ఉద్వాసన !
గృహనిర్మాణ శాఖలో కాంట్రాక్టు సిబ్బందిపై వేటు
120 మంది తొలగింపునకు జీవో
రోడ్డున పడనున్న కుటుంబాలు
ఆందోళనకు గురవుతున్న ఉద్యోగులు
‘జాబు కావాలంటే ... బాబు రావాలని’
ఎన్నికల ముందు టీడీపీ నేతలు ఊదర గొట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక ఉన్న జాబులకే భద్రత లేకుండా పోతోంది. చేస్తున్న చిన్నపాటి జాబూ చేజారిపోతుందనే అభద్రతా భావంతో కాంట్రాక్టు సిబ్బంది నలిగిపోతున్నారు.. తమ పరిస్థితి ఏమవుతుందోనని వారం రోజులుగా కుటుంబ సభ్యులంతా కుమిలిపోతున్నారు.. ఇదీ గృహనిర్మాణ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల దుస్థితి.
గుడివాడ :
జిల్లా గృహనిర్మాణ శాఖలో వర్క్‌ఇన్‌స్పెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లుగా వివిధ మండలాల్లో 120 మంది విధులు నిర్వహిస్తున్నారు. వారిలో వర్క్ ఇన్‌స్పెక్టర్లు 108 మంది, కంప్యూటర్ ఆపరేటర్లు 12 మంది ఉన్నారు. ఏడున్నరేళ్లుగా వీరంతా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. వీరిని 2007 జనవరిలో జిల్లా సమాఖ్య ద్వారా కాంట్రాక్టు పద్ధతిలో తీసుకోగా రెండేళ్ల క్రితం ఎం.కె. ఎంటర్‌ప్రైజెస్ అనే అవుట్ సోర్సింగ్ సంస్థకు మార్చారు. వీరికి వచ్చేది చిరు జీతమే. నెలకు రూ.9,200 తీసుకుని విధులు నిర్వర్తిస్తున్నారు. గృహ నిర్మాణ శాఖలో వర్క్ ఇన్‌స్పెక్టర్లు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో పూర్తిస్థాయిలో భాగస్వాములుగా ఉంటారు. నిరుపేదలను గుర్తించటం, వారిని ఇల్లు కట్టుకునేందుకు ప్రోత్సహించటం వంటి విధులు నిర్వహిస్తుంటారు. స్టేజీల వారీగా జరిగిన పనులకు బిల్లులు చేయించే విషయంలో వర్క్ ఇన్‌స్పెక్టర్లదే కీలక భూమిక.
బాబు వస్తే పర్మినెంటు అవుతుందనుకుంటే...
చంద్రబాబు వస్తే తమ కాంట్రాక్టు జాబులు పర్మినెంటు అవుతాయని ఈ చిరుద్యోగులు ఇప్పటివరకు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే వారి ఆశలను అడియాసలు చేస్తూ.. అసలుకే ఎసరు పెడుతూ టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆయా కుటుంబాల్లో తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నెల 30 తరువాత కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని నిలుపుదల చేయాల్సిందిగా ప్రభుత్వం మెమో జారీ చేయటం వారి ఆయా కుటుంబాల్లో తీరని ఆవేదన మిగిల్చింది.
రోడ్డున పడనున్న 120 కుటుంబాలు...
ఉద్యోగుల జోలికి వెళ్లనని ఎన్నికల ముందు వాగ్దానాలిచ్చిన చంద్రబాబు నేడు అధికారంలోకొచ్చాక వారిని తీవ్ర అభద్రతా భావానికి గురిచేస్తున్నారని గృహనిర్మాణ శాఖ కాంట్రాక్టు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడున్నరేళ్లుగా ఇదే ఉద్యోగాన్ని నమ్ముకుని ఎప్పటికైనా పర్మినెంటు కాక పోతుందా అనే ఆశతో ఉద్యోగాలు నిర్వర్తిస్తున్నామని, తీరా అధికారం చేపట్టిన తర్వాత చంద్రబాబు ఉన్న ఉద్యోగాన్నే ఊడగొట్టే నిర్ణయం తీసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని వాపోతున్నారు. ఈ ఉద్యోగాలపైనే ఆధారపడి బతుకుతున్న తమను తొలగిస్తే తమ కుటుంబాలు రోడ్డున పడతాయంటున్నారు. బాబు వస్తే జాబు సంగతి ఏమో గానీ.. ఉన్న జాబు పోతుందని కాంట్రాక్టు ఉద్యోగులు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఏడున్నరేళ్లుగా ఇదే ఉద్యోగాన్ని నమ్ముకుని జీవిస్తున్న తమను కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.