బదిలీలలు | transfers issue in housing department | Sakshi
Sakshi News home page

బదిలీలలు

Feb 19 2018 1:08 PM | Updated on Feb 19 2018 1:08 PM

transfers issue in housing department - Sakshi

ప్రభుత్వ స్థాయిలో జరిగిన బదిలీలకే నామాలు పెట్టి ఇష్టారీతిన పోస్టింగులు ఇచ్చుకొన్న వ్యవహారం గృహ నిర్మాణశాఖలో వెలుగుచూసింది. ఇది గృహనిర్మాణశాఖలో హాట్‌టాపిక్‌గా మారింది. సాధారణ బదిలీలను పక్కనపెట్టి కోరుకున్న చోటకు డీఈలుగా పనిచేసుకుంటున్నారు. అధికారవర్గాల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.            

చిత్తూరు, బి.కొత్తకోట: గృహనిర్మాణ శాఖలో గత సాధారణ బదిలీల్లో భాగంగా సబ్‌డివిజన్‌ డీఈలను ఆ శాఖ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కాంతిలాల్‌దండే బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో 14 సబ్‌డివిజన్లకు సంబంధించిన వాటిలో సాంబశివయ్యను శ్రీకాళహస్తికి, వెంకటేష్‌ను నగరికి, జానకిరాంరెడ్డిని జీడీనెల్లూరుకు, నరసింహాను పుంగనూరుకు, మహేంద్రను చిత్తూరు పీడీ కార్యాలయానికి బదిలీలు చేశారు. ఎండీ స్థాయి ఉన్నతాధికారి చేసిన బదిలీలు యథావిధిగా అమలు కావాలి. అయితే జిల్లాలో అందుకు పూర్తి విరుద్ధమైన పరిస్థితులు నెలకొన్నాయి. పై బదిలీలను పట్టించుకోకుండా ప్రాజెక్టు డైరెక్టర్‌ తనకు ఇష్టమొచ్చినట్టుగా వ్యవహరించి డీఈలను నియమించారన్న ఆరోపణలు వెలుగుచూశాయి. ఎండీ బదిలీలకు విరుద్ధంగా సాంబశివయ్యకు నగరిలో, వెంకటేష్‌ను జీడీనెల్లూరుకు, జానకిరాంరెడ్డికి శ్రీకాళహస్తి సబ్‌డివిజన్‌ డీఈలుగా నియమించుకొన్నారు. అలాగే తంబళ్లపల్లె–2 డీఈ బాలాజీని ఇక్కడి నుంచి బదిలీ చేసి పీడీ కార్యాలయంలో నియమించుకొన్నారు.

పీడీ కార్యాలయానికి బదిలీ అయిన మహేంద్రను చంద్రగిరి–2 డీఈగా పోస్టింగ్‌ ఇచ్చారు. దీనిపై మదనపల్లెకు చెందిన ఓ టీడీపీ సీనియర్‌ నేత ఎండీకి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎండీ విచారణ చేయాలంటూ కలెక్టర్‌ను కోరినట్టు తెలిసింది. దీనిపై విచారించాలని ఆరోపణలు ఎదుర్కొంటున్న పీడీని  కలెక్టర్‌ ఆదేశించారని సమాచారం. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకొన్నారు, కోరిన నివేదికను అందించలేదంటూ ఎండీ జిల్లా అ ధికారులను గురువారం ప్రశ్నించినట్టు తెలిసింది. దీం తో ఎండీ కాంతిలాల్‌దండే ఇచ్చిన బదిలీ ఉత్తర్వులు, ప్రస్తుతం ఏ డీఈ ఎక్కడ పనిచేస్తున్నది సమగ్ర వివరాలతో పీడీ కార్యాలయ అసిస్టెంట్‌ మేనేజర్‌ తాడేపల్లెలోని ఎండీ కార్యాలయానికి గురువారం రాత్రి బయల్దేరినట్టు తెలిసింది. కొందరు డీఈలు ఒకేచోట 8ఏళ్లుగా పనిచేస్తున్నా ఆయా స్థానాల నుంచి కదిలించక పోవడానికి కారణాలేమిటో తేలాలి. ఈ వ్యవహారంలో పైసా వసూళ్లే కారణమన్న ఆరోపణలు వస్తున్నాయి.

కలెక్టర్‌ నిర్ణయం
జిల్లాలో డీఈల బదిలీ విషయంలో కలెక్టర్‌ నిర్ణయం మేరకే చర్యలు తీసుకొన్నాం. జిల్లా గృహ నిర్మాణశాఖకు కలెక్టర్‌ చైర్మన్‌గా ఉంటారు. వారి నిర్ణయాలనే అమలు చేస్తాం. ఎండీ ఉత్తర్వుల ఉల్లంఘనలో అవినీతి ఆరోపణలు అవాస్తవం. నిజాలు నిలకడగా తెలుస్తాయి.      – ధనుంజయుడు, హౌసింగ్‌ పీడీ, చిత్తూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement