సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో డబుల్ బెడ్రూం ఇళ్లకు అర్హులై.. రిజిస్టర్ చేసుకున్న కుటుంబాలకు ఇంటి వెలుగు కార్యక్రమం కింద రూ.50 వేల అద్దె చెల్లిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. ‘హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో లక్ష ఇళ్లు, గ్రామీణంలో మరో లక్షా అరవై వేల ఇళ్లు కట్టిస్తామని చెప్పి కేసీఆర్ మోసం చేశారు. వారందరికీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది.
డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం రిజిష్టర్ చేసుకున్న కుటుంబాలకు అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లో రెంట్ రీయింబర్స్‌మెంట్ కింద రూ.50 వేలు ఒకే విడతలో గ్రాంటుగా ఇస్తాం. రిజిష్టర్ చేసుకున్న కుటుంబాలకు ఏడాదిలోనే ఇళ్లు పూర్తి చేసి ఇస్తామని హామీ ఇస్తున్నాం’అని పేర్కొన్నారు. గాంధీభవన్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామన్నారు. వచ్చే ప్రజా ఫ్రంట్ ప్రభుత్వంలో 15 రోజుల్లోనే ఉద్యోగులకు ఐఆర్ విడుదల చేస్తామన్నారు. ఇక కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఎన్‌ఆర్‌ఈజీఎస్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం విధానాన్ని నెల రోజుల్లో అమలు చేస్తామని తెలిపారు.
28న రాహుల్, బాబు సంయుక్త ప్రచారం...
ఇక ఈ నెల 28న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రంలో సం యుక్త ప్రచారం చేస్తారని ఉత్తమ్ వెల్లడించారు. 28 న ఖమ్మం, తాండూర్ బహిరంగ సభలతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా రోడ్‌షోల్లో వీరిద్దరూ పాల్గొంటారన్నారు. 29న సైతం మరిన్ని బహిరంగ సభల్లో పాల్గొననున్నట్లు తెలిపారు.
కేసీఆర్ ఫాంహౌజ్‌కు.. కేటీఆర్ అమెరికాకు..
ఎన్నికల ఫలితాల అనంతరం డిసెంబర్ 12 నుంచి కేసీఆర్ ఫాంహౌజ్‌కే పరిమితమవుతారని, కేటీఆర్ తెలంగాణకు గుడ్‌బై చెప్పి అమెరికాకు వెళ్లిపోతారని ఉత్తమ్ పేర్కొన్నారు. ఓడిపోతే ఫాంహౌజ్‌లో విశ్రాంతి తీసుకుంటానని ప్రకటించినందుకు కేసీఆర్‌కు తాను అభినందనలు తెలియజేస్తున్నానని కౌంటర్ వేశారు. దగాకోరు, మోసకారి అయిన కేసీఆర్‌ను రాజకీయంగా బొందపెట్టే రోజులు దగ్గరపడ్డాయన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి వచ్చేది ప్రజాకూటమేనని పునరుద్ఘాటించారు. రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు టీఆర్‌ఎస్ నాయకులు కేసీఆర్ తీరు పట్ల విసిగెత్తి ఉన్నారని అన్నారు. కేసీఆర్ కుటుంబ పాలన నుంచి విముక్తి పొందడానికి ఇదే సరైన సమయమని, అలాంటి వారందరికీ తాము ఆహ్వానం పలుకుతున్నామని చెప్పారు. ఒకట్రెండు రోజు ల్లో ఎవరూ ఊహించని విధంగా టీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ఉత్తమ్ వెల్లడిం చారు. ఈ ఎన్నికలు కేసీఆర్ కుటుంబం, ప్రజల కు మధ్యే జరుగుతున్నాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment