Bobbili town
-
పెరుగనున్న బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ (బుడా) పరిధి పెరగనుంది. బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి మరో 6 మండలాల్లోని 169 పంచాయతీలను విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం బొబ్బిలి అర్బన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం మున్సిపాలిటీలతో పాటు విజయనగరం జిల్లాలోని 11 మండలాల్లోని 572 గ్రామాలు ఉన్నాయి. చదవండి: 'వైఎస్ఆర్ చేయూత' రెండో విడత ప్రారంభం కొత్తగా బుడా పరిధిలోకి తెర్లా, బలిజపేట, కురుపాం, జియ్యమ్మవలస, గరుగుబిల్లి గ్రామాలు, గుమ్మలక్ష్మీపురం మండలాల్లోని 833 చదరపు కిలో మీటర్ల ప్రాంతాన్ని కలుపుతూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. తాజా ఉత్తర్వులతో 3080 చదరపు కిలో మీటర్లు బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధి పెరగనుంది. మొత్తంగా 7.52లక్షల జనాభా పరిధిలో బుడా తన సేవలను ప్రారంభించాల్సి ఉంది. -
ఆ పాఠాలు ఉండవిక...
విద్యావిధానంలో సమూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒత్తిడి లేని విద్య అందించే ప్రక్రియకు అడుగులు పడుతున్నాయి. బడి అంటే అదేదో బందిఖానాలా కాకుండా... ఆటపాటల నిలయంగా మార్చే యత్నాలు సాగుతున్నాయి. ఇప్పటికే ఆనందలహరి... నో బ్యాగ్‌డే...అంటూ సంస్కరణలు తీసుకొచ్చిన సర్కారు తాజాగా పలు తరగతుల సిలబస్ తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ రూపొందించిన ఈ ప్రణాళికను తాజాగా అమలు చేయాలని నిర్ణయానికి వచ్చింది. సాక్షి, బొబ్బిలి(విజయనగరం) : విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. విద్యార్థుల ఒత్తిడిని తగ్గించేందుకు, సరళీకృతమైన సమగ్ర విద్యాబోధనకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. పాఠశాలల్లో వివిధ తరగతులకు నిర్దేశించిన విద్యాప్రమాణాలను సాధించ డం ఉపాధ్యాయులకు తలకుమించిన భారమవుతోంది. సిలబస్ పూర్తి చేయడానికి నానా తంటాలు పడాల్సి వస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని అవసరం లేని పాఠాలను తొలగించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న పాఠ్యాంశాలు విద్యార్థి భవిష్యత్తుకు అవసరమయినవా కావా అన్న అంశాలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు బోధనలో ఉపయోగిస్తున్న కొన్ని పాఠ్యాం శాలను తొలగించాలని నిర్ణయించింది. వయోపరిమితిని అనుసరించి విద్యార్థుల సామర్థ్యాలు, వారి మానసిక స్థితిని బేరీజు వేసుకున్న విద్యా శాఖలోని ఎస్సీఈఆర్టీ(రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా సంస్థ) విభాగం మూడో తరగతి నుంచి 8 వ తరగతి వరకూ గల పాఠాల్లో పలు పాఠ్యాంశాలను తొలగించాలని నిర్ణయించింది. ఆయా పాఠ్యాంశాల వివరాలను విద్యా శాఖకు పంపింది. ఆ పాఠాలను ఇప్పుడు విద్యార్థులు చదవనవసరం లేదనీ, వీటిని పుస్తకాల్లోంచి తొలగించాలని ఏపీ ఎస్సీఈఆర్టీ ఆదేశించింది. గుర్తించిన పాఠ్యాంశాలపై పరీక్షలుండవని కూడా స్పష్టం చేసింది. తొలగించనున్న పాఠ్యాంశాలివే... మూడో తరగతి తెలుగులో ఆరోగ్యమే మహాభాగ్యం, లడ్డూ బాధ, పిల్లల మర్రి, చెట్టు కోరిక వంటి వాటితో పాటు ఇంగ్లిష్‌లో మూడు, లెక్కలులో రెండు, ఈవీఎస్‌లో నాలుగు, నాలుగో తరగతిలో తెలుగు నాలుగు పాఠాలు ఇంగ్లిష్ రెండు పాఠాలు లెక్కలులో మూడు ఇలా వరుసగా ఒక్కో తరగతిలోనూ రెండు నుంచి ఆరు వరకూ పాఠాలను అవసరం లేనివిగా గుర్తించారు. ఆరో తరగతిలో ఉర్దూ సబ్జెక్టులో ఆరు పాఠాలు అవసరం లేనట్టు గుర్తించారు. ఇలా ఎనిమిదో తరగతి వరకూ పాఠ్యాంశాలను తొలగిస్తున్నట్టు ఎస్సీఈఆర్టీ ప్రకటించింది. ఈ ఏడాది నుంచే అమలు మూడో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వర కూ అన్ని సబ్జెక్టులలోనూ అవసరం లేని పాఠ్యాంశాలను గుర్తించిన ప్రభుత్వం ఇప్పుడు వాటిని ఈ ఏడాది నుంచే అమలు చేస్తున్నట్టు చెప్పింది. 2019–20 నుంచి ఈ పాఠ్యాంశాలు అవసరం లేనివని వీటిని తొలగిస్తున్నట్టు చెప్పారు. సామర్థ్యాలు పెరుగుతాయి దీని ప్రకారం వేలాది మంది విద్యార్థులు అవసరమయిన పాఠాలను ఆకళింపు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆ పాఠ్యాంశాలను వదిలి వేయడం వల్ల మిగతా ముఖ్యమైన పాఠాలపై దృష్టి పెట్టడం వల్ల విద్యార్థుల సామర్థ్యాలు పె రుగుతాయి. ఉపాధ్యాయులు కూడా కాస్త ఎక్కు వ సమయాన్ని మిగిలిన పాఠ్యాంశాలపై దృష్టి సా రించి బోధించేందుకు అవకాశం కలుగుతుంది. బోధన సరళీకృతమవుతుంది అవసరం లేని పాఠాలను తొలగించడం వల్ల బోధన సరళీకృతమవుతంది. దీని వల్ల విద్యార్థులు ము ఖ్యమైన పాఠాలపై ఏకాగ్రత పెంచుకుని చదువుకునేందుకు అవకాశం కలుగుతుంది. మరింత తొందరగా సిలబస్‌ను పూర్తి చేసి రివిజన్ చేసుకునేందుకు అవకాశం కలుగుతుంది. – జె.సి.రాజు, హెచ్ఎం, నారాయణప్పవలస -
డబ్బు ఇవ్వలేదని కొట్టి చంపేశారు
సాక్షి, బొబ్బిలి(విజయనగరం) : మండలంలోని నారసింహునిపేట సమీపంలో నంద చెరువు వద్ద సీతానగరం మండలం గుచ్చిమికి చెందిన దుస్తుల వ్యాపారి కింతలి నాగేశ్వరరావు మంగళవారం సాయంత్రం అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ మిస్టరీని ఏఎస్పీ గౌతమీశాలి ఆధ్వర్యంలో పోలీసులు రెండు రోజుల వ్యవధిలో ఛేదించారు. ఈ మేరకు గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ వివరాలు వెల్లడించారు. కింతలి నాగేశ్వరరావు దుస్తులు విక్రయించుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఇతను అదే గ్రామానికి చెందిన బలగ రామినాయుడుకు రూ. రెండు లక్షలు అప్పుగా ఇచ్చాడు. ఇటీవల కాలంలో తన సొమ్ము తిరిగి ఇచ్చేయాలని తరచూ నాగేశ్వరరావు అడుగుతుండడంతో రామినాయుడు కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా నాగేశ్వరరావును అంతమొందించాలని భావించిన రామినాయుడు తనకు తెలిసిన సుంకరి వాసు, జాగాన సత్యనారాయణలతో బేరం కుదుర్చుకున్నాడు. ఇందుకోసం ఒక్కొక్కరికీ రెండు వేల రూపాయలు అడ్వాన్స్‌గా చెల్లించి.. హత్య చేసిన తర్వాత రూ. 75 వేలు ఇవ్వడానికి రామినాయుడు ఒప్పుకున్నాడు. దీంతో నిందితులు ముందుగా కింతలి నాగేశ్వరరావు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో రెక్కీ నిర్వహించుకుని పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రానికి నారసింహునిపేట వైపు నాగేశ్వరరావు వస్తాడని నిర్ణయించుకున్న నిందితులు ముందుగా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఇంతలో అటుగా వస్తున్న నాగేశ్వరరావుపై నిందితులు కర్రలతో దాడి చేసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని అక్కడే వదిలేసి రెండు ఉంగరాలు, పర్స్, సెల్‌ఫోన్ తీసుకెళ్లిపోయారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. సమీపంలోని మూడు పోలీస్స్టేషన్లకు సమాచారం అందించి పక్కా ప్రణాళికతో నిందితులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్, హత్యకు ఉపయోగించిన కర్ర స్వాధీనం చేసుకున్నారు. సిబ్బందికి అభినందనలు.. హత్య కేసును త్వరగా ఛేదించిన బొబ్బిలి, బాడంగి, సీతానగరం ఎస్సైలు వి. ప్రసాదరావు, బి. సురేంద్ర నాయుడు, జి.కళాధర్‌తో పాటు బొబ్బిలి నూతన ఎస్సై ఎస్. కృష్ణమూర్తి, బొబ్బిలి ఏఎస్సైలు బీవీ రమణ, వై. మురళీకృష్ణ, జి. శ్యామ్‌సుందరరావు, పీసీలు కె. తిరుపతిరావు, యు. తాతబాబునాయుడు, బి. కాసులరావు, వి. శ్రీరామ్, వై. శ్యామలరావు, కె.పూడినాయుడులను ఏఎస్పీ అభినందించారు. -
టీడీపీ రాష్ట్ర నేత లాడ్జీలో చీరల స్వాధీనం!
బొబ్బిలి: ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అధికార పార్టీ నాయకులు తమ సిబ్బందిని, కార్యకర్తలను విరివిగా వినియోగిస్తున్నారు. ఎంతయినా డబ్బు ఖర్చు పెట్టి ఓట్లను లాక్కునేందుకు ప్రయత్నిస్తూ భంగపడుతున్నారు. మంగళవారం పట్టణంలోని రైల్వే స్టేషన్ జంక్షన్ వద్ద టీడీపీ నాయకుడు, రాష్ట్ర ఆర్ధిక మండలి సభ్యుడు తూముల భాస్కరరావుకు చెందిన సూర్య లాడ్జిలో ఓటర్లకు పంచేందుకు సిద్ధంగా ఉంచినట్టు భావిస్తున్న చీరెల బేళ్లను ఏఎస్పీ గౌతమీ శాలి దాడుల్లో పట్టుబడ్డాయి. సాధారణ గాలింపు చర్యల్లో భాగంగా ఏఎస్పీ పట్టణంలోని పలు లాడ్జిలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సూర్య లాడ్జీలోని రూం నెంబర్ 215లో చీరల బేళ్లు కనిపించాయి. మున్సిపల్ చైర్పర్సన్ తూముల అచ్యుతవల్లి కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న ఎం.ప్రసాద్ ఇక్కడి రూంను బుక్ చేసుకున్నట్టు అధికారుల విచారణలో తెలిసింది. వెంటనే వాటిని స్వాధీనం చేసుకోవాలని ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ మెజిస్ట్రేట్ ఎం. శ్యాంసుందరరావు, ఏఎస్ఐ జి భాస్కరరావులు సూచించారు. ఫ్లైయింగ్ స్క్వాడ్ మెజిస్ట్రేట్ శ్యాం సుందర రావు తన సిబ్బందితో చీరెలను ఎన్ని కొన్నారు? ఎవరు కొన్నారన్న వివరాలను ఆరా తీశారు. ప్రాథమికంగా విచారణచేశారు. మొత్తంగా ఒక్కో బేల్లో 200 చీరెలున్నాయని గుర్తించారు. మూడు బేళ్లలో 600 చీరెలున్నట్టు గుర్తించారు. వాటిని సీజ్ చేస్తున్నట్టు చెప్పారు. టీడీపీ నాయకుల పనే! పట్టణంలోని పలు వార్డుల్లో చీరెలు, డబ్బులను కొంత మంది టీడీపీ కార్యకర్తలు, నాయకుల సిబ్బంది ఇళ్లకు గత మూడు రోజులుగా తరలిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే దాదాపు నాలుగు వేలకు పైగా చీరెలను తరలించారు. మంగళవారం పోలీసుల దాడుల్లో పట్టుబడ్డ ఎం ప్రసాద్ టీడీపీ రాష్ట్రనాయకుడు తూముల భాస్కరరావు సహాయకుడు. మున్సిపల్ చైర్పర్సన్ తూముల అచ్యుతవల్లి వద్ద కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఇప్పటికే పలు చీరలను ఓటర్లకు పంపిణీ చేసేందుకు వివిధ ప్రాంతాలకు చేరవేసినట్టు పట్టణంలో పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై ఫ్లైయింగ్ స్క్వాడ్ మెజిస్ట్రేట్ శ్యాం సుందర్ మాట్లాడుతూ చీరెలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేస్తామనీ, విచారణ అనంతరం పూర్తి వివరాలు తేలుతాయన్నారు. కాగా చీరెలను పంపిణీ చేసేందుకే ఇక్కడ భద్రపరిచామని ఎం ప్రసాద్ తెలిపారు. అయితే తన కుమార్తె రజస్వల ఫంక్షన్‌కు సంబంధించి వచ్చే ఆదివారం ఇక్కడే ఫంక్షన్ చేస్తామని అందుకనే చీరెలను పంపిణీ చేసేందుకు కొనుగోలు చేశానని మెజిస్ట్రేట్‌కు వాంగ్మూలమిచ్చారు. -
బుడా రియల్ బడా
సాక్షి, బొబ్బిలి: ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందానన్న సామెత అచ్చంగా టీడీపీ నాయకులకు సరిపోతుంది. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న రియల్ దందాను ఇక్కడి టీడీపీ నాయకులు అచ్చంగా పాటిస్తున్నారు. ఇటీవలే శ్రీకాకుళానికి సుడా, బొబ్బిలికి బుడా సంస్థలను ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వ ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఈ ఉత్తర్వులను నిబంధనల ప్రకారం ముందుగా కార్యాలయాలు, కార్యకలాపాలు ప్రారంభించకుండానే రియల్ వ్యాపారం బుడా పేరిట సంతరించుకుంటోంది. బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ (బుడా)కు చైర్మన్, వైస్ చైర్మన్లను నియమించిన అధికార ప్రభుత్వం దీని ఏర్పాటు వెనుక మతలబును చెప్పకనే చెబుతోంది. ఏదేని రియల్ ఎస్టేట్ ప్రారంభమయితే దానికి సంబంధించి అనుమతుల కోసం నిర్దిష్ట అధికారులకు దరఖాస్తు చేసుకుని ఉండాలి. కానీ ఇక్కడ బుడా పేరిట బొబ్బిలిలో ఓ కార్యాలయమూ లేదు... కార్యవర్గమూ పూర్తి స్థాయిలో కాలేదు. అంతే కాదు దీనికి కార్యాలయం ఏర్పాటుకు ఒక్క పైసా బడ్జెట్ కూడా విడుదల చేయలేదు. కానీ బుడాకు ప్రతిపాదించామంటే రూ.కోట్లలో రియల్ బిజినెస్‌ను ప్రారంభించారు తెలుగుదేశం పార్టీ నాయకులు. బొబ్బిలి నియోజకవర్గానికి చెందిన పలువురు వ్యాపారులు టీడీపీ నాయకులతో కలసి పెద్ద వెంచర్‌ను ప్రారంభించారు. అంత వరకూ బాగానే ఉంది. కానీ మొట్టమొదటి బుడా ప్రపోజ్డ్ అందమైన బ్రోచర్లు వేసి రియల్ వ్యాపారాన్ని ప్రారంభించేశారు. కానీ కొనుగోలు దారులకు ఈ బుడా సంగతి తెలియదు కదా? ఎడాపెడా కొనుగోలుకు ముందుకు వస్తున్నట్టు తెలుస్తున్నది. అసలే ఎన్నికల వేళ అంటూ రాని బుడాకు అనుమతులకు దరఖాస్తులు చేశామని టీడీపీ నాయకులు కోట్లాది రూపాయల రియల్ వ్యాపారానికి మాత్రం బుడాను అప్పుడే వినియోగించుకుంటున్నారు. బుడా ప్రపోజ్డ్ అంటూ పెద్ద వెంచర్లు వేస్తూ ప్రజలను మస్కా కొడుతున్నారు. బుడా పరిధిలో 11 మండలాల్లోని 572 గ్రామాలతో పాటు మూడు మున్సిపాలిటీ(బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం)లను విలీనం చేస్తూ జీఓ విడుదల చేశారు. మొత్తంగా 7.52లక్షల జనాభా పరిధిలో బుడా తన సేవలను ప్రారంభించాల్సి ఉంది. దీనికి చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే తెంటు లకు‡్ష్మనాయుడు, వైస్‌చైర్మన్‌గా జాయింట్ కలెక్టర్లను నియమించారు. ఇంకా పూర్తి స్థాయి కార్యవర్గాన్ని నియమించాల్సి ఉంది. అలాగే కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ దీనికి సంబంధించి బడ్జెట్ విడుదల చేయకపోవడంతో ఎక్కడిదక్కడే ఉండిపోయింది. దీనికి సంబంధించిన రివాల్వింగ్ ఫండ్ కానీ, డవలప్మెంట్ ఫండ్కానీ విడుదల చేయలేదు. కానీ బుడా పేరిట అప్పుడే రియల్ వ్యాపారాలు మా త్రం ప్రారంభమయ్యాయి. అర్బన్ డెవలప్మెంట్ పనులు ప్రారంభించక పోయినా, కార్యాలయాలు కానరాకపోయినా రియల్ వ్యాపారులకు మాత్రం ఈ బుడా ముందుగానే వినియోగపడుతోంది. రియల్ బ్రోచర్లు ఈ రియల్ ఎస్టేట్ వెంచర్ చిత్రం చూడండి! ఆ.. ఏముంది? ఎవరో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్లు వేసుకుని విక్రయించుకుంటున్నారనుకుంటున్నారా? అంత వరకూ బానే ఉంది. దీనికి సంబంధించి అనుమతులు తీసుకునేందుకు ఏదేని పట్టణాభివృద్ధి శాఖకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడి రియల్ ఎస్టేట్లకు ఇంకా కార్యకలాపాలు ప్రారంభించని, కార్యాలయమే లేని బుడాకు ప్రతిపాదించామని రియల్ వ్యాపారులు బోర్డులు పెట్టారు. అంతే కాదు. మంచి నగిషీలతో బ్రోచర్లు తయారు చేసి టీడీపీ నాయకుల కనుసన్నల్లో వ్యాపారాలు సాగిస్తున్నారు. -
వృత్తి ఉద్యోగం... ప్రవృత్తి వ్యాపారం...
అది బొబ్బిలి పట్టణంలోని స్వామివారి వీధిలోగల సాలూరు హౌసింగ్ ఏఈగా పనిచేస్తున్న రెడ్డి వేణుగోపాలరావు ఇల్లు. ఎప్పటిమాదిరిగానే శుక్రవారం కూడా తెల్లారింది. ఇంతలో ఎవరో తలుపు కొడుతున్న చప్పుడు. ఎవరో వచ్చారనుకుని తలుపు తెరిచారు. తీరా చూస్తే వారు అవినీతి నిరోధక శాఖ అధికారులు. ఆదాయానికి మించి ఆస్తులు కూడ బెట్టారన్న అభియోగం వచ్చిందనీ... ఇల్లంతా సోదాలు చేస్తామని చెప్పేసరికి వారంతా హతాసులయ్యారు. అంతేగాదు. ఇంటినుంచి ఎవరూ బయటకు వెళ్లకూడదని హుకుం జారీ చేశారు. తరువాత తెలిసింది. అక్కడే కాదు... ఆయన బంధువులు... వ్యాపార భాగస్వాముల ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయని. * కోట్లకు పడగలెత్తిన హౌసింగ్ ఏఈ వేణుగోపాలరావు * ఏసీబీ సోదాల్లో రూ. 15కోట్ల ఆస్తులు బట్టబయలు * సన్నిహితులతో అటు రియల్... ఇటు చిట్స్ వ్యాపారం * జిల్లాలోని ఆరుచోట్ల ఏకకాలంలో ఏసీబీ అధికారుల సోదాలు * ఉలిక్కిపడ్డ హౌసింగ్ శాఖ బొబ్బిలి : ఆయన హౌసింగ్‌శాఖలో అసిస్టెంట్ ఇంజినీర్. ఉద్యోగంలో కంటే... వ్యాపారంలో బాగా రాణించారు. విధినిర్వహణలో ఎందరికి ఇళ్లు కట్టిచ్చారో తెలీదుగానీ... ఆయన మాత్రం భూములు కొనుగోలు చేశారు. ఇళ్లు కట్టించుకున్నారు. వర్కు ఇన్స్పెక్టర్గా విధుల్లో చేరి అసిస్టెంట్ ఇంజినీర్‌గా పదోన్నతి పొందడమే గాదు. అదే స్థాయిలో వ్యాపారాలు విస్తృతం చేశారు. భార్యతో చిట్స్ వ్యాపారం, సహ ఉద్యోగి, సమీప బంధువులతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసి బొబ్బిలిలో ఎక్కడికక్కడ ఆస్తులు కూడపెట్టారు. కోట్ల రూపాయలకు పడగలెత్తారు. ఇదీ రెడ్డి వేణుగోపాలరావు ప్రస్థానం. ఆదాయానికి మంచి ఆస్తులున్నట్లు ఏసీబీ అధికారులకు సమాచారం అందడంతో డెరైక్టర్ జనరల్ ఎం.మాలకొండయ్య స్పందించారు. వెంటనే అదే శాఖలో సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ (సీఐయూ) డీఎస్పీగా ఉన్న ఎస్వీవీ ప్రసాదరావుకు ఈ బాధ్యత అప్పగించారు. ఏఈ వేణుగోపాలరావుపై కేసు నమోదు చేసి ఏడుగురు ఏసీబీ సీఐలు రంగంలోనికి దిగారు. నెల రోజులుగా వివిధ కోణాల్లో అక్రమంగా సంపాదించిన ఆస్తుల చిట్టాను చేతిలో పెట్టుకొని ఏసీబీ కోర్టు వారెంటుతో శుక్రవారం బొబ్బిలి పట్టణంలోని స్వామివారివీధిలో ఉండే ఆయన ఇంటికి వచ్చి సోదాలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో ఆదాయానికి మించి కోటి 55 లక్షల 37 వేల రూపాయల ఆస్తులు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఏఈని అరెస్టు చేసి విజయనగరం ఒకటవ పట్టణ పోలీసు స్టేషనుకు తరలించినట్లు డీఎస్పీ ప్రసాదరావు విలేకరులకు తెలిపారు. సోదాలు చేసింది వీరే... డీఎస్పీ ప్రసాదరావు ఆధ్వర్యంలో బొబ్బిలి వచ్చిన ఏసీబీ అధికారులు వేణుగోపాలరావు ఇంట్లో సీఐలు సతీష్‌కుమార్, లక్ష్మోజిలు, వ్యాపార బాగస్వామి రెడ్డి సత్యం ఇంట్లో సీఐ గణేష్, దిబ్బగుడ్డివలసలోని ఏఈ సోదరులు భూషణం, సత్యంనాయుడు, తండ్రి పాపినాయుడు నివాసం ఉంటున్న ఇంట్లో సీఐ రమేష్, ఏఈ అత్తారిళ్లు బాడంగి మండలం అల్లుపాల్తేరులో సీఐ ఎస్ గఫూర్, సాలూరులోని హౌసింగు కార్యాలయం, రామభద్రపురం మండలం నాయుడువలసలోని వ్యాపార బాగస్వామి నడిమింటి లక్ష్మి ఇంట్లో సీఐ రమేష్, విశాఖపట్నంలోని మల్కాపురంలో వ్యాపార బాగస్వామి పెంట ఉమామహేశ్వరరావు ఇంట్లో, కార్యాలయంలో సీఐ రమణమూర్తి దాడులు చేపట్టారు. ఉలిక్కిపడ్డ దిబ్బగుడ్డివలస బొబ్బిలి రూరల్: సాలూరు హౌసింగ్ ఏఈ రెడ్డి వేణుగోపాలరావు స్వగ్రామం దిబ్బగుడ్డివలసలోని ఆయన కుటుంబసభ్యుల ఇళ్లల్లో ఏసీబీ అధికారులు శుక్రవారం ఉదయం ఆకస్మికంగా సోదాలు చేశారు. సీఐ రమేష్ ఆధ్వర్యంలో జరిపిన సోదాలో రూ. 35లక్షల విలువైన ప్రామిసరీ నోట్లు, దస్తావేజులు లభించాయి. వీటితో పాటు 15తులాల బంగారం, 1,30,000 రూపాయల నగదు లభించింది. ఈ సంఘటనతో గ్రామం ఉలిక్కిపడింది. నాయుడువలసలో... తెర్లాం రూరల్: వేణుగోపాలరావు వ్యాపార భాగస్వామి, బాడంగి మండల గృహ నిర్మాణ శాఖ ఏఈగా పనిచేస్తున్న నడిమింటి సత్యం స్వగ్రామం రామభద్రపురం మండలం నాయుడువలసలో. ఆయన ఇంట్లో ఏసీబీ అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. ఏసీబీ ఇన్స్పెక్టర్లు రమేష్, గపూర్లు జిల్లా వాణిజ్య పన్నుల శాఖాధికారి మన్మధరావు సమక్షంలో సోదాలు జరిపారు. విలువైన డాక్యుమెంట్లు, బ్యాంక్ పుస్తకాలు, బ్యాంక్ లాకర్లకు సంబంధించిన వివరాలను పరిశీలించారు. అల్లుపాల్తేరులో... బాడంగి : బాడంగి మండలం అల్లుపాల్తేరు గ్రామంలో ఏఈ వేణుగోపాలరావు అత్తవారిల్లుంది. అక్కడా ఏసీబీ అధికారుల బృందం శుక్రవారం ఆకస్మికంగా దాడిచేసి సోదాలు చేపట్టారు. ఇంటిలోగల భూముల పట్టా పుస్తకాలు, బ్యాంకు ఖాతాలు, బంగారు ఆభరణాల రుణాల వివరాలకు చెందిన రశీదులు, విలువైన పత్రాలను స్వాదీనంచేసుకున్నారు. ఇవీ అక్రమాస్తులు వేణుగోపాలరావు 1986లో హౌసింగు శాఖలో వర్క్ ఇన్స్పెక్టరుగా ఉద్యోగంలో చేరారు. 2010లో ఏఈగా పదోన్నతి వచ్చింది. ఎక్కువ కాలం పార్వతీపురం డివిజన్‌లోనే పనిచేశారు. బొబ్బిలి మండలం దిబ్బగుడ్డివలస గ్రామానికి చెందిన ఈయన ప్రస్తుతం స్వామివారివీధిలోని రెండతస్థుల భవనంలో నివాసం ఉంటున్నారు. పార్కు పక్కన మూడు ఇళ్లు, కోర్టుకు ఎదురుగా 600 గజాల స్థలం, మార్కెట్లో పలు భవనాలు ఉన్నట్లు గుర్తించారు. భార్య వరలక్ష్మి నిర్వహిస్తున్న చిట్స్ వ్యాపారానికి సంబంధించి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకులో 25 తులాల బంగారాన్ని తనఖా పెట్టి రుణం తీసుకున్నట్లు గుర్తించారు. రియల్ ఎస్టేట్‌లో ఇటీవలే బాడంగి, ప్రేమనగర్ కాలనీ, అప్పయ్యపేట, తారకరామకాలనీల్లో అమ్మిన స్థలాలకు సంబంధించి 40 డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. రామభద్రపురం మండలం నాయుడువలసలో ఉండే మరో హౌసింగ్ ఏఈ సత్యం భార్య నడిమింటి లక్ష్మి పేరుతో వ్యాపారాలు చేస్తుండడంతో అక్కడ కూడా దాడులు చేసి విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో వేణుగోపాలరావుకు బొబ్బిలి పట్టణంలో ఖరీదైన 16 ఇళ్ల స్థలాలు, 5 భవనాలు, ఒక కారు, రెండు ద్విచక్ర వాహనాలు ఉన్నట్లు గుర్తించారు. ఇవన్నీ ప్రస్తుతం మార్కెట్ ధర ప్రకారం 15 కోట్ల రూపాయల వరకూ ఉంటుందని అంచనా.