టీడీపీ నాయకుల లాడ్జీలో విచారణ చేస్తున్న మెజిస్ట్రేట్, పోలీసులు
బొబ్బిలి: ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అధికార పార్టీ నాయకులు తమ సిబ్బందిని, కార్యకర్తలను విరివిగా వినియోగిస్తున్నారు. ఎంతయినా డబ్బు ఖర్చు పెట్టి ఓట్లను లాక్కునేందుకు ప్రయత్నిస్తూ భంగపడుతున్నారు. మంగళవారం పట్టణంలోని రైల్వే స్టేషన్ జంక్షన్ వద్ద టీడీపీ నాయకుడు, రాష్ట్ర ఆర్ధిక మండలి సభ్యుడు తూముల భాస్కరరావుకు చెందిన సూర్య లాడ్జిలో ఓటర్లకు పంచేందుకు సిద్ధంగా ఉంచినట్టు భావిస్తున్న చీరెల బేళ్లను ఏఎస్పీ గౌతమీ శాలి దాడుల్లో పట్టుబడ్డాయి. సాధారణ గాలింపు చర్యల్లో భాగంగా ఏఎస్పీ పట్టణంలోని పలు లాడ్జిలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సూర్య లాడ్జీలోని రూం నెంబర్ 215లో చీరల బేళ్లు కనిపించాయి.
మున్సిపల్ చైర్‌పర్సన్ తూముల అచ్యుతవల్లి కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న ఎం.ప్రసాద్ ఇక్కడి రూంను బుక్ చేసుకున్నట్టు అధికారుల విచారణలో తెలిసింది. వెంటనే వాటిని స్వాధీనం చేసుకోవాలని ఎన్నికల ఫ్‌లైయింగ్ స్క్వాడ్ మెజిస్ట్రేట్ ఎం. శ్యాంసుందరరావు, ఏఎస్‌ఐ జి భాస్కరరావులు సూచించారు. ఫ్‌లైయింగ్ స్క్వాడ్ మెజిస్ట్రేట్ శ్యాం సుందర రావు తన సిబ్బందితో చీరెలను ఎన్ని కొన్నారు? ఎవరు కొన్నారన్న వివరాలను ఆరా తీశారు. ప్రాథమికంగా విచారణచేశారు. మొత్తంగా ఒక్కో బేల్‌లో 200 చీరెలున్నాయని గుర్తించారు. మూడు బేళ్లలో 600 చీరెలున్నట్టు గుర్తించారు. వాటిని సీజ్ చేస్తున్నట్టు చెప్పారు.
టీడీపీ నాయకుల పనే!
పట్టణంలోని పలు వార్డుల్లో చీరెలు, డబ్బులను కొంత మంది టీడీపీ కార్యకర్తలు, నాయకుల సిబ్బంది ఇళ్లకు గత మూడు రోజులుగా తరలిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే దాదాపు నాలుగు వేలకు పైగా చీరెలను తరలించారు. మంగళవారం పోలీసుల దాడుల్లో పట్టుబడ్డ ఎం ప్రసాద్ టీడీపీ రాష్ట్రనాయకుడు తూముల భాస్కరరావు సహాయకుడు. మున్సిపల్ చైర్‌పర్సన్ తూముల అచ్యుతవల్లి వద్ద కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఇప్పటికే పలు చీరలను ఓటర్లకు పంపిణీ చేసేందుకు వివిధ ప్రాంతాలకు చేరవేసినట్టు పట్టణంలో పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
దీనిపై ఫ్‌లైయింగ్ స్క్వాడ్ మెజిస్ట్రేట్ శ్యాం సుందర్ మాట్లాడుతూ చీరెలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేస్తామనీ, విచారణ అనంతరం పూర్తి వివరాలు తేలుతాయన్నారు. కాగా చీరెలను పంపిణీ చేసేందుకే ఇక్కడ భద్రపరిచామని ఎం ప్రసాద్ తెలిపారు. అయితే తన కుమార్తె రజస్వల ఫంక్షన్‌కు సంబంధించి వచ్చే ఆదివారం ఇక్కడే ఫంక్షన్ చేస్తామని అందుకనే చీరెలను పంపిణీ చేసేందుకు కొనుగోలు చేశానని మెజిస్ట్రేట్‌కు వాంగ్మూలమిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment