నేడే వీఆర్‌వో, వీఆర్‌ఏ ఫలితాలు | today,vro/vra results | Sakshi
Sakshi News home page

నేడే వీఆర్‌వో, వీఆర్‌ఏ ఫలితాలు

Published Sat, Feb 22 2014 1:28 AM | Last Updated on Sat, Sep 2 2017 3:57 AM

today,vro/vra results

  శనివారం మధ్యాహ్నం నుంచి వెబ్‌సైట్లలో
     24 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్
     28 నాటికి ప్రాథమిక నియామకాలు పూర్తి
 
 సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్‌వో), గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏ) పరీక్షల ఫలితాలు శనివారం విడుదలకానున్నాయి. 1,657 వీఆర్‌వో, 4,305 వీఆర్‌ఏ పోస్టుల భర్తీకి ఈ నెల 2న జరిగిన రాత పరీక్షలకు మొత్తం 12,72,843 మంది హాజరయ్యారు. వీటికి సంబంధించిన ఫలితాలను శనివారం మధ్యాహ్నం సీసీఎల్‌ఏ వెబ్‌సైట్‌లో పెడతామని రెవెన్యూ ఉన్నతాధికారులు తెలిపారు. 2వ తేదీన జరిగిన ఈ పరీక్షలకు సంబంధించి నాలుగో తేదీన వెబ్‌సైట్ ద్వారా ప్రాథమిక ‘కీ’ ప్రకటించి అభ్యంతరాలు స్వీకరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) అధికారులు ఈనెల 10న ఫైనల్ ‘కీ’ ప్రకటించారు.
 
  వీఆర్‌వో పరీక్షలకు సంబంధించి ఒక ప్రశ్నను తొలగించడమే కాకుండా మరో ప్రశ్నకు రెండు సమాధానాల్లో ఏది సూచించినా మార్కు ఇవ్వాలని నిర్ణయించారు. దీని ప్రకారం వీఆర్‌వో, వీఆర్‌ఏ ఫలితాలను రూపొం దించిన ఏపీపీఎస్సీ అధికారులు శుక్రవారం సాయంత్రం ఫలితాల సాఫ్ట్ కాపీలను రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనరేట్ అధికారులకు అందజేశారు. అభ్యర్థుల ప్రయోజనార్థం ఈ ఫలితాలను శనివారం మధ్యాహ్నం రెండు గంటల్లోగా ఛిఛ్చి.ఛిజజ.జౌఠి.జీ, ఝ్ఛ్ఛట్ఛఠ్చి.జౌఠి.జీ వెబ్‌సైట్లలో పెట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వెబ్‌సైట్‌లో వీఆర్‌వో, వీఆర్‌ఏ ఫలితాలు క్లిక్ చేసి హాల్‌టికెట్ నంబరు ఫీడ్ చేయడం ద్వారా అభ్యర్థులు తమకు వచ్చిన మార్కులు తెలుసుకోవచ్చు.
 
 24 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన
 కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ) ప్రతినిధులు రిజర్వేషన్ల కేటగిరీల వారీగా ఖాళీలను బట్టి పోస్టులకు ఎంపికైన వారి వివరాల జాబితాను ప్రకటిస్తారు. ఎంపికైన అభ్యర్థుల మొబైల్ నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించడంతోపాటు ఎస్సెమ్మెస్ కూడా పంపుతారు. ఈ నెల 24, 25 తేదీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసి 28వ తేదీలోగా ప్రాథమిక నియామక ప్రక్రియ పూర్తి చేస్తారు. ఈ మేరకు సీసీఎల్‌ఏ అధికారులు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. వచ్చే నెల మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నందున ఆ లోగా వీఆర్‌వో, వీఆర్‌ఏ నియామక ప్రక్రియ పూర్తి చేయాలనే ఉద్దేశంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపితే ఆలస్యమవుతుందనే భావంతోనే ఫోన్ ద్వారా సమాచారం అందించి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పిలిపించాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు.  
 ఫలితాలు అందుబాటులో ఉండే వెబ్‌సైట్లు ccla.cgg.gov.in, www.meeseva.gov.in
 
 గందరగోళం వల్లే వాయిదా!
 వాస్తవానికి శుక్రవారం సాయంత్రమే వీఆర్‌వో, వీఆర్‌ఏ పరీక్షల ఫలితాలను వెబ్‌సైట్లలో పెట్టేందుకు సీసీఎల్‌ఏ అధికారులు ప్రయత్నించారు. అయితే ఏపీపీఎస్సీ అందించిన ఫలితాల సాఫ్ట్ కాపీ గందరగోళంగా ఉండటంతో ఈ ప్రయత్నాన్ని చివరి నిమిషంలో వాయిదా వేశారు. ఏపీపీఎస్సీ అధికారులు ఇచ్చిన ఫలితాలను (జిప్ ఫైల్) యథాతథంగా వెబ్‌సైట్‌లో పెడితే అభ్యర్థులు రకరకాల ఆప్షన్లు  క్లిక్ చేయాల్సి వస్తుంది. ఈ పరీక్షలకు హాజరైన వారిలో అత్యధికులు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారే. ఇన్ని ఆప్షన్లు క్లిక్ చేసి ఫలితాలు తెలుసుకోవాలంటే గందరగోళం ఏర్పడుతుంది. ఇది కచ్చితంగా అభ్యర్థులను ఇబ్బందిపెట్టడమే అవుతుందని రెవెన్యూ అధికారులు నిర్ధారణకు వచ్చారు. అందువల్ల అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్ ఫీడ్ చేస్తే మార్కులు వచ్చేలా సరళంగా మార్చి శనివారం మధ్యాహ్నానికి ఫలితాలను వెబ్‌సైట్లలో పెట్టాలని నిర్ణయించారు.
 
 
 రేపు పంచాయతీ కార్యదర్శి పరీక్ష
 రాష్ట్రంలో 2,677 పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి ఈనెల 23న రాత ప రీక్ష నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 2,406 కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షకు హాజరయ్యేందుకు 8.15 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement