‘నేను ఎయిర్‌పోర్టుకు భూమి ఇవ్వలేదు’
భోగాపురం : మండలంలో నిర్మిస్తున్న ఎయిర్‌పోర్టుకు తన భూమి ఇవ్వలేదని గూడెపువలసకు చెందిన రైతు ముదునూరు రాజేష్ అన్నారు. సోమవారం ఆయన ఇక్కడి విలేకరులతో మాట్లాడారు. గత నెల 26న విమానాశ్రయానికి తన పేరున ఉన్న భూమిని వేరొకరు ఎయిర్‌పోర్టుకి అధికారులకు అందజేసినట్టు పత్రికల్లో వచ్చిందని, అది వాస్తవం కాదని చెప్పారు. గూడెపువలస రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 60/1లో 1. 12 ఎకరాలు, 60/2లో 0. 38 ఎకరాలు భూమికి పూర్తిగా తాను హక్కుదారుడునన్నారు. కొన్నేళ్లుగా ఆ భూమి సాగు చేస్తూ, దానిపై వచ్చే ఫలసాయాన్ని తానే పూర్తిగా పొందుతున్నానన్నారు.
అయితే ఆ సర్వే నంబరు గల భూమిని వేరొక వ్యక్తులు విమానాశ్రయానికి ఇవ్వడంపై అసహనం వ్యక్తం చేశారు. ఎవరైనా భూమి ఇస్తున్నామంటే అది ఎవరది అన్నది కూడా రెవెన్యూ అధికారులు నిర్ధారణ చేసుకోకుండా ప్రకటనలు ఇస్తున్న తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. తాను ఎయిర్‌పోర్టుకి భూమి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ఈ విషయమై తహశీల్దారు డి. లక్ష్మారెడ్డిని వివరణ కోరగా...తమ వద్ద ఉన్న రికార్డుల ప్రకారం 2012లో రేసర్ల కమల పేరున పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరు చేసినట్లు ఉందన్నారు. వారి కుటుం బ తగాదాలు తమకు అనవసరమని చెప్పారు. ఎవరు ఎయిర్‌పోర్టుకి భూమి ఇస్తున్నామని ప్రకటించినా వారి వద్ద నుంచి కేవలం అంగీకారపత్రం తీసుకుంటున్నామే తప్ప, భూమిని తీసుకోవడం లేదన్నారు.