'ఓ దేవుడో.. మేం పోలీస్ స్టేషన్ విడిచి పోం'
ఫరీదాబాద్: ఢిల్లీ శివారు ప్రాంతంలో ఘర్షణలు చోటు చేసుకుని భయాందోళనకు గురైన దాదాపు వందమంది పోలీస్ స్టేషన్ను ఆశ్రయంగా చేసుకున్నారు. ఘర్షణల తీరు చూసి తాము తమ ఇళ్లకు పోనే పోమంటూ మొండికేసి కూర్చున్నారు. రక్షణ కల్పిస్తామని పోలీసులు హామీ ఇస్తున్నా వారు మాత్రం ససేమిరా అంటూ.. పోలీస్ స్టేషన్లోనే కూర్చున్నారు. వివరాల్లోకి వెళ్లగా.. ఢిల్లీ శివారులోని అటాలీ అనే గ్రామంలో ఓ మతానికి సంబంధించిన నిర్మాణం పై కప్పు తొలగించే విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు.
అవతలి వర్గం వారు బాధితుల వర్గంపైకి ఘోరంగా దాడి చేసి దాదాపు ఐదుగురుని తీవ్రంగా గాయపరిచారు. పదిహేను నివాసాలపై కిరోసిన్ పోసీ నిప్పటించారు. ఈ సంఘటనలన్నీ బాధితుల్లో భయాందోళనలు నింపాయి. దీంతో దాదాపు వందమందికి పైగా పరుగుపరుగున సమీపంలోని పోలీస్ స్టేషన్కు చేరి అక్కడే ఉండిపోయారు. వీరికి ధైర్యం చెప్పేందుకు ప్రస్తుతం మైనారిటీ కమిషన్ సభ్యులు వచ్చారని, ఇతర జిల్లా స్థాయి అధికారులు, సబ్ డివిజన్ మేజిస్ట్రేట్ కూడా వచ్చారని పోలీసులు చెప్తున్నారు. ఈ కేసు విషయంలో మొత్తం 22 మందిని అరెస్టు చేశామని, బాధితులకు కౌన్సెలింగ్ ఇస్తున్నామని చెప్పారు.