- వీఆర్వో, వీఆర్‌ఏ పరీక్షలకు ‘నిమిషం’ నిబంధన
- అభ్యర్థులు గంటముందే కేంద్రాలకు చేరుకోవాలి..
- పరీక్షా కేంద్రాల్లో వీడియో చిత్రీకరణ, అభ్యర్థుల వేలిముద్రలు
- సమీక్ష సమావేశంలో కలెక్టర్ వెల్లడి
కలెక్టరేట్,న్యూస్‌లైన్: జిల్లాలో ఆదివారం జరిగే వీఆర్వో,వీఆర్‌ఏ పరీక్షల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. ఎలాంటి లోపాలు, ఇబ్బందుల్లేకుండా పరీక్ష సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎంకే మీనా అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించిన సమీక్షను శుక్రవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో సంబంధిత శాఖాధికారులతో సమీక్షించి పలు సూచనలు ఇచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆదివారం ఉదయం వీఆర్‌వో, మధ్యాహ్నం వీఆర్‌ఏ పరీక్షలు ఉంటాయని, నగరంలో వీఆర్వో పరీక్షకు 31 కేంద్రాలు, వీఆర్‌ఏ పరీక్షకు 8 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
అభ్యర్థులు పరీక్షా కేంద్రం లోకి ఒక్కనిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించేది లేదని స్పష్టంచేశారు. వైట్నర్,ఎరైజర్ ఉపయోగించబడిన జవాబుపత్రాలు పరిగణలోనికి తీసుకోబడవని.. అభ్యర్థులు గంట ముందే సంబంధిత కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఎలా ంటి అక్రమాలకు పాల్పడకుండా పరీక్షా కేంద్రాల్లో వీడియో చిత్రీకరణతోపాటు అభ్యర్థుల వేలిముద్రలతో హాజరు తీసుకుంటున్నట్లు చెప్పారు. అభ్యర్థులు బ్లూ, బ్లాక్‌బాల్‌పాయింట్ పెన్నులు మాత్రమే వినియోగించాలంటూ..వీఆర్‌వో పరీక్షకు 15,171, వీఆర్‌ఏ పరీక్షకు 3,673 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.
పరీక్షాకేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేయాలని పోలీసు విభాగాన్ని ఆదేశించారు. పరీక్ష నిర్వహణలో 31 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, ఆరుగురు ఫ్లైయింగ్‌స్క్వాడ్, ఆరుగురు పరిశీలకులు, ఇద్దరు కోఆర్డినేటర్లు, 17 మంది లెజైన్ అధికారులు, 31మంది సహాయ లైజనింగ్ అధికారులను నియమించినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ సమావేశంలో ఏపీపీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ సీతాదేవి, డీఆర్వో అశోక్‌కుమార్, ఆర్డీవోలు నవ్య, కిషన్, డిప్యూటీ కలెక్టర్లు,తహశీల్దార్లు పాల్గొన్నారు.