ఇదేం ‘పరీక్ష’ | Shortage of exam question -2 absence sammetiv | Sakshi
Sakshi News home page

ఇదేం ‘పరీక్ష’

Published Fri, Jan 3 2014 12:47 AM | Last Updated on Sat, Sep 2 2017 2:13 AM

ఇదేం ‘పరీక్ష’

ఇదేం ‘పరీక్ష’

=సమ్మెటివ్-2 పరీక్షల తొలిరోజే ప్రశ్నపత్రాల కొరత
 =6, 7, 8 తరగతులకు తీవ్ర ఇబ్బంది
 =పాఠశాలల్లో పంపిణీలోను ఆలస్యమే
 =ఫొటోస్టాట్ కాపీలే శరణ్యం

 
అసలే సమైక్య ఉద్యమ ప్రభావం.. ఆపై పరీక్షలు ఆలస్యం.. అయినా మన ప్రభుత్వ యంత్రాంగానికి చిత్తశుద్ధి కొరవడింది. జిల్లాలో గురువారం ప్రారంభమైన సమ్మెటివ్-2 (అర్ధ సంవత్సర) పరీక్షల నిర్వహణ తీరులో నిర్లక్ష్యం  ఆవరించింది.  ఇప్పటికే చాలా వరకు విద్యసంవత్సరం నష్టపోయిన విద్యార్థుల మానసిక ఒత్తిడికి మరింత పరీక్ష పెట్టింది.
 
సాక్షి, మచిలీపట్నం : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సమ్మెటివ్-2 పరీక్షల తొలిరోజే గందరగోళం నెలకొంది. ప్రశ్నపత్రాలు అరకొరగా పంపించటంతో ఉపాధ్యాయులు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. ఫొటోస్టాట్ కాపీల కోసం పరుగులు పెట్టారు. కొన్నిచోట్ల ప్రశ్నపత్రాలు అందక పరీక్ష వాయిదా వేశారు. మరోపక్క విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. త్రైమాసిక, అర్ధ సంవత్సర, ఫైనల్ పరీక్షలను ఇటీవల సమ్మెటివ్-1 (మూడు నెలల), సమ్మెటివ్-2 (అర్ధ సంవత్సర), సమ్మెటివ్-3 (ఫైనల్) పరీక్షలుగా మార్పు చేశారు.

ఈ ఏడాది 9, 10 తరగతులకు మాత్రం బోర్డు ద్వారా ప్రశ్నపత్రాలను అందిస్తుంటే ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు మాత్రం రాజీవ్ విద్యామిషన్ ద్వారా ప్రశ్నప్రత్నాలు అందించేలా ఏర్పాట్లు చేశారు. దీనికితోడు ప్రశ్నపత్రాల తయారీ ఈసారి జిల్లాలో స్థానికంగా చేపట్టకుండా హైదరాబాద్ నుంచి పంపించారు. అంతవరకు బాగానే ఉన్నా జిల్లాలో పరీక్షలు ప్రారంభమైన తొలిరోజునే విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురిచేశారు.

గురువారం తెలుగు పరీక్ష జరగాల్సి ఉండగా 6, 7, 8 తరగతుల ప్రశ్నపత్రాలు ఆలస్యంగా, అరకొరగా అందడంతో అవస్థలు తప్పలేదు. జిల్లాలో 9, 10 తరగతులకు చెందిన 80 వేల మంది విద్యార్థులకు రెండురోజుల ముందే ఆయా మండలాలకు ప్రశ్నపత్రాలు అందించారు. దీంతో గురువారం తొలిపరీక్షలకు సకాలంలో ప్రశ్నపత్రాలు అందించగలిగారు. 6, 7, 8 తరగతులకు చెందిన 2 లక్షల 74 వేల 115 మంది విద్యార్థులకు మాత్రం గురువారం ఉదయం హడావుడిగా చేరవేశారు. చాలా పాఠశాలల్లో ప్రశ్నపత్రాలకు కొరత ఏర్పడింది.

దీంతో అందుబాటులోని ఫొటోస్టాట్ సెంటర్‌లకు వెళ్లి హడావుడిగా ఫొటోస్టాట్ కాపీలు తీయించి ఇవ్వాల్సి వచ్చింది. ఇలా గుడ్లవల్లేరు మండలంలోని వడ్లమన్నాడు, విన్నకోట, గుడ్లవల్లేరు ఎస్‌ఈఆర్‌ఎం స్కూల్ తదితర పాఠశాలల్లో కొరత సమస్య వచ్చినట్టు సమాచారం. మరికొన్ని పాఠశాలకు ప్రశ్నపత్రాలు ఆలస్యం కావడంతో సీఆర్‌పీల ద్వారా పంపినట్టు తెలిసింది. ముదినేపల్లి మండల పరిధిలో ఎనిమిదో తరగతి ప్రశ్నపత్రాలు అసలు అందలేదు.

దీంతో పరీక్ష వాయిదా వేయాల్సి వచ్చింది. గుడివాడ ప్రాంతంలోని కొన్ని పాఠశాలలకు ఒకటో తరగతి ప్రశ్నపత్రాలు కూడా అందలేదు. దీంతో పలు ప్రాంతాల్లో పరీక్షలు వాయిదా పడ్డాయి. తొలి రోజున ప్రశ్నపత్రాల అందజేతలో నిర్వాకం ఇలా ఉంటే మరికొన్ని సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నపత్రాలు పలు పాఠశాలలకు చేరలేదని చెబుతున్నారు. సమ్మెటివ్-2 నిర్వహణలోనే ఇంత నిర్లక్ష్యం ఉంటే.. ఫైనల్ పరీక్షల సం‘గతేంటి’ అని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
 
పరీశీలిస్తాం : ఆర్వీఎం పీవో

 
జిల్లాకు అవసరమైన ప్రశ్నపత్రాలకు తాము ప్రతిపాదనలు పంపించామని, అయినా కొరత ఎందుకు వచ్చిందో పరిశీలిస్తామని రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు అధికారిణి బి.పద్మావతి ‘సాక్షి’కి వివరణ ఇచ్చారు. జిల్లాకు అవసరమైన ప్రశ్నపత్రాలు ఆర్డర్ పెట్టిన అనంతరం ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు పెరిగారని, అందుకే కొంతమేరకు సమస్య వచ్చి ఉండొచ్చని చెప్పారు. జిల్లా మొత్తానికి హైదరాబాద్ నుంచి ప్రశ్నపత్రాలు రావడంతో వాటిని మండలాల వారీగా విభజించి బుధవారం సాయంత్రం నాటికే ఆయా మండలాలకు చేరవేసినట్టు తెలిపారు. మండలాల స్థాయిలో ఆయా పాఠశాలలకు ప్రశ్నపత్రాల కేటాయింపుల్లో లోపాలుంటే ఆలస్యం జరిగి ఉండొచ్చని చెప్పారు. అయినా జిల్లాలోని అన్ని మండలాల అధికారులతో మాట్లాడి లోపం ఎక్కడ జరిగిందో గుర్తిస్తామని పద్మావతి చెప్పారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement