VRO and VRA
-
వీఆర్వో, వీఆర్ఏలకు గుడ్ న్యూస్!
సాక్షి,అమరావతి: రాష్ట్రంలో అర్హత కలిగిన వీఆర్వోలకు పదోన్నతులు కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరినట్లు ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్ర రాజు తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సంఘం ప్రతినిధులు మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద రవీంద్రరాజు మాట్లాడారు. ప్రస్తుతం వీఆర్వోల పదోన్నతుల్లో 40 శాతం రేషియో అమల్లో ఉందని, దీంలో చాలా మంది వీఆర్వోలకు సీనియర్ సహాయకుల పోస్టులు రావడం లేదన్నారు. వీఆర్వోల పదోన్నతుల్లో 70 శాతం రేషియో ఇవ్వాలని కోరారు. విధి నిర్వహణలో ఎవరైనా వీఆర్వో చనిపోతే అతని కుటుంబసభ్యులకు కారుణ్య నియామకాలు ద్వారా ఉద్యోగం ఇవ్వాలని కోరామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏ నుంచి వీఆర్వోకు అర్హత కల్గిన 1,500 మందికి అర్హత పరీక్ష నిర్వహించి వీఆర్వోలుగా పదోన్నతి కల్పించాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. తాము లేవనెత్తిన అంశాలపై సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకటరామిరెడ్డి, ఏపీ గ్రామ రెవిన్యూ అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పలనాయుడు, ఏపీ రెవెన్యూ జేఏసీ చైర్మన్ వీఎస్ దివాకర్, సీఆర్పీ రాష్ట్ర అధ్యక్షుడు గోవర్దన్ తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: టీచర్ల వల్లే విద్యార్థులకు మంచి భవిత -
తహసీల్దార్ వేధింపులు భరించలేకపోతున్నాం
కూసుమంచి,ఖమ్మం : తహసీల్దార్ కృష్ణ వేధింపులను భరించలేకపోతున్నామని గురువారం మండలంలోని వీఆర్ఓలు, వీఆర్ఏలు సామూహికంగా విధులను బహిష్కరించారు. అనంతరం ఖమ్మం వెళ్లి ఆర్డీఓ పూర్ణచంద్రకు వినతిపత్రం రూపంలో తమ గోడును చెప్పుకున్నారు. తహసీల్దార్ తీరు మారేంత వరకు తాము విధులకు రాబోమని తేల్చి చెప్పారు. తొలుత వీరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వీఆర్ఓల సంఘం మండల అధ్యక్షుడు షేక్ నాగులుమీరా విలేకరులతో మాట్లాడుతూ.. కూసుమంచి తహసీల్దార్ కృష్ణ వీఆర్ఓలు, వీఆర్ఓలను తీవ్రంగా వేధిస్తున్నారన్నారు. తమకు జీతాలు కూడా సక్రమంగా అందకుండా చేస్తున్నారని ఆరోపించారు. పని ఉన్నా లేకున్నా అర్థరాత్రి వరకు ఆఫీసులోనే ఉంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాకుండా సిబ్బంది పట్ల తహసీల్దార్ ప్రవర్తన ఏమాత్రం బాగాలేదన్నారు. గతంలో భూ రికార్డుల ప్రక్షాళన, రైతుబంధు పథకం సమయంలో తాము ప్రభుత్వ ఆదేశాల మేరకు రేయింబవళ్లు కష్డపడి పనిచేశామని, ఇప్పుడు ఆ పరిస్థితులు లేకున్నా రాత్రి వరకు ఆఫీసులోనే ఉంచుతున్నారని వాపోయారు. ఉదయం 8 గంటలకు ఆఫీసుకు వచ్చి సాయంత్రం 6 గంటలకు ఇంటికి వెళతామని విన్నవించుకున్నా ససేమిరా అంటున్నారన్నారు. ఉదయం 6 గంటలకే కార్యాలయానికి వచ్చి రాత్రి 10 వరకు ఉండాలని ఆదేశిస్తున్నారని చెప్పారు. అనంతరం వీఆర్ఓల ఆందోళనకు మద్దతు తెలిపిన సంఘం రాష్ట్ర నాయకుడు గరికె ఉపేందర్‌రావు మాట్లాడుతూ.. తహసీల్దారు తీరును తప్పుబట్టారు. తమకు కూడా ఇతర ఉద్యోగుల వలె అన్ని హక్కులూ ఉంటాయన్నారు. ప్రభుత్వ పాలనలో తామే కీలకం కాబట్టి కొన్ని సమాయా ల్లో అదనంగా పనిచేయాల్సి వస్తోందన్నారు. దా న్ని అడ్డుపెట్టుకుని తహసీల్దారు కావాలని పనివత్తిడి పెంచి వీఆర్ఓలను, వీఆర్ఏలను మానసికం గా ఇబ్బంది పెట్టడం సరికాదని అన్నారు. తహసీల్దారు తీరుపై ఉన్నతాధికారులకు విన్నవిస్తామని అన్నారు. తీరు మార్చుకోకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వీఆర్ఓలు, వీఆర్ఏలు పాల్గొన్నారు. -
పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణా తరగతులు
ప్రతి పేద విద్యార్థి కల ప్రభుత్వ ఉద్యోగం సాధించటం. అందుకోసం అప్పుచేసి వేలకు వేలు కోచింగ్ సెంటర్లకు ఫీజుగా చెల్లిస్తూ, అరకొర వసతులతో, పస్తులతో తమ విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నారు యువత. వీరందరికీ ఒక మంచి భవిష్యత్తును నిర్మించాలనుకుని నడుం కట్టింది ఓ స్వచ్ఛంద సంస్థ. వీరికి ఉచిత తరగతులు నిర్వహిస్తూ, వసతితో కూడిన భోజన సౌకర్యం కల్పిస్తూ తమ సేవలందిస్తుంది. ఇప్పటిదాకా వంద మంది యువతీ, యువకులు వీరి శిక్షణను ఉపయోగించుకొని ఉద్యోగాలను సాధించారు. సాక్షి, నంద్యాల : నాగకృష్ణమ్మ ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ఆద్వర్యంలో ఏపీపిఎస్సీ నిర్వహించే గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, వీఆర్ఓ ఉద్యోగాలకు నాలుగు నెలల పాటు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించబడునని, కేవలం 100 మంది విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం కల్పించబడునని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు తెలిపారు. అలాగే రైల్వే బోర్డ్ నిర్వహించే గ్రూప్-సి, గ్రూప్-డి, రైల్వే పోలీసు ఉద్యోగాలకు జూన్ 15వ తేదీ తరగతులు నిర్వహిస్తామని, ఉపాధ్యాయ పరీక్షల కోసం టెట్, డీఎస్సీ తరగతులను జూన్ 21వ తేదీన తరగతులు ప్రారంభిస్తామని, ఈ అవకాశాన్ని ప్రతి పేద విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని సంస్థ నిర్వాహకులు గిరీష్ బాబు తెలిపారు. అభ్యర్థులకు తెల్లరేషన్ కార్డు కలిగి ఉంటే వారికి నెలకు 1000 స్టయిఫండ్(శిక్షణ భృతి) కల్పించబడునని, అలాగే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వసతితో పాటు బోజన సౌకర్యం కల్పించబడునని తెలిపారు. తరగతులు ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 6గం. వరకు నిర్వహిస్తామని, శిక్షణా కాలంలో ఉచిత స్టడీ మెటీరియల్ అందించబడునని సంస్థ ప్రధాన కార్యదర్శి తెలిపారు. అప్లికేషన్లు లభించు స్థలం..శ్రీ క్రిష్ణమ్మ స్టడీ సర్కిల్, నంద్యాల. మరింత సమాచారం కొరకు 99850 41168 నెంబర్‌ను సంప్రదించగలరు. -
వీఆర్ఓ, వీఆర్ఏ ఫలితాలు విడుదల
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఖాళీగా ఉన్న వీఆర్ఓ, వీఆర్ఏ పోస్టుల భర్తీ కోసం ఈనెల 2న నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను అధికారులు శనివారం ప్రకటించారు. జిల్లాలో 62 వీఆర్ఓ పోస్టులకు 76,179మంది, 177 వీఆర్ఏ పోస్టులకు 4519 మంది అభ్యర్థుల మార్కులను వెల్లడించారు. పరీక్ష నిర్వహణకు 200 కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యారణ్యపురి, న్యూస్‌లైన్ : శనివారం విడుదలైన విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (వీఆర్ఓ) ఉద్యోగాల ఫలితాల్లో ఖానాపురం మండలం రాగంపేటకు చెందిన ఎలగందుల శ్రీకాంత్ 98 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఆయన ఖానాపురంలో ఇంటర్ వరకు చదువుకున్నారు. ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడంతో రెగ్యులర్‌గా చదువుకోకుండా హైదరాబాద్‌లో పార్ట్‌టైం ఉద్యోగం చేసుకుంటూ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ(బీఏ) పూర్తిచేశారు. 2012 సంవత్సరంలో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. అయి తే ఆప్షన్‌గా ఫైర్‌మెన్‌గా ఉద్యోగం పొందారు. శ్రీకాంత్ ప్రస్తుతం జనగామలో ఫైర్‌మెన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే శ్రీకాంత్ ఈ ఏడాది ఫిబ్రవరి 2న జరిగిన వీఆర్వో పరీక్ష రాసి జిల్లా టాపర్‌గా నిలిచారు. ‘గ్రూప్-1 ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నా.అరుుతే గ్రూపు-2 కోసం ప్రిపేర్ అవుతున్న దశలో వీఆర్వో ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడంతో దీనికి దరఖాస్తు చేశాను. గ్రూపు-2కు ప్రిపేర్ కావడం కూడా తనకు ఈవీఆర్వో పరీక్షకు ఉపయోగపడింది. పోలీస్ కానిస్టేబుల్‌కు ఎంపికైనప్పుడు తనకు సివిల్, ఫైర్స్టేషన్లలో ఉద్యోగాలకు అవకాశం రాగా ఫైర్‌మెన్ ఉద్యోగిగా ఆప్షన్ తీసుకొని పనిచేస్తున్నాను. వీఆర్వో రాతపరీక్షకు హాజరై 99 మార్కులకు గాను 98 మార్కులతో టాపర్‌గా నిలవడం సంతోషంగా ఉంది. ఫైర్‌మెన్ నుంచి వీఆర్వోగా విధుల్లో చేరుతాను. అయితే ఇది కూడా చిరుద్యోగమే అయినా ఫైర్ మెన్ కంటే కొంత ప్రశాంతంగా ఉంటుంది. వీఆర్వో ఉద్యోగంతోనే సరిపుచ్చుకోవాలని లేదు. గ్రూప్-1 ఉద్యోగాన్ని సాధించాలనే తపన ఉంది. ఆ దిశగా ప్రిపరేషన్ కొనసాగిస్తాను’ అని శ్రీకాంత్ చెప్పారు. -
వీఆర్వో, వీఆర్ఏ ఫలితాలు విడుదల
జిల్లా టాపర్లు సీతామహాలక్ష్మి, గోపాలరావు 1 : 3 నిష్పత్తిలో ఇంటర్వ్యూలు 27న సర్టిఫికెట్ల పరిశీలన మెరిట్ లిస్ట్ నేడో, రేపో మచిలీపట్నం, న్యూస్‌లైన్ : వీఆర్వో, వీఆర్ఏ పరీక్షా ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి శనివారం విడుదలృచేశారు. ఈ నెల రెండున ఈ పరీక్షలు నిర్వహించారు. మొత్తం వంద మార్కులకు జరిగిన వీఆర్వో పరీక్షల్లో గంపలగూడెం మండలం నెమలి గ్రామానికి చెందిన సీహెచ్ సీతామహాలక్ష్మి 96 మార్కులతో, వీఆర్ఏ పరీక్షల్లో ఎ.కొండూరు మండలం చీమలపాడుకు చెందిన గుండ్రు గోపాలరావు 92 మార్కులతో జిల్లా టాపర్లుగా నిలిచారు. గోపాలరావు వీఆర్వో పరీక్షలోనూ 92 మార్కులతో 40వ స్థానంలో నిలిచాడు. వీఆర్వో పరీక్షలో పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటకు చెందిన ఎం.గోపాలకృష్ణ (95 మార్కులు), ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన అల్లాడ నళినికుమార్ (95 మార్కులు), అవనిగడ్డకు చెందిన కమ్మిలి హరిబాబు (94 మార్కులు), గూడూరు మండలం కప్పలదొడ్డి గ్రామానికి చెందిన బొద్దుల నాగరాజు (94 మార్కులు) సాధించి మొదటి ఐదు స్థానాల్లో నిలిచారు. వీఆర్ఏ పరీక్ష ఫలితాల్లో మచిలీపట్నం మండలానికి చెందిన ముదినేని గాయత్రిదేవి (91 మార్కులు), ఎ.కొండూరు చీమలపాడుకు చెందిన నన్నెబోయిన గోపీకృష్ణ (91 మార్కులు), కోడూరు మండలం విశ్వనాథపల్లికి చెందిన సీహెచ్ వెంకటనారాయణ (91 మార్కులు), జగ్గయ్యపేట మండలం అన్నవరం దాచేపల్లి రమేష్ (91 మార్కులు), జగ్గయ్యపేట మండలం అన్నవరానికి చెందిన దాచేపల్లి శ్రీను (91 మార్కులు)తో తర్వాతి స్థానాలు సాధించారు. ర్యాంకుల ఆధారంగా ఇంటర్వ్యూలు... జిల్లాలో ఖాళీగా ఉన్న 64 వీఆర్వో, 403 వీఆర్ఏ పోస్టులను భర్తీ చేసేందుకు ఈ నెల 2న పరీక్షలు నిర్వహించారు. వీఆర్వో పరీక్షకు 59,024 మంది దరఖాస్తు చేసుకోగా 52,119 మంది, వీఆర్ఏ పరీక్షకు 7,542 మంది దరఖాస్తు చేసుకోగా 6,684 మంది హాజరయ్యారు. అభ్యర్థులకు వచ్చిన ర్యాంకుల ఆధారంగా ఇంటర్వ్యూలకు పిలుస్తామని రెవెన్యూ అధికారులు తెలిపాయి. ఈ నెల 27 నాటికి పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి పీకే మహంతి జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల వారీగా వీఆర్వో, వీఆర్ఏ మెరిట్ జాబితాలను శనివారం కలెక్టర్లకు పంపించిన ఆయన ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలపై పలు సూచనలు చేశారు. ఆన్లైన్ వ్యవస్థను పటిష్టంగా ఉపయోగించుకుని పారదర్శకంగా పోస్టుల భర్తీ ప్రక్రియ నిర్వహించాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 27న మచిలీపట్నం జిల్లా కలెక్టరేట్లో అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టనున్నారు. నేడో, రేపో మెరిట్ లిస్ట్... రాష్ట్రంలోని వీఆర్వో, వీఆర్ఏ పోస్టుల భర్తీలో భాగంగా ఫలితాలను ప్రకటించిన ప్రభుత్వం ఇందుకు సంబంధించి జిల్లాల వారీగా భర్తీ ప్రక్రియకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. జిల్లాలోని పోస్టులు, అభ్యర్థుల మార్కులు, ర్యాంకుల వారీగా మెరిట్ లిస్టును ఆది, సోమవారాల్లో ప్రకటించే అవకాశం ఉందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అనంతరం పోస్టుల భర్తీ ప్రక్రియ ఇలా ఉంటుంది. జిల్లాలో 64 వీఆర్వో పోస్టులు ఉండగా వాటిలో ఓపెన్ కేటగిరీలో 18 పోస్టులు, ఓసీ మహిళా కోటాలో 9, ఎస్సీలకు 5, ఎస్సీ మహిళ 3, ఎస్టీలకు 2, ఎస్టీ మహిళలకు 2, బీసీ-ఏ 4, బీసీ-ఏ మహిళలకు 1, బీసీ-బీ 4, బీసీ-బీ మహిళలకు 3, బీసీ-సీ 1, బీసీ-డీ 3, బీసీ-డీ మహిళలు 2, బీసీ-ఈ 2, బీసీ-ఈ మహిళకు 1, మాజీ సైనికుల కోటాలో 2, ఓసీ వీహెచ్ 1, ఓసీ ఓహెచ్ 1 చొప్పున పోస్టులను కేటాయించారు. వీఆర్ఏల భర్తీ ప్రక్రియ మండలాలవారీగా నిర్వహిస్తారు. -
వీఆర్ఓ, వీఆర్ఏ ఫలితాలు విడుదల: మహంతి
హైదరాబాద్: గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్ఓ), గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ) పరీక్ష ఫలితాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి శనివారం విడుదల చేశారు. ఈ ఫలితాల వివరాల జాబితాను ccla.cgg.gov.in వెబ్సైట్లో ఉంచామని ఆయన అన్నారు. వీఆర్ఓ, వీఆర్ఏ పరీక్ష ఫలితాల జాబితాను జిల్లా కలెక్టర్లకు పంపించామని మహంతి చెప్పారు. అయితే ఈ నెల 2న జరిగిన ఈ పరీక్షలకు 14లక్షల మందిపైగా విద్యార్థులు హాజరైన సంగతి తెలిసిందే. వీఆర్ఓ పరీక్ష రాసిన అభ్యర్థులు 88,609 లక్షల మంది కాగా, వీఆర్ఏ పరీక్ష రాసిన అభ్యర్థులు 11.84 లక్షల మంది హాజరైనట్టు మహంతి తెలిపారు. ఈ నెల 27లోగా ఉత్తీర్ణులైన వారి ధృవీకరణ పత్రాలు పరీశీలించనున్నట్టు మహంతి పేర్కొన్నారు. వీఆర్వో, వీఆర్ఏ ఫలితాల్లో మొదటి మూడు ర్యాంకులలో నిలిచిన అభ్యర్ధుల వివరాలు.. వీఆర్వో ఫలితాల్లో... చిత్తూరు జిల్లాకు చెందిన నరేందర్‌రెడ్డి మొదటి ర్యాంకు సాధించగా, నల్గొండ జిల్లాకు చెందిన శ్యాంసుందర్ రెడ్డికి రెండో ర్యాంకు, అనంతపురం జిల్లాకు చెందిన యోగానందరెడ్డి మూడో ర్యాంకు సాధించాడు. వీఆర్ఏ ఫలితాల్లో... అనంతపురం జిల్లాకు చెందిన ప్రభాకర్ మొదటి ర్యాంకు సాధించగా, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కృష్ణారావుకు రెండో ర్యాంకు, నిజామాబాద్ జిల్లాకు చెందిన రామకృష్ణ మూడో ర్యాంకు సాధించాడు. -
నేడే వీఆర్వో, వీఆర్ఏ ఫలితాలు
శనివారం మధ్యాహ్నం నుంచి వెబ్సైట్లలో 24 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 28 నాటికి ప్రాథమిక నియామకాలు పూర్తి సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వో), గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ) పరీక్షల ఫలితాలు శనివారం విడుదలకానున్నాయి. 1,657 వీఆర్వో, 4,305 వీఆర్ఏ పోస్టుల భర్తీకి ఈ నెల 2న జరిగిన రాత పరీక్షలకు మొత్తం 12,72,843 మంది హాజరయ్యారు. వీటికి సంబంధించిన ఫలితాలను శనివారం మధ్యాహ్నం సీసీఎల్ఏ వెబ్సైట్లో పెడతామని రెవెన్యూ ఉన్నతాధికారులు తెలిపారు. 2వ తేదీన జరిగిన ఈ పరీక్షలకు సంబంధించి నాలుగో తేదీన వెబ్సైట్ ద్వారా ప్రాథమిక ‘కీ’ ప్రకటించి అభ్యంతరాలు స్వీకరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) అధికారులు ఈనెల 10న ఫైనల్ ‘కీ’ ప్రకటించారు. వీఆర్వో పరీక్షలకు సంబంధించి ఒక ప్రశ్నను తొలగించడమే కాకుండా మరో ప్రశ్నకు రెండు సమాధానాల్లో ఏది సూచించినా మార్కు ఇవ్వాలని నిర్ణయించారు. దీని ప్రకారం వీఆర్వో, వీఆర్ఏ ఫలితాలను రూపొం దించిన ఏపీపీఎస్సీ అధికారులు శుక్రవారం సాయంత్రం ఫలితాల సాఫ్ట్ కాపీలను రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనరేట్ అధికారులకు అందజేశారు. అభ్యర్థుల ప్రయోజనార్థం ఈ ఫలితాలను శనివారం మధ్యాహ్నం రెండు గంటల్లోగా ఛిఛ్చి.ఛిజజ.జౌఠి.జీ, ఝ్ఛ్ఛట్ఛఠ్చి.జౌఠి.జీ వెబ్సైట్లలో పెట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వెబ్సైట్లో వీఆర్వో, వీఆర్ఏ ఫలితాలు క్లిక్ చేసి హాల్‌టికెట్ నంబరు ఫీడ్ చేయడం ద్వారా అభ్యర్థులు తమకు వచ్చిన మార్కులు తెలుసుకోవచ్చు. 24 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ) ప్రతినిధులు రిజర్వేషన్ల కేటగిరీల వారీగా ఖాళీలను బట్టి పోస్టులకు ఎంపికైన వారి వివరాల జాబితాను ప్రకటిస్తారు. ఎంపికైన అభ్యర్థుల మొబైల్ నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించడంతోపాటు ఎస్సెమ్మెస్ కూడా పంపుతారు. ఈ నెల 24, 25 తేదీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసి 28వ తేదీలోగా ప్రాథమిక నియామక ప్రక్రియ పూర్తి చేస్తారు. ఈ మేరకు సీసీఎల్ఏ అధికారులు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. వచ్చే నెల మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నందున ఆ లోగా వీఆర్వో, వీఆర్ఏ నియామక ప్రక్రియ పూర్తి చేయాలనే ఉద్దేశంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపితే ఆలస్యమవుతుందనే భావంతోనే ఫోన్ ద్వారా సమాచారం అందించి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పిలిపించాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. ఫలితాలు అందుబాటులో ఉండే వెబ్సైట్లు ccla.cgg.gov.in, www.meeseva.gov.in గందరగోళం వల్లే వాయిదా! వాస్తవానికి శుక్రవారం సాయంత్రమే వీఆర్వో, వీఆర్ఏ పరీక్షల ఫలితాలను వెబ్సైట్లలో పెట్టేందుకు సీసీఎల్ఏ అధికారులు ప్రయత్నించారు. అయితే ఏపీపీఎస్సీ అందించిన ఫలితాల సాఫ్ట్ కాపీ గందరగోళంగా ఉండటంతో ఈ ప్రయత్నాన్ని చివరి నిమిషంలో వాయిదా వేశారు. ఏపీపీఎస్సీ అధికారులు ఇచ్చిన ఫలితాలను (జిప్ ఫైల్) యథాతథంగా వెబ్సైట్లో పెడితే అభ్యర్థులు రకరకాల ఆప్షన్లు క్లిక్ చేయాల్సి వస్తుంది. ఈ పరీక్షలకు హాజరైన వారిలో అత్యధికులు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారే. ఇన్ని ఆప్షన్లు క్లిక్ చేసి ఫలితాలు తెలుసుకోవాలంటే గందరగోళం ఏర్పడుతుంది. ఇది కచ్చితంగా అభ్యర్థులను ఇబ్బందిపెట్టడమే అవుతుందని రెవెన్యూ అధికారులు నిర్ధారణకు వచ్చారు. అందువల్ల అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్ ఫీడ్ చేస్తే మార్కులు వచ్చేలా సరళంగా మార్చి శనివారం మధ్యాహ్నానికి ఫలితాలను వెబ్సైట్లలో పెట్టాలని నిర్ణయించారు. రేపు పంచాయతీ కార్యదర్శి పరీక్ష రాష్ట్రంలో 2,677 పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి ఈనెల 23న రాత ప రీక్ష నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 2,406 కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షకు హాజరయ్యేందుకు 8.15 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. -
వీఆర్వో పరీక్షలు ప్రశాంతం
-
అదృష్ట ‘పరీక్ష’!
చిరు ఉద్యోగానికి ఎన్ని వ్యయప్రయాసలో.. వీఆర్ఓ, వీఆర్ఏ పరీక్షలు ప్రశాంతం జిల్లాలో 89.34 శాతం హాజరు సుదూరం నుంచి తరలివచ్చిన అభ్యర్థులు కిక్కిరిసిన పరీక్షా కేంద్రాలు సంగారెడ్డి/కలెక్టరేట్, న్యూస్‌లైన్: నిరుద్యోగ యువతీయువకులు కడలి ప్రవాహంలా కదిలొచ్చారు. ఉద్యోగన్వేషణలో విసిగివేసారిన నిరుద్యోగులు రాకరాక వచ్చిన ఒక్క అవకాశాన్ని ఒడిసి పట్టుకోడానికి హోరాహోరీగా పోటీపడ్డారు. ఒక్కసారిగా వందలు, వేల సంఖ్యలో తరలివచ్చి అదృష్టాన్ని ‘ప రీక్షించుకున్నారు’. చిరుద్యోగమైనా ప్రభుత్వ ఉద్యోగమే నయమని భావించి వ్యయప్రయాసలు పడ్డారు. ఆదివారం నిర్వహించిన వీఆర్ఓ, వీఆర్ఏ పరీక్షలకు మొత్తం 60,477 మంది హాజరు కావాల్సి ఉండగా, 54,034 మంది పరీక్ష రాయడంతో జిల్లాలో 89.34 శాతం హాజరు నమోదైంది. సిద్దిపేటలోని ఓ పరీక్ష కేంద్రంలో ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తూ అక్కాతమ్ముళ్లు అధికారులకు పట్టుబడ్డారు. వీరిపై స్థానిక పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ ఘటన మినహా జిల్లాలో పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. వీఆర్ఓకు 57,834 మంది దరఖాస్తు చేసుకోగా 51,731 మంది పరీక్ష రాశారు. దీంతో 89.44 శాతం హాజరు నమోదైంది. 6,102 మంది గైర్హాజరయ్యారు. వీఆర్ఏకు 2,643 మంది దరఖాస్తు చేసుకోగా 2,302 మంది పరీక్ష రాశారు. 87.09 శాతం హాజరు నమోదైంది. 341 మంది హాజరుకాలేదు. కష్టనష్టాలకు ఓర్చి.. నిరుద్యోగ యువతీయువకులను ఊరించిన వీఆర్ఓ, వీఆర్ఏ ఉద్యోగాల రాత పరీక్షకు భారీ స్పందన లభించింది. సుదూర ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలుండటంతో అభ్యర్థులు కష్టనష్టాలు ఓర్చి ఎట్టకేలకు పరీక్ష రాశారు. కొందరు అభ్యర్థులు ముందు జాగ్రత్తగా ఒక రోజు ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకుని బస్టాండ్లు, లాడ్జీల్లో బస చేశారు. చాలామంది అద్దె వాహనాల్లో వచ్చి పరీక్షలు రాశారు. బస్సులు సమయానికి రాకపోవడంతో కొందరు అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకోలేకపోయారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించవద్దనే నిబంధన మేరకు అధికారులు వీరిని పరీక్ష రాయడానికి అనుమతించలేదు. పరీక్షలు జరిగే ప్రాంతాలకు వెళ్లే బస్సులన్నీ కిక్కిరిసిపోయి కనిపించాయి. ఒక్కసారిగా వేల మంది తరలిరావడంతో హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో ఆహార పదార్థాలు లభ్యం కాక ఇబ్బంది పడ్డారు. కలెక్టర్ సందర్శన కలెక్టర్ స్మితా సబర్వాల్ సంగారెడ్డి పట్టణంలోని సెయింట్ ఆంథోని పాఠశాల, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, మండల పరిధిలోని ఎంఎన్ఆర్ కళాశాలను సందర్శించి పరీక్షల నిర్వహణను పరిశీలించారు. కరుణ హైస్కూల్లో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ తనిఖీ చేశారు. సమీకృత కలెక్టరేట్ ఆవరణలోని సెయింట్ ఆంథోనీ పాఠశాల కేంద్రాన్ని సాంఘిక సంక్షేమ శాఖ సంయుక్త సంచాలకులు శ్రీనివాస్‌రెడ్డి తనిఖీ చేశారు. -
ఒక్క చోట గందరగోళం.. వీఆర్వో పరీక్ష ప్రశాంతం
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: ఒక్కచోట మినహాయిస్తే నగరంలో వీఆర్వో పరీక్ష ప్రశాంతంగా, సాఫీగా ముగిసింది. ఏపీపీఎస్సీ నిర్వాకం కారణంగా నగరంలోని అక్కయ్యపాలెంలోగల జ్ఞాన నికేతన్ స్కూల్లో వీఆర్వో పరీక్ష ప్రారంభంలో గందరగోళం చోటు చేసుకుంది. అభ్యర్థులకు చెమటలు పట్టించింది. అధికారులను పరుగులు పెట్టించింది. అభ్యర్థుల సంఖ్య కన్నా తక్కువగా ప్రశ్నపత్రాలను పంపించడంతో ఈ కేంద్రంలో పరీక్ష ఆలస్యమైంది. అభ్యర్థులు ఆందోళనకు దిగారు. అధికారులు హైరానా పడి ఇతర కేంద్రాల నుంచి ప్రశ్నపత్రాలను తీసుకువచ్చి పరీక్ష నిర్వహించారు. ఈ సంఘటన మినహా మిగిలిన కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో 41 వీఆర్వో, 12 వీఆర్ఏ పోస్టులకు ఆదివారం 39 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. వీఆర్వో పరీక్షకు మొత్తం 21,284 మంది దరఖాస్తు చేసుకోగా 19,160 మంది (90.1 శాతం) పరీక్షకు హాజరయ్యారు. అలాగే మధ్యాహ్నం జరిగిన వీఆర్ఏ పరీక్షకు 888 మంది అభ్యర్థులలో 738 మంది (83.1 శాతం) పరీక్ష రాశారు. కలెక్టర్ ఆరోఖ్య రాజ్, జేసీ ప్రవీణ్‌కుమార్ పరీక్ష కేంద్రాలకు వెళ్లి నిర్వహణను పరిశీలించారు. -
పరీక్ష.. ప్రశాంతం..
సాక్షి, విజయవాడ : వీఆర్వో, వీఆర్ఏ పరీక్షలు ఆదివారం నగరంలో ప్రశాంతంగా ముగిశాయి. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ పరీక్ష సజావుగా సాగింది. నగరంలో 115 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. వీటిపై కలెక్టర్ ముందస్తుగానే సమీక్ష నిర్వహించి వివిధ విభాగాల అధికారులకు ప్రత్యేక విధులు కేటాయించారు. పరీక్ష పత్రాల పంపిణీ మొదలుకుని జవాబు పత్రాలను ప్రత్యేక బందోబస్తు నడుమ హైదరాబాద్ పంపటం వరకు అన్ని విషయాల్లో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. జిల్లాలో మొత్తం 64 వీఆర్వో పోస్టులకు గానూ 59,024 మంది, 403 వీఆర్ఏ పోస్టులకు గానూ 7,542 మంది దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన వారికి సైతం నగరంలోనే పరీక్ష సెంటర్లు కేటారుుంచారు. వీఆర్వో పరీక్షకు 52,119 మంది హాజరుకాగా, 6,905 మంది గైర్హాజరయ్యూరు. వీఆర్ఏ పరీక్షకు 6,684 మంది హాజరు కాగా, 908 మంది గైర్హాజరయ్యూరు. వీఆర్వోకు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, వీఆర్‌కు మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. పరీక్షా మెటీరియల్ పంపిణీ ఆదివారం ఉదయం 5 గంటలకు అర్బన్ తహశీల్దార్ కార్యాలయంలో కలెక్టర్ ఎం.రఘునందనరావు పరీక్ష మెటీరియల్‌ను పరిశీలించి చీఫ్ సూపరింటెండెంట్లు, జోనల్, రూట్ ఆఫీసర్లకు అందజేశారు. వాటిని ప్రత్యేక వాహనాల్లో ఉదయం 8 గంటలకు పరీక్ష కేంద్రాలకు తరలించారు. కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ జె.మురళీ, సబ్ కలెక్టర్లు దాసరి హరిచందన, చక్రధరరావు, డీఆర్వో ఎల్.విజయ్‌చందర్, జెడ్పీ సీఈవో సుబ్బారావు పరీక్షా మొటీరియల్ పంపిణీని, కేంద్రాలను సందర్శించారు. కలెక్టర్ పరిశీలన నగరంలోని బిషప్ హజరత్తయ్య ఉన్నత పాఠశాల, సిద్ధార్థ అకాడమీ, పీజీ సెంటర్లోని పరీక్షా కేంద్రాల్ని కలెక్టర్ రఘునందనరావు పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, ఎక్కడా చిన్నపాటి ఇబ్బంది కూడ తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. జవాబు పత్రాల కవర్లకు అక్కడే సీల్‌వేసి పోలీసు భద్రత నడుమ అర్బన్ తహశీల్దార్ కార్యాలయూనికి చేర్చారని, అక్కడి నుంచి పబ్లిక్ సర్వీసు కమిషన్ అధికారులు, పోలీసు బందోబస్తు నడుమ హైదరాబాద్‌కు పంపామని చెప్పారు. -
నేడే వీఆర్వో, వీఆర్ఏ రాతపరీక్ష
కొన్ని సూచనలు.. నిమిషం లేటైనా అనుమతించరు గంట ముందుగా పరీక్షాకేంద్రానికి చేరుకోవాలి 20 నిమిషాల ముందు హాల్లోకి అనుమతిస్తారు ఓఎంఆర్‌పై వైట్నర్, ఎరేజర్లు వాడకూడదు బ్లూ/బ్లాక్ బాల్‌పాయింట్ పెన్నులే వాడాలి వీడియోగ్రఫీతో పటిష్ట పర్యవేక్షణ సాక్షి, సిటీబ్యూరో: జంటనగరాల్లో ఆది వారం జరిగే వీఆర్ఓ, వీఆర్ఏ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధుల కోసం 280 ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఈడీ ఎ.కోటేశ్వర్రావు ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలు జరిగే వేళలు... ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు, అలాగే సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు ఈ ప్రత్యేక బస్సులు నడుస్తాయి. బస్సులపై ‘వీఆర్ఓ అండ్ వీఆర్ఏ’ అనే డెస్టినేషన్ బోర్డులు ఉంటాయి. నగరంలోని అన్ని ప్రధాన ప్రాంతాల నుంచి ఇవి బయలుదేరుతాయి. ప్రత్యేక బస్సులు నడిచే ప్రాంతాలివే... సికింద్రాబాద్-కోఠీ, సికింద్రాబాద్-ఆఫ్జల్‌గంజ్, ఈసీఐఎల్-ఆఫ్జల్‌గంజ్, మెహదీపట్నం-సికింద్రాబాద్, రీసాలాబజార్-అబిడ్స్, జీడిమెట్ల-కోఠీ, సికింద్రాబాద్-సనత్‌నగర్, ఉప్పల్-సికింద్రాబాద్, నాంపల్లి-సికింద్రాబాద్, జగద్గిరిగుట్ట-సికింద్రాబాద్, ఈసీఐఎల్-సికింద్రాబాద్, హనుమాన్‌పేట్-సికింద్రాబాద్, కోఠీ-సికింద్రాబాద్, కోఠీ-సనత్‌నగర్, మెహదీపట్నం-చార్మినార్, హయత్‌నగర్-బహదూర్‌పురా, ఉప్పల్-మెహదీపట్నం, దిల్సుఖ్ నగర్-పటాన్చెరు, ఎల్బీనగర్-మెహదీపట్నం, రాంనగర్-మెహదీపట్నం, మిధానీ-సికింద్రాబాద్, మధుబన్‌కాలనీ-సికింద్రాబాద్, ఎల్బీనగర్-సికింద్రాబాద్ తదితర మార్గాలు. ఓయూ నుంచి గ్రామాలకు... ఉస్మానియా యూనివర్సిటీ: కాగా, ఈ పరీక్షల కోసం ఓయూ క్యాంపస్ నుంచి సుమారు 8 వేల మంది విద్యార్థులు తమతమ గ్రామాలకు తరలివెళ్లారు. ఈ ఉద్యోగాలకు అర్హత ఇంటరే అయినా... ఇంజినీరింగ్, లా, బీఈడీ, పీజీ, పీహెచ్డీ తదితర ఉన్నత విద్య అభ్యశిస్తున్నవారు కూడా పోటీపడుతుండటం విశేషం. -
సర్వం సిద్ధం
నేడు వీఆర్వో, వీఆర్ఏ పరీక్షలు పరీక్ష కేంద్రాల్లో వీడియో కవరేజ్ నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ చిత్తూరు(జిల్లాపరిషత్), న్యూస్‌లైన్: జిల్లాలో ఆదివారం జరగనున్న వీఆర్వో, వీఆర్ఏ పరీక్షల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్ష గదిలోకి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. జిల్లాలో 104 వీఆర్వో, 188 వీఆర్ఏ పోస్టుల భర్తీకి గత ఏడాది డిసెంబర్ 28న నోటిఫికేషన్ విడుదలైంది. పరీక్ష తేదీ ఫిబ్రవరి 2గా నిర్ణయించారు. చిత్తూరు, తిరుపతి, మదనపల్లె డివిజన్ కేంద్రాల్లో పరీక్షలు ఆదివారం నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. చిత్తూరులోని 35 కేంద్రాల్లో 14467 మంది, తిరుపతిలోని 70 కేంద్రాల్లో 38156 మంది, మదనపల్లెలోని 16 కేంద్రాల్లో 8975 మంది వీఆర్వో పరీక్ష రాయనున్నారు. వీఆర్ఏ పరీక్ష చిత్తూరులో మాత్రమే జరగనుంది. మొత్తం 2158 మంది రాయనున్నారు. వీఆర్వో, వీఆర్ఏ పరీక్షలను 750 మంది రాయనున్నారు. ఆలస్యమైతే అనుమతి లేదు వీఆర్వో పరీక్ష ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, వీఆర్ఏ పరీక్ష మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు జరగనుంది. నిర్దేశిత సమయానికి నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్ష గదిలోకి అనుమతించొద్దని జేసీ బసంత్‌కుమార్ పరీక్ష చీఫ్ సూపరింటెండెంట్లను ఆదేశించారు. ఈ పరిస్థితుల్లో అభ్యర్థులు తప్పనిసరిగా అర్ధగంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. పరీక్ష కేంద్రాల్లో వీడియో కవరేజ్ వీఆర్వో, వీఆర్ఏ పరీక్షలనిర్వహణ తీరును వీడియో కవరేజ్ చేయాలని రాష్ట్ర సీసీఎల్ఏ ఆదేశించారు. జేసీ ఆదేశాలమేరకు వీడియో కవరేజ్‌కు అవసర మై న ఏర్పాట్లను తహశీల్దార్లు పూర్తి చేశారు. మూడు డివిజన్ కే ంద్రాల పరిధిలో 130 వీడియో కెమెరాలు ఏర్పాటు చేసినట్లు డీఆర్వో శేషయ్య తెలిపారు. హాల్‌టికెట్‌లో ఫొటో సరిగా కనిపించకపోయినా, అసలు లేకపోయినా అభ్యర్థులు ఐడీ ప్రూఫ్‌తో 3 పాస్పోర్ట ఫొటోలు తీసుకురావాలని పేర్కొన్నారు. అధికారుల నియామకం: పరీక్ష నిర్వహణకు సంబంధించి అదనపు జిల్లా కోఆర్డినేటర్లుగా ముగ్గురు ఆర్డీవోలను, పరీశీలకులుగా 25 మంది జిల్లా అధికారులను నియమించారు. లైజన్ అధికారులుగా 25 మంది తహశీల్దార్లను, అసిస్టెంట్ చీఫ్ సూపరింటెండెంట్ అధికారులుగా 191 మంది తహశీల్దార్లు, ఎంపీడీవోలను, అసిస్టెంట్ లైజన్ అధికారులుగా 195 మందిని నియమించారు. -
నేడు వీఆర్వో, వీఆర్ఏ పరీక్ష
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు 200 కేంద్రాలు.. 80,758 అభ్యర్థులు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఏపీపీఎస్సీ ద్వారా జిల్లా లో ఆదివారం నిర్వహిస్తున్న వీఆర్వో, వీఆర్ఏ పరీక్షలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పా ట్లు పూర్తిచేసింది. మొత్తం వరంగల్ నగరంతోపాటు చుట్టుపక్కల ప్రదేశాల్లో 200 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసింది. వీఆర్వో పరీక్షకు 75179, వీఆర్ఏ పరీక్షకు 4579 అభ్యర్థులు హాజరుకానున్నారు. మొత్తం 62 వీఆర్వో, 177 వీఆర్ఏ పోస్టులకు పరీక్ష నిర్వహిస్తున్నారు. అభ్యర్థులకు సూచనలు, పాటించాల్సిన నియమాలపై అధికారులు ఇప్పటికే స్పష్టమైన ప్రకటన జారీచేశారు. పరీక్షాకేంద్రాలు, హాల్‌టికెట్ల విషయంలో సహాయం కోసం కలెక్టరేట్లోని టోల్ ఫ్రీ నెంబర్ 18004252757తోపాటు 0870-2510777 నంబర్లు అందుబాటులో ఉంటాయని డీఆర్వో సురేందర్ కరణ్ తెలిపారు. అభ్యర్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, పరీక్ష ప్రారంభమయ్యాక లోపలికి అనుమతించరని ఆయన స్పష్టం చేశారు. -
వీఆర్వో అభ్యర్థులకు బస్టాండ్‌లో హెల్ప్‌డెస్క్
గుంటూరు రూరల్, న్యూస్‌లైన్ :గుంటూరు నగరంలో, గుంటూరు రూరల్ మండల పరిధిలో ఏర్పాటు చేసిన వీఆర్ఓ, వీఆర్ఏ పరీక్ష కేంద్రాలలో రెవెన్యూ సిబ్బంది అందుబాటులో ఉండాలని తహాశీల్దార్ తాతా మోహన్‌రావు అన్నారు. స్థానిక లాడ్జిసెంటర్, మార్కెట్, బస్టాండ్, బీఆర్ స్టేడియం ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన హెల్ప్ డె స్క్ కేంద్రాలను తహశీల్దార్ తాతా మోహన్‌రావు సిబ్బందితో పరిశీలించారు. హెల్ప్ డెస్క్ కేంద్రం వద్ద శనివార ం రాత్రి 8 గంటల నుంచే రెవెన్యూ సిబ్బందిని ఏర్పాటుచేసినట్టు ఆయన తెలిపారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు వీఆర్వో, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు వీఆర్ఏ పరీక్షలు పూర్తయ్యేంతవరకు కూడా సిబ్బంది అందుబాటులో ఉండాలని తెలిపారు. దూరప్రాంతాల నుంచి పరీక్ష కేంద్రాలకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పరీక్ష కేంద్రాల వివరాలను అభ్యర్థులకు క్షుణ్ణంగా వివరించాలని తెలిపారు. ప్రతి హెల్ప్ డెస్క్ కేంద్రం వద్ద వీఆర్వోలను ఏర్పాటుచేశామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద కూడా రెవెన్యూ సిబ్బంది ఆయా పాఠశాలలు, కళాశాలల సిబ్బంది అందుబాటులో ఉండడంతో పాటు అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించారు. పరీక్షలు పూర్తయ్యేంతవరకు అందుబాటులో ఉండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత రెవెన్యూ సిబ్బందిదే అని చెప్పారు. గుంటూరు నగరంలో 63, రూరల్‌లో 14 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేసినట్టు తెలిపారు. ఈ కేంద్రాల్లో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా, సమాచారం కోసం 0863-2234070, ఆర్డీవో రామమూర్తి 9849904006 ,తహశీల్దార్ తాతా మోహన్‌రావు 9849904016 లకు ఫోన్ చెయ్యాల్సిందిగా కోరారు. పరీక్షా కేంద్రాలకు కేఎల్ వర్సిటీ ఉచిత బస్సులు గుంటూరుసిటీ, న్యూస్‌లైన్: వడ్డేశ్వరం కె.ఎల్.యూనివర్సిటీలో వీఆర్వో, వీఆర్ఏ పరీక్షలు హాజరయ్యే అభ్యర్థుల కోసం యూనివ ర్సిటీ యాజమాన్యం పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు ఉచిత బస్సులు ఏర్పాటు చేసినట్లు పరీక్షల జిల్లా కో ఆర్డినేటర్, జిల్లా రెవెన్యూ అధికారి కె.నాగబాబు శనివారం తెలిపారు. జాతీయ రహదారి వద్ద నుంచి బస్సులు కేఎల్ వర్సీటీ పరీక్షా కేంద్రానికి చేరవేస్తాయన్నారు. అలాగే నంబూరు వీవీఐటీ కళాశాల యాజమాన్యం కూడా ఉచిత బస్సులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. -
వీఆర్వో.. వీఆర్ఏ నేడు పరీక్ష
అన్ని ఏర్పాట్లూ పూర్తి నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ భారీ పోలీసు బందోబస్తు విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : విజయవాడలో ఆదివారం జరగనున్న వీఆర్వో, వీఆర్ఏ పరీక్షల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. విజయవాడ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో కలిపి 127 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. 64 వీఆర్ఓ పోస్టులకు 54 వేల 103 మంది, 403 వీఆర్ఏ పోస్టులకు 7,592 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. నిర్ణీత సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రం లోపలికి అనుమతించబోమని జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు ప్రకటించారు. అభ్యర్థులు గంట ముందుగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఆయన సూచించారు. వీఆర్వో పరీక్ష ఉదయం 10 గంటలకు ప్రారంభమై 12 గంటల వరకు జరుగుతుంది. వీఆర్ఏ పరీక్ష మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహిస్తారు. వీఆర్వో పరీక్షకు 15 జోన్లు 38 రూట్లుగాను, వీఆర్ఏ పరీక్షకు ఒక జోన్ నాలుగు రూట్లుగా విభజించారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు 115 మంది చీఫ్ సూపరింటెండెంట్లను, 129 మంది సిట్టింగ్ స్క్వాడ్, 13 మంది ఫ్లయింగ్ స్క్వాడ్, 17 మంది పరిశీలకులను నియమించారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీటి వసతి కల్పించారు. విద్యుత్ సరఫరా సక్రమంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు, ఓఎంఆర్ షీట్లు అర్బన్ తాలూకా కేంద్రం ఆవరణలోని ట్రెజరీలో భద్రపరిచారు. ఆదివారం ఉదయం ఐదు గంటల నుంచి రూట్ అధికారులు ప్రశ్నపత్రాలను, ఓఎంఆర్ షీట్లను పరీక్షా కేంద్రాలకు తరలిస్తారు. జిల్లా జాయింట్ కలెక్టర్ మురళి, డీఆర్వో సుందరరాజు, సబ్‌కలెక్టర్ డి.హరిచందన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో శనివారం రాత్రి నుంచి కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. అభ్యర్థులు, ఇన్విజిలేటర్లు, ఇతర అధికారులు ఏమైనా సమస్యలు ఎదురైతే కంట్రోల్ రూంలో అందుబాటులో ఉన్న ఫోన్ నంబర్ 0866 2574454, మొబైల్ నంబర్ 9290009918లలో సంప్రదించాలని అధికారులు తెలిపారు. విజయవాడలో 144వ సెక్షన్.. భారీ బందోబస్తు రెవెన్యూ పరీక్షల సందర్భంగా ఆదివారం నాడు కమిషనరేట్ పరిధిలో 144వ సెక్షన్ విధించారు. విజయవాడ నగర పోలీసు కమిషనర్ బి.శ్రీనివాసులు అన్ని పరీక్షా కేంద్రాల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. పరీక్షలను పురస్కరించుకొని ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. కట్టుదిట్టమైన భద్రత : కలెక్టర్ వీఆర్వో, వీఆర్ఏ పరీక్ష ప్రశ్నపత్రాలు పరీక్షా కేంద్రాలకు చేర్చేవరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు అధికారులకు సూచించారు. స్థానిక డివిజనల్ ట్రెజరీ కార్యాలయం స్ట్రాంగ్ రూంలో భద్రపరచిన ప్రశ్నపత్రాల బండిళ్లను శనివారం ఆయన పరిశీలించారు. బండిళ్లపై ఉన్న కోడ్ నంబర్ల ఆధారంగా ఆయా పరీక్షా కేంద్రాలకు చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సకాలంలో పరీక్షా కేంద్రాలకు ప్రశ్నపత్రాలు చేర్చాలని సూచించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ మురళి, తహశీల్దార్ ఆర్.శివరావు ఉన్నారు. -
నేడే పరీక్ష
వీఆర్వో, వీఆర్ఏ పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు సెకను లేటైనా నో ఎంట్రీ కేంద్రాల్లోకి సెల్ఫోన్లు, క్యాలిక్యులేటర్లు నిషేధం విశాఖ రూరల్, న్యూస్‌లైన్: జిల్లాలో ఆదివారం నిర్వహించనున్న వీఆర్వో, వీఆర్ఏ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఆర్వో ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. శనివారం కలెక్టరేట్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ పరీక్షల కోసం చేపట్టిన చర్యలను వివరించారు. విశాఖలో 39 కేంద్రాల్లో వీఆర్వో పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగుతుంది. వీఆర్ఏ పరీక్ష మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 3 కేంద్రాల్లో ఉంటుంది. వీఆర్వోకు 41 పోస్టులకు 21,284, వీఆర్ఏ 12 పోస్టులకు 888 దరఖాస్తులు వచ్చాయి. పరీక్ష కేంద్రాల్లో చీఫ్ సూపరింటెండెంట్లుగా 39 మందిని, అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్లు 43, పరిశీలకులుగా జిల్లా స్థాయి అధికారులు 39, సహాయ పరిశీలకులుగా 74, ఇన్విజిలేటర్లుగా 996 మందిని నియమించారు. 10 రూట్లలో తహశీల్దార్లను లైజనింగ్ అధికారులుగా ఏర్పాటు చేశారు. 10 ఫ్లయింగ్ స్క్వాడ్లు ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. అన్ని కేంద్రాల్లో పరీక్షలను చిత్రీకరించేందుకు 42 మంది వీడియోగ్రాఫర్లను పెట్టారు. పరీక్ష సమయంలో విద్యుత్‌కు అంతరాయం కలగకుండా విద్యుత్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతీ కేంద్రం వద్ద అత్యవసర వైద్యం అందించేందుకు ఒక ఏఎన్ఎం, అవసరమైన ఔషధాలను సిద్ధం చేశారు. తాగునీటికి ఇబ్బంది కలగకుండా వా టర్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు. ఆర్టీసీ బస్సులను ఉదయం 8 గంటల నుంచి ప్రతీ ప్రధాన కేంద్రాల నుంచి నడుపుతారు. ఏజెన్సీ ప్రాంత మండలాల నుంచి హాజరయ్యే అభ్యర్థులకు శనివారం సాయంత్రం నుంచి ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నారు. అభ్యర్థులకు సూచనలు పరీక్ష రాసే అభ్యర్థులు తప్పనిసరిగా హాల్‌టికెట్‌తో హాజరుకావాలి. పరీక్ష కేంద్రానికి గంట ముందుగా ప్యాడ్, బ్లూ/బ్లాక్ పెన్ను తీసుకొని రావాలి. పరీక్ష ప్రారంభమైన తరువాత వచ్చిన అభ్యర్థిని పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. అభ్యర్థులకు సరఫరా చేసే రెండు ఓఎంఆర్ షీట్లలో పరీక్ష పూర్తయిన తరువాత అసలు కాపీని ఇన్విజిలేటర్‌కు అందజేసి, నకిలీ కాపీని తమ వెంట తీసుకువెళ్లొచ్చు. పరీక్ష కేంద్రాలకు సెల్ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, బ్లేడులు, వైట్నర్, రబ్బర్లను తీసుకురాకూడదు. -
నిమిషం లేటైనా నో..
వీఆర్వో, వీఆర్ఏ పరీక్షలకు ‘నిమిషం’ నిబంధన అభ్యర్థులు గంటముందే కేంద్రాలకు చేరుకోవాలి.. పరీక్షా కేంద్రాల్లో వీడియో చిత్రీకరణ, అభ్యర్థుల వేలిముద్రలు సమీక్ష సమావేశంలో కలెక్టర్ వెల్లడి కలెక్టరేట్,న్యూస్‌లైన్: జిల్లాలో ఆదివారం జరిగే వీఆర్వో,వీఆర్ఏ పరీక్షల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. ఎలాంటి లోపాలు, ఇబ్బందుల్లేకుండా పరీక్ష సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎంకే మీనా అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించిన సమీక్షను శుక్రవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో సంబంధిత శాఖాధికారులతో సమీక్షించి పలు సూచనలు ఇచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆదివారం ఉదయం వీఆర్వో, మధ్యాహ్నం వీఆర్ఏ పరీక్షలు ఉంటాయని, నగరంలో వీఆర్వో పరీక్షకు 31 కేంద్రాలు, వీఆర్ఏ పరీక్షకు 8 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రం లోకి ఒక్కనిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించేది లేదని స్పష్టంచేశారు. వైట్నర్,ఎరైజర్ ఉపయోగించబడిన జవాబుపత్రాలు పరిగణలోనికి తీసుకోబడవని.. అభ్యర్థులు గంట ముందే సంబంధిత కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఎలా ంటి అక్రమాలకు పాల్పడకుండా పరీక్షా కేంద్రాల్లో వీడియో చిత్రీకరణతోపాటు అభ్యర్థుల వేలిముద్రలతో హాజరు తీసుకుంటున్నట్లు చెప్పారు. అభ్యర్థులు బ్లూ, బ్లాక్బాల్పాయింట్ పెన్నులు మాత్రమే వినియోగించాలంటూ..వీఆర్వో పరీక్షకు 15,171, వీఆర్ఏ పరీక్షకు 3,673 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. పరీక్షాకేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేయాలని పోలీసు విభాగాన్ని ఆదేశించారు. పరీక్ష నిర్వహణలో 31 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, ఆరుగురు ఫ్లైయింగ్స్క్వాడ్, ఆరుగురు పరిశీలకులు, ఇద్దరు కోఆర్డినేటర్లు, 17 మంది లెజైన్ అధికారులు, 31మంది సహాయ లైజనింగ్ అధికారులను నియమించినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ సమావేశంలో ఏపీపీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ సీతాదేవి, డీఆర్వో అశోక్‌కుమార్, ఆర్డీవోలు నవ్య, కిషన్, డిప్యూటీ కలెక్టర్లు,తహశీల్దార్లు పాల్గొన్నారు. -
'పూర్తి పారదర్శకంగా వీఆర్ఓ పరీక్ష'
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఓ, వీఆర్ఏ పోస్టులకు ఆదివారం పరీక్ష నిర్వహించనున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి వెల్లడించారు. ఈ పోస్టులలో 1657 వీఆర్ఓ పోస్టులకు గానూ 13,13వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా, 4305 వీఆర్ఏ పోస్టులకు 69వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసినట్టు మంత్రి రఘువీరా రెడ్డి తెలిపారు. అయితే ఈ పరీక్షను పూర్తి పారదర్శకంగా ఉండేలా నిర్వహణ కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. రాజకీయ నాయకుల సహా దళారులు ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామంటే నమ్మెద్దని చెప్పారు. దీనిపై ఎలాంటి సమాచారం అందినా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయమని మంత్రి రఘువీరా పేర్కొన్నారు. -
వీఆర్వో, వీఆర్ఏ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
2న వేర్వేరుగా పరీక్షలు 64 వీఆర్వో పోస్టులకు 54,013 దరఖాస్తులు 403 వీఆర్ఏ పోస్టులకు 7,592 దరఖాస్తులు వీఆర్వోకు 115, వీఆర్ఏకు 12 పరీక్షా కేంద్రాలు సాక్షి, మచిలీపట్నం : జిల్లాలో ఉద్యోగ పరీక్షకు నిరుద్యోగ యువత సిద్ధమైంది. వీఆర్వో (గ్రామ పరిపాలనాధికారులు), వీఆర్ఏ (గ్రామ సహాయకుల)) పోస్టులకు పరీక్షలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. ఫిబ్రవరి 2న ఉదయం వీఆర్వో పోస్టులకు, మధ్యాహ్నం వీఆర్ఏ పోస్టులకు పరీక్షల నిర్వహణ కోసం ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు పర్యవేక్షణలో పరీక్ష కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది నియామకం, వారికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు బుధవారానికి పూర్తయ్యాయి. ప్రత్యేక చర్యలు ఇవీ... వీఆర్వో, వీఆర్ఏ పరీక్షలు సక్రమంగా జరిగేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఇన్విజిలేటర్లకు, చీఫ్ సూపరింటెండెంట్లకు, సిట్టింగ్ స్క్వాడ్లకు, ఫ్లయింగ్ స్క్వాడ్లకు, పరిశీలకులకు బుధవారం ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండే పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేశారు. పరీక్ష సమయంలో విద్యుత్ కోత లేకుండా ఏపీ ట్రాన్స్‌కో ఎస్ఈకి ఆదేశాలు ఇచ్చారు. పరీక్షలు జరిగే తీరును వీడియో తీయిస్తారు. పరీక్షా కేంద్రాల సమీపంలో 144 సెక్షన్ అమలులో ఉంటుంది. పరీక్షా కేంద్రాలకు సమీపంలోని జిరాక్స్ షాపులు మూసివేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు హాల్‌టిక్కెట్‌తో మాత్రమే రావాలి. సెల్ఫోన్లు, కాలిక్యులేటర్లు అనుమతించరు. కంట్రోల్ రూం ఏర్పాటు.. పరీక్షలు సజావుగా జరిగేలా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా అధిగమించేందుకు ప్రత్యేకంగా కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ల్యాండ్‌లైన్ నంబర్ 0866 2574454, మొబైల్ నంబర్ 92900 09918లకు రాత్రి ఎనిమిది గంటల వరకు సమాచారం ఇవ్వొచ్చు. ఎప్పటికప్పుడు పరీక్షలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా 13 మంది మానిటరింగ్ సెల్ ఇన్చార్జిలను నియమించారు. మొత్తం 127 పరీక్షా కేంద్రాల ఏర్పాటు జిల్లాలో 64 గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో) పోస్టులు ఖాళీగా ఉండగా 54 వేల 13 మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. 403 గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్ఏ) పోస్టులు ఖాళీగా ఉండగా 7,592 మంది దరఖాస్తులు చేశారు. వీఆర్వో, వీఆర్ఏ పోస్టులు రెండింటికీ కొందరు దరఖాస్తు చేసే అవకాశం ఉండటంతో ఈ రెండు పరీక్షలను ఒకే రోజున వేర్వేరు సమయాల్లో నిర్వహిస్తున్నారు. ఈ నెల 2న ఉదయం 10 గంటల నుంచి 12 వరకు వీఆర్వో, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 వరకు వీఆర్ఏ పోస్టులకు పరీక్షలు నిర్వహించనున్నారు. విజయవాడ నగరంతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో ఈ పరీక్షలు నిర్వహించేలా కేంద్రాలను ఎంపిక చేశారు. వీఆర్వో పరీక్షల కోసం 115, వీఆర్ఏ పరీక్షల కోసం 12 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. పరిశీలకులుగా జిల్లా స్థాయి అధికారులను నియమించారు. వీఆర్వో పరీక్షలకు 15 జోన్లు.. 38 రూట్లుగా, వీఆర్ఏ పరీక్షలకు ఒక జోన్.. నాలుగు రూట్లుగా విభజించారు. పరీక్షలు సజావుగా నిర్వహించేలా 115 మంది చీఫ్ సూపరింటెండెంట్లను, 129 మంది సిట్టింగ్ స్క్వాడ్, 13 మంది ఫ్లయింగ్ స్క్వాడ్, 17 మంది పరిశీలకులను నియమించారు. వ్యవధి దాటితే అనుమతించం విజయవాడ సిటీ : గ్రామ పరిపాలనాధికారులు, గ్రామ సహాయకుల పోస్టుల భర్తీకి ఫిబ్రవరి రెండున జరగనున్న పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు తెలిపారు. పరీక్షలు సరిగ్గా 10 గంటలకు ప్రారంభిస్తామని, ఆ తరువాత వచ్చినవారిని నిర్దాక్షిణ్యంగా వెనక్కి పంపేస్తామని స్పష్టం చేశారు. అభ్యర్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు హాజరు కావాలని ఆయన సూచించారు. బుధవారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. ప్రభుత్వ సర్వీసులో ఉండి పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులు విధిగా వారి శాఖాధిపతుల అనుమతి పొందాల్సి ఉందన్నారు. నగర పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసులు మాట్లాడుతూ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులకు సూచనలివీ... హాల్టిక్కెట్లకు సంబంధించి అభ్యర్థులదే పూర్తి బాధ్యత. వెబ్సైట్లలో అభ్యర్థులే డౌన్లోడ్ చేసుకోవాలి. హాల్‌టిక్కెట్‌పై ఫొటోలు సక్రమంగా లేకపోయినా, కనబడకపోయినా, అభ్యర్థి తనకు సంబంధించిన మూడు పాస్‌పోర్టు సైజు ఫొటోలను గెజిటెడ్ ఆఫీసర్‌తో ధృవీకరించి ఇన్విజిలేటర్‌కు ఇవ్వాలి. పరీక్షా కేంద్రంలోకి హాజరైన అభ్యర్ధులను పూర్తి టైము అయ్యే వరకు బయటకు వెళ్లకూడదు. పరీక్షా కేంద్రాల వద్ద సెల్ఫోన్లు భద్రపరిచేందుకు ఎటువంటి కౌంటర్లూ ఏర్పాటు చేయటం లేదు. ఎవరి వస్తువులు వారే భద్రపరుచుకోవాలి. -
ఉద్యోగమే లక్ష్యం
=ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు =ఆసక్తి చూపుతున్న యువత = పోస్టు దక్కించుకునేందుకు కసరత్తు = కోచింగ్ సెంటర్లు బిజీ.. బిజీ.. కొలువుల జాతర మొదలైంది. నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రభుత్వ ఉద్యోగాలకు వరుస గా నోటిషికేషన్లు విడుదలయ్యాయి. వీఆర్వో, వీఆర్ఏ, పంచాయతీ కార్యదర్శి పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో 41 వీఆర్వో, 12 వీఆర్ఏ, 155 పంచాయతీ కార్యదర్శుల పోస్టులు ఈ దఫా భర్తీ కానున్నా యి. దీంతో పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఉన్నత విద్యా వంతులు కూడా ఉద్యోగ భద్రత ఉంటుందని ఆసక్తి చూపుతున్నారు. సంక్రాంతి సెలవులు కలిసి రావడంతో యువతీ యువకులు కోచింగ్ సెంటర్ల వైపు చూస్తున్నారు. ఈ నెలరోజులు శ్రమిం చి పక్కా ప్రణా ళిక ప్రకారం చదివితే విజయం మీ సొంతమవుతుంది. విశాఖపట్నం, న్యూస్‌లైన్: కొత్త కొలువులు తలుపు తడుతున్నాయి.. కోటి ఆశలతో నూతన సంవత్సరం ప్రారంభమైంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగార్థులను ఊరిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ల మీద నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. ఈనెల 4న వీఆర్వో.. వీఆర్ఏల పోస్టుల భర్తీకి నోటిపికేషన్ విడుదలవగా, తాజాగా పంచాయతీ కార్యదర్శుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో కోచింగ్ సెంటర్లన్నీ కిటకిటలాడుతున్నాయి. నగ రంలో ఉన్న 15 కోచింగ్ సెంటర్లలో వీఆర్ఓ, వీఆర్ఏ, పంచాయతీ కార్యదర్శి, బ్యాంక్ ఉద్యోగాల కోసం సుమారు 10 వేల మందికి పైగా శిక్షణ తీసుకుంటున్నారు. భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలంటే ఉద్యోగం సాధించి తీరాల్సిందే. లక్ష్యం చేరుకునేలా మంచి ప్రణాళిక అవసరం. దీనిపై ‘న్యూస్‌లైన్’ అందిస్తున్న ప్రత్యేక కథనం... ఇబ్బడిముబ్బడిగా కోచింగ్ సెంటర్లు పోటీ పరీక్షల్లో శిక్షణకు గతంలో హైదరాబాద్ పేరే వినిపించేది. ప్రస్తుతం విశాఖ కూడా కోచింగ్ సెంటర్లకు నిలయంగా మారింది. ఇక్కడ ఇగ్నో, ఏయూ, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ స్టడీ సర్కిల్ సెంటర్లు, మెరైన్, న్యాయ, ఆంధ్రా, గీతం వంటి పేరుగాంచిన యూనివర్సిటీలు ఉన్నాయి. ఇక్కడ చదువుతున్న విద్యార్థులు, చదువు పూర్తయిన నిరుద్యోగులు పెద్దఎత్తున కోచింగ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. ఇక్కడ వీఆర్ఏ నుంచి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ల వరకు లాంగ్‌టెర్మ్, షార్ట్ టెర్మ్ శిక్షణ ఇస్తున్నారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలతోపాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి ఉద్యోగార్థులు వచ్చి ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నారు. నైపుణ్యం, సామర్ధ్యం గల ఫ్యాకల్టీలను బెంగళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి వైజాగ్ తీసుకు వచ్చి వీరికి పాఠాలు చెప్పిస్తున్నారు. చాలమంది నిరుద్యోగులు ఇక్కడ పార్టుటైమ్ ఉద్యోగాలు చేసుకుంటూ శిక్షణ పొందుతున్నారు. ఈ తరహా అభ్యర్థులు నగరంలో పదివేలమందికి పైగా ఉన్నారంటే అతిశయోక్తికాదు. వసతి గృహాలు కిటకిట ప్రస్తుతం కోచింగ్ తీసుకునే నిరుద్యోగులతో నగరంలోని హాస్టల్స్ కిటకిలాడుతున్నారుు. యువతీ, యువకులకు కోసం నగరంలో 225కు పైగా హాస్టల్స్ ఉన్నాయి. ఇటీవల సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో వెలవెలబోరుున వసతి గృహాలు ప్రభుత్వ ఉద్యోగులకు వరస నోటిఫికేషన్లు ప్రకటించడంతో మళ్లీ కళకళలాడుతున్నాయి. కొందరు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు వసతి సౌకర్యం కల్పించడానికి కూడా ముందుకు వస్తున్నారు. వసతి వినియోగించుకుంటే ఫీజులో 15 శాతం రారుుతీ కూడా ప్రకటిస్తున్నారు. విషయంపై అవగాహన ముఖ్యం పంచాయతీ కార్యదర్శి పోస్టు కోసం నిర్వహించే పరీక్షలో డిగ్రీ స్థాయి ప్రశ్నలు వస్తాయి. విషయంపై అవగాహనతో అభ్యర్థులు సన్నద్ధం కావాలి. గత ఏడాది కాలంలో జరిగిన అంతర్జాతీయ, జాతీయ సంఘటనలపై కరెంట్ అఫైర్స్‌కు ప్రిపేరవ్వాలి. శాస్త్ర, సాంకేతిక, ఐటీ రంగం ప్రగతిపై దృష్టి పెట్టాలి. లాజికల్, ఎబిలిటీ ప్రశ్నలను అర్ధం చేసుకొని, ఒకటికి రెండుసార్లు చూసుకోవాలి. అదే విధంగా వీఆర్ఓకు సిద్ధపడే అభ్యర్థులు ఎనిమిదో తరగతి నుంచి టెన్త్ వరకు ఉన్న సబ్జెక్టులను స్టడీ చేయడం ఉత్తమం. -డాక్టర్ వి.నాగేశ్వరరావు, లెక్చరర్, బీవీకే డిగ్రీ కాలేజీ ఏకాగ్రతతో చదివితే లక్ష్య సాధన ఆధునిక భారత దేశ చరిత్ర, జాతీయ ఉద్యమం, భారతదేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి సంబంధించి తెలుగు అకాడమీ పుస్తకాలు చదవాలి. ఆర్ఎస్ అగర్వాల్ పుస్తకాలు ఉపయోగపడతాయి. సీబీఎస్ఈ ప్రచురించిన 8, 9 తరగతుల పుస్తకాలను ఫాలో కావాలి. పేపర్-2కు సంబంధించి అభ్యర్థులు గ్రామీణాభివృద్ధిపై సాధారణ పరిజ్ఞానం కలిగి ఉండాలి. పంచాయతీరాజ్ వ్యవస్థపై పరిపూర్ణ అవగాహన ఉండాలి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పథకాల పనితీరు, పత్రికల్లో వచ్చిన కథనాలను అధ్యయనం చేయాలి. ప్రజారోగ్యం, సంక్రమిత వ్యాధులు, మలేరియా, డెంగీ తదితర వ్యాధులకు సంబంధించి ప్రశ్నలు రావచ్చు. -శ్రీధర్, లెక్చరర్, బీవీకే డిగ్రీ కాలేజీ అందరికీ కొత్త సిలబసే.. ఈ పరీక్ష రాసే అభ్యర్థులందరికీ సిలబస్ కొత్తదే. కాబట్టి పరీక్షరాసే ప్రతి అభ్యర్థికి సమాన అవకాశాలు ఉంటాయి. పరీక్ష వ్యవధి తక్కువగా ఉన్నందున ఎక్కువ సమయం చదవడానికి కేటాయించాలి. కనీసం 15 గంటలు చదివితే లక్ష్యం నెరవేరుతుంది. సిలబస్ ప్రకారం చదవాలి. జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ వారి ప్రచురణ, నివేదికలు చూసుకోవాలి. పేపర్-2 కోసం ఇంటర్ సివిక్స్ నోట్స్ చదవాలి. ఎన్ఆర్హెచ్ఎం, ఆరోగ్యశ్రీ, రెడ్ రిబ్బన్, ఆశా సంబంధిత కార్యాకర్తల విధులు, బాధ్యతలపై అవగాహన కలిగి ఉండాలి. -పి.రమణమూర్తి, డిగ్రీ లెక్చరర్, విశాఖపట్నం. కోచింగ్‌తో ఉపయోగం ఉంది చదువుకోవలసింది విద్యార్థే అయినా.. అత్యధిక పోటీలో నెగ్గుకురావడానికి శిక్షణ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రీజనింగ్, మ్యాథ్స్ అంశాల్లో వేగంగా సమాధానాలు కనుక్కోవడానికి కోచింగ్ నాకెంతో ఉపయోగపడుతోంది. విశాఖలో ఇప్పుడు కోచింగ్ అవకాశాలు పెరిగాయి. బెంగళూరు, హైదరాబాద్, ఇతర రాష్ట్రాల నుంచి నైపుణ్యత గల ఫ్యాకల్టీలను తీసుకు వచ్చి నాణ్యత, సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్‌లో మంచి శిక్షణ ఇస్తున్నారు. -ఎస్.శ్రీనివాస్, ఉద్యోగార్థి ఇదీ షెడ్యూల్.. విశాఖ రూరల్: వీఆర్వో, వీఆర్ఏ ఉద్యోగాల దరఖాస్తుకు ఈ నెల 12వ తేదీలోగా ఫీజు చెల్లించి, 13వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి. 19 నుంచి హాల్‌టికెట్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష తేదీ ఫిబ్రవరి 2. ప్రాథమిక కీ విడుదల నాలుగో తేదీన. ఫైనల్ కీ విడుదల 10న, ఫలితాల ప్రకటన 20న ఉంటుంది. నియామక ఉత్తర్వులు 26న జారీ చేస్తారు. పరీక్ష కేంద్రాలను నగరంలోనే ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికి 50 కేంద్రాలను గుర్తించారు. అభ్యర్థులు అధికమైతే డివిజన్ ప్రధాన కేంద్రాల్లో నిర్వహించడానికి ప్రతిపాదించనున్నారు. కలిసి రానున్న సిలబస్ : వీఆర్వో, వీఆర్ఏ, పంచాయతీ కార్యదర్శి పోస్టులకు ప్రిపేరయితే రానున్న టెట్, డీఎస్సీ పరీక్షలను కూడా సులభంగా ఎదుర్కొనవచ్చు. జనరల్ స్టడీస్, అర్ధమెటికల్, రీజనింగ్ సాధారణంగా అన్ని పరీక్షల్లో ఉంటాయి. గ్రామీణ అంశాలపై అవగాహన ముఖ్యం: ఈ ఉద్యోగాల కోసం గ్రూప్స్ కోసం చదివిన స్థాయిలో కష్టపడాల్సిన పనిలేదు. అయితే గ్రామీణ అంశాలపై పరిజ్ఞానం తప్పనిసరి. గణితంపై మంచి పట్టు, కరెంట్ అఫైర్స్‌లో చురుగ్గా ఉండ డం అవసరం. -
‘వీఆర్వో, వీఆర్ఏ’లకు నోటిఫికేషన్
గుడివాడ రూరల్, న్యూస్‌లైన్ : ప్రభుత్వం గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో), గ్రామ రెవెన్యూ సహాయకుడి (వీఆర్ఏ) పోస్టులకు భర్తీకి శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లాలో 64 వీఆర్వో, 403 వీఆర్ఏల పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేస్తున్నారు. వీఆర్ఏలు డివిజన్ల వారీగా బందరు 96, గుడివాడ 104, నూజివీడు 88, విజయవాడ 115 పోస్టులు రిజర్వేషన్లు వారీగా కేటాయించారు. దీనికి సంబంధించి మార్గదర్శకాలు కూడా విడుదల చేశారు. వాటి ప్రకారం.. జిల్లా కేంద్రంగా వీఆర్వోలు, గ్రామ కేంద్రంగా వీఆర్ఏల ఎంపిక జరుగుతుంది. గతంలో వీఆర్ఏ పోస్టుకు దరఖాస్తు చేసే అభ్యర్థులు మండలంలో నివాసం ఉన్నవారైతే సరిపోతుంది. ప్రస్తుతం దానిని మార్చి పోస్టు మంజూరు చేసిన గ్రామవాసి అయి ఉండాలని నిబంధన విధించారు. దీంతో పాటు పుట్టిన స్థలం, నివాస, రేషన్ కార్డు, నాలుగు నుంచి ఏడేళ్లలోపు స్టడీ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. 36 సంవత్సరాల లోపువారు మాత్రమే ఈ పోస్టుకు అర్హులు. వివాహ మైన మహిళలు తమ స్వస్థలం గాని, భర్త అడ్రసుతోగాని దరఖాస్తు చేసుకోవచ్చు. వీఆర్వో, వీఆర్ఏ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు ఓసీ, బీసీలు రూ.300, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారు రూ.150 చెల్లించాలి. వికలాంగులు ఎటువంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. దరఖాస్తు రుసుం జనవరి 12 లోపు చెల్లించాలి. దరఖాస్తులు అందించాల్సిన గడువు జనవరి 13తో ముగుస్తుంది. జనవరి 19 నుంచి ఫిబ్రవరి 2 వరకు హాల్‌టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి రెండోతేదీ ఉదయం 10 నుంచి 12 వరకు వీఆర్వోలకు, మధ్యాహ్నం 3 నుంచి 5 వరకు వీఆర్ఏలకు పరీక్షలు ఉంటాయి. 100 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షల్లో జనరల్ స్టడీస్ 60, అర్థమెటిక్స్ 30, లాజికల్ స్కిల్స్ 10 మార్కులకు ఉంటాయి. దరఖాస్తులను ఆన్లైన్లోనే స్వీకరిస్తారు. దగ్గరలో ఉన్న మీ సేవ, ఈ సేవలలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే జిల్లాలోని అన్ని మండల కేంద్రాలు, రెవెన్యూ కార్యాలయాలకు నోటిఫికేషన్ మార్గదర్శక ఉత్తర్వులు పంపించారు. -
వీఆర్వో, వీఆర్ఏ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
=జిల్లాలో 104 వీఆర్వో, 188 వీఆర్ఏ పోస్టులు =ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ =ఫిబ్రవరి 2న రాత పరీక్ష చిత్తూరు(జిల్లాపరిషత్), న్యూస్‌లైన్: జిల్లాలో ఖాళీగా ఉన్న వీఆర్వో (గ్రామ రెవెన్యూ అధికారులు), వీఆర్ఏ(గ్రామ రెవెన్యూ సహాయకులు) పోస్టులకు జేసీ బసంత్‌కుమార్ నోటిఫికేషన్ జారీ చేశారు. శుక్రవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో జేసీ మాట్లాడారు. వీఆర్వో, వీఆర్ఏ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వీఆర్వో పరీక్ష వచ్చే ఏడాది ఫిబ్రవరి 2న ఉదయం 10 నుంచి 12 గంటల వరకు జరుగుతుందన్నారు. వీఆర్ఏ పరీక్ష అదే రోజు మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులు శనివారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పరీక్ష రుసుముగా ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.300, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.150 చెల్లించాలని సూచించారు. వికలాంగ అభ్యర్థులకు ఫీజు రాయితీని ప్రభుత్వం కల్పించిందన్నారు. పరీక్ష రుసుం చెల్లింపునకు చివర తేదీ జనవరి 12 అని తెలిపారు. జనవరి 19 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ ఉదయం 9 గంటల వరకు ఆన్లైన్లో హాల్‌టికెట్‌ను పొందవచ్చన్నారు. పోస్టులు ఇలా జిల్లాలో 104 వీఆర్వో, 188 వీఆర్ఏ పోస్టులను భర్తీ చేయనున్నట్లు జేసీ తెలిపారు. వీఆర్వో పోస్టుల్లో 36 ఖాళీలను మహిళలకు కేటాయించామన్నారు. వీఆర్ఏ పోస్టుల్లో 50 శాతానికిపైగా మహిళలకు కేటాయించినట్లు వివరించారు. మరిన్ని వివరాలను http://ccla.cgg.gov.in వెబ్సైట్లో పొందవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఒంగోలు శేషయ్య పాల్గొన్నారు. -
నేడు వీఆర్వో, వీఆర్ఏ నోటిఫికేషన్
=ఫిబ్రవరి 2న రాత పరీక్షలు =20న ఫలితాలు విడుదల =కలెక్టర్ ఆరోఖ్యరాజ్ వెల్లడి విశాఖ రూరల్, న్యూస్‌లైన్: వీఆర్వో, వీఆర్ఏ నియామక నోటిఫికేషన్ శ నివారం జారీ చేయనున్నట్టు జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ తెలిపారు. కలెక్టరేట్లో శుక్రవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జనవరి 12లోగా ఫీజు చెల్లించి, 13లోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. 19 నుంచి హాల్ టికెట్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఫిబ్రవరి 2న ఉదయం వీఆర్వోలకు, మధ్యాహ్నం వీఆర్ఏలకు రాత పరీక్షలు ఉంటాయని వెల్లడించారు. అదే నెల 4న ప్రాథమిక కీ, 10న తుది కీ వెలువడుతుందని చెప్పారు. 20న పరీక్షా ఫలితాలు ప్రకటించి, 26 నుంచి ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు జారీ చేస్తామని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాలను నగరంలోనే ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే 50 కేంద్రాలు గుర్తించామన్నారు. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే డివిజన్ ప్రధాన కేంద్రాల్లో నిర్వహించేందుకు ప్రతిపాదిస్తామన్నారు. పూర్తి వివరాల కోసం 1800-4250-0002 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయవచ్చు లేదా http://ccla.cgg.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చని సూచించారు.