సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ భూముల రికార్డుల నుంచి క్రయ విక్రయ లావాదేవీల వరకు అన్ని రకాల అంశాలతో ముడిపడి ఉన్న ధరణి పోర్టల్‌ను పక్కాగా అధ్యయనం చేసిన తర్వాతే తదుపరి చర్యలకు ఉపక్రమించాలని దీనిపై కొత్తగా ఏర్పాటైన కమిటీ భావిస్తోంది. రైతులు తక్షణం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా ఫోకస్ చేసి పనిచేయాలని, పూర్తి సమాచారాన్ని సేకరించి, రెవెన్యూ వ్యవహారాలతో సంబంధమున్న భాగస్వామ్య పక్షా లన్నింటితో చర్చించి ఫార్మర్స్ ఫ్రెండ్లీ (రైతులకు సులభంగా ఉండే)వెబ్‌సైట్ తయారు చేసే లక్ష్యంతో ముందుకెళ్లే ఆలోచనలో ఉంది.
పోర్టల్‌లో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించడం కూడా సవాలేనని, ఇందుకోసం సాంకేతిక నిపుణులతో కూడా సంప్రదింపులు జరపాలని ప్రాథమికంగా భావిస్తోంది. ధరణి పోర్టల్‌ను ప్రక్షాళన చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా చెప్పిన విధంగా భూమాత పోర్టల్‌ను రూపొందించే దిశలో భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన కమిటీ తొలిసారిగా గురువారం సమావేశం కానుంది.
నిషేధిత భూములు పెద్ద సవాల్!
కొత్తగా ఏర్పాటైన ధరణి కమిటీ ముందున్న ప్రధాన సమస్యల్లో నిషేధిత జాబితా భూములే ప్రధానాంశంగా మారనున్నాయి. ధరణి రికార్డుల ప్రకారం నిషేధిత (22ఏ) జాబితాలో చేరిన రైతుల పట్టా భూములను తిరిగి వారి పేరిట రికార్డు చేయడమే పెద్ద సవాల్‌గా మారనుంది. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చి ఆరేళ్లు గడుస్తున్నా ఈ సమస్య పరిష్కారం కావడం లేదు. వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నిషేధిత భూముల జాబితా రూపొందించారు.
రెవెన్యూ వర్గాలిచ్చిన ఆ జాబితా ప్రకారం అప్పటి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సాఫ్ట్‌వేర్‌లో ఆయా భూముల సర్వే నంబర్లను అప్‌లోడ్ చేశారు. ఈ సర్వే నంబర్ల పరిధిలోనే రైతుల పట్టా భూములు కూడా ఉండేవి. అయితే రైతుల పట్టా భూములకు, నిషేధిత జాబితాలో పేర్కొన్న ప్రభుత్వ భూములకు వేర్వేరు బై నంబర్లు ఇవ్వడంతో ప్రభుత్వ భూముల లావాదేవీలు మాత్రమే నిలిచిపోయి, ప్రైవేటు భూముల లావాదేవీలు నిరాటంకంగా జరిగిపోయేవి.
కానీ ధరణి పోర్టల్ ఏర్పాటైన తర్వాత స్టాంపుల శాఖ వద్ద ఉన్న సాఫ్ట్‌వేర్‌ను ధరణి పోర్టల్‌లో అప్‌లోడ్ చేసేటప్పుడు నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నంబర్ ఎక్కించినా ఎలాంటి బై నంబర్లు ఇవ్వకపోవడంతో సదరు సర్వే నంబర్‌లోని భూమి పూర్తిగా నిషేధిత జాబితాలోకి వెళ్లింది. దీంతో రైతులు తమ పట్టా భూముల్లోనూ ఎలాంటి లావాదేవీలు జరిపే అవకాశం లేకుండా పోయింది. ఈ సమస్య ఇప్పటివరకు పరిష్కారం కాలేదు. ఇలా నిషేధిత జాబితాలో పడిన పట్టా భూములు 10 లక్షల ఎకరాల వరకు ఉంటాయని భూసమస్యలపై పనిచేస్తున్న వారు చెపుతున్నారు.
గత ఏడాదిలోనే 30 వేల దరఖాస్తులు
తమ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కోరుతూ టీఎం15 కింద ఒక్క 2023లోనే 30 వేల దరఖాస్తులు ధరణిలో వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కొత్తగా ఏ ర్పాటైన కమిటీ ప్రధానంగా ఈ అంశంపైనే దృష్టి సారించనుందని, ధరణి పోర్టల్‌లోని సాంకేతిక సమస్యలు పరిష్కారమయ్యేలోపు నిషేధిత జాబితాను కొత్తగా తయారు చేసేలా సిఫారసు చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఆ జాబితాను మళ్లీ ధరణి లేదా భూమాత పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తేనే రైతుల సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుందని, లేదంటే మళ్లీ రెవెన్యూ వర్గాల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిందేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నిషేధిత జాబితాలో పట్టా భూములు
రైతుల పట్టా భూములను కూడా నిషేధిత జాబితాలో పెట్టారు. వీటిని తొలగించుకోవడం కోసం రైతులు 2,3 ఏళ్లు తిరిగినా పరిష్కారం కావడం లేదు. అసలు 22ఏ జాబితాలోనే చాలా తప్పులున్నాయి. 2007 నుంచి 2023 వరకు తప్పులతో కూడిన డేటా ఎక్కించారు. రెవెన్యూ శాఖ కొత్త జాబితా తయారు చేసి దాన్ని అటు స్టాంపుల శాఖ, ఇటు ధరణి పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి. ఈ నిషేధిత జాబితా సమస్య పరిష్కారం కాకుండా ధరణి సమస్యలు తేలవు. – మన్నె నర్సింహారెడ్డి, ధరణి భూ సమస్యల వేదిక కన్వినర్
Comments
Please login to add a commentAdd a comment