ఫోరెన్సిక్ బృందాలకు స్వయంప్రతిపత్తి!
నేరుగా జిల్లా కలెక్టర్లతో అటాచ్
రెవెన్యూ ఉన్నతాధికారులతో సంబంధం లేకుండా పని
ఆడిట్ బాధ్యతలిచ్చేందుకు మూడు కంపెనీల పరిశీలన
అక్రమాలు తేలితే వెంటనే భూముల స్వాదీనం
బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు కూడా
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్ ద్వారా రాష్ట్రంలో జరిగిన భూముల క్రయ, విక్రయాలపై ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేయాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ ఆడిటింగ్ చేసే ఫోరెన్సిక్ బృందాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని భావిస్తోంది. డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ఆధారంగా భూ లావాదేవీల్లో జరిగిన అవకతవకలను గుర్తించే ప్రక్రియలో నిపుణులను మాత్రమే భాగస్వాములను చేయాలని నిర్ణయించింది.
జిల్లాలవారీగా భూములను ఆడిటింగ్ చేసేందుకు రెవెన్యూ శాఖలోని ఉన్నతస్థాయి అధికారులతో సంబంధం లేకుండా ఈ నిపుణుల బృందాలను నేరుగా ఆయా జిల్లాల కలెక్టర్లతో అటాచ్ చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ బాధ్యతలు అప్పగించేందుకు హైదరాబాద్‌కు చెందిన రెండు, ముంబైకి చెందిన ఒక కంపెనీ సామర్థ్యాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది.
రెవెన్యూ వ్యవహారాలు, సాఫ్ట్‌వేర్ అంశాల్లో ఆ కంపెనీల బలమే ప్రాతిపదికగా ఈ మూడింటిలో ఒక దానిని ఎంపిక చేయనుంది. ఇప్పటికే ధరణి పోర్టల్ వివరాల రీవ్యాంప్ ప్రక్రియ జరుగుతోంది. రానున్న 10–15 రోజుల్లో ఆ ప్రక్రియను పూర్తి చేసి, అనంతరం ఫోరెన్సిక్ ఆడిటింగ్ బాధ్యతలు అప్పగించే కంపెనీని ఎంపిక చేయాలన్న యోచనలో ప్రభుత్వ వర్గాలున్నట్టు సమాచారం.
భూముల స్వాదీనమే!
ఫోరెన్సిక్ ఆడిటింగ్‌లో భాగంగా తొలుత హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని భూముల లావాదేవీలను మాత్రమే పరిశీలించాలని ప్రభుత్వం భావించింది. తాజాగా సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో భూ అక్రమాలు బయటపడటంతో రాష్ట్ర వ్యాప్తంగా అనుమానం ఉన్న ప్రతి లావాదేవీని ఫోరెన్సిక్ ఆడిటింగ్‌లో పరిశీలించాలని నిర్ణయించింది. ఇందుకు 2014 కంటే ముందు ఉన్న నిషేధిత భూముల జాబితాను ప్రాతిపదికగా తీసుకో నుంది.
ఈ జాబితాలోని భూముల్లో ఎన్ని పట్టా భూములుగా మారాయి? ఎందుకు మారాయి? కోర్టు ఉత్తర్వుల పరిస్థితి ఏంటి? కోర్టు ఉత్తర్వులను సవాల్ చేశారా? అసలు కోర్టు ఉత్తర్వులు నిజమైనవేనా? మాజీ సైనికుల పేరిట మార్చిన భూముల్లో ఎన్ని అసలైనవి? మాజీ సైనికులకు ఆవార్డు చేసినట్టు బోగస్ డాక్యుమెంట్లు సృష్టించారా? పనివేళల్లో జరిగిన లావాదేవీలెన్ని? అర్ధరాత్రి తర్వాత ఏయే లావాదేవీలు జరిగాయి? ఏ కంప్యూటర్ నుంచి జరిగాయి? అనుమతి ఇచ్చింది ఎవరు? అనే అంశాలను సాంకేతిక సమాచారంతో సరిపోల్చి ఏం జరిగిందో నిర్ధారించనున్నారు.
ఈ ప్రక్రియ అనంతరం అక్రమాలు జరిగాయని తేలిన పక్షంలో వెంటనే సదరు భూములను స్వాధీనం చేసుకొని.. బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment