Flying Squad
-
ఓ ఇంట్లో రూ.4.8 కోట్ల నగదు.. బీజేపీ అభ్యర్థిపై కేసు నమోదు
బెంగళూరు, సాక్షి: కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల మొదటి దశ ఓటింగ్ ప్రారంభం కావడానికి ముందు చిక్కబళ్లాపుర లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని యలహంకలో ఓ ఇంట్లో రూ.4.8 కోట్ల నగదును ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు బీజేపీ అభ్యర్థి కె.సుధాకర్‌పై కేసు నమోదు చేశారు.చిక్కబల్లాపుర ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం రూ. 4.8 కోట్ల విలువైన నగదును స్వాధీనం చేసుకుందని, చిక్కబల్లాపుర నియోజకవర్గం ఎస్ఎస్టీ బృందం బీజేపీ అభ్యర్థి కె.సుధాకర్‌పై గురువారం మదనాయకనహల్లి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ‘ఎక్స్’ (ట్విటర్)లో ద్వారా శుక్రవారం ప్రకటించారు.కాగా గోవిందప్ప అనే వ్యక్తికి చెందిన నివాసంలో అధికారులు జరిపిన సోదాల్లో కట్టలకొద్దీ రూ.500 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంటి యజమానిని విచారించిన తరువాత బీజేపీ అభ్యర్థిపై కేసు నమోదు చేశారు. ఈ పరిణామం తరువాత ఆదాయపు పన్ను శాఖ అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నట్లు తెలిసింది. The FST of Chikkaballapura seized cash worth 4.8 Crores. An FIR also has been lodged by the SST team of Chikkaballapura Constituency against K Sudhakar, BJP Candidate on 25.04.2024 at Madanayakanahally Police Station.— Chief Electoral Officer, Karnataka (@ceo_karnataka) April 26, 2024 -
రూ.1,000 కోట్ల బంగారం స్వాధీనం
అన్నానగర్: చైన్నె సమీపంలో ఆదివారం ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ జరిపిన వాహనాల తనిఖీల్లో సీజ్ చేసిన రూ.1000 కోట్ల విలువైన బంగారు కడ్డీలను ఆదాయపు పన్ను శాఖకు సోమవారం అప్పగించారు. వివరాలు.. శ్రీపెరంబత్తూర్ పార్లమెంటరీ నియోజకవర్గం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ కాంచీపురం జిల్లా కుండ్రత్తూర్ సమీపంలోని వండలూరు – మీంజూర్ ఔటర్ రింగ్ రోడ్డుపై తనిఖీలు నిర్వహించింది. ఆ సమయంలో చైన్నె విమానాశ్రయం నుంచి సరుకులు తీసుకెళ్తున్న ప్రైవేట్ ఇంటర్నేషనల్ కొరియర్ కంపెనీకి చెందిన మినీ లారీలో బంగారు కడ్డీలు ఉండడంతో శ్రీపెరంబదూరు పార్లమెంట్ నియోజకవర్గ సహాయ ఎన్నికల అధికారి శరవణ కన్నన్ సీజ్ చేశారు. వాటిని సోమవారం జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేష్, శరవణ కన్నన్ సమక్షంలో చైన్నెకి చెందిన ఆదాయపన్ను శాఖ అధికారులకు అప్పగించారు. వీటి విలువ మార్కెట్లో రూ.1,000 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. తగిన ధ్రువపత్రాలు అందిస్తే కలెక్టర్ నేతృత్వంలో ప్రైవేట్ కొరియర్ కంపెనీకి తిరిగి ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. -
ఈలేస్తే.. క్లోజ్! .. గంట వ్యవధిలోనే ఘటనాస్థలికి ఫ్లయింగ్ స్క్వాడ్
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మెయిన్ రోడ్డులో రాజకీయ పార్టీల హోర్డింగులు సోమవారం ఉదయం వరకూ ఉన్నాయి. వీటిని సీ–విజిల్ ద్వారా ఫొటోలు తీసి ఎవరో అప్లోడ్ చేశారు. అంతే.. నిమిషాల వ్యవధిలో అక్కడకు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ చేరుకుంది. స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుని, యుద్ధ ప్రాతిపదికన హోర్డింగులను తొలగించింది. ఈ యాప్ ఎంత వేగంగా పని చేస్తుందనేందుకు ఈ చర్యలే సాక్ష్యం. సార్వత్రిక ఎన్నికలకు ఎన్నికల కమిషన్ సర్వ సన్నద్ధమయింది. ఇప్పటికే ఓటర్ల జాబితాలు.. పోలింగ్ కేంద్రాలు, ఈవీఎంలు, వీవీ ప్యాట్లపై కసరత్తు చేస్తున్న ఎన్నికల సంఘం.. ఎన్నికల్లో పార్టీల ప్రలోభాలు, కోడ్ ఉల్లంఘనలపైనా దృష్టి సారించింది. ఉల్లంఘనులపై చర్యలకు ‘సీ విజిల్’ యాప్‌ను సిద్ధం చేసింది. – ప్రత్తిపాడు ఫొటోలు, వీడియోలు అప్లోడ్ చేస్తే చాలు.. సాధారణ ఎన్నికల్లో ఎవరైనా ప్రవర్తనా నియమావళిని (ఎన్నికలకోడ్) ఉల్లంఘించినా, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినా, మద్యం, డబ్బు, వస్తు సామగ్రి పంపిణీ వంటి వాటికి పాల్పడినా, అలాంటి వారిపై చర్యలు తీసుకునేలా ఈ యాప్‌ను రూపొందించారు. ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా, ఓటర్లకు కానుకలు అందజేసే సమయంలో ఫొటోలు, వీడియోలు తీసి యాప్‌లో అప్లోడ్ చేస్తే నేరుగా ఎన్నికల సంఘానికి చేరిపోతాయి. కులమత విద్వేషాలను రెచ్చగొట్టేలా చేసే ప్రసంగాలనూ ఆడియో ద్వారా రికార్డు చేసి అప్లోడ్ చేయవచ్చు. అత్యంత వేగంగా స్పందన సీ విజిల్ యాప్ ద్వారా చేసిన ఫిర్యాదులపై అత్యంత వేగంగా స్పందన ఉంటుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినా, ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నా సంబంధిత ప్రదేశం నుంచే ఫొటోలు, వీడియోలు, ఆడియోలు తీసి యాప్‌లో అప్లోడ్ చేయవచ్చు. అప్లోడ్ చేసిన గంటలోపు అక్కడకు ముగ్గురు సభ్యులతో కూడిన ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ చేరుకుంటుంది. ఘటనపై 90 నిమిషాల్లో ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తారు. ఎన్నికల కమిషన్ అందుబాటులోనికి తీసుకువచి్చన ఈ యాప్‌ను ఓటర్లు వినియోగించుకోవాలి. – ఎం.పద్మజ, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్, ప్రత్తిపాడు గంట వ్యవధిలోనే.. ► ఎవరైనా, ఎక్కడి నుంచైనా యాప్‌లో అప్లోడ్ చేసిన ఐదు నిమిషాల్లో జిల్లా ఎన్నికల అధికారికి వెళుతుంది. ఆయన దీని పరిశీలనకు ఫీల్డ్‌లో ఉన్న టీముకు పంపిస్తారు. ►15 నిమిషాల్లో ఫీల్డ్‌లో ఉన్న ఫ్లయింగ్ స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుతుంది. ► 30 నిమిషాల్లో ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ చర్యలు మొదలుపెట్టి నివేదికను ఉన్నతాధికారులకు పంపుతుంది. ►యాభై నిమిషాల్లో రిటర్నింగ్ అధికారులు ఫిర్యాదును క్లోజ్ చేస్తారు. ►ప్రతి ఫిర్యాదుకు 100 నిమిషాల్లో ప్రతిస్పందన ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి.. ►యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ చేసుకోవాల్సి ఉంటుంది. ► ఇన్స్టాల్ చేసుకునే సమయంలో రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ► ఫొటోలు, వీడియోలు అప్లోడ్ చేయాలనుకున్న సమయంలో మొబైల్లోని జీపీఎస్ ఆన్‌లో ఉంచాలి. దాని ఆధారంగానే అధికారులు సంబంధిత ప్రాంతానికి నేరుగా చేరుకోగలుగుతారు. ► యాప్ ఇన్స్టాల్ చేసుకునే సమయంలో వచ్చిన ఓటీపీ ద్వారా యాప్ యాక్టివేట్ అవుతుంది. ► ఆ తర్వాత వీడియోలు, ఫొటోలు అప్ లోడ్ చేసి నేరుగా యాప్ ద్వారా ఉన్నతాధికారులకు పంపవచ్చు. -
ఒడిశా సీఎం హెలికాప్టర్ తనిఖీ
భువనేశ్వర్: ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ హెలికాప్టర్‌ను ఎన్నికల సంఘం అధికారులు తనిఖీ చేశారు. మంగళవారం రూర్కెలాలో రోడ్ షో కోసం పట్నాయక్ వచ్చినప్పుడు అధికారులు అక్కడకు చేరుకుని హెలికాప్టర్‌ను, అందులోని ఇతర సామగ్రిని తనిఖీ చేయాల్సి ఉందని కోరారని పట్నాయక్ భద్రతాధికారి చెప్పారు. మోదీ హెలికాప్టర్‌లోనూ సోదాలు ఒడిశాలోని సంబాల్పూర్లో మంగళవారం ఎన్నికలర్యాలీ వేళ ప్రధాని మోదీ హెలికాప్టర్‌ను అధికారులు తనిఖీ చేశారు. నిబంధనల ప్రకారం ఎస్పీజీ రక్షణ కలిగిన వారి హెలికాప్టర్ సోదా చేయొద్దు. దీంతో సోదా చేసిన కర్ణాటక కేడర్ ఐఏఎస్ అధికారి మోహిన్సన్ను ఈసీ బుధవారం సస్పెండ్ చేసింది. -
1381 కేజీల బంగారం పట్టివేత
సాక్షి, చెన్నై: ఎన్నికల వేళ భారీగా బంగారం పట్టుబడుతోంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఎన్నికల సమయంలో బంగారంతో పాటు భారీగా అక్రమ నగదు పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. తాజాగా తమిళనాడులో 1381 కేజీల బంగారం పట్టుబడింది. చెన్నై సమీపంలోని తిరువల్తూరు జిల్లా వేపంబట్టు టోల్‌ప్లాజా వద్ద అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ఫ్తెయింగ్ స్క్వాడ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెండు వ్యాన్లలో బంగారం, కొంతమేర నగదును తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బంగారానికి సంబంధించి సరైన సమాధానం రాకపోవడంతో వాహనాలతో సహా సీజ్ చేశారు. కాగా రేపు దేశ వ్యాప్తంగా రెండో విడత పోలింగ్ జరుగునున్న నేపథ్యంలో భారీగా బంగారం పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది. ఓటర్లకు పంచేందుకే తరలిస్తున్నారా అనే కోణంలో అధికారులు విచారిస్తున్నారు. తెలి విడుత పోలింగ్ ముందు కూడా తమిళనాడు సరిహద్దుల్లో భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా అధికారులకు పట్టుబడిన బంగారాన్ని టీటీడీకి చెందినదిగా గుర్తించారు. తనిఖీల్లో పట్టుకున్న బంగారాన్ని విడిపించేందుకు టీటీడీ ఇచ్చిన లేఖతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజర్ తమిళనాడుకు బయలుదేరారు. -
ఒడిశా సీఎం హెలికాప్టర్లో ఎన్నికల అధికారుల సోదాలు
-
టీడీపీ రాష్ట్ర నేత లాడ్జీలో చీరల స్వాధీనం!
బొబ్బిలి: ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అధికార పార్టీ నాయకులు తమ సిబ్బందిని, కార్యకర్తలను విరివిగా వినియోగిస్తున్నారు. ఎంతయినా డబ్బు ఖర్చు పెట్టి ఓట్లను లాక్కునేందుకు ప్రయత్నిస్తూ భంగపడుతున్నారు. మంగళవారం పట్టణంలోని రైల్వే స్టేషన్ జంక్షన్ వద్ద టీడీపీ నాయకుడు, రాష్ట్ర ఆర్ధిక మండలి సభ్యుడు తూముల భాస్కరరావుకు చెందిన సూర్య లాడ్జిలో ఓటర్లకు పంచేందుకు సిద్ధంగా ఉంచినట్టు భావిస్తున్న చీరెల బేళ్లను ఏఎస్పీ గౌతమీ శాలి దాడుల్లో పట్టుబడ్డాయి. సాధారణ గాలింపు చర్యల్లో భాగంగా ఏఎస్పీ పట్టణంలోని పలు లాడ్జిలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సూర్య లాడ్జీలోని రూం నెంబర్ 215లో చీరల బేళ్లు కనిపించాయి. మున్సిపల్ చైర్పర్సన్ తూముల అచ్యుతవల్లి కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న ఎం.ప్రసాద్ ఇక్కడి రూంను బుక్ చేసుకున్నట్టు అధికారుల విచారణలో తెలిసింది. వెంటనే వాటిని స్వాధీనం చేసుకోవాలని ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ మెజిస్ట్రేట్ ఎం. శ్యాంసుందరరావు, ఏఎస్ఐ జి భాస్కరరావులు సూచించారు. ఫ్లైయింగ్ స్క్వాడ్ మెజిస్ట్రేట్ శ్యాం సుందర రావు తన సిబ్బందితో చీరెలను ఎన్ని కొన్నారు? ఎవరు కొన్నారన్న వివరాలను ఆరా తీశారు. ప్రాథమికంగా విచారణచేశారు. మొత్తంగా ఒక్కో బేల్లో 200 చీరెలున్నాయని గుర్తించారు. మూడు బేళ్లలో 600 చీరెలున్నట్టు గుర్తించారు. వాటిని సీజ్ చేస్తున్నట్టు చెప్పారు. టీడీపీ నాయకుల పనే! పట్టణంలోని పలు వార్డుల్లో చీరెలు, డబ్బులను కొంత మంది టీడీపీ కార్యకర్తలు, నాయకుల సిబ్బంది ఇళ్లకు గత మూడు రోజులుగా తరలిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే దాదాపు నాలుగు వేలకు పైగా చీరెలను తరలించారు. మంగళవారం పోలీసుల దాడుల్లో పట్టుబడ్డ ఎం ప్రసాద్ టీడీపీ రాష్ట్రనాయకుడు తూముల భాస్కరరావు సహాయకుడు. మున్సిపల్ చైర్పర్సన్ తూముల అచ్యుతవల్లి వద్ద కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఇప్పటికే పలు చీరలను ఓటర్లకు పంపిణీ చేసేందుకు వివిధ ప్రాంతాలకు చేరవేసినట్టు పట్టణంలో పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై ఫ్లైయింగ్ స్క్వాడ్ మెజిస్ట్రేట్ శ్యాం సుందర్ మాట్లాడుతూ చీరెలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేస్తామనీ, విచారణ అనంతరం పూర్తి వివరాలు తేలుతాయన్నారు. కాగా చీరెలను పంపిణీ చేసేందుకే ఇక్కడ భద్రపరిచామని ఎం ప్రసాద్ తెలిపారు. అయితే తన కుమార్తె రజస్వల ఫంక్షన్‌కు సంబంధించి వచ్చే ఆదివారం ఇక్కడే ఫంక్షన్ చేస్తామని అందుకనే చీరెలను పంపిణీ చేసేందుకు కొనుగోలు చేశానని మెజిస్ట్రేట్‌కు వాంగ్మూలమిచ్చారు. -
ఏమి జరిగిందంటే..
పెరంబూరు: ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రజలను ప్రలోభాలకు గురి చేసి ఓట్లు గుంజుకోవడానికి రాజకీయ నాయకులు బయలుదేరుతున్న విషయం తెలిసిందే. దీంతో ఎన్నికల అధికారులు డబ్బును అక్రమంగా తరలిస్తున్న వాహనాలను తనిఖీలు చేయడానికి ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ను నియమించారు. వారు ఇప్పటికే సరైన ఆధారాలు లేని కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకుంటున్నారు. కాగా నటి నమిత ఫ్లయింగ్ స్క్వాడ్‌తో వాగ్వాదానికి దిగినట్లు, వారితో గొడవ పడినట్లు గరువారం ప్రచారం హోరెత్తిన విషయం తెలిసిందే. దీంతో నటి నమిత భర్త వీరేంద్ర స్పందించారు. ఆయన శుక్రవారం ఒక ప్రకటనను మీడియా పర్సన్ ద్వారా విడుదల చేశారు.అందులో తాము షూటింగ్లో పాల్గొనడానికి 8 గంటల పాటు కారులో ప్రయాణం చేస్తున్నామన్నారు. నమిత ప్రయాణ బడలికతో కారు వెనుక సీటులో నిద్రిస్తోందని చెప్పారు. అప్పటికే దారిలో రెండు మూడు చోట్ల ఫ్లయింగ్ స్క్వాడ్స్ తమ కారును తనిఖీ చేశారన్నారు. అలా సేలం జిల్లా, ఆర్కాడు ప్రధాన కూడలిలో మరోసారి ఫ్లయింగ్ స్క్వాడ్స్ తమ కారు ఆపారని చెప్పారు. అయినా తాము తనిఖీకి సహకరించామని తెలిపారు. అయితే వెనుక సీటులో నమిత నిద్రపోతుండడంతో అవసరం అయితే తానే ఆమెను లేపుతానని చెప్పానన్నారు. అయితే వారు తన మాటను వినిపించుకోకుండా కారు డోర్‌ను టక్కున ఒపెన్ చేశారని, దీంతో పడుకున్న నమిత సడన్‌గా కిందకు పడిపోయే పరిస్థితి నెలకొందని చెప్పారు. అయినా వారు నమిత బ్యాగ్‌ను పరిశీలించాలని అన్నారని,, దీంతో నిరాకరించిన నమిత మహిళా పోలీస్‌నే తన బ్యాగ్ చెక్ చేయాలని చెప్పిందన్నారు. అప్పుడు మహిళా పోలీస్ వచ్చి నమిత బ్యాగ్‌ను చెక్ చేసిందని తెలిపారు. అసౌకర్యమైన పరిస్థితుల్లో మహిళా పోలీస్‌ను తనిఖీకి కోరడం ప్రతి మహిళా హక్కు అని నమిత భర్త వీరేంద్ర అన్నారు. జరిగింది ఇదయితే మీడియా వేరే విధంగా వక్రీకరించిందని ఆయన అన్నారు. -
‘రైతుబంధు’ పర్యవేక్షణకు ఫ్లయింగ్ స్క్వాడ్
సాక్షి, హైదరాబాద్ : రైతు బంధు పథకం అమలు తీరు పర్యవేక్షణకు ఫ్లయింగ్‌స్క్వాడ్ ఏర్పాటు చేయ నున్నట్లు వ్యవసాయమంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. పెట్టుబడి చెక్కుల పంపిణీపై వ్యవ సాయ అధికారులు, బ్యాంకర్లతో సోమవారం సచి వాలయంలో సమీక్ష సమావేశం నిర్వహిం చారు. రెవెన్యూశాఖ ఇచ్చే డేటాను వ్యవసాయ అధికా రులు సమీక్షించి చెక్‌ల ముద్రణ కోసం బ్యాంకు లకు పంపుతున్నారని, మొదటి విడతలో 3,300 గ్రామాల వివరాలను ఇచ్చారని చెప్పారు. చెక్కుల పంపిణీని గ్రామాల్లో పండుగలా జరపాలని సూచించారు. గ్రామ, మండల రైతు సమన్వయ సమితి సభ్యుల సహకారం తీసుకోవాలన్నారు. స్థానిక శాసనసభ్యుడు, ప్రజాప్రతినిధులు, అధికా రులతో గ్రామసభ నిర్వహించి ప్రతిరైతుకు స్వయంగా చెక్కును అందించాలని పేర్కొన్నారు. గ్రామంలోని రైతులందరికీ అదేరోజు చెక్కులను పంపిణీ చేయాలన్నారు. గ్రామసభలో టెంట్లు, కుర్చీలు, తాగునీటి సౌకర్యం కల్పించాలని సూచిం చారు. ప్రభుత్వం ఇస్తున్న పెట్టుబడిపై రైతులందరూ సంతృప్తి వ్యక్తం చేయాలని, ప్రతి పక్షాలు కూడా అభినందించాలన్నారు. ప్రతిజిల్లాకు రాష్ట్రస్థాయి అధికారిని ఇన్చార్జిగా నియమించాలని ఆదేశించారు. సమావేశంలో వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి, కమిషనర్ ఎం.జగన్మోహన్, ఉద్యానశాఖ డైరెక్టర్ ఎల్.వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. మొక్కజొన్న కొనుగోలుకు రూ.1,000 కోట్ల రుణం రబీలో మొక్కజొన్న పంట కొనుగోలు నిమిత్తం మార్క్‌ఫెడ్‌కు రూ.1,000 కోట్ల రుణం ఇచ్చేందుకు బ్యాంకులు అంగీక రించాయని పోచారం వెల్లడించారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందన్నారు. సోమవారం సచి వాలయంలో సమా వేశం నిర్వహిం చా రు. రాష్ట్రంలో ఏడా దికి 4 లక్షల ఎక రాల్లో మొక్క జొన్న పంట సాగైందని పేర్కొన్నారు. -
అధికారుల తనిఖీలు: 25 కిలోల వెండి స్వాధీనం
కేకే.నగర్: రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఫ్లయింగ్‌స్క్వాడ్ అధికారులు జరిపిన తనిఖీల్లో రూ.4.39 కోట్ల నగదు, 28 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. టి.నగర్లో రూ.3.58 లక్షల స్వాధీనం: ఓటర్లకు డబ్బులు పంచడానికి దాచి ఉంచిన రూ.3.58 కోట్లను ఆదాయశాఖ అధికారులు నందనం సీఐటీ నగర్ పారిశ్రామిక వేత్త ఇంట్లో సోమవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. టి.నగర్ నియోజకవర్గం నందనం సీఐటీ నగర్‌లోని పారిశ్రామికవేత్త ఓటర్లకు డబ్బులు ఇస్తున్నట్లు అధికారులకు రహస్య సమాచారం అందిం ది. తనిఖీ చేసిన అధికారులు సరైన ఆధారాలు లేకపోవడంతో నగదును స్వాధీనం చేసుకున్నారు. రూ.40 లక్షల స్వాధీనం : మడిపాక్కం పొన్నియమ్మన్ కోవిల్ సమీపం లో నివసిస్తున్న 169వ వార్డు అన్నాడీఎంకే కౌన్సిలర్ జయచంద్రన్ ఇంట్లో అధిక మొత్తంలో డబ్బులు దాచి ఉంచినట్లు అధికారులకు సమాచారం అందింది. ఎన్నికల అధికారి సెంథిల్‌వేల్ సోదాలు జరిపి రూ.40 38లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అన్నానగర్‌లో: అన్నానగర్ నియోజ కవర్గం టి.పి.సత్రం జ్యోతి అమ్మల్నగర్ 23వ వీధిలో అన్నాడీఎంకే వార్డు కౌన్సిలర్ కుప్పుస్వామి కుమార్తె సెల్వి ని పోలీసులు అరెస్టు చేశారు. ఓటు వే యాలని రూ. 500లను పంచుతుండగా అధికారులు ఆమెను అడ్డుకున్నారు. టి.పి.సత్రం పోలీసులు సెల్వి, వెల్లచ్చిలను అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్ళారు. రూ.41 లక్షలు స్వాధీనం :మంగళవారం ఉదయం పుదుచ్చేరి కారామణికుప్పం ప్రాంతంలో ఫ్లయింగ్‌స్క్వాడ్ అధికారులు జరిపిన తనిఖీలలో రూ. 41 లక్షల డబ్బు పట్టుబడింది. ఏటీఎంలలో నింపడానికి బ్యాంకు నుంచి తెస్తున్నట్లు చెప్పినా సరైన ఆధారాలు లేకపోవడంతో నగదు, జీపును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 25 కిలోల వెండి స్వాధీనం : దిండివనం సెంజి నియోజకవర్గంలో కా రులో తీసుకెళుతున్న 25 కిలోల వెండి వస్తువులను అధికారులు మంగళవారం ఉ దయం స్వాధీనం చేసుకున్నారు. శివకాపురం నుంచి చెన్నైకు వెళుతున్న కారులో వెండిని స్వాధీనం చేసుకున్నారు. మదురైలో అన్నాడీఎంకే, డీఎంకే ప్రముఖుల ఇళ్లల్లో సోదాలు దిండుకల్ జిల్లాలో అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలకు చెందిన ప్రముఖుల ఇళ్లల్లో అధికారులు సోదాలు జరిపారు. ఒకే రోజు డీఎంకే, అన్నాడీఎంకేకు చెందిన ప్రముఖుల ఇళ్లల్లో ఐటీ అధికారులు ఆకస్మిక తనిఖీలు జరపడం ప్రజలు, పార్టీ వర్గాల మధ్య సంచలనం రేకెత్తించింది. -
పరీక్షకు వేళాయె..
నేటి నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు మొదటి రోజు 8.15 గంటలకే హాజరుకావాలి మహారాణిపేట (విశాఖపట్నం): రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. ప్రభుత్వ క్వీన్ మేరీ బాలికోన్నత పాఠశాలలో పదోతరగతి పరీక్షల జిల్లా అబ్జర్వర్ తులసీదాస్‌తో కలిసి ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 262 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి 12 గంటల వరకూ జరుగుతాయన్నారు. జిల్లావ్యాప్తంగా 62వేల 661మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారన్నారు. మాల్ ప్రాక్టీస్ జరగకుండా 13 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 29 సిటింగ్ స్క్వాడ్లు పరీక్షా కేంద్రాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తాయని తెలిపారు. విద్యార్థులు యూని ఫాంలో కాకుండా సాధారణ దుస్తుల్లో పరీక్షలకు హాజరుకావాలని చెప్పారు. బస్సు సౌకర్యం ఉ న్న ప్రాంతాల్లో విద్యార్థులు హాల్ టికెట్లు చూపించి ఉచితంగా రెండు వైపులా ప్రయాణించవచ్చన్నారు. పరీక్షల కోసం నియమించిన ప్రతి ఉద్యోగి తప్పకుండా విధులు హాజరుకావాలని హాజరుకానివారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మరింత మెరుగైన ఫలితాలకు కసరత్తు పదో తరగతి పరీక్షల్లో ఐదేళ్లుగా మెరుగైన ఫలితాలే సాధించినప్పటికీ రాష్ర్ట స్థాయిలో మాత్రం ఆశించిన స్థానం లభించలేదు. గతేడాది ఉమ్మడి రాష్ర్టంలో జరిగిన పరీక్షల్లో 90.86 శాతం ఉత్తీర్ణతతో జిల్లా పదకొండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈసారి జరుగుతున్న పరీక్షలకు ప్రత్యేకత ఉంది. విభజన నేపథ్యంలో 13 జిల్లాలతో కూడిన ఏపీలో తొలిసారి జరుగుతున్న పరీక్షలు కావడంతో జిల్లా ర్యాంకును మెరుగుపర్చుకోవాలని జిల్లా యంత్రాంగం ముమ్మర కసరత్తు చేసింది. పైగా రాష్ర్ట మానవవనరుల (విద్యా) శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ జిల్లాకు చెందిన వారుకావడంతో జిల్లా అధికారులకు ఈ పరీక్షలు నిజంగానే పరీక్షగా మారాయి.హుద్‌హుద్ తుఫాన్ సమయంలో పాఠశాలలు నెల రోజులు మూతపడినప్పటికీ నవంబర్ నుంచి మార్చి వరకు ఆదివారాలు, పండగ, రెండో శనివారాల్లో పనిచేసి సిలబస్‌ను పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పరీక్షా కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద గట్టి పోలీస్ బందోబస్తుతో పాటు కేంద్రాల్లో చూసిరాతకు పాల్పడకుండా వీడియో కెమెరాలు, వెబ్‌కెమెరాలు సిద్ధం చేశారు. విద్యార్థులకు ఇప్పటికే హాల్‌టికెట్లు అందచేశారు. హాల్‌టికెట్లు అందని వారు ‘డబ్యూడబ్యూడబ్యూ. బీఎస్ఈఏపీ.ఓఆర్జీ’ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని సంబంధిత పాఠశాల హెచ్ఎం సంతంకం, స్కూల్ స్టాంప్‌తో పరీక్షకు హాజరుకావచ్చు. 144 సెక్షన్ అమలు: ప్రతీ పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేశారు. సమస్మాత్మక ప్రాంతాల్లో సిటింగ్ స్క్వాడ్లు వేశారు. స్థానిక తహశీల్దార్లు, డిప్యూటీ డీఈఓలు ఎప్పటికప్పుడు తనిఖీలు చేసేలా ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు కూర్చునేందుకు బెంచీలు, కుర్చీలతో పాటు తాగునీరు ఏర్పాటు చేశారు. మెడికల్ కిట్‌తో సహా ఏఎన్ఎంను నియమిం చారు.పరీక్షలు జరుగుతున్న సమయంలో పరీక్షా కేంద్రం చుట్టుపక్కల జెరాక్స్ కేంద్రాలు మూసివేయాలని ఇప్పటికే విద్యాశాఖాధికారులు ఆదేశాలు జారీ చేశారు. పోలీస్స్టేషన్ల ద్వారా ప్రశ్నపత్రాలు : జిల్లాలో మొత్తం 262 పరీక్షా కేంద్రాలకు ప్రశ్నపత్రాలను 76 పోలీస్ స్టేషన్లలో భద్రపరిచారు. మైదాన ప్రాంతంలో, పట్టణ ప్రాంతంలో, ఏజెన్సీలో కేంద్రాలకు 76 పోలీస్స్టేషన్లు ద్వారా ఏ రోజుకారోజు ప్రశ్నపత్రాలను పోలీస్లే దగ్గరుండి తీసుకొని పరీక్షా కేంద్రాలకు తరలిస్తారు. జిల్లాలో 29 సమస్యాత్మక కేంద్రాలు గుర్తించారు. ఇవి ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతంలోనే ఉన్నాయి. ప్రతి సమస్యాత్మక కేంద్రంలోనూ వెబ్‌కెమెరాలు ఏర్పాటుచేశారు. విద్యార్థులకు సూచనలు: బార్‌కోడింగ్ విధానం అమల్లో ఉండడం వల్ల పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తొలిరోజు గురువారం పరీక్షా కేంద్రాలకు ఉదయం 8-15కే చేరుకోవాలని డీఈవో సూచించారు. మిగతా రోజుల్లో 8-45కు చేరుకోవాలని ఆయన వెల్లడించారు. పెన్నులు, రైటింగ్ప్యాడ్లు, పరీక్షకు అవసరమైన వస్తువులు విద్యార్థులు తెచ్చుకోవాలి. సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. కంట్రోల్‌రూం ఏర్పాటు : పదోతరగతి పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరిగినా, ఎలాంటి సమస్యలు ఎదురైనా ఎప్పటికప్పుడు తెలియచేసేందుకు జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ఎవరైనా 9180330984 నంబరుకు అత్యవసర సమయాల్లో ఫోన్ చేయవచ్చు. ఈ నంబర్ ద్వారా సమాధానం చెప్పేందుకు కంట్రోల్‌రూంలో ఆరుగురుని నియమించారు. -
ఎన్నికలకు ఫ్లయింగ్ స్క్వాడ్ల నియామకం
సాక్షి, నల్లగొండ : సార్వత్రక ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా జరిగేలా చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు నియమితులయ్యారు. మండల స్థాయిలో ఎన్నికల నిర్వహణను ఈ బృందాలు పర్యవేక్షిస్తాయి. మొత్తం 59 మండలాలకు అధికారులను జిల్లా ఎన్నికల అధికారి టి. చిరంజీవులు ఆదివారం నియమించారు. ఒక్కో అధికారికి ఒకటి రెండు మండలాల బాధ్యతలు అప్పగించారు. వీరంతా ఈ నెల 27 నుంచి 30వ తేదీన ఎన్నికలు ముగిసే వరకు ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులుగా విధులు నిర్విహ స్తారు. సంబంధిత రిటర్నింగ్ అధికారులతో వీరు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకొని ఎన్నికలు ప్రశాంతగా ముగిసేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మండలాల్లో విస్తృతంగా తిరిగి పోలింగ్ ప్రక్రియను తెలుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి వీరికి సూచించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల తనిఖీ నల్లగొండ : సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.చిరంజీవులు, జేసీ హరిజవహర్‌లాల్ ఆదివారం తనిఖీ చేశారు. నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు కేంద్రమైన ఎఫ్‌సీఐ గోదామును కలెక్టర్ పరిశీలించి ఏర్పాట్లపై సిబ్బందికి పలు సూచనలు, సలహాలు అందించారు. అదేవిధంగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు కేంద్రమైన దుప్పలపల్లి ఎఫ్‌సీఐ గోదాములో జరుగుతున్న ఏర్పాట్లను జేసీ హరిజవహర్‌లాల్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ లోక్‌సభ వ్యయ పరిశీలకులు ఎ.ధనరాజ్, రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. -
అంతా ఆన్లైన్లోనే..
బాన్సువాడ, న్యూస్‌లైన్ : ఒకవైపు ఎన్నికల సంఘం పకడ్బందీగా నిబంధనలు అమలు చేస్తోంది. అనుక్షణం అభ్యర్థులపై నిఘా పెడుతోంది. ఏమాత్రం కట్టు తప్పినా కఠినంగా స్పంది స్తోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు, పార్టీల నాయకులు ఆచితూచిగా స్పందిస్తున్నారు. పాతపద్ధతులతో పరేషాన్ వద్దంటూ.. కొత్త పద్ధతుల్లో ప్రచారంలో దూసుకెళ్తున్నా రు. నవతరం ఓటర్లను ఆకట్టుకునేందుకు సామాజిక మా ద్యమాన్ని ఎంచుకొని ప్రచారం చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీంలు, ఫ్లయింగ్ స్క్వాడ్లు, పోలీసులతో నిఘా పెంచడం అభ్యర్థులకు, రాజకీయ పార్టీలకు తలనొప్పిగా తయారయ్యింది. ప్రచార నిబంధనలు ఉల్లంఘిస్తే కేసుల పాలవ్వాల్సి వస్తుంది. దీంతో కొంతమంది అభ్యర్థులు ప్రచారంలో కొత్త పద్ధతులను ఎంచుకున్నారు. సంప్రదాయ పద్ధతులతో పాటు ఇంటర్నెట్, ఫేస్బుక్, సెల్ఫోన్ల ద్వారా ఓట్లభ్యర్థిస్తున్నారు. యువ ఓటర్లు భారీగా ఉండడం, వారు ఫోన్, ఇంటర్నెట్ వినియోగిస్తుండడంతో అభ్యర్థులు సామాజిక మాధ్యమాలను ప్రచారానికి ఎంచుకుంటున్నారు. గెలిపిస్తే తామేం చేస్తామో ఫెస్బుక్ పేజీల్లో పోస్ట్ చేస్తున్నారు. ప్రచార ఫోటోలను ఎప్పటికప్పుడు అపడేట్ చేస్తున్నారు. మరోవైపు అత్యాధునిక త్రీడీ వాహనాల ద్వారా కూడా ప్రచారం చేస్తున్నారు. ఫేస్బు క్, ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ల ద్వారా ప్రచారం చేయడం లో టీడీపీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి మదన్మోహన్రా వు ముందంజలో ఉన్నారు. ఇప్పటికే ఆయన తన ప్రత్యేకమైన మెనిఫెస్టోను తయారు చేసి ఫోన్లలో వైస్ రికార్డింగ్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఆర్మూర్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్‌రెడ్డి తరపున సురేశ్‌రెడ్డి యువసేన, కామారెడ్డి అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీ తరపున షబ్బీర్ అలీ యువసేన, టీడీపీ అభ్యర్థి గంప గోవర్ధన్ తరపున గంప గోవర్ధన్ యువసేన ఫేస్బుక్ ద్వారా ప్రచారం చేస్తోంది. ఎస్ఎంఎస్ల ద్వారా బీజేపీ తమ లక్ష్యాలను వివరిస్తోంది. ఆన్లైన్లోనే అన్నీ.. ఓట్ల కోసం డబ్బులు, మద్యం, క్రికెట్ కిట్లు, సెల్ఫోన్లు, చీరలు ఎరవేయడం అందరికీ తెలిసిందే. సాంకేతిక విజ్ఞానాన్ని వాడుకొంటూ ఆన్లైన్ ద్వారా పంపకాలు చేసేందు కు కొందరు అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలిసింది. యువకులు, కళాశాల విద్యార్థుల బ్యాంకు ఖా తాల వివరాలను సైతం సేకరిస్తున్నారని సమాచారం. -
‘టెన్’షన్
27 నుంచి పదో తరగతి పరీక్షలు కర్నూలు(విద్య), న్యూస్‌లైన్: ఏడాది కష్టానికి ‘పరీక్ష’. భానుడు ఉగ్రరూపం దాల్చగా.. ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఈ పరిస్థితుల్లో విద్యార్థి దశలో అత్యంత కీలకమైన పదో తరగతి పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మార్కుల గోల నుంచి ఉపశమనం లభించినా.. గ్రేడింగ్‌లో ముందుండాలనే తపన ప్రతి విద్యార్థిలో కనిపిస్తోంది. ఈనెల 27 నుంచి ఏప్రిల్ 11వ తేదీ వరకు పరీక్షల నిర్వహణకు జిల్లా విద్యా శాఖ కసరత్తు పూర్తి చేసింది. వివరాలను జిల్లా విద్యాశాఖాధికారి కె.నాగేశ్వరరావు సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రెగ్యులర్‌గా 47,057.. ప్రైవేట్‌గా 6,293 మంది కలిపి 53,350 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. రెగ్యులర్ విద్యార్థులకు 199, ప్రైవేట్ విద్యార్థులకు 28 మంది పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో సమస్యాత్మకమైనవిగా 19 కేంద్రాలను గుర్తించారు. ప్రశ్నపత్రాలను 75 పాయింట్లలో సోరేజ్ చేయగా.. 227 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లను నియమించారు. మరో 20 శాతం మందిని రిజర్వులో ఉచారు. వీరితో పాటు 2,667 మంది ఇన్విజిలేటర్లను నియమించామన్నారు. 11 మంది విద్యాధికారులు, 11 మంది ఎమ్మార్వోలు, 11 మంది ఎస్ఐలతో ఫ్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటైంది. ఏప్రిల్ 15 నుంచి స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభం కానుంది. ఎన్నికల నేపథ్యంలో ఉపాధ్యాయులకు విధుల కేటాయింపులో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ 144 సెక్షన్ అమలు చేస్తోంది. పరీక్ష కేంద్రాల పరిధిలోని జిరాక్స్ సెంటర్ల మూసివేతకు ఆదేశించారు. ప్రతి కేంద్రం వద్ద ఒక ఏఎన్ఎంచే అత్యవసర మందులను అందుబాటులో ఉంచే ఏర్పాటు చేశారు. అయితే అధిక శాతం పరీక్ష కేంద్రాల్లో ఫర్నిచర్ సమస్య వేధిస్తోంది. పరీక్ష సమయంలో ఇన్విజిలేటర్లు సెల్‌ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు ఉపయోగించరాదని.. ప్రతిరోజూ ఉదయం 8.45 గంటల్లోపు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని డీఈఓ ఆదేశించారు. పరీక్ష నిర్వహణలో ఇబ్బందులు తలెత్తితే విద్యార్థులు హెల్ప్‌లైన్ నెంబర్ 98499 32289, 08518-277064 నెంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు. -
భారీగా నగదు పట్టివేత
నాగిరెడ్డిపేట, న్యూస్‌లైన్: వేర్వేరు ప్రాంతాల్లో పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. నాగిరెడ్డిపేట మండలంలోని తాండూరు గేట్ సమీపంలో ఆదివారం వాహనాల తనిఖీ చేపట్టిన ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు శ్రీనివాస్, అనిల్ రూ. 2.89 లక్షల నగదును పట్టుకున్నారు. సిద్దిపేటకు చెందిన దేశభక్తి శివ అనేవ్యక్తి తన వాహ నంలో ఎల్లారెడ్డి నుంచి మెదక్ వెళ్తుండగా అధికారులు శివ వాహనాన్ని తనిఖీ చేశారు. ఈ క్రమంలో వ్యాన్‌లో ఉన్న నగదును స్వాధీనం చేసుకున్నారు. కోడిగుడ్లను విక్రయించగా వచ్చిన డబ్బును వ్యాన్‌లో తీసుకు వెళ్తుండగా అధికారులు పట్టుకున్నారని బాధితుడు శివ తెలిపారు. రూ. 2.17 లక్షలు బాల్కొండ: ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సందర్భంగా మండలంలోని చాకీర్యాల్ చెక్‌పోస్ట్ వద్ద వివిధ వాహనాల తనిఖీల్లో 2.17 లక్షల నగదును శనివారం రాత్రి పట్టుకున్నట్లు ఎస్సై సురేష్ తెలిపారు. నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో నగదును సీజ్ చేసి ఎన్నికల అధికారులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. రూ. 2 లక్షల 45 వేలు సదాశివనగర్: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలవద్ద 44వ జాతీయ రహదారిపై ఆదివారం ఫ్లయిం గ్ స్వ్కాడ్ బృందం వాహనాలను తనిఖీ చేసి రూ. 2 లక్షల 45వేల నగదును పట్టుకున్నారు. ఎంహెచ్ 40వై 5242 నం బరు గల మహరాష్ట్రకు చెందిన ఆర్టీసీ బస్సులో రూ. 95 వేలు తరలిస్తున్న ఆసమహ్మద్ వద్ద డబ్బుకు సంబంధించి ఆధారాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నామని అధికారులు పేర్కొన్నారు. అలాగే టర్బో వాహనంలో రూ. లక్షా 50వేలు తరలిస్తున్న మహ్మద్ ఉస్మాన్ నుంచి డబ్బును స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న డబ్బును జిల్లా ఖజానాకు పంపిస్తున్నట్లు బృందం ప్రతినిధులు ప్రేమ్‌కుమార్, ఏఎస్సై జేవీఆర్ నర్సయ్య, సిబ్బంది తెలిపారు. సాలూర చెక్ పోస్టు వద్ద రూ.1.60 లక్షలు బోధన్ టౌన్: మండల శివారులోని అంధ్ర- మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన సాలుర చెక్ పోస్టు వద్ద ఆదివారం పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో రూ. 1.60 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు బోధన్ సీఐ రామకృష్ణ తెలిపారు. మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి బోధన్ వైపు వస్తున్న డీసీఎం వ్యాన్ తనిఖీ చేయగా ఇద్దరి వ్యక్తుల వద్ద రూ. 1.60 వేలు ఉన్నాయని, వారివద్ద నగదుకు సంబంధించి ఎలాంటి రశీదులు లేకపోవడంతో డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ పేర్కొన్నారు. -
పార్లమెంట్ ఎన్నికలు వ్యయంపై నిఘా
పింప్రి, న్యూస్‌లైన్: వచ్చే లోక్‌సభ ఎన్నికల బరిలో దిగే అభ్యర్థుల వ ్యయంపై నిఘా కోసం పోలీసులతో ప్రత్యేక ఫ్లైయింగ్ స్క్వాడ్ ఏర్పాటు కానుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర డీజీపీ సంజీవ్ దయాళ్ వీడియో కాన్ఫ్రెన్స్ ద్వారా పోలీసులకు శనివారం అనేక సూచనలిచ్చారు. ఈ నాలుగు నియోజకవర్గాల్లోని నేరగాళ్లపై దృష్టి సారించాలన్నారు. ఎన్నికల సమయంలో గెలుపు కోసం వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేసే అవకాశాలు మెండుగా ఉంటాయని, అందువల్లనే పోలీసులతో ఫ్లైయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఇక ఈ నాలుగు నియోజకవర్గాల్లోని నేరగాళ్లపై దృష్టి సారించాలన్నారు. అవసరమైతే వారి మోకా చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం, నగర బహిష్కరణ వంటి చర్యలు కూడా తీసుకోవాలన్నారు. ఎవరి ఒత్తిళ్లకు లొంగిపోవద్దన్నారు. అదేవిధంగా అనుమతి పొందకుండా ఆయుధాలను వినియోగిస్తున్నవారిపైనా దృష్టి సారించాలన్నారు. సారా బట్టీలపైనా దృష్టి సారించాలన్నారు. తర చూ దాడులకు ఆదేశించారు. కాగా పుణే పోలీసు కమిషనరేట్ పరిధిలో పుణే, బారామతి, వడగావ్, మావల్ శిరూర్ పార్లమెంటు నియోజక వర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 656 పోలింగ్ కేంద్రాలు, 3,668 పోలింగ్ బూత్‌లున్నాయి. ఇందులో 77 కేంద్రాలలోని 594 పోలింగ్ బూత్‌లు సమస్యాత్మకమైనవి. కమిషనరేట్ పరిధిలోని 33 పోలీస్ స్టేషన్లకు చెందిన పోలీసు ఉన్నతాధికారులు ఆయా బూత్‌లను ఇటీవల సందర్శించారు. అవి ఎక్కడ ఉన్నాయి? అందులో ఎటువంటి సదుపాయాలు ఉన్నాయి? అనే అంశాలను వారు ఈ సందర్భంగా నిశితంగా పరిశీలించారు. సమస్యాత్మక బూత్‌లవద్ద ఎటువంటి భద్రతా చర్యలు తీసుకోవాలనే అంశంపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. -
నిమిషం లేటైనా నో..
వీఆర్వో, వీఆర్ఏ పరీక్షలకు ‘నిమిషం’ నిబంధన అభ్యర్థులు గంటముందే కేంద్రాలకు చేరుకోవాలి.. పరీక్షా కేంద్రాల్లో వీడియో చిత్రీకరణ, అభ్యర్థుల వేలిముద్రలు సమీక్ష సమావేశంలో కలెక్టర్ వెల్లడి కలెక్టరేట్,న్యూస్‌లైన్: జిల్లాలో ఆదివారం జరిగే వీఆర్వో,వీఆర్ఏ పరీక్షల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. ఎలాంటి లోపాలు, ఇబ్బందుల్లేకుండా పరీక్ష సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎంకే మీనా అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించిన సమీక్షను శుక్రవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో సంబంధిత శాఖాధికారులతో సమీక్షించి పలు సూచనలు ఇచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆదివారం ఉదయం వీఆర్వో, మధ్యాహ్నం వీఆర్ఏ పరీక్షలు ఉంటాయని, నగరంలో వీఆర్వో పరీక్షకు 31 కేంద్రాలు, వీఆర్ఏ పరీక్షకు 8 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రం లోకి ఒక్కనిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించేది లేదని స్పష్టంచేశారు. వైట్నర్,ఎరైజర్ ఉపయోగించబడిన జవాబుపత్రాలు పరిగణలోనికి తీసుకోబడవని.. అభ్యర్థులు గంట ముందే సంబంధిత కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఎలా ంటి అక్రమాలకు పాల్పడకుండా పరీక్షా కేంద్రాల్లో వీడియో చిత్రీకరణతోపాటు అభ్యర్థుల వేలిముద్రలతో హాజరు తీసుకుంటున్నట్లు చెప్పారు. అభ్యర్థులు బ్లూ, బ్లాక్బాల్పాయింట్ పెన్నులు మాత్రమే వినియోగించాలంటూ..వీఆర్వో పరీక్షకు 15,171, వీఆర్ఏ పరీక్షకు 3,673 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. పరీక్షాకేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేయాలని పోలీసు విభాగాన్ని ఆదేశించారు. పరీక్ష నిర్వహణలో 31 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, ఆరుగురు ఫ్లైయింగ్స్క్వాడ్, ఆరుగురు పరిశీలకులు, ఇద్దరు కోఆర్డినేటర్లు, 17 మంది లెజైన్ అధికారులు, 31మంది సహాయ లైజనింగ్ అధికారులను నియమించినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ సమావేశంలో ఏపీపీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ సీతాదేవి, డీఆర్వో అశోక్‌కుమార్, ఆర్డీవోలు నవ్య, కిషన్, డిప్యూటీ కలెక్టర్లు,తహశీల్దార్లు పాల్గొన్నారు.