pahani
-
‘అడ్రస్’లేని భూములకు సర్వేనంబర్
ఏ భూమి అయినా ధరణిలో రిజిస్ట్రేషన్ చేయాలంటే ముందుగా స్లాట్ బుక్ చేయాలి. పట్టాదారు పాస్‌బుక్, ఖాతా నంబర్, సర్వే నంబర్, క్రయ విక్రయాలు చేసే వ్యక్తుల పేర్లు, వారి ఆధార్‌కార్డు, ఫోన్‌నంబర్లు ఆ స్లాట్‌లో పొందుపరచాలి. కానీ ఇక్కడ ఆ భూమికి సంబంధించి ఎలాంటి సపోర్టింగ్ డాక్యుమెంట్ లేకపోయినా, సర్వే నంబర్, ఖాతా నంబర్‌తో పనిలేకుండా స్లాట్ ఎలా బుక్ అయ్యింది? రిజిస్ట్రేషన్ ఎలా జరిగింది? అనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వంలోని కొందరు పెద్దలు.. రెవెన్యూ అధికారులు కుమ్మక్కై ఏకంగా ‘బిలా దాఖలా’ భూమికి ఎసరు పెట్టారు. రికార్డులు లేవనే సాకుతో పొజి షన్లో ఉన్న రైతులను మభ్యపెట్టి బహిరంగ మార్కెట్ కంటే.. చౌకధరకు ఈ భూములు కొట్టేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఆ వెంటనే వాటికి సర్వే నంబర్ సృష్టించి, ధరణిలో రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకుంటున్నారని, వారు దరఖాస్తు చేసిందే తడవుగా అధికారు లు ఈ భూములను వారి పేరున బదలాయిస్తున్నారని అంటున్నారు. బహిరంగ మార్కెట్లో రూ.వెయ్యి కోట్లకుపైగా విలువ చేసే ఈ భూమిని.. చాలా తక్కువ రేటుకు కొనేస్తున్నారని సమాచారం. కోకాపేట సమీపంలో ఉండడంతోనే... రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మోకిల–కొండకల్ గ్రామాల మధ్యన కొండకల్ రెవెన్యూ పరిధిలో 76.24 ఎకరాల ఏ అడ్రస్ లేని(బిలా దాఖలా) భూమి ఉంది. దీనికి సంబంధించి రెవెన్యూ శాఖ వద్ద ఎలాంటి రికార్డులు లేవు. 45 మంది స్థానిక రైతులు ఏళ్ల తరబడి ఈ భూములను సాగు చేసుకుంటున్నారు. పొజిషన్లో ఉన్నా వారి పేర్లు కూడా రికార్డుల్లో లేవు. పహాణీలు, పట్టాదారు పాసు పుస్తకాలు అసలే లేవు. కనీసం వీటి సర్వే నంబర్ ఏమిటో కూడా చాలామందికి తెలియదు. బహిరంగ మార్కెట్లో ఎకరా రూ.15 కోట్ల పైమాటే. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్‌కు ముఖ్యంగా కోకాపేటకు అతిసమీపంలో ఉన్న ఈ భూములపై కొంతమంది ప్రభుత్వ పెద్దల కన్నుపడింది. ఎలాగైనా వీటిని చేజిక్కించుకోవాలని భావించి తెరవెనుక కథ నడిపించారు. ఏ అడ్రస్ లేని ఈ మిగులు భూములు ప్రభుత్వానికి చెందుతాయని, ఈ విషయం బయటకు చెబితే..వాటిని సర్కారు లాగేసుకుంటుందని చెప్పి రైతుల నోరు మూయిస్తున్నారు. అంతా కలిసి.. ఓ వైపు రికార్డులు లేవని, ప్రభుత్వ భూములని ప్రచారం చేస్తూ పొజిషన్లో ఉన్న రైతులను భయాందోళనకు గురి చేస్తూ.. మరోవైపు రెవెన్యూ అధికారులతో ఈ భూములకు ఎంజాయ్మెంట్ సర్వే చేయించారు. తహసీల్దార్ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా పాత రికార్డులను పరిశీలించి ఏడీ రిపోర్టు జారీ చేశారు. దీని ఆధారంగా కలెక్టర్ సూచన మేరకు సీసీఎల్ఏ ఈ భూములకు క్లియరెన్స్ కూడా ఇచ్చినట్టు సంబంధిత అధికారులు చెబుతున్నారు. అయితే అప్పటికే ఈ భూములపై కన్నేసిన బడా నేతలు, రియల్టర్లు, వ్యాపారులు పహాణీలు, పట్టాదారు పాసుపుస్తకాలు, సర్వే నంబర్, ఖాతా నంబర్లు లేవనే అంశాన్ని తెరపైకి తెచ్చారు. ప్రభుత్వం నుంచి ఏదైనా ఇబ్బంది ఉంటే తాము చూసుకుంటామని నమ్మ బలికారు. భూములు అమ్మాల్సిందిగా వారిపై ఒత్తిడి తీసు కొచ్చారు. చేసేది లేక రైతులు కూడా తలవంచక తప్ప లేదు. రైతుల్లో ఉన్న ఈ బలహీనతను ఆసరాగా చేసుకుని రూ.2 కోట్లకు ఎకరం చొప్పున 21 ఎకరాలకుపైగా కొల్లగొట్టారు. అంతేకాదు ఎలాంటి సపోర్టింగ్ డాక్యుమెంట్లు సమర్పించకుండానే ‘ధరణి’లో స్లాట్ బుక్ చేసి.. గుట్టుగా రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు. సర్వే నంబరు 555..దానికి బై నంబర్లు వేసి... ఇప్పటి వరకు ఏ అడ్రస్ లేని ఈ భూములకు రైతుల నుంచి చేతులు మారిన వెంటనే కొత్త అడ్రస్ సృష్టించారు. సర్వే నంబర్ 555గా నామకరణం చేసి..బై నంబర్లతో ఆయా భూములను బడాబాబులకు కట్టబెడుతున్నారు. ఈ విషయం బయటకు పొక్కితే.. ఎక్కడ తన ఉద్యోగానికి ఎసరు వస్తుందోననే భయంతో ఈ భూముల రిజిస్ట్రేషన్ సమయంలో ప్రస్తుత తహసీల్దార్ సెలవులో వెళ్లి.. డిప్యూటీ తహసీల్దార్లతో పని కానిచ్చేసినట్టు విశ్వసనీయ సమాచారం. శేరిగూడ భూములపైనా కన్ను సంగారెడ్డి– రంగారెడ్డి జిల్లాల సరిహద్దులోని శేరిగూడ రెవెన్యూ పరిధిలోనూ 90 ఎకరాలకు పైగా బిలా దాఖలా భూములు ఉన్నాయి. వీటిని కూడా కొల్లగొట్టేందుకు రెవెన్యూ అధికారులు, నేతలు, రియల్టర్లు, వ్యాపారులు తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలిసింది. విచిత్రమేమంటే.. ఏళ్ల తరబడి కబ్జాలో ఉండి.. సాగు చేస్తున్న రైతుల పేర్లు మాత్రం ఇప్పటికీ ధరణిలో కనిపించడం లేదు. కానీ వారి నుంచి కొనుగోలు చేసిన నేతలు, వ్యాపారులు, రియల్టర్ల పేర్లు మాత్రం ఆ వెంటనే నమోదవుతున్నాయి. ఇదే అంశంపై ఇటీవల కొంత మంది రైతులు మండల ఆఫీసులో ఆందోళనకు దిగారు. ప్రభుత్వం అనుమతించింది కొండకల్ రెవెన్యూ పరిధిలో ‘బిలా దాఖలా’ భూములు ఉన్న మాట వాస్తవమే. వీటికి సంబంధించి గతేడాది ప్రభుత్వం ఎంజాయ్మెంట్ సర్వే చేయించింది. ఆ నివేదిక ఆధారంగా భూ రికార్డులు, సర్వే శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పాత రికార్డులను పరిశీలించి, వాటికి సర్వే నం.555గా నిర్ధారించింది. కలెక్టర్ సిఫార్సు మేరకు సీసీఎల్ఏ ఈ భూముల రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇచ్చింది. ఆ మేరకే రిజిస్ట్రేషన్లు చేస్తున్నాం.’ అని చెప్పిన తహసీల్దార్ నయీమొద్దీన్.. పొజిషన్లో ఉన్న రైతుల వివరాలు ధరణిలో ఎందుకు నమోదు చేయడం లేదని ‘సాక్షి’ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానం దాటవేయడం విశేషం. – తహసీల్దార్, నయీమొద్దీన్ -
పహాణీ.. ఏడేళ్ల పరేషానీ!
సాక్షి, హైదరాబాద్: పహాణీ.. అత్యంత కీలకమైన ఓ భూ రికార్డు. సర్వే నంబర్, సబ్ డివిజన్ నంబర్లలో ఉండే భూమి విస్తీర్ణం, యజమాని పేరు, హక్కులు సంక్రమించిన విధానం, భూమి రకం లాంటి వివరాలన్నీ ఇందులో ఉంటాయి. బ్యాంకులు ఇచ్చే తనఖా రుణాలు, టైటిల్ క్లియరెన్స్‌లు, కోర్టు కేసుల విషయంలో ఇది ప్రధాన భూమిక పోషిస్తుంది. యాజమాన్య హక్కుల కల్పనకు దీనిని మాతృకగా పరిగణిస్తారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పహాణీలకు సంబంధించిన ఏడేళ్ల రికార్డులు అందుబాటులో లేకపోవడం రెవెన్యూ యంత్రాంగానికి తలనొప్పులు తెచ్చి పెడుతోంది. 2011 నుంచి 2018 వరకు తయారైన కంప్యూటరైజ్డ్ పహాణీలను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వకపోవడంతో సమస్యలు వస్తున్నాయని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. 2018 నుంచి భూరికార్డుల ప్రక్షాళన ద్వారా సేకరించిన రికార్డులు అందుబాటులో ఉన్నా అంతకుముందు ఏడేళ్ల పహాణీలు లేకపోవడంతో చాలా సమస్యలు పరిష్కారం కాక పెండింగ్ జాబితాలోనే ఉండిపోతున్నాయి. 2011 వరకు కాగితాల్లోనే.. ప్రతి రెవెన్యూ గ్రామానికి పహాణీలు తయారు చేయడం దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో భూరికార్డులకు 1954–55 పహాణీలను కీలక ఆధారంగా రెవెన్యూ శాఖ పరిగణిస్తోంది. అప్పటి నుంచి 2004 వరకు ప్రతియేటా రెవెన్యూ వర్గాలు గ్రామ పహాణీలను మాన్యువల్‌గా తయారు చేశాయి. అయితే ఉమ్మడి రాష్ట్రంలో 2004 నుంచి కంప్యూటరైజ్డ్ పహాణీల తయారీ ప్రారంభమైంది. పైలట్‌గా చేపట్టిన ఈ ప్రక్రియలోనే కొన్ని సమస్యలు ఎదురుకావడంతో 2011 వరకు రెవెన్యూ యంత్రాంగం ప్రతి ఏటా మాన్యువల్ పహాణీలు రాసింది. తర్వాత మాన్యువల్ పహాణీలు రాయవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో 2011–12 నుంచి కాగితపు పహాణీలు రాయడం మానేశారు. అప్పటి నుంచి కంప్యూటర్లోనే ఈ పహాణీ రికార్డులు రూపొందించేవారు. 2011 నుంచి 2018 వరకు జరిగిన ఈ ప్రక్రియను జాతీయ స్థాయి సంస్థ అయిన నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) నిర్వహించింది. 2018లో భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం (ఎల్‌ఆర్‌యూపీ) ప్రారంభం కావడంతో అప్పటినుంచి మిగతా భూరికార్డులతో పాటు పహాణీలను ఎల్‌ఆర్‌యూపీ పోర్టల్‌లో నిక్షిప్తం చేశారు. ఇక 2020 నవంబర్‌లో ధరణి పోర్టల్ అందుబాటులోకి రావడంతో ఎల్‌ఆర్‌యూపీ పోర్టల్ డేటా అంతటినీ ధరణి పోర్టల్‌లోకి బదిలీ చేశారు. ఈ ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను టెండర్ ప్రక్రియ ద్వారా ఐఎల్ఎఫ్ఎస్ అనే ప్రైవేటు సంస్థకు అప్పగించారు. ధరణి అందుబాటులోకి వచి్చనా.. 2020లో ధరణి అందుబాటులోకి వచ్చినా 2011 నుంచి 2018 వరకు రూపొందించిన పహాణీ రికార్డులు మాత్రం ఎన్ఐసీ వద్దనే ఉన్నాయి. ఈ డేటాను అటు రెవెన్యూ శాఖకు కానీ, ఇటు ధరణి పోర్టల్‌ను నిర్వహించే ఐఎల్ఎఫ్ఎస్ అనే ప్రైవేటు సంస్థకు గానీ ఎన్ఐసీ ఇవ్వలేదు. తాము ఒకవేళ ఈ డేటాను బదిలీ చేస్తే తమ వద్ద ఉండే సర్వర్లలో ఇకపై వాటిని స్టోరేజీ చేయబోమని ఎన్ఐసీ తేల్చి చెప్పింది. దీనికి ప్రభుత్వం అంగీకరించలేదు. డేటాను బదిలీ చేయడంతో పాటు ఎన్ఐసీ సర్వర్లలో స్టోర్ చేయా లని, తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సర్వర్ల సమస్య తలెత్తదని వాదించింది. ఈ వాదనను పట్టించుకోని ఎన్ఐసీ ఇప్పటివరకు 2011–18 మధ్య తయారు చేసిన ఆన్లైన్ పహాణీ రికార్డులను ప్రభుత్వానికి ఇవ్వలేదని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆ మధ్య కాలంలో జరిగిన లావాదేవీల ద్వారా మారిన భూ యాజమాన్య హక్కుల వివరాలు అందుబాటులో లేకుండా పోయాయని అంటున్నా యి. ఈ రికార్డులు అందుబాటులో లేకపోవడంతో సదరు భూములపై యాజమాన్య హక్కులను నిర్ధారించి టైటిల్ క్లియరెన్స్ ఇవ్వలేకపోతున్నామని రెవెన్యూ శాఖకు చెందిన ఓ అధికారి వెల్లడించారు. ఇక బ్యాంకులు అప్పులు ఇవ్వాలన్నా, సివిల్ కోర్టుల్లోని కేసులు తేలాలన్నా గత 13 ఏళ్ల పహాణీ రికార్డులను ఆధారంగా తీసుకుంటాయని, ఇప్పడు ఆ రికార్డులు లేకపోవడంతో ఇ బ్బందులు వస్తున్నాయని రెవెన్యూ వర్గాలంటు న్నాయి. చాలావరకు కోర్టు కేసులు పెండింగ్‌లోనే ఉంటుండగా, కొన్ని సందర్భాల్లో యజమాని సైతం తన భూములపై హక్కును కోల్పోవాల్సి వస్తోంది. 2011–18 మధ్య రూపొందించిన ఆన్లైన్ పహాణీలను త్వరగా అందుబాటులోకి తేవ డం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం గందరగోళానికి తెరదింపాలని రెవెన్యూ వర్గాలు కోరుతున్నాయి. -
భూమి హక్కు పక్కా
సాక్షి, హైదరాబాద్: ‘కంక్లూజివ్ టైటిల్’... సీఎం కేసీఆర్ చెప్పిన ఈ మాట గురించి రెవెన్యూ శాఖలో పెద్ద చర్చే జరుగుతోంది. భూ యాజమాన్య హక్కు వివాదాలకు శాశ్వతంగా తెరదించాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి చేసిన ఈ ప్రతిపాదన అమలు సాధ్యాసాధ్యాలపై అధికారుల్లో లోతైన చర్చ జరుగుతోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన మంచిదే అయినా చరిత్ర, భవిష్యత్తుతోపాటు వర్తమానాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ విషయంలో ముందడుగు వేయాల్సి ఉంటుందని, లేదంటే మున్ముందు భూ సమస్యలు మరింత పెరిగిపోతాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా టైటిల్ గ్యారంటీ ఇచ్చే విషయంలో పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత కొత్త రెవెన్యూ చట్టంలో భూ యాజమాన్య హక్కులపై స్పష్టత ఇవ్వాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నాణేనికి అటూ... ఇటూ కొత్త రెవెన్యూ చట్టంపై మల్లగుల్లాలు పడుతున్న ప్రభుత్వం మూడు మార్గాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఒకటి నిజాం కాలంలో ప్రవేశపెట్టిన తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్–1907కు ప్రాణం పోయడం, రెండోది ప్రస్తుతం అమల్లో ఉన్న రికార్డ్స్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్–1971) చట్టానికి మార్పులు చేయడం, మూడోది టైటిల్ గ్యారంటీ చట్టాన్ని తీసుకురావడం. ఈ మూడింటిలో అత్యుత్తమమైనదిగా టైటిల్ గ్యారంటీ చట్టాన్ని ప్రభుత్వం పరిగణిస్తోంది. తద్వారా పట్టాదారులకు భూమిపై పక్కాగా హక్కులు రావడమే కాకుండా భవిష్యత్తులో ఎలాంటి భూ వివాదాలకు తావుండదని అంచనా వేస్తోంది. అయితే ప్రభుత్వ ప్రతిపాదన, ముఖ్యమంత్రి ఆలోచన సాకారం కావాలంటే దీని అమల్లో ఎదురయ్యే కష్టసాధ్యాలపై మరింత కసరత్తు అవసరమని నిపుణులు అంటున్నారు. టైటిల్ గ్యారెంటీపై రెవెన్యూశాఖలో జరుగుతున్న చర్చ ప్రకారం రికార్డులు అప్డేట్గా తప్పులు లేకుండా ఉంటేనే టైటిల్ గ్యారెంటీపై ముందుడుగు వేయగలమని, అది కూడా హద్దులు నిర్ధారించాకే సాధ్యపడుతుందని చెబుతున్నారు. ఒకసారి టైటిల్ గ్యారెంటీని గనుక అమలు చేస్తే రికార్డులను సవరించే వీలుండదు. ఒకవేళ భవిష్యత్తులో సదరు టైటిల్లో గనుక తప్పులున్నట్లు తేలితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ మేరకు భూ యజమానులకు నష్టపరిహారాన్ని చెల్లించాల్సి ఉంటుంది. తప్పులను పూర్తిస్థాయిలో సవరించి రెవెన్యూ రికార్డులను పటిష్టంగా రూపొందించాల్సి ఉంటుంది. అమెరికాలోని ఒకట్రెండు రాష్ట్రాలు నష్టపరిహారం భారం కావడంతో టైటిల్ గ్యారెంటీ నుంచి వెనక్కి తగ్గాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తెస్తున్న కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనలో మరింత జాగ్రత్త అవసరం కానుంది. మరోవైపు బీమా కంపెనీలు కూడా రికార్డులు పక్కాగా ఉంటేనే బీమా వర్తింపజేస్తాయి. ఇప్పటికే భూ రికార్డుల ప్రక్షాళన అనంతరం కూడా రికార్డుల్లో తప్పులు దొర్లాయని కోకొల్లలుగా ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో ఈ తప్పులను సరిచేసేందుకు అవకాశం ఇచ్చాకే టైటిల్ గ్యారెంటీని అమల్లోకి తేవాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పహాణీలు బ్యాక్ ఎండ్‌లోనే... కొత్త చట్టాన్ని తీసుకొస్తే ఇన్నాళ్లూ రెవెన్యూ రికార్డుల మాతృకగా ఉన్న పహాణీలు రికార్డులుగా మిగిలిపోనున్నాయి. వాటి ప్రామాణికంగానే రికార్డులను అప్డేట్ చేస్తారు గనుక.. జాగ్రత్తగా భద్రపరుస్తారు. పహాణీల్లో నిక్షిప్తమైన సమాచారం మేరకు 1బీ రికార్డులను పటిష్టం చేస్తే సరిపోతుందని రెవెన్యూ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఫలానా వ్యక్తికి ఫలానా భూమి ఎక్కడి నుంచి వచ్చిందన్న సమాచారం 1బీ రికార్డుల్లో ఉంటుంది కనుక ఈ రికార్డులను పూర్తిస్థాయిలో పటిష్టంగా తయారు చేస్తే భవిష్యత్తులో సమస్యలు రావని భావిస్తున్నాయి. 1బీ రికార్డులను గ్రామ సభల్లో ప్రదర్శించి తప్పులు సరిదిద్దితే సమస్యలకు ముగింపు పలక వచ్చని అంచనా వేస్తున్నాయి. కొత్త చట్టం అమల్లో ఉండే ఇబ్బందులు సహజమే కానీ అంతిమంగా రైతుకు తన భూమిపై హక్కులు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని ఉన్నతాధికారులు చెబుతున్నారు. దీనికితోడు ప్రస్తుతమున్న ఇనాం, వక్ఫ్, దేవాదాయ, భూదాన్, రక్షిత కౌలుదారు తదితర చట్టాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడం ద్వారా భూ వివాదాలకు అంతిమ పరిష్కారం తీసుకురాగలమని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. భూములు పరాధీనమైతే? టైటిల్ గ్యారంటీ చట్టం అమల్లోకి వస్తే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యే అవకాశం లేకపోలేదు. కంక్లూజివ్ టైటిల్ యాక్ట్ ప్రకారం నిర్దేశిత భూమిపై ఆరు నెలల్లోగా అభ్యంతరాలు వస్తే సరి. లేకుంటే సదరు భూమిని క్లియర్ టైటిల్‌గా పరిగణించి క్లెయిమ్ చేసిన పట్టాదారుకు యాజ మాన్య హక్కు కల్పించాల్సి ఉంటుంది. దీనివల్ల చట్టంలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకొని బడా బాబులు, భూ మాఫియా సర్కారు భూములపై హక్కులను సంపాదించే అవకాశమూ లేకపోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భూ కబ్జాలపై ఉక్కుపాదం మోపడం ద్వారానే టైటిల్ గ్యారంటీ పారదర్శకంగా ఉంటుందనే చర్చ జరుగుతోంది. -
ఒకే స్థలం రెండు సంస్థలకు!
సాక్షి, మంథని : ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఓ పట్టాదారు వద్ద కొనుగోలు చేసిన భూమిని సదరు పట్టాదారు మరలా ఓ ప్రైవేటు సంస్థకు రిజిస్ట్రేషన్ చేసిన ఉదంతం శుక్రవారం వెలుగుచూసింది. మంథని డివిజన్లో నెలకొన్న రెవెన్యూ సమస్యలపై కలెక్టర్ శ్రీ దేవసేన మండలపరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే పుట్ట మధు, జిల్లా ఇన్చార్జి డీఆర్వో పద్మయ్య, డివిజన్ పరిధిలోని ఆయా మండలాల ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. మంథని మండలం నాగారం శివారులోని సర్వే నంబర్లు 95, 97లోని 17 ఎకరాల భూమిని 1997లో ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసింది. దానిని 17 మంది ఎస్సీలకు పంపిణీ చేసిందని గ్రామానికి చెందిన రైతు బెల్లంకొండ రవీందర్‌రెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాడు. అప్పటి నుంచి కాస్తులో ఉన్న ఎస్సీలు తమ పేర్లను పహణీలో చేర్చాలని, పట్టా పాస్‌పుస్తకాలు ఇవ్వాలని అధికారుల చుట్టు తిరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఇదే అదునుగా పట్టాదారు అదే భూమిని ఓ ప్రైవేటు సంస్థకు ఎకరాకు రూ.9 లక్షల చొప్పున 11 ఎకరాలను 2015–16లో అమ్మినట్లు తెలిపారు. సమస్యపై తీవ్రంగా స్పందించిన కలెక్టర్ తహసీల్దార్ సుధాకర్‌ను వివరణ కోరారు. రెండోసారి అక్రమ పట్టా నిజమేనని చెప్పడంతో వెంటనే సదరు భూమిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. రెవెన్యూ రికార్డుల్లో చూపని కారణమా లేక మరేదో చూడాలని, రిజిస్ట్రేషన్ అథారిటీ, రెవెన్యూ అథారిటీ వేరని, ప్రభుత్వం కొత్తగా రెవెన్యూకే రిజిస్ట్రేషన్ అథారిటీ అప్పగించినందున ఇలాంటి సమస్యలు భవిష్యత్తులో తలెత్తకపోవచ్చని తెలిపారు. నాగారంలో జరిగిన సమస్యను తీవ్రంగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. అక్రమంగా రెండోసారి పట్టా చేసి వ్యక్తిపై పోలీస్ స్టేషన్లో కేసు వేయాలని ఆదేశించారు. అ భూమిలో ఇప్పటికే పట్టాలు ఇచ్చి ఉంటే వారిలో అర్హులను గుర్తించి పాస్‌పుస్తకాలు జారీ చేయాలని సూచించారు. నెలాఖరులోగా అందరికీ పాస్‌పుస్తకాలు.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నెలాఖరులోగా రైతులందరికీ పట్టాపాస్‌పుస్తకాలు జారీ చేస్తామని కలెక్టర్ తెలిపాçరు. రైతులకు పాస్‌పుస్తకాల పంపిణీ పక్రియ నిరంతరం జరుగుతుందని, ఎవరూ హైరానా పడాల్సిన అవరం లేదన్నారు. జిల్లాలో 1.26 లక్షల మంది రైతులను గుర్తించామని, 1.13 లక్షల పాస్‌పుస్తకాలు ప్రింట్ చేయించామన్నారు. ఇప్పటి వరకు 1.09 లక్షల మంందికి పంపిణీ చేశామని వివరించారు. వివిధ కారణాలతో 12 వేల పాస్ పుస్తకాలు పంపిణీ చేయలేదన్నారు. పంపి ణీ చేసిన పాస్‌పుస్తకాల్లో దొర్లిన తప్పుల సవరణ, కొత్త పాస్‌పుస్తకాల పంపిణీ పక్రియ ను నెలాఖరు వరకు పూర్తి చేస్తామన్నారు. ఇలాంటివి జిల్లాలో 3 వేలు ఉన్నాయని తెలి పారు. గతంలో ఉన్న వెబ్‌లాండ్‌తో అనేక సమస్యలు వచ్చాయని ధరణీ వెబ్సైట్ పకడ్బందీగా ఉందన్నారు. కొత్తగా చేర్చిన సమాచారం ఆన్లైన్లో నమో దు చేసి సెంట్రలైజ్డ్ ప్రింటింగ్ ద్వారా రైతులకు అందిస్తాన్నారు. భూ రికార్డుల ప్రక్షాళన సందర్భంగా పార్ట్–ఏ, బీ నమోదు చేశామని పార్ట్–ఏ కింద 94 శాతం పూర్తి చేసామని బీలో కేవలం 6 శాతమే అన్నారు. వివాదాలు, ఫిర్యాదుల ఉన్నవాటిని బీలో చేర్చామని, పరిశీలన, విచారణ అనంతరం అర్హులకు పట్టాలు ఇస్తామని తెలిపారు. నాగారంలో గ్రామం రెవెన్యూ, గ్రామపంచాయతీలో లేకుండా పోవడంతో ఇబ్బందులు ఎదురొంటున్నామని ప్రకాశ్‌రెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. రామగుండం కార్పొరేషన్‌కు 25 కిలోమీటర్ల దూరంలో గ్రామం ఉండడంతో నిబంధన అడ్డుగా ఉందని తెలిపారు. రామగిరి మండలం సుందిళ్ల గ్రామంలో కాస్తులో ఉన్న భూమి అటవీశాఖవారు తమదని అంటున్నారని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. సాదాబైనామాలు చాలా కాలంగా పెండింగ్ ఉన్నాయ ని డిసెంబర్ 31 వరకు మాత్రమే దరఖాస్తులు తీసుకున్నారని.. తర్వాత తీసుకోవాలని పలువురు కోరారు. అలాగే పీఓటీ కింద వేల సమస్యలు గుర్తించా మని, వీటన్నింటిపై వచ్చే సోమవారం జరిగే సమావేశంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఎమ్మెల్యే పుట్ట మధు మాట్లాడుతూ రైతుల నుంచి వచ్చిన సమస్యలను క్షుణ్ణంగా పరిశీంచి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. గ్రామాల్లో తిరుగుతుంటే రెవెన్యూ సమస్యలే ఎక్కువగా వస్తున్నాయని అందుకే ప్రత్యక సమావేశం ఏర్పాటు చేయించా మన్నారు. అధికారులు మానవీయ కోణాన్ని చూడాలని, వారి పరిధిలో ఉన్న వాటిని పరిష్కరించి ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. మంథన, ముత్తారం ఎంపీపీలు ఏగోళపు కమల, అత్తె చంద్రమౌళి, కమాన్‌పూర్ జెడ్పీటీసీ, మంథని సర్పంచ్ పుట్ట శైలజ, ఆయా మండలాల తహసీల్దార్లు సమావేశంలో పాల్గొన్నారు. -
నకిలీ పాసుపుస్తకాలు, పహనీలు!
పంట రుణం పొండం కోసం.. నిర్మల్‌లో యథేచ్ఛగా తయారీ ఖానాపూర్‌లో వెలుగు చూసిన ఘటన ఆర్డీవో, తహసీల్దార్ సంతకాల ఫోర్జరీ పుస్తకాల్లో తేడాలు గుర్తించిన ఎస్బీఐ.. ఖానాపూర్ : ఇటీవల ఐటీడీఏ కేంద్రంగా నకిలీ సర్టిఫికెట్ల దందా జరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చిన ఘటన మరువకముందే.. నూతన జిల్లాగా ఏర్పడబోయే నిర్మల్ కేంద్రంగా నకిలీ పహనీలు, పట్టా పాసు పుస్తకాల తయారీ దందా ఉదంతం తాజాగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. నకిలీ పాసుబుక్ తయారు చేసి బ్యాంకు అదికారులను బురిడి కొట్టించేలా ఓ వ్యక్తి చేసిన ప్రయత్నం బుక్కులోని చిన్న చిన్న లోపాలతో అధికారులకు పట్టుబడేలా చేశాయి. నిర్మల్ కేంద్రంగా ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది. ఇదీ సంగతి.. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో మోసాలను అరికట్టి నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు, సబ్సిడీ, ఆర్థిక సహకారం అందాలని ప్రభుత్వాలు అన్ని పనులకు సైతం దాదాపు ఆన్లైన్ పద్ధతిని ప్రవేశపెడుతున్నాయి. కానీ ఖానాపూర్ మండలంలోని వెంకంపోచంపాడ్ గ్రామానికి చెందిన కొందరు నిర్మల్ కేంద్రంలో ఓ మీసేవ యజమాని సహకారంతో ఏకంగా ఆన్లైన్లో నకిలీ పహనీ పత్రాలు, పట్టా పాసు పుస్తకాలు తయారు చేస్తున్నారు. భూములు లేకున్నా పుస్తకంలో భూములు ఉన్నట్లు సర్వే నంబర్లు రాసి చూపి నకిలీ పట్టాదారు పాసుపుస్తకాన్ని సష్టించి వాణిజ్య బ్యాంకుల్లో పంట రుణాలు, ఇతర రుణాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓSవ్యక్తి శుక్రవారం నకిలీ పాసు పుస్తకాల బాగోతం వెలుగులోకి వచ్చింది. ఈ నకిలీ పాస్‌బుక్ బాగోతం గురించి తహసీల్దార్ ఆరె నరేందర్, ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ కె.రాఘవేంద్రన్ వెల్లడించారు. వెలుగు చూసిందిలా.. వెంకంపొచంపాడ్ గ్రామానికి చెందిన పవార్ ఆనంద్ అనే వ్యక్తి అతడి భార్య అనిత పేరుతో మూడు ఎకరాల నాలుగు గుంటల భూమి సర్వే నంబర్ 341/1/1లో ఉన్నట్లు 226 పట్టా నంబర్‌తో నకిలీ పాసు పుస్తకాన్ని తయారు చే యించాడు. ఆ పుస్తకంలో నిర్మల్ ఆర్డీవో సంతకంతో పాటుగా తహసీల్దార్, వీఆర్వో సంతకాన్ని సైతం ఫోర్జరీ చేశాడు. అలాగే నిర్మల్‌కు చెందిన ఓ మీసేవ యజమాని సహకారంతో ఆన్లైన్లో నకిలీ పహనీ సర్టిఫికెట్లు కూడా సష్టించగలిగాడు. దొంగ పాసుపుస్తకాలు కూడా నిర్మల్‌లోనే కొనుగోలు చేసినట్లు ప్రాథమిక సమాచారం బట్టి తెలిసిందని తహసీల్దార్ నరేందర్ తెలిపారు. అయితే ఈ డూప్లికేట్ పాసు పుస్తకాన్ని ఖానాపూర్ ఎస్బీఐ బ్యాంకులో అందజేసి పసుపు పంటకు రుణం ఇవ్వాలని ఆనంద్ కోరాడు. బ్యాంకు అధికారులు ఆ పాసు పుస్తకాన్ని పరిశీలించి చూడగా దానిపై యూనిక్ ఐడీ లేకపోవడంతో అనుమానం వచ్చి రెవెన్యు కార్యాలయానికి వెళ్లారు. తహసీల్దార్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పవార్ అనిత భర్త ఆనంద్ పేరిట వెంకంపోచంపాడ్ గ్రామ పరిధిలో 226 పట్టా నంబర్‌తో సర్వే 341/1/1లో, 3.04 ఎకరాల భూమి ఎక్కడా లేదని తహసీల్దార్ నిర్ధారించారు. నకిలీ పాసుపుస్తకాలను తయారు చేసి బ్యాంకులను ఆయా శాఖల అధికారులను మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారని గ్రహించారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తాం ఇలా డూప్లికేట్ పాసు పుస్తకాలు తయారు చేసిన వ్యక్తిపై గ్రామ పరిధి గల పెంబి పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తహసీల్దార్ నరేందర్ తెలిపారు. ఈ దందాలో ఉన్న నిందితులందరిపైనా సమగ్ర విచారణ చేపిస్తామని పేర్కొన్నారు. ఎవరినీ వదిలేది లేదని స్పష్టం చేశారు.