
సాక్షి, హైదరాబాద్: ధరణి దరఖాస్తుల పరిష్కారంలో అధికారాలను వికేంద్రీకరించడమే మేలని పలు జిల్లాల కలెక్టర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. ధరణి పరిధిలోని ప్రతి మాడ్యూల్ ద్వారా వచ్చే దరఖాస్తులన్నింటినీ జిల్లా కలెక్టర్లే పరిష్కరించే పద్ధతి సరైంది కాదని, ఇందుకు పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండవని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ధరణి దర ఖాస్తులు పేరుకుపోయాయని వెల్లడించారు. ధరణి పునర్నిర్మాణ కమిటీ బుధవారం సచివాలయంలో ఐదు జిల్లాల కలెక్టర్లతో సమావేశమైంది.
కమిటీ సభ్యులు ఎం.కోదండరెడ్డి, ఎం.సునీల్‌కుమార్, రేమండ్ పీటర్, మధుసూదన్, నవీన్ మిత్తల్‌తో పాటు సీఎంఆర్‌వో పీడీ వి.లచ్చిరెడ్డి, జిల్లాల కలెక్టర్లు ప్రశాంత్ పాటిల్ (సిద్దిపేట), రాజీవ్‌గాంధీ హనుమంతు (నిజామాబాద్), ప్రావీణ్య (వరంగల్), గౌతమ్ కుమార్ (ఖమ్మం), శశాంక్ (రంగారెడ్డి), రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ధరణి దరఖాస్తుల పరిష్కారంలో ఎదురవుతున్న సమస్యలు, అనుభవాలను కమిటీ సభ్యులకు కలెక్టర్లు వివరించారు.
అన్ని సమస్యలకూ తగిన మాడ్యూల్స్ లేవు
ధరణి పోర్టల్‌లో అన్ని సమస్యల పరిష్కారానికి అవసరమైన మాడ్యూల్స్ లేవని, తమకు ఉన్న పని ఒత్తిడిలో అన్ని దరఖాస్తులు పరిశీలించి పరిష్కరించేందుకు జాప్యం జరుగుతోందని కలెక్టర్లు తెలిపారు. ఈ మేరకు అవసరమైన సిబ్బంది కూడా క్షేత్రస్థాయిలో లేరని చెప్పినట్టు తెలిసింది. సమస్యల పరిష్కార అధికారాలను కేవలం కలెక్టర్లకే కాకుండా కేటగిరీల వారీగా తహశీల్దార్లకు, ఆర్డీవోలకు కూడా ఇవ్వాలని సూచించారు. సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు లేనందున వాటిని పరిష్కరించలేకపోయామని వివరించినట్టు సమాచారం.
టెర్రాసిస్ కాంటెల్లా ప్రతినిధులతోనూ సమావేశం
ధరణి పోర్టల్ నిర్వహిస్తోన్న టెర్రాసిస్ కాంటెల్లా కంపెనీ ప్రతినిధులతోనూ కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. ధరణి పోర్టల్ పనితీరు, ఇందులో ఇమిడి ఉన్న సాంకేతిక అంశాలు, సమస్యల పరిష్కారానికి ఉన్న మార్గాల గురించి చర్చించారు. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లు, కంపెనీ ప్రతినిధుల నుంచి అవసరమైన సమాచారాన్ని కమిటీ సభ్యులు సేకరించారు.
27న అటవీ, వ్యవసాయ అధికారులతో భేటీ
ఈ నెల 27న మరోమారు భేటీ కావాలని, ఉదయం అటవీ, గిరిజన శాఖలతో, మధ్యాహ్నం వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం కావాలని నిర్ణయించారు. ఆ తర్వాత స్టాంపులు, రిజి్రస్టేషన్లు, సర్వే సెటిల్‌మెంట్, దేవాదాయ, వక్ఫ్ ఉన్నతాధికారులతో సమావేశం కావాలని, ఆ భేటీ తర్వాతే ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక సమర్పించాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment