ఇక బినామీల వంతు
- రామిరెడ్డి కేసులో ఏసీబీ విచారణ
- తెరపైకి పాత పాపాలు
- ప్రభుత్వానికి నివేదిక
- ఆ కేసులపై త్వరలో విచారణ
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు జెడ్పీ సీఈఓ రామిరెడ్డి అక్రమాలు, ఆదాయానికి మించిన ఆస్తులను పూర్తిస్థాయిలో వెలికితీసే పనిలో ఏసీబీ అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ఆస్తులను గుర్తించిన ఆ శాఖ, ఇపుడు రామిరెడ్డి బినామీలపై ప్రత్యేక దృష్టి సారించింది. త్వరలోనే వారిని అదుపులోకి తీసుకొని విచారించనున్నట్లు తెలిసింది. అలాగే ఆయన గతంలో పనిచేసిన శాఖలు, ఎదుర్కొన్న ఆరోపణలు.. కేసులపై కూడాప్రత్యేక దృష్టి సారించారు.
పనిచేసిన ప్రతి చోటా ఆస్తులు
రెవెన్యూశాఖలో డెప్యూటీ తహసీల్దార్‌గా వృత్తిజీవితం ప్రారంభించిన రామిరెడ్డి జెడ్పీ సీఈవో వరకు ఎదిగారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ అందరితో సన్నిహితంగా మెలుగుతూ కోరిన పోస్టింగ్‌లను దక్కించుకున్నారు. రామిరెడ్డి రెవెన్యూశాఖలో కీలక బాధ్యతలు నిర్వహించడంతో అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొన్నారు. పనిచేసిన ప్రతిచోట ఆస్తులను కూడగట్టారు. తనకంటూ ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకొని భారీగానే వెనుకేసుకొన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకొన్నారు.
నగదు, నగలు, కీలకపత్రాలు స్వాధీనం
తిరుపతి రేణిగుంటరోడ్డు కాకతీయనగర్‌లో నివాసముంటున్న రామినేని బాబు రామిరెడ్డికి బినామీగా వ్యవహరిస్తున్నట్లు ఏసీబీ అధికారుల విచారణలో వెల్లడైంది. ఈయన ద్వారా అనేక ఆర్థిక లావాదేవీలను నడిపినట్లు సమా చారం. దీంతో అతడిని ఏసీబీ అధికారులు పూర్తిస్థాయిలో విచారిస్తున్నారు. అదేక్రమంలో రామిరెడ్డి స్నేహితుడైన తిరుపతి పెద్దకాపులే అవుట్ అశోక్ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న పెద్దయ్యనాయుడు ఇంట్లో సైతం అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పెద్ద ఎత్తున స్వదేశీ, విదేశీ నగదు, బంగారు, వెండి ఆభరణాలు, పలు ఆస్తులు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన దస్తావేజులను ఏసీబీ అధికారులు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకొన్నారు. అతడిని సైతం మరోమారు పూర్తిస్థాయిలో ఏసీబీ అధికారులు విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే రామిరెడ్డితో సన్నిహితంగా వ్యవహరిస్తున్న ఇంకొందరిని ఏసీబీ అధికారులు గుర్తించారు. దీంతో రామిరెడ్డితో సన్నిహితంగా ఉన్న అధికారులు, సిబ్బంది బెంబేలెత్తుతున్నారు. ఏసీబీ అధికారులకు చిక్కిన జాబితాల్లో తమ పేర్లు ఉన్నాయా? ఉంటే ఏం చేయాలి? అని తర్జనభర్జన పడుతున్నారు.
డ్వామాలోనూ అక్రమాలు
ఇదిలా ఉంటే గతంలో రామిరెడ్డి పనిచేసిన పలు శాఖల్లో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారు. 2010 డ్వామా పీడీగా పనిచేస్తున్న సమయంలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు, నిధులను పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు వినిపించాయి. ఉపాధి హామీ పథకం కోసం సామగ్రి కొనుగోలు, బిల్లుల చెల్లింపు, ఏపీడీ, ఎంపీడీవో, ఇతర అధికారులకు వాహనాల బిల్లులు తదితరాల్లో భారీగా అక్రమాలు చోటుచేసుకొన్నాయని ఏసీబీ అధికారులకు ఫిర్యాదులందాయి. దీంతో ఏసీబీ అధికారులు కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టి పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగమైనట్లు గుర్తించారు.
రామిరెడ్డితో పాటు ఆ శాఖలోని ఏపీడీ, ఎంపీడీవోలు, ఇతర అధికారులైన వెంకటకృష్ణయ్య, రత్నాకర్, శ్రీహరి, షానవాజ్‌బేగం, ఉద్దయ్య, దామోదరం, శ్రీహరి, సురేఖ, గోపి, వరలక్ష్మి, సరళ, చెంచుకృష్ణయ్యలపై ప్రభుత్వానికి నివేదిక పంపారు. అయితే అప్పట్లో తనకున్న పలుకుబడిని ఉపయోగించి విచారణ ముందుకు సాగకుండా రామిరెడ్డి అడ్డుకొన్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో గత ఏడాది ఏప్రిల్ 12న ఏసీబీ అధికారులు పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి అందించారు. దీంతో రామిరెడ్డితో పాటు మిగిలిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఈ నెల 8వ తేదీన ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇదిలా ఉండగానే ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తులను కూడగట్టిన కేసులో రామిరెడ్డిని కటకటాల వెనక్కిపంపారు. త్వరలో డ్వామా అక్రమాల కేసులో సంబంధితశాఖ కు చెందిన బాధ్యులందరిపై విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నారు. రామిరెడ్డి ఒక్కొక్కశాఖలో ఒక్కోరీతిలో అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. మొత్తంమీద అవినీతి, అక్రమాలకు పాల్పడితే ఎంతటివారైనా కటకటాలవెనక్కి పోవాల్సిందేనని మరోమారు ఏసీబీ అధికారులు తెలియజెప్పారు.