సాక్షి, సిటీబ్యూరో: సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ)కు భవన నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకుంటున్న ప్రజలకు ‘నాలా’గోల దడ పుట్టిస్తోంది. సేల్ డీడ్, లింక్స్ డాక్యుమెంట్స్, పహణీలు, పాస్‌బుక్, 13 ఏళ్ల ఈసీ, మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్, సైట్ ఫొటోలు నాలుగు సైడ్‌లు, అవుట్‌సైడ్‌లు, లేఅవుట్ కాపీలు అర్కిటెక్ట్ సేవలతో నిక్షిప్తం చేసి చివరకు ఎల్‌ఆర్‌ఎస్ ఫీజుపై 33 శాతం అదనంగా ఫీజు కట్టేందుకు సిద్ధమైన దరఖాస్తుదారులకు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అసెస్‌మెంట్(నాలా) సర్టిఫికెట్ తీసుకురావాలంటూ హెచ్‌ఎండీఏ నుంచి షార్ట్‌ఫాల్స్ వస్తుండడంతో తలబొప్పి కడుతోంది. రెవెన్యూ కార్యాలయాల చుట్టూ వెళ్లి నాలా సర్టిఫికెట్ తీసుకొచ్చేందుకు నానాతంటాలు పడుతున్నారు. నెలరోజుల్లో చేతికందాల్సిన ఆ నాలా సర్టిఫికెట్లు దరఖాస్తుదారులకు ఆలస్యంఅవుతుండడంతో అప్పటికే హెచ్‌ఎండీఏ నుంచి మీరు షార్ట్‌ఫాల్స్ ఆప్‌లోడ్ చేయకపోవడంతో మీ దరఖాస్తును తిరస్కరిస్తున్నామంటూ సమాచారం రావడంతో బిక్కమొహం పెడుతున్నారు. హెచ్‌ఎండీఏ పరిధిలోని ఘట్‌కేసర్, మేడ్చల్, శంషాబాద్, శంకరపల్లి జోన్‌ల అన్నింటిలో ఇదే పరిస్థితి ఎదురవుతోందని ఇటు ప్లానింగ్ విభాగం అధికారులు, అటు దరఖాస్తుదారులు వాపోతున్నారు.
‘నాలా’ కోసం అష్టకష్టాలు...
వ్యవసాయభూమిని వ్యవసాయేతర అవసరాలకు మార్చుకునేందుకు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అసెస్‌మెంట్(నాలా) కింద చెల్లించేదే నాలా పన్ను. దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోగానే ఈ నాలా సర్టిఫికెట్‌ను రెవెన్యూ విభాగం జారీ చేయాల్సి ఉండగా అవేమీ పట్టించుకోవడం లేదు. నెలల కొద్దీ దరఖాస్తుదారులను వెంటతిప్పుకుంటోందనే విమర్శులున్నాయి. ఫలితంగా సొంతింటి కల సాకారం చేసుకునే పనిలో సామాన్యుడు బోల్తాపడుతున్నాడు. అయితే బడాబడా రియల్ ఎస్టేట్ వ్యాపారులైతే రెవెన్యూ అధికారులకు అమ్యమ్యాలు చూపుతుండటంతో దరఖాస్తు చేసుకున్న పది రోజుల్లోనే చేతికి అందిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ విభాగాలు సామాన్యుడిని ఒక మాదిరిగా, రియల్ ఎస్టేట్ వ్యాపారాలను మరో రకంగా చూస్తుందనే అపవాదును మూటగట్టుకుంటున్నాయి. నాలా సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వెంటనే ఆర్‌డీవో క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి నివేదికను ఎంఆర్‌వోకు రాస్తున్నారు. మళ్లీ ఎంఆర్‌వో పూర్తిస్థాయిలో తనిఖీ చేశాక తిరిగి నాలా సర్టిఫికెట్ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ ఆర్‌డీవోకు నివేదిక పంపుతున్నారు. అక్కడి నుంచి అన్నీ తనిఖీ చేశాక దరఖాస్తుదారుడు నాలా పన్ను చెల్లించి సర్టిఫికెట్ తీసుకుంటున్నారు. ఈ రెండంచెల పద్ధతికి చాలా రోజులు సమయం తీసుకుంటుండటం ఆరోపణలకు తావిస్తోంది. ఈ సమయంలోనే హెచ్‌ఎండీఏ డీపీఎంఎస్ షార్ట్‌ఫాల్స్ ఆప్‌లోడ్ చేయలేదని దరఖాస్తును తిరస్కరించడంతో దరఖాస్తుదారుల్లో అగ్రహం వ్యక్తమవుతోంది. నిబంధనల ప్రకారం హెచ్‌ఎండీఏ నాలా సర్టిఫికెట్ అడుగుతున్నా, అనుకున్న సమయానికి రెవెన్యూ విభాగం నుంచి ఆ సర్టిఫికెట్ రాకపోవడంతో వందలాది మంది దరఖాస్తుదారులు ఆవేదన చెందుతున్నారు.
నాలా ఫీజు హెచ్‌ఎండీఏలోనే వసూలు చేయాలి...
2015 అక్టోబర్ 20వ తేదీనాటికి ప్లాటు మీద రిజిష్టర్డ్ సేల్ డీడ్ ఉంటేనే 33 శాతం ఎల్‌ఆర్‌ఎస్ రుసుంతో హెచ్‌ఎండీఏ బిల్డింగ్ పర్మిషన్ ఇస్తోంది. జీవో 151 ప్రకారం లే అవుట్ రెగ్యులేషన్ స్కీమ్(ఎల్‌ఆర్‌ఎస్) దరఖాస్తుల క్లియరెన్స్‌లో భాగంగా నాలా చార్జీలు వసూలుచేసుకునే వీలును హెచ్‌ఎండీఏకు ప్రభుత్వం కల్పించింది. ఇదే విధానాన్ని భవన నిర్మాణ అనుమతుల కోసం వచ్చేవారికి కల్పించాలని, నాలా సర్టిఫికెట్ కోసం రెవెన్యూ విభాగం చుట్టూ తిరగాలంటే చాలా సమయం పడుతోందని, ఆలోపు హెచ్‌ఎండీఏలో దరఖాస్తు చేసుకున్న డీపీఎంఎస్ ఫైల్ తిరస్కరణ గురవుతోందని దరఖాస్తుదారులు వాపోతున్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించి హెచ్‌ఎండీఏలోనే సింగిల్ విండోలో పని పూర్తయ్యేట్టుగా వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment