వేణుగోపాలరావు ఇంట్లో డాక్యుమెంట్లు పరిశీలిస్తున్న డీఎస్పీ ప్రసాదరావు, సీఐలు
అది బొబ్బిలి పట్టణంలోని స్వామివారి వీధిలోగల సాలూరు హౌసింగ్ ఏఈగా పనిచేస్తున్న రెడ్డి వేణుగోపాలరావు ఇల్లు. ఎప్పటిమాదిరిగానే శుక్రవారం కూడా తెల్లారింది. ఇంతలో ఎవరో తలుపు కొడుతున్న చప్పుడు. ఎవరో వచ్చారనుకుని తలుపు తెరిచారు. తీరా చూస్తే వారు అవినీతి నిరోధక శాఖ అధికారులు. ఆదాయానికి మించి ఆస్తులు కూడ బెట్టారన్న అభియోగం వచ్చిందనీ... ఇల్లంతా సోదాలు చేస్తామని చెప్పేసరికి వారంతా హతాసులయ్యారు. అంతేగాదు. ఇంటినుంచి ఎవరూ బయటకు వెళ్లకూడదని హుకుం జారీ చేశారు. తరువాత తెలిసింది. అక్కడే కాదు... ఆయన బంధువులు... వ్యాపార భాగస్వాముల ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయని.
* కోట్లకు పడగలెత్తిన హౌసింగ్ ఏఈ వేణుగోపాలరావు
* ఏసీబీ సోదాల్లో రూ. 15కోట్ల ఆస్తులు బట్టబయలు
* సన్నిహితులతో అటు రియల్... ఇటు చిట్స్ వ్యాపారం
* జిల్లాలోని ఆరుచోట్ల ఏకకాలంలో ఏసీబీ అధికారుల సోదాలు
* ఉలిక్కిపడ్డ హౌసింగ్ శాఖ
బొబ్బిలి : ఆయన హౌసింగ్‌శాఖలో అసిస్టెంట్ ఇంజినీర్. ఉద్యోగంలో కంటే... వ్యాపారంలో బాగా రాణించారు. విధినిర్వహణలో ఎందరికి ఇళ్లు కట్టిచ్చారో తెలీదుగానీ... ఆయన మాత్రం భూములు కొనుగోలు చేశారు. ఇళ్లు కట్టించుకున్నారు. వర్కు ఇన్‌స్పెక్టర్‌గా విధుల్లో చేరి అసిస్టెంట్ ఇంజినీర్‌గా పదోన్నతి పొందడమే గాదు. అదే స్థాయిలో వ్యాపారాలు విస్తృతం చేశారు. భార్యతో చిట్స్ వ్యాపారం, సహ ఉద్యోగి, సమీప బంధువులతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసి బొబ్బిలిలో ఎక్కడికక్కడ ఆస్తులు కూడపెట్టారు. కోట్ల రూపాయలకు పడగలెత్తారు.
ఇదీ రెడ్డి వేణుగోపాలరావు ప్రస్థానం. ఆదాయానికి మంచి ఆస్తులున్నట్లు ఏసీబీ అధికారులకు సమాచారం అందడంతో డెరైక్టర్ జనరల్ ఎం.మాలకొండయ్య స్పందించారు. వెంటనే అదే శాఖలో సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ (సీఐయూ) డీఎస్‌పీగా ఉన్న ఎస్‌వీవీ ప్రసాదరావుకు ఈ బాధ్యత అప్పగించారు. ఏఈ వేణుగోపాలరావుపై కేసు నమోదు చేసి ఏడుగురు ఏసీబీ సీఐలు రంగంలోనికి దిగారు.
నెల రోజులుగా వివిధ కోణాల్లో అక్రమంగా సంపాదించిన ఆస్తుల చిట్టాను చేతిలో పెట్టుకొని ఏసీబీ కోర్టు వారెంటుతో శుక్రవారం బొబ్బిలి పట్టణంలోని స్వామివారివీధిలో ఉండే ఆయన ఇంటికి వచ్చి సోదాలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో ఆదాయానికి మించి కోటి 55 లక్షల 37 వేల రూపాయల ఆస్తులు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఏఈని అరెస్టు చేసి విజయనగరం ఒకటవ పట్టణ పోలీసు స్టేషనుకు తరలించినట్లు డీఎస్‌పీ ప్రసాదరావు విలేకరులకు తెలిపారు.
సోదాలు చేసింది వీరే...
డీఎస్‌పీ ప్రసాదరావు ఆధ్వర్యంలో బొబ్బిలి వచ్చిన ఏసీబీ అధికారులు వేణుగోపాలరావు ఇంట్లో సీఐలు సతీష్‌కుమార్, లక్ష్మోజిలు, వ్యాపార బాగస్వామి రెడ్డి సత్యం ఇంట్లో సీఐ గణేష్, దిబ్బగుడ్డివలసలోని ఏఈ సోదరులు భూషణం, సత్యంనాయుడు, తండ్రి పాపినాయుడు నివాసం ఉంటున్న ఇంట్లో సీఐ రమేష్, ఏఈ అత్తారిళ్లు బాడంగి మండలం అల్లుపాల్తేరులో సీఐ ఎస్ గఫూర్, సాలూరులోని హౌసింగు కార్యాలయం, రామభద్రపురం మండలం నాయుడువలసలోని వ్యాపార బాగస్వామి నడిమింటి లక్ష్మి ఇంట్లో సీఐ రమేష్, విశాఖపట్నంలోని మల్కాపురంలో వ్యాపార బాగస్వామి పెంట ఉమామహేశ్వరరావు ఇంట్లో, కార్యాలయంలో సీఐ రమణమూర్తి దాడులు చేపట్టారు.
ఉలిక్కిపడ్డ దిబ్బగుడ్డివలస
బొబ్బిలి రూరల్: సాలూరు హౌసింగ్ ఏఈ రెడ్డి వేణుగోపాలరావు స్వగ్రామం దిబ్బగుడ్డివలసలోని ఆయన కుటుంబసభ్యుల ఇళ్లల్లో ఏసీబీ అధికారులు శుక్రవారం ఉదయం ఆకస్మికంగా సోదాలు చేశారు.
సీఐ రమేష్ ఆధ్వర్యంలో జరిపిన సోదాలో రూ. 35లక్షల విలువైన ప్రామిసరీ నోట్లు, దస్తావేజులు లభించాయి. వీటితో పాటు 15తులాల బంగారం, 1,30,000 రూపాయల నగదు లభించింది. ఈ సంఘటనతో గ్రామం ఉలిక్కిపడింది.
నాయుడువలసలో...
తెర్లాం రూరల్: వేణుగోపాలరావు వ్యాపార భాగస్వామి, బాడంగి మండల గృహ నిర్మాణ శాఖ ఏఈగా పనిచేస్తున్న నడిమింటి సత్యం స్వగ్రామం రామభద్రపురం మండలం నాయుడువలసలో. ఆయన ఇంట్లో ఏసీబీ అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు రమేష్, గపూర్‌లు జిల్లా వాణిజ్య పన్నుల శాఖాధికారి మన్మధరావు సమక్షంలో సోదాలు జరిపారు. విలువైన డాక్యుమెంట్లు, బ్యాంక్ పుస్తకాలు, బ్యాంక్ లాకర్లకు సంబంధించిన వివరాలను పరిశీలించారు.
అల్లుపాల్తేరులో...
బాడంగి : బాడంగి మండలం అల్లుపాల్తేరు గ్రామంలో ఏఈ వేణుగోపాలరావు అత్తవారిల్లుంది. అక్కడా ఏసీబీ అధికారుల బృందం శుక్రవారం ఆకస్మికంగా దాడిచేసి సోదాలు చేపట్టారు. ఇంటిలోగల భూముల పట్టా పుస్తకాలు, బ్యాంకు ఖాతాలు, బంగారు ఆభరణాల రుణాల వివరాలకు చెందిన రశీదులు, విలువైన పత్రాలను స్వాదీనంచేసుకున్నారు.
ఇవీ అక్రమాస్తులు
వేణుగోపాలరావు 1986లో హౌసింగు శాఖలో వర్క్ ఇన్‌స్పెక్టరుగా ఉద్యోగంలో చేరారు. 2010లో ఏఈగా పదోన్నతి వచ్చింది. ఎక్కువ కాలం పార్వతీపురం డివిజన్‌లోనే పనిచేశారు. బొబ్బిలి మండలం దిబ్బగుడ్డివలస గ్రామానికి చెందిన ఈయన ప్రస్తుతం స్వామివారివీధిలోని రెండతస్థుల భవనంలో నివాసం ఉంటున్నారు. పార్కు పక్కన మూడు ఇళ్లు, కోర్టుకు ఎదురుగా 600 గజాల స్థలం, మార్కెట్‌లో పలు భవనాలు ఉన్నట్లు గుర్తించారు. భార్య వరలక్ష్మి నిర్వహిస్తున్న చిట్స్ వ్యాపారానికి సంబంధించి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకులో 25 తులాల బంగారాన్ని తనఖా పెట్టి రుణం తీసుకున్నట్లు గుర్తించారు.
రియల్ ఎస్టేట్‌లో ఇటీవలే బాడంగి, ప్రేమనగర్ కాలనీ, అప్పయ్యపేట, తారకరామకాలనీల్లో అమ్మిన స్థలాలకు సంబంధించి 40 డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. రామభద్రపురం మండలం నాయుడువలసలో ఉండే మరో హౌసింగ్ ఏఈ సత్యం భార్య నడిమింటి లక్ష్మి పేరుతో వ్యాపారాలు చేస్తుండడంతో అక్కడ కూడా దాడులు చేసి విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో వేణుగోపాలరావుకు బొబ్బిలి పట్టణంలో ఖరీదైన 16 ఇళ్ల స్థలాలు, 5 భవనాలు, ఒక కారు, రెండు ద్విచక్ర వాహనాలు ఉన్నట్లు గుర్తించారు. ఇవన్నీ ప్రస్తుతం మార్కెట్ ధర ప్రకారం 15 కోట్ల రూపాయల వరకూ ఉంటుందని అంచనా.