
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వాతావరణం వేడెక్కుతుండటంతో అన్ని శాఖలు తమ పరిధిలో ఉన్న పెండింగ్ పనులపై దృష్టి సారించాయి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం దూకుడు పెరగనుంది. ఇళ్ల నిర్మాణ వేగాన్ని పెంచాలని ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే పలు జిల్లాల్లో పూర్తయిన ఇళ్లను ఎన్ని వీలైతే అన్నింటిని దసరాకు లబ్ధిదారులకు అందజేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. సీఎం పేషీ నుంచి ఆదేశాలు వచ్చిన దరిమిలా అధికారులు పనుల స్పీడును పెంచారు. పూర్తయిన ఇళ్లతోపాటు మరికొన్నింటిని దసరాకల్లా నిర్మాణం పూర్తి చేసేలా పనులను ముమ్మరం చేశారు.
ప్రకటించినంత వేగంగా మొదలు కాని వైనం
గత ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఇచ్చిన కీలకమైన హామీల్లో డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం కూడా ఒకటి. అయితే పథకం ప్రకటించినంత వేగంగా పనులు మొదలు కాలేదు. 2014, 2015 వరకు పథకంలో ఎలాంటి పురోగతి నమోదు కాలేదు. దీంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఈ విషయంలో ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో 2016లో పనులు మొదలయ్యాయి. హౌసింగ్ శాఖ గణాంకాల ప్రకారం.. 2018 జూలై 31 నాటికి 13,548 ఇళ్లు పూర్తయ్యాయి. ఇందుకోసం ఇప్పటిదాకా రూ.2,461 కోట్లను వెచ్చించారు.
9 జిల్లాల్లో ఒక్కటీ పూర్తి కాలేదు
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,60,000 ఇళ్లను నిర్మించి ఇస్తామని ప్రభుత్వం çహామీ ఇచ్చింది. వీటిలో జిల్లాల పరిధిలో 1,53,880 ఇళ్లకి అనుమతులు వచ్చాయి. ఇందులో 1,29,777 ఇళ్లకు టెండర్లు పిలవగా.. 94,360కి టెండర్లు ఖరారయ్యాయి. అందులో 72,558 ఇళ్ల పనులు మొదలు కాగా.. 12,976 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. సిద్దిపేట జిల్లాలో 3,605, ఖమ్మంలో 1,809, మహబూబ్‌నగర్‌లో 1,505, భద్రాద్రి కొత్తగూడెంలో 1,225లో ఇళ్లు పూర్తయ్యాయి. మిగిలిన జిల్లాల్లో పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. పనుల్లో వేగం లేకపోవడం కారణంగా జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్, వనపర్తి, మెదక్, సంగారెడ్డి, కుమురంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, వికారాబాద్ జిల్లాల్లో జూలై 31 నాటికి ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదు. ఇక జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రభుత్వం అనుమతించిన 1,00,000 ఇళ్లలో.. 98,118 ఇళ్ల పనులు ప్రారంభమైనప్పటికీ కేవలం 572 మాత్రమే పూర్తయ్యాయి.