అవసరమైన డాక్యుమెంట్లు అందజేస్తే షార్ట్‌ఫాల్స్ లేకుండానే..
టీజీబీపాస్ నుంచి వారం, పది రోజుల్లోనే ప్రొసీడింగ్స్
చెరువులు, బఫర్‌జోన్లపై అవగాహన తప్పనిసరి
తాజాగా ఇరిగేషన్, రెవెన్యూ ఎన్‌ఓసీలను తప్పనిసరి చేసిన హెచ్‌ఎండీఏ
సాక్షి, సిటీబ్యూరో: మధ్యతరగతి వర్గాలు సొంత ఇంటి కలను సాకారం చేసుకోవాలనుకున్నా.. నిర్మాణ సంస్థలు బహుళ అంతస్తుల భవనాలు నిర్మించాలన్నా.. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) నుంచి అనుమతులు తీసుకోవడం తప్పనిసరి. భవన నిర్మాణాలకే కాకుండా నిర్మాణం పూర్తయిన ఇళ్లు, అపార్ట్‌మెంట్‌లలో నివాసానికి సైతం హెచ్‌ఎండీఏ నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు(ఓసీ) తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది.
అన్ని రకాల డాక్యుమెంట్లు, ఆధారాలు ఉంటే దరఖాస్తుదారులు ప్రత్యేకంగా హెచ్‌ఎండీఏ అధికారుల వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. టీజీబీపాస్ ద్వారా దరఖాస్తు చేసుకొని నిర్ణీత వ్యవధిలో ప్రొసీడింగ్స్ పొందవచ్చు. కొత్తగా అపార్ట్‌మెంట్ కానీ, బిల్డింగ్‌లు కానీ నిర్మించేందుకు చాలామంది సకాలంలో సరైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయకపోవడం వల్లనే ఇబ్బందులకు గురవుతున్నారని అధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌ల్లో.. పెట్ పార్క్
అన్ని విధాలుగా నిర్మాణ యోగ్యత ఉన్నట్లు తేలితే వారం, పది రోజుల్లోనే ప్రొసీడింగ్స్ లభిస్తాయని హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. ‘కొద్ది రోజులుగా హెచ్‌ఎండీఏ ఫైళ్లకు కదలిక వచ్చింది. లేఅవుట్‌లు, అపార్ట్‌మెంట్‌లకు ఇచ్చే అనుమతుల్లో వేగం పెరిగింది. సమస్యలు ఉన్న స్థలాల్లో మాత్రమే ప్రతిష్టంభన నెలకొంటోందని’ అన్నారు. ఈ క్రమంలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొనే సమయంలోనే అన్ని డాక్యుమెంట్లను సరి చూసుకోవాలని చెప్పారు.
మీ స్థలం జాడ తెలుసుకోండి..
» హెచ్‌ఎండీఏ పరిధిలో సుమారు 3,350కి పైగా చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటికి సమీపంలో ఉండే నిర్మాణ స్థలాలు బఫర్ జోన్‌లలో ఉన్నా, ఎఫ్‌టీఎస్ పరిధిలో ఉన్నా అనుమతులు లభించవు. ఇందుకోసం హెచ్‌ఎండీఏ వెబ్‌సైట్‌లోని చెరువుల మ్యాపులను పరిశీలించి నిర్ధారణ చేసుకొనే అవకాశం ఉంది.
» టీజీబీపాస్‌లో దరఖాస్తు చేసుకొనే సమయంలోనే రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారుల నుంచి అనుమతులు పొంది ఉండటం తప్పనిసరి. ప్రభుత్వం కొత్తగా హైడ్రాను ఏర్పాటు చేసిన తర్వాత క్షేత్రస్థాయిలో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు తనిఖీలు చేసి ఎన్‌ఓసీలు ఇచ్చిన తర్వాతే హెచ్‌ఎండీఏ ప్లానింగ్ విభాగం దరఖాస్తులను స్వీకరించే విధంగా మార్పు చేశారు.
» ఇప్పుడు ఈ అనుమతుల ప్రక్రియ రెండు అంచెలుగా మారింది. మొదట నీటి పారుదల, రెవెన్యూ అధికారులు పరిశీలించి నివేదికలు ఇచ్చిన అనంతరం ప్లానింగ్ అధికారి పరిశీలనలోకి వెళ్తుంది. అక్కడ ఏమైనా సందేహాలు ఉంటే సదరు ఫైల్‌ను వెనక్కి పంపించే అవకాశం ఉంది. అన్నీ క్లీయర్‌గా ఉంటే ప్లానింగ్ డైరెక్టర్ పరిశీలిస్తారు. అనంతరం హెచ్‌ఎండీఏ కమిషనర్ ఆమోదంతో నిర్మాణానికి అనుమతి పత్రాలు (ప్రొసీడింగ్స్) లభిస్తాయి.
డాక్యుమెంట్లు ఇవీ..
» సాధారణంగా నిర్మాణ సంస్థలు సొంతంగా కానీ లేదా కన్సల్టెంట్ సంస్థల ద్వారా కానీ టీజీబీపాస్ ద్వారా దరఖాస్తులను అప్‌లోడ్ చేస్తున్నాయి. సొంత ఇళ్లు నిర్మించుకొనే మధ్యతరగతి వర్గాలు సైతం ఆర్కిటెక్చర్‌లు, కన్సల్టెంట్‌ల సహాయం తీసుకుంటారు. అన్ని అంశాల పట్ల స్పష్టమైన అవగాహన ఉన్నవాళ్లు స్వయంగా తమ దరఖాస్తులను అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఏ విధంగా దరఖాస్తు చేసినప్పటికీ అవసరమైన డాక్యుమెంట్లు మాత్రం తప్పనిసరిగా ఉండాల్సిందే.
» భూమి డాక్యుమెంట్లు, లింక్‌డాక్యుమెంట్లు, పాస్‌బుక్, టైటిల్ డీడ్, ఎమ్మార్వో ప్రొసీడింగ్స్, భూమికి సంబంధించిన పహణీలు, కాస్రాపహణీ, రెవెన్యూ స్కెచ్, 13 ఏళ్ల ఈసీ పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
» మార్కెట్ వాల్యూ, నాలా చార్జీలు, ఎన్‌ఓసీలు, సైట్ ఫొటోలు, జియో కోఆర్టినేట్స్, సైట్ సర్వే బౌండరీలు తదితర పత్రాలన్నీ ఉంటే సకాలంలో అనుమతులు పొందవచ్చు.
» భవన నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను కూడా అధికారులు పరిశీలిస్తారు. ఇందుకోసం భూమి స్వభావాన్ని ధ్రువీకరించే సర్టిఫికెట్, నీటి నాణ్యత ధ్రువీకరణ, డిజైన్లు, ఫైర్, పర్యావరణ తదితర సంస్థల అనుమతులు, బిల్డింగ్ రిస్క్ ఇన్సూరెన్స్ వంటివి ఉండాలి.
Comments
Please login to add a commentAdd a comment