వీఆర్వో, వీఆర్‌ఏ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
- 2న వేర్వేరుగా పరీక్షలు
- 64 వీఆర్‌వో పోస్టులకు 54,013 దరఖాస్తులు
- 403 వీఆర్‌ఏ పోస్టులకు 7,592 దరఖాస్తులు
- వీఆర్వోకు 115, వీఆర్‌ఏకు 12 పరీక్షా కేంద్రాలు
సాక్షి, మచిలీపట్నం : జిల్లాలో ఉద్యోగ పరీక్షకు నిరుద్యోగ యువత సిద్ధమైంది. వీఆర్వో (గ్రామ పరిపాలనాధికారులు), వీఆర్‌ఏ (గ్రామ సహాయకుల)) పోస్టులకు పరీక్షలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. ఫిబ్రవరి 2న ఉదయం వీఆర్వో పోస్టులకు, మధ్యాహ్నం వీఆర్‌ఏ పోస్టులకు పరీక్షల నిర్వహణ కోసం ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు పర్యవేక్షణలో పరీక్ష కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది నియామకం, వారికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు బుధవారానికి పూర్తయ్యాయి.
ప్రత్యేక చర్యలు ఇవీ...
వీఆర్వో, వీఆర్‌ఏ పరీక్షలు సక్రమంగా జరిగేలా అధికారులు చర్యలు చేపట్టారు.
ఇన్విజిలేటర్లకు, చీఫ్ సూపరింటెండెంట్‌లకు, సిట్టింగ్ స్క్వాడ్‌లకు, ఫ్లయింగ్ స్క్వాడ్‌లకు, పరిశీలకులకు బుధవారం ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండే పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేశారు.
పరీక్ష సమయంలో విద్యుత్ కోత లేకుండా ఏపీ ట్రాన్స్‌కో ఎస్‌ఈకి ఆదేశాలు ఇచ్చారు.
పరీక్షలు జరిగే తీరును వీడియో తీయిస్తారు.
పరీక్షా కేంద్రాల సమీపంలో 144 సెక్షన్ అమలులో ఉంటుంది.
పరీక్షా కేంద్రాలకు సమీపంలోని జిరాక్స్ షాపులు మూసివేయాల్సి ఉంటుంది.
అభ్యర్థులు హాల్‌టిక్కెట్‌తో మాత్రమే రావాలి. సెల్‌ఫోన్లు, కాలిక్యులేటర్లు అనుమతించరు.
కంట్రోల్ రూం ఏర్పాటు..
పరీక్షలు సజావుగా జరిగేలా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా అధిగమించేందుకు ప్రత్యేకంగా కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ల్యాండ్‌లైన్ నంబర్ 0866 2574454, మొబైల్ నంబర్ 92900 09918లకు రాత్రి ఎనిమిది గంటల వరకు సమాచారం ఇవ్వొచ్చు. ఎప్పటికప్పుడు పరీక్షలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా 13 మంది మానిటరింగ్ సెల్ ఇన్‌చార్జిలను నియమించారు.
మొత్తం 127 పరీక్షా కేంద్రాల ఏర్పాటు
జిల్లాలో 64 గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్‌వో) పోస్టులు ఖాళీగా ఉండగా 54 వేల 13 మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు.
403 గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్‌ఏ) పోస్టులు ఖాళీగా ఉండగా 7,592 మంది దరఖాస్తులు చేశారు.
వీఆర్‌వో, వీఆర్‌ఏ పోస్టులు రెండింటికీ కొందరు దరఖాస్తు చేసే అవకాశం ఉండటంతో ఈ రెండు పరీక్షలను ఒకే రోజున వేర్వేరు సమయాల్లో నిర్వహిస్తున్నారు.
ఈ నెల 2న ఉదయం 10 గంటల నుంచి 12 వరకు వీఆర్వో, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 వరకు వీఆర్‌ఏ పోస్టులకు పరీక్షలు నిర్వహించనున్నారు.
విజయవాడ నగరంతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో ఈ పరీక్షలు నిర్వహించేలా కేంద్రాలను ఎంపిక చేశారు.
వీఆర్వో పరీక్షల కోసం 115, వీఆర్‌ఏ పరీక్షల కోసం 12 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
పరిశీలకులుగా జిల్లా స్థాయి అధికారులను నియమించారు.
వీఆర్వో పరీక్షలకు 15 జోన్‌లు.. 38 రూట్లుగా, వీఆర్‌ఏ పరీక్షలకు ఒక జోన్.. నాలుగు రూట్లుగా విభజించారు.
పరీక్షలు సజావుగా నిర్వహించేలా 115 మంది చీఫ్ సూపరింటెండెంట్‌లను, 129 మంది సిట్టింగ్ స్క్వాడ్, 13 మంది ఫ్లయింగ్ స్క్వాడ్, 17 మంది పరిశీలకులను నియమించారు.
వ్యవధి దాటితే అనుమతించం
విజయవాడ సిటీ : గ్రామ పరిపాలనాధికారులు, గ్రామ సహాయకుల పోస్టుల భర్తీకి ఫిబ్రవరి రెండున జరగనున్న పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు తెలిపారు. పరీక్షలు సరిగ్గా 10 గంటలకు ప్రారంభిస్తామని, ఆ తరువాత వచ్చినవారిని నిర్దాక్షిణ్యంగా వెనక్కి పంపేస్తామని స్పష్టం చేశారు. అభ్యర్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు హాజరు కావాలని ఆయన సూచించారు. బుధవారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. ప్రభుత్వ సర్వీసులో ఉండి పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులు విధిగా వారి శాఖాధిపతుల అనుమతి పొందాల్సి ఉందన్నారు. నగర పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసులు మాట్లాడుతూ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
అభ్యర్థులకు సూచనలివీ...
హాల్‌టిక్కెట్లకు సంబంధించి అభ్యర్థులదే పూర్తి బాధ్యత. వెబ్‌సైట్‌లలో అభ్యర్థులే డౌన్‌లోడ్ చేసుకోవాలి.
హాల్‌టిక్కెట్‌పై ఫొటోలు సక్రమంగా లేకపోయినా, కనబడకపోయినా, అభ్యర్థి తనకు సంబంధించిన మూడు పాస్‌పోర్టు సైజు ఫొటోలను గెజిటెడ్ ఆఫీసర్‌తో ధృవీకరించి ఇన్విజిలేటర్‌కు ఇవ్వాలి.
పరీక్షా కేంద్రంలోకి హాజరైన అభ్యర్ధులను పూర్తి టైము అయ్యే వరకు బయటకు వెళ్లకూడదు.
పరీక్షా కేంద్రాల వద్ద సెల్‌ఫోన్లు భద్రపరిచేందుకు ఎటువంటి కౌంటర్లూ ఏర్పాటు చేయటం లేదు. ఎవరి వస్తువులు వారే భద్రపరుచుకోవాలి.