ఉద్యోగమే లక్ష్యం | job or my gole | Sakshi
Sakshi News home page

ఉద్యోగమే లక్ష్యం

Published Thu, Jan 9 2014 2:14 AM | Last Updated on Sat, Sep 2 2017 2:24 AM

ఉద్యోగమే లక్ష్యం

ఉద్యోగమే లక్ష్యం

=ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు
=ఆసక్తి చూపుతున్న యువత
= పోస్టు దక్కించుకునేందుకు కసరత్తు
= కోచింగ్ సెంటర్లు బిజీ.. బిజీ..

కొలువుల జాతర మొదలైంది. నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రభుత్వ ఉద్యోగాలకు వరుస గా నోటిషికేషన్లు విడుదలయ్యాయి. వీఆర్వో, వీఆర్‌ఏ, పంచాయతీ కార్యదర్శి పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో 41 వీఆర్‌వో, 12 వీఆర్‌ఏ, 155 పంచాయతీ కార్యదర్శుల పోస్టులు ఈ దఫా భర్తీ కానున్నా యి. దీంతో పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఉన్నత విద్యా వంతులు కూడా ఉద్యోగ భద్రత ఉంటుందని ఆసక్తి చూపుతున్నారు. సంక్రాంతి సెలవులు కలిసి రావడంతో యువతీ యువకులు కోచింగ్ సెంటర్ల వైపు చూస్తున్నారు. ఈ నెలరోజులు శ్రమిం చి పక్కా ప్రణా ళిక ప్రకారం చదివితే విజయం మీ సొంతమవుతుంది.

విశాఖపట్నం, న్యూస్‌లైన్:  కొత్త కొలువులు తలుపు తడుతున్నాయి.. కోటి ఆశలతో నూతన సంవత్సరం ప్రారంభమైంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగార్థులను ఊరిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ల మీద నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. ఈనెల 4న వీఆర్వో.. వీఆర్‌ఏల పోస్టుల భర్తీకి నోటిపికేషన్ విడుదలవగా, తాజాగా పంచాయతీ కార్యదర్శుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో కోచింగ్ సెంటర్లన్నీ కిటకిటలాడుతున్నాయి. నగ రంలో ఉన్న 15 కోచింగ్ సెంటర్లలో వీఆర్‌ఓ, వీఆర్‌ఏ, పంచాయతీ కార్యదర్శి, బ్యాంక్ ఉద్యోగాల కోసం సుమారు 10 వేల మందికి పైగా శిక్షణ తీసుకుంటున్నారు. భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలంటే ఉద్యోగం సాధించి తీరాల్సిందే. లక్ష్యం చేరుకునేలా మంచి ప్రణాళిక అవసరం. దీనిపై ‘న్యూస్‌లైన్’ అందిస్తున్న ప్రత్యేక కథనం...
 
ఇబ్బడిముబ్బడిగా కోచింగ్ సెంటర్లు
 
పోటీ పరీక్షల్లో శిక్షణకు గతంలో హైదరాబాద్ పేరే వినిపించేది. ప్రస్తుతం విశాఖ కూడా కోచింగ్ సెంటర్లకు నిలయంగా మారింది. ఇక్కడ ఇగ్నో, ఏయూ, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ స్టడీ సర్కిల్ సెంటర్లు, మెరైన్, న్యాయ, ఆంధ్రా, గీతం వంటి పేరుగాంచిన యూనివర్సిటీలు ఉన్నాయి. ఇక్కడ చదువుతున్న విద్యార్థులు, చదువు పూర్తయిన నిరుద్యోగులు పెద్దఎత్తున కోచింగ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. ఇక్కడ వీఆర్‌ఏ నుంచి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్‌ఎస్‌ల వరకు లాంగ్‌టెర్మ్, షార్ట్ టెర్మ్ శిక్షణ ఇస్తున్నారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలతోపాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి ఉద్యోగార్థులు వచ్చి ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నారు. నైపుణ్యం, సామర్ధ్యం గల ఫ్యాకల్టీలను బెంగళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి వైజాగ్ తీసుకు వచ్చి వీరికి పాఠాలు చెప్పిస్తున్నారు. చాలమంది నిరుద్యోగులు ఇక్కడ పార్టుటైమ్ ఉద్యోగాలు చేసుకుంటూ శిక్షణ పొందుతున్నారు. ఈ తరహా అభ్యర్థులు నగరంలో పదివేలమందికి పైగా ఉన్నారంటే అతిశయోక్తికాదు.
 
వసతి గృహాలు కిటకిట
 
ప్రస్తుతం కోచింగ్ తీసుకునే నిరుద్యోగులతో నగరంలోని హాస్టల్స్ కిటకిలాడుతున్నారుు. యువతీ, యువకులకు కోసం నగరంలో 225కు పైగా హాస్టల్స్ ఉన్నాయి. ఇటీవల సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో వెలవెలబోరుున వసతి గృహాలు ప్రభుత్వ ఉద్యోగులకు వరస నోటిఫికేషన్లు ప్రకటించడంతో మళ్లీ కళకళలాడుతున్నాయి. కొందరు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు వసతి సౌకర్యం కల్పించడానికి కూడా ముందుకు వస్తున్నారు. వసతి వినియోగించుకుంటే ఫీజులో 15 శాతం రారుుతీ కూడా ప్రకటిస్తున్నారు.
 
 విషయంపై అవగాహన ముఖ్యం
 
పంచాయతీ కార్యదర్శి పోస్టు కోసం నిర్వహించే పరీక్షలో డిగ్రీ స్థాయి ప్రశ్నలు వస్తాయి. విషయంపై అవగాహనతో అభ్యర్థులు సన్నద్ధం కావాలి. గత ఏడాది కాలంలో జరిగిన అంతర్జాతీయ, జాతీయ సంఘటనలపై కరెంట్ అఫైర్స్‌కు ప్రిపేరవ్వాలి. శాస్త్ర, సాంకేతిక, ఐటీ రంగం ప్రగతిపై దృష్టి పెట్టాలి. లాజికల్, ఎబిలిటీ ప్రశ్నలను అర్ధం చేసుకొని, ఒకటికి రెండుసార్లు చూసుకోవాలి. అదే విధంగా వీఆర్‌ఓకు సిద్ధపడే అభ్యర్థులు ఎనిమిదో తరగతి నుంచి టెన్త్ వరకు ఉన్న సబ్జెక్టులను స్టడీ చేయడం ఉత్తమం.
 -డాక్టర్ వి.నాగేశ్వరరావు, లెక్చరర్, బీవీకే డిగ్రీ కాలేజీ
 
 ఏకాగ్రతతో చదివితే లక్ష్య సాధన
 ఆధునిక భారత దేశ చరిత్ర, జాతీయ ఉద్యమం, భారతదేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి సంబంధించి తెలుగు అకాడమీ పుస్తకాలు చదవాలి. ఆర్‌ఎస్ అగర్వాల్ పుస్తకాలు ఉపయోగపడతాయి. సీబీఎస్‌ఈ ప్రచురించిన 8, 9 తరగతుల పుస్తకాలను ఫాలో కావాలి. పేపర్-2కు సంబంధించి అభ్యర్థులు గ్రామీణాభివృద్ధిపై సాధారణ పరిజ్ఞానం కలిగి ఉండాలి. పంచాయతీరాజ్ వ్యవస్థపై పరిపూర్ణ అవగాహన ఉండాలి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పథకాల పనితీరు, పత్రికల్లో వచ్చిన కథనాలను అధ్యయనం చేయాలి. ప్రజారోగ్యం, సంక్రమిత వ్యాధులు, మలేరియా, డెంగీ తదితర వ్యాధులకు సంబంధించి ప్రశ్నలు రావచ్చు.                              
-శ్రీధర్, లెక్చరర్, బీవీకే డిగ్రీ కాలేజీ
 
 అందరికీ కొత్త సిలబసే..
 ఈ పరీక్ష రాసే అభ్యర్థులందరికీ సిలబస్ కొత్తదే. కాబట్టి పరీక్షరాసే ప్రతి అభ్యర్థికి సమాన అవకాశాలు ఉంటాయి. పరీక్ష వ్యవధి తక్కువగా ఉన్నందున ఎక్కువ సమయం చదవడానికి కేటాయించాలి. కనీసం 15 గంటలు చదివితే లక్ష్యం నెరవేరుతుంది. సిలబస్ ప్రకారం చదవాలి. జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ వారి ప్రచురణ, నివేదికలు చూసుకోవాలి. పేపర్-2 కోసం ఇంటర్ సివిక్స్ నోట్స్ చదవాలి. ఎన్‌ఆర్‌హెచ్‌ఎం, ఆరోగ్యశ్రీ, రెడ్ రిబ్బన్, ఆశా సంబంధిత కార్యాకర్తల విధులు, బాధ్యతలపై అవగాహన కలిగి ఉండాలి.
 -పి.రమణమూర్తి, డిగ్రీ లెక్చరర్, విశాఖపట్నం.
 
 కోచింగ్‌తో ఉపయోగం ఉంది
 చదువుకోవలసింది విద్యార్థే అయినా.. అత్యధిక పోటీలో నెగ్గుకురావడానికి శిక్షణ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రీజనింగ్, మ్యాథ్స్ అంశాల్లో వేగంగా సమాధానాలు కనుక్కోవడానికి కోచింగ్ నాకెంతో ఉపయోగపడుతోంది. విశాఖలో ఇప్పుడు కోచింగ్ అవకాశాలు పెరిగాయి. బెంగళూరు, హైదరాబాద్, ఇతర రాష్ట్రాల నుంచి నైపుణ్యత గల ఫ్యాకల్టీలను తీసుకు వచ్చి నాణ్యత, సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్‌లో మంచి శిక్షణ ఇస్తున్నారు.
 -ఎస్.శ్రీనివాస్, ఉద్యోగార్థి
 
 ఇదీ షెడ్యూల్..
 విశాఖ రూరల్: వీఆర్వో, వీఆర్‌ఏ ఉద్యోగాల దరఖాస్తుకు ఈ నెల 12వ తేదీలోగా ఫీజు చెల్లించి, 13వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలి. 19 నుంచి హాల్‌టికెట్లను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష తేదీ ఫిబ్రవరి 2. ప్రాథమిక కీ విడుదల నాలుగో తేదీన. ఫైనల్ కీ విడుదల 10న, ఫలితాల ప్రకటన 20న ఉంటుంది. నియామక ఉత్తర్వులు 26న జారీ చేస్తారు. పరీక్ష కేంద్రాలను నగరంలోనే ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికి 50 కేంద్రాలను గుర్తించారు. అభ్యర్థులు అధికమైతే డివిజన్ ప్రధాన కేంద్రాల్లో నిర్వహించడానికి ప్రతిపాదించనున్నారు.
 
 కలిసి రానున్న సిలబస్ : వీఆర్వో, వీఆర్‌ఏ, పంచాయతీ కార్యదర్శి పోస్టులకు ప్రిపేరయితే రానున్న టెట్, డీఎస్సీ పరీక్షలను కూడా సులభంగా ఎదుర్కొనవచ్చు. జనరల్ స్టడీస్, అర్ధమెటికల్, రీజనింగ్ సాధారణంగా అన్ని పరీక్షల్లో ఉంటాయి.

 గ్రామీణ అంశాలపై అవగాహన ముఖ్యం: ఈ ఉద్యోగాల కోసం గ్రూప్స్ కోసం చదివిన స్థాయిలో కష్టపడాల్సిన పనిలేదు. అయితే గ్రామీణ అంశాలపై పరిజ్ఞానం తప్పనిసరి. గణితంపై మంచి పట్టు, కరెంట్ అఫైర్స్‌లో చురుగ్గా ఉండ డం అవసరం.




 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement