంటూ ఉన్నతాధికారులకు అందుబాటులో ఉండడం లేదా?.. అంటే అవుననే అంటున్నాయి తెలంగాణ రెవెన్యూ శాఖ జారీ చేసిన తాజా ఉత్తర్వులు. సచివాలయంలోని రెవెన్యూ, ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ, దేవాదాయ, రిజిస్ట్రేషన్ల శాఖల్లో పనిచేస్తున్న సిబ్బందిని ఉద్దేశించి రెవెన్యూ శాఖ అదనపు కార్యదర్శి నరేందర్‌రావు పేరిట ఈనెల 12న జారీ అయిన 35084/ఓపీ1/ఏ1/2022 అనే సర్క్యులర్ ఇదే విషయాన్ని ధ్రువపరుస్తోంది.
ఈ సర్క్యులర్‌లో పేర్కొన్న హెచ్చరికల్లాంటి మార్గదర్శకాలు కూడా సచివాలయ రెవెన్యూ ఉద్యోగుల అలసత్వాన్ని ప్రశ్నించే విధంగా ఉన్నాయి. సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకాలు పెట్టి వెళ్లిపోతున్నారని, కొందరు చాలా ఆలస్యంగా వస్తున్నారని, మరికొందరు ఎలాంటి కారణాలు చెప్పకుండానే ఆఫీసుకు రావడం లేదని, ఇందుకు సంబంధించిన సెలవు పత్రాలు ఎప్పటికో సమర్పిస్తున్నారని, సెలవు పెట్టిన సందర్భాల్లో కూడా లీవ్ లెటర్లు ఇవ్వకుండా లేట్ పర్మిషన్లు, ఓడీ నోట్‌లు తీసుకుంటున్నారని, ఈ నేపథ్యంలోనే సర్క్యులర్‌ను జారీ చేశామని, ఈ సర్క్యులర్‌లోని నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించడం గమనార్హం. సచివాలయ రెవెన్యూ శాఖ తాజాగా జారీ చేసిన సర్క్యులర్‌లో సిబ్బందికి జారీ చేసిన మార్గదర్శకాలివే..
►సచివాలయ నిబంధనల ప్రకారం రెవెన్యూ శాఖల్లో పనిచేసే ప్రతి ఉద్యోగి ఉదయం 10:30 గంటలకల్లా వచ్చి విధులు ప్రారంభించాలి. ఈ విషయంలో అత్యవసర సమయాల్లో మాత్రం 10 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయం 10:40 గంటలకు అటెండెన్స్ రిజిస్టర్‌ను మూసివేస్తాం.
►రికార్డు అసిస్టెంట్లు, అటెండర్లు తమకు నిర్దేశించిన సమయం కన్నా అరగంట ముందుగానే ఆఫీసుకు రావాల్సి ఉంటుంది. సంబంధిత సెక్షన్ అధికారి అనుమతి లేకుండా వారు కార్యాలయం నుంచి వెళ్లడానికి వీల్లేదు. అధికారులు వెళ్లేంతవరకు అటెండర్లు కార్యాలయం విడిచి వెళ్లరాదు.
►సచివాలయంలోని రెవెన్యూ శాఖల్లో పనిచేస్తున్న సిబ్బందికి నెలలో మూడు సార్లు మాత్రమే ఆలస్యంగా వచ్చేందుకు అనుమతి ఇస్తారు. అది కూడా అత్యవసర సమయాల్లో మాత్రమే నెలకు గంట కంటే ఎక్కువ సమయం ఆలస్యం కాకుండా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఆలస్యంగా రావాల్సి వస్తే ప్రతి ఉద్యోగి ముందస్తుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
►వరుసగా మూడు రోజులు ఆలస్యంగా వచ్చిన ప్రతిసారీ క్యాజువల్ లీవ్ (సీఎల్) మినహాయిస్తాం. సీఎల్‌లు కూడా అయిపోతే కాంపెన్సేటరీ అకౌంట్ నుంచి ఈ సెలవులను మినహాయిస్తారు. ఎవరైనా ఉద్యోగి అదే పనిగా ఆలస్యంగా వస్తుంటే ఆ ఉద్యోగిపై సచివాలయ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే అధికారం సంబంధిత అధికారికి ఉంటుంది. మధ్యాహ్నం రెండుగంటల లోపు వస్తే దాన్ని ఆఫ్‌డే లీవ్‌గా, ఆ తర్వాత దాన్ని ఫుల్‌డే లీవ్‌గా పరిగణిస్తారు.
►ఎవరైనా ఉద్యోగి సెలవు పెట్టాలనుకున్నప్పుడు సెలవు పత్రాలు కూడా సంబంధిత అధికారికి ముందుగానే సమర్పించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment