2,812 జేఎల్‌ఎం, 330 సబ్ ఇంజనీర్, 118 ఏఈ పోస్టుల భర్తీకి నిర్ణయం త్వరలోనే నోటిఫికేషన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో కొలువుల జాతర ప్రారంభం కానుంది. వరంగల్ కేంద్రంగా పనిచేసే ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్)లో 2,212 జేఎల్‌ఎం (జూనియర్ లైన్‌మెన్), 30 సబ్ ఇంజనీర్, 18 అసిస్టెంట్ ఇంజనీర్‌ల (ఎలక్ట్రికల్, సివిల్)తో పాటు హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్)లో 600 జూనియర్ లైన్ మెన్ (జేఎల్‌ఎం), 300 సబ్ ఇంజనీర్, 100 అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు విద్యుత్ సంస్థలు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ)కి సమర్పించిన నివేదికలో తెలిపాయి.
2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ బిజినెస్, వీలింగ్ టారిఫ్ వార్షిక ఆదాయ అవసరాల (ఏఆర్‌ఆర్) పిటిషన్లలో విద్యుత్ సంస్థలు ఈ కొత్త నియామకాల అంశాన్ని ప్రస్తావించాయి. కాగా, ఐటీఐ చేసిన వారు జేఎల్‌ఎం ఉద్యోగాలకు, పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన వారు సబ్ ఇంజనీర్, బీఈ/బీటెక్ అభ్యర్థులు అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు అర్హులు. ఈ మేరకు పోస్టుల భర్తీ కోసం రెండు డిస్కంలు త్వరలో ఏకకాలంలో నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశాలున్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరంలోనే ఈ ఉద్యోగాల భర్తీ ఉంటుందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment