సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వన్‌టైమ్ సెటిల్‌మెంట్ (ఓటీఎస్)కు మంచి స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమం కింద లబ్ధి పొందడానికి అర్హులు వడివడిగా ముందుకొస్తున్నారు. రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ద్వారా 1983 నుంచి 2011 మధ్య ఇళ్ల నిర్మాణం కోసం తీసుకున్న రుణాలు, వీటిపై వడ్డీని ఓటీఎస్ కింద మాఫీ చేసి.. నిర్దేశించిన మొత్తం చెల్లిస్తే ఇళ్లపై సంపూర్ణ యాజమాన్య హక్కులను ప్రభుత్వం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటీఎస్ వినియోగించుకుని రాష్ట్రవ్యాప్తంగా 9,18,216 మంది ఇళ్లపై హక్కులు పొందారు. వీరిలో 2,47,355 మంది తమ పేర్లపై రిజిస్ట్రేషన్‌లు కూడా పూర్తి చేసుకున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1.26 లక్షల మంది.. పశ్చిమ గోదావరి జిల్లాలో 1.11 లక్షల మంది ఓటీఎస్ వినియోగించుకున్నారు. ఓటీఎస్ రూపంలో ప్రభుత్వం రూ.10 వేల కోట్ల మేర రుణాలు మాఫీ చేసింది. అంతేకాకుండా పేదలపై తలకు మించిన భారం మోపకుండా తక్కువ మొత్తం నిర్దేశించి.. వాటిని చెల్లించినవారికి ఇళ్లను రిజిస్ట్రేషన్ చేసి ఇస్తోంది. పేదలపై ఎటువంటి రుసుములు లేకుండా రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా రూ.6 వేల కోట్ల లబ్ధి చేకూరుస్తోంది. ఇలా మొత్తంగా రూ.16 వేల కోట్ల మేర ప్రభుత్వం పేదలకు మేలు చేసింది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో అర్హులైన పేదలు రెండు వాయిదాల్లో ఓటీఎస్ కట్టుకునే అవకాశం కల్పించింది. ఉగాదికి తొలి వాయిదా, దీపావళికి రెండో వాయిదా చెల్లించేలా వెసులుబాటు ఇచ్చింది.
స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు..
ఓటీఎస్‌కు స్పందన బాగుంది. ఓటీఎస్ వినియోగించుకోవాలని ఎవరినీ ఒత్తిడి చేయడం లేదు. గ్రామ, వార్డు సచివాలయాల యంత్రాంగం అర్హుల ఇళ్లకు వెళ్లి ఓటీఎస్ ప్రయోజనాలను వివరిస్తున్నారు. దీంతో అర్హులు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. సోమవారం ఒక్కరోజే నెల్లూరు జిల్లాలో 3,761 మంది ఓటీఎస్ వినియోగించుకోవడానికి సుముఖత తెలిపారు.
– నారాయణ భరత్ గుప్తా, ఎండీ, రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ
ఓటీఎస్‌కు మంచి స్పందన
Published Tue, Jan 25 2022 2:51 AM | Last Updated on Tue, Jan 25 2022 2:51 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment