సాక్షి, హైదరాబాద్: పహాణీ.. అత్యంత కీలకమైన ఓ భూ రికార్డు. సర్వే నంబర్, సబ్ డివిజన్ నంబర్లలో ఉండే భూమి విస్తీర్ణం, యజమాని పేరు, హక్కులు సంక్రమించిన విధానం, భూమి రకం లాంటి వివరాలన్నీ ఇందులో ఉంటాయి. బ్యాంకులు ఇచ్చే తనఖా రుణాలు, టైటిల్ క్లియరెన్స్‌లు, కోర్టు కేసుల విషయంలో ఇది ప్రధాన భూమిక పోషిస్తుంది. యాజమాన్య హక్కుల కల్పనకు దీనిని మాతృకగా పరిగణిస్తారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పహాణీలకు సంబంధించిన ఏడేళ్ల రికార్డులు అందుబాటులో లేకపోవడం రెవెన్యూ యంత్రాంగానికి తలనొప్పులు తెచ్చి పెడుతోంది.
2011 నుంచి 2018 వరకు తయారైన కంప్యూటరైజ్డ్ పహాణీలను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసీ) రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వకపోవడంతో సమస్యలు వస్తున్నాయని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. 2018 నుంచి భూరికార్డుల ప్రక్షాళన ద్వారా సేకరించిన రికార్డులు అందుబాటులో ఉన్నా అంతకుముందు ఏడేళ్ల పహాణీలు లేకపోవడంతో చాలా సమస్యలు పరిష్కారం కాక పెండింగ్ జాబితాలోనే ఉండిపోతున్నాయి.
2011 వరకు కాగితాల్లోనే..
ప్రతి రెవెన్యూ గ్రామానికి పహాణీలు తయారు చేయడం దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో భూరికార్డులకు 1954–55 పహాణీలను కీలక ఆధారంగా రెవెన్యూ శాఖ పరిగణిస్తోంది. అప్పటి నుంచి 2004 వరకు ప్రతియేటా రెవెన్యూ వర్గాలు గ్రామ పహాణీలను మాన్యువల్‌గా తయారు చేశాయి. అయితే ఉమ్మడి రాష్ట్రంలో 2004 నుంచి కంప్యూటరైజ్డ్ పహాణీల తయారీ ప్రారంభమైంది. పైలట్‌గా చేపట్టిన ఈ ప్రక్రియలోనే కొన్ని సమస్యలు ఎదురుకావడంతో 2011 వరకు రెవెన్యూ యంత్రాంగం ప్రతి ఏటా మాన్యువల్ పహాణీలు రాసింది.
తర్వాత మాన్యువల్ పహాణీలు రాయవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో 2011–12 నుంచి కాగితపు పహాణీలు రాయడం మానేశారు. అప్పటి నుంచి కంప్యూటర్‌లోనే ఈ పహాణీ రికార్డులు రూపొందించేవారు. 2011 నుంచి 2018 వరకు జరిగిన ఈ ప్రక్రియను జాతీయ స్థాయి సంస్థ అయిన నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసీ) నిర్వహించింది. 2018లో భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం (ఎల్‌ఆర్‌యూపీ) ప్రారంభం కావడంతో అప్పటినుంచి మిగతా భూరికార్డులతో పాటు పహాణీలను ఎల్‌ఆర్‌యూపీ పోర్టల్‌లో నిక్షిప్తం చేశారు.
ఇక 2020 నవంబర్‌లో ధరణి పోర్టల్ అందుబాటులోకి రావడంతో ఎల్‌ఆర్‌యూపీ పోర్టల్ డేటా అంతటినీ ధరణి పోర్టల్‌లోకి బదిలీ చేశారు. ఈ ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను టెండర్ ప్రక్రియ ద్వారా ఐఎల్‌ఎఫ్‌ఎస్ అనే ప్రైవేటు సంస్థకు అప్పగించారు.
ధరణి అందుబాటులోకి వచి్చనా..
2020లో ధరణి అందుబాటులోకి వచ్చినా 2011 నుంచి 2018 వరకు రూపొందించిన పహాణీ రికార్డులు మాత్రం ఎన్‌ఐసీ వద్దనే ఉన్నాయి. ఈ డేటాను అటు రెవెన్యూ శాఖకు కానీ, ఇటు ధరణి పోర్టల్‌ను నిర్వహించే ఐఎల్‌ఎఫ్‌ఎస్ అనే ప్రైవేటు సంస్థకు గానీ ఎన్‌ఐసీ ఇవ్వలేదు. తాము ఒకవేళ ఈ డేటాను బదిలీ చేస్తే తమ వద్ద ఉండే సర్వర్లలో ఇకపై వాటిని స్టోరేజీ చేయబోమని ఎన్‌ఐసీ తేల్చి చెప్పింది.
దీనికి ప్రభుత్వం అంగీకరించలేదు. డేటాను బదిలీ చేయడంతో పాటు ఎన్‌ఐసీ సర్వర్లలో స్టోర్ చేయా లని, తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సర్వర్ల సమస్య తలెత్తదని వాదించింది. ఈ వాదనను పట్టించుకోని ఎన్‌ఐసీ ఇప్పటివరకు 2011–18 మధ్య తయారు చేసిన ఆన్‌లైన్ పహాణీ రికార్డులను ప్రభుత్వానికి ఇవ్వలేదని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆ మధ్య కాలంలో జరిగిన లావాదేవీల ద్వారా మారిన భూ యాజమాన్య హక్కుల వివరాలు అందుబాటులో లేకుండా పోయాయని అంటున్నా యి. ఈ రికార్డులు అందుబాటులో లేకపోవడంతో సదరు భూములపై యాజమాన్య హక్కులను నిర్ధారించి టైటిల్ క్లియరెన్స్ ఇవ్వలేకపోతున్నామని రెవెన్యూ శాఖకు చెందిన ఓ అధికారి వెల్లడించారు.
ఇక బ్యాంకులు అప్పులు ఇవ్వాలన్నా, సివిల్ కోర్టుల్లోని కేసులు తేలాలన్నా గత 13 ఏళ్ల పహాణీ రికార్డులను ఆధారంగా తీసుకుంటాయని, ఇప్పడు ఆ రికార్డులు లేకపోవడంతో ఇ బ్బందులు వస్తున్నాయని రెవెన్యూ వర్గాలంటు న్నాయి. చాలావరకు కోర్టు కేసులు పెండింగ్‌లోనే ఉంటుండగా, కొన్ని సందర్భాల్లో యజమాని సైతం తన భూములపై హక్కును కోల్పోవాల్సి వస్తోంది. 2011–18 మధ్య రూపొందించిన ఆన్‌లైన్ పహాణీలను త్వరగా అందుబాటులోకి తేవ డం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం గందరగోళానికి తెరదింపాలని రెవెన్యూ వర్గాలు కోరుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment