Community members
-
డల్లాస్‌లో మహత్మాగాంధీకి శ్రద్ధాంజలి
డల్లస్: జనవరి 30న భారత జాతిపిత, మహత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని అమెరికాలోని డల్లాస్‌లో పలువురు కమ్యూనిటీ సభ్యులు, నేతలు మహత్మాగాంధీ మెమోరియల్ వద్ద గాంధీ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. అమెరికాలో అతిపెద్దదైన మహత్మాగాంధీ మెమోరియల్ ప్లాజా, ఇర్వింగ్, టిఎక్స్ వద్ద కమ్యూనిటీ సభ్యులంతా ఒకేచోట చేరి గాంధీ విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మహత్మాగాంధీ మెమోరియల్ చైర్మన్ ప్రసాద్ తోటకూర, సహా ఛైర్మన్ తయాబ్ కుందవాలా, సెక్రటరీ రావు కాల్వాల, బోర్డు డైరెక్టర్ షబ్నామ్ మోదిగిల్, పలువురు కమ్యూనిటీ నేతలు విశ్వనాధమ్ పులిగండ్ల, గోపాల పిల్లాయి, రాహుల్, జాన్ శెర్రీ, అలెక్స్ అలెగ్జాండర్, అల్యకుట్టి ఫ్రాన్సిస్, సత్యాన్ కల్యాణ్దుర్గ్ తదితరులు పాల్గొని గాంధీ విగ్రహం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. నార్త్ టెక్సస్ మహత్మాగాంధీ మెమోరియల్ సెక్రటరీ రావు కాల్వాల మాట్లాడుతూ.. మహత్మాగాంధీ మెమోరియల్ ఇండో అమెరికన్ కమ్యూనిటీ డల్లాస్‌కు సరిహద్దు గుర్తుగా మారిందని చెప్పారు. భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకవచ్చేందుకు గాంధీ ఎంతోగానూ శ్రమించారని తెలిపారు. గాంధీ చెప్పిన బోధనలు, సిద్దాంతాలు.. భారత్ దేశంలో శాంతి, సామరస్యాన్ని తీసుకవచ్చాయని పేర్కొన్నారు. తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం కోసం గాంధీజీ పాటించిన సిద్ధాంతాల వల్లే బ్రిటిష్ పాలన నుంచి భారత్‌కు స్వేచ్చ లభించిందని చెప్పారు. తాయిబ్ కుందవాలా మాట్లాడుతూ.. గాంధీజీ అహింస సిద్ధాంతాలు, ఆయన కృషితో పాటు దేశవ్యాప్తంగా ప్రజలనుంచి అసమానమైన ప్రేరణను కలిగించడంతో భారత్‌కు స్వాతంత్ర్యం సాధించగలిగినట్టు తెలిపారు. శబ్నామ్ మోదిగిల్ మాట్లాడుతూ.. గాంధీజీ ఇతర దేశాల నేతలకు గాంధీజీ ఓ స్పూర్తి ప్రదాతగా నిలిచారని, ఆయనను స్పూర్తిగా తీసుకున్న చాలా ఖండాలలో పౌరహక్కుల కోసం ఉద్యమాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. గాంధీజీ ఒక భారత్ ఖండానికి చెందినవాడు కాదని యావత్ ప్రపంచానికి చెందినవాడిగా కీర్తించారు. -
'ఓ దేవుడో.. మేం పోలీస్ స్టేషన్ విడిచి పోం'
ఫరీదాబాద్: ఢిల్లీ శివారు ప్రాంతంలో ఘర్షణలు చోటు చేసుకుని భయాందోళనకు గురైన దాదాపు వందమంది పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయంగా చేసుకున్నారు. ఘర్షణల తీరు చూసి తాము తమ ఇళ్లకు పోనే పోమంటూ మొండికేసి కూర్చున్నారు. రక్షణ కల్పిస్తామని పోలీసులు హామీ ఇస్తున్నా వారు మాత్రం ససేమిరా అంటూ.. పోలీస్ స్టేషన్లోనే కూర్చున్నారు. వివరాల్లోకి వెళ్లగా.. ఢిల్లీ శివారులోని అటాలీ అనే గ్రామంలో ఓ మతానికి సంబంధించిన నిర్మాణం పై కప్పు తొలగించే విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. అవతలి వర్గం వారు బాధితుల వర్గంపైకి ఘోరంగా దాడి చేసి దాదాపు ఐదుగురుని తీవ్రంగా గాయపరిచారు. పదిహేను నివాసాలపై కిరోసిన్ పోసీ నిప్పటించారు. ఈ సంఘటనలన్నీ బాధితుల్లో భయాందోళనలు నింపాయి. దీంతో దాదాపు వందమందికి పైగా పరుగుపరుగున సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు చేరి అక్కడే ఉండిపోయారు. వీరికి ధైర్యం చెప్పేందుకు ప్రస్తుతం మైనారిటీ కమిషన్ సభ్యులు వచ్చారని, ఇతర జిల్లా స్థాయి అధికారులు, సబ్ డివిజన్ మేజిస్ట్రేట్ కూడా వచ్చారని పోలీసులు చెప్తున్నారు. ఈ కేసు విషయంలో మొత్తం 22 మందిని అరెస్టు చేశామని, బాధితులకు కౌన్సెలింగ్ ఇస్తున్నామని చెప్పారు. -
ఉద్వాసన !
గృహనిర్మాణ శాఖలో కాంట్రాక్టు సిబ్బందిపై వేటు 120 మంది తొలగింపునకు జీవో రోడ్డున పడనున్న కుటుంబాలు ఆందోళనకు గురవుతున్న ఉద్యోగులు ‘జాబు కావాలంటే ... బాబు రావాలని’ ఎన్నికల ముందు టీడీపీ నేతలు ఊదర గొట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక ఉన్న జాబులకే భద్రత లేకుండా పోతోంది. చేస్తున్న చిన్నపాటి జాబూ చేజారిపోతుందనే అభద్రతా భావంతో కాంట్రాక్టు సిబ్బంది నలిగిపోతున్నారు.. తమ పరిస్థితి ఏమవుతుందోనని వారం రోజులుగా కుటుంబ సభ్యులంతా కుమిలిపోతున్నారు.. ఇదీ గృహనిర్మాణ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల దుస్థితి. గుడివాడ : జిల్లా గృహనిర్మాణ శాఖలో వర్క్ఇన్స్పెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లుగా వివిధ మండలాల్లో 120 మంది విధులు నిర్వహిస్తున్నారు. వారిలో వర్క్ ఇన్స్పెక్టర్లు 108 మంది, కంప్యూటర్ ఆపరేటర్లు 12 మంది ఉన్నారు. ఏడున్నరేళ్లుగా వీరంతా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. వీరిని 2007 జనవరిలో జిల్లా సమాఖ్య ద్వారా కాంట్రాక్టు పద్ధతిలో తీసుకోగా రెండేళ్ల క్రితం ఎం.కె. ఎంటర్ప్రైజెస్ అనే అవుట్ సోర్సింగ్ సంస్థకు మార్చారు. వీరికి వచ్చేది చిరు జీతమే. నెలకు రూ.9,200 తీసుకుని విధులు నిర్వర్తిస్తున్నారు. గృహ నిర్మాణ శాఖలో వర్క్ ఇన్స్పెక్టర్లు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో పూర్తిస్థాయిలో భాగస్వాములుగా ఉంటారు. నిరుపేదలను గుర్తించటం, వారిని ఇల్లు కట్టుకునేందుకు ప్రోత్సహించటం వంటి విధులు నిర్వహిస్తుంటారు. స్టేజీల వారీగా జరిగిన పనులకు బిల్లులు చేయించే విషయంలో వర్క్ ఇన్స్పెక్టర్లదే కీలక భూమిక. బాబు వస్తే పర్మినెంటు అవుతుందనుకుంటే... చంద్రబాబు వస్తే తమ కాంట్రాక్టు జాబులు పర్మినెంటు అవుతాయని ఈ చిరుద్యోగులు ఇప్పటివరకు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే వారి ఆశలను అడియాసలు చేస్తూ.. అసలుకే ఎసరు పెడుతూ టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆయా కుటుంబాల్లో తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నెల 30 తరువాత కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని నిలుపుదల చేయాల్సిందిగా ప్రభుత్వం మెమో జారీ చేయటం వారి ఆయా కుటుంబాల్లో తీరని ఆవేదన మిగిల్చింది. రోడ్డున పడనున్న 120 కుటుంబాలు... ఉద్యోగుల జోలికి వెళ్లనని ఎన్నికల ముందు వాగ్దానాలిచ్చిన చంద్రబాబు నేడు అధికారంలోకొచ్చాక వారిని తీవ్ర అభద్రతా భావానికి గురిచేస్తున్నారని గృహనిర్మాణ శాఖ కాంట్రాక్టు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడున్నరేళ్లుగా ఇదే ఉద్యోగాన్ని నమ్ముకుని ఎప్పటికైనా పర్మినెంటు కాక పోతుందా అనే ఆశతో ఉద్యోగాలు నిర్వర్తిస్తున్నామని, తీరా అధికారం చేపట్టిన తర్వాత చంద్రబాబు ఉన్న ఉద్యోగాన్నే ఊడగొట్టే నిర్ణయం తీసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని వాపోతున్నారు. ఈ ఉద్యోగాలపైనే ఆధారపడి బతుకుతున్న తమను తొలగిస్తే తమ కుటుంబాలు రోడ్డున పడతాయంటున్నారు. బాబు వస్తే జాబు సంగతి ఏమో గానీ.. ఉన్న జాబు పోతుందని కాంట్రాక్టు ఉద్యోగులు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఏడున్నరేళ్లుగా ఇదే ఉద్యోగాన్ని నమ్ముకుని జీవిస్తున్న తమను కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.