సాక్షి, హైదరాబాద్: గత ప్రభుత్వ హయాంలో రోడ్లు భవనాల శాఖలోకి మారిన గృహ నిర్మాణ శాఖ విభాగాలను పునరుద్ధరించనున్నట్టు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. త్వరలో చేపట్టనున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి గాను ఆ విభాగాన్ని పునరుద్ధరిస్తూ, చాలినంత సిబ్బందిని ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్‌పై సమకూర్చుకోనున్నట్టు వెల్లడించారు.
ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మూడు, నాలుగు నమూనాలను సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి గృహనిర్మాణ సంస్థ, రాజీవ్ స్వగృహ, గృహనిర్మాణ మండలి అధికారులతో సమీక్షించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నందున, వాటి నిర్మాణానికి కార్యాచరణ ప్రారంభిస్తామని పొంగులేటి చెప్పారు. త్వరలో సీఎం రేవంత్‌రెడ్డి గృహనిర్మాణ శాఖపై సమీక్షించనున్నారని, ఈ సందర్భంగా విధి విధానాలపై స్పష్టత ఇవ్వనున్నారని తెలిపారు.
రాజీవ్ స్వగృహ ఇళ్ల విక్రయాల కోసం మార్కెటింగ్ నిపుణులను నియమించండి
కొనుగోళ్లు కాకుండా ఉన్న రాజీవ్ స్వగృహ ఇళ్లను విక్రయించేందుకు వీలుగా మార్కెటింగ్ చేయాల్సి ఉందని, ఇందుకు నిపుణులను నియమించాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న రాజీవ్ స్వగృహ సముదాయాలను ఏ ధరకు విక్రయించాలన్న విషయంలో కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్టు వెల్లడించారు. వాటి ద్వారా సమకూరే మొత్తాన్ని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి వినియోగించనున్నట్టు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment