అదృష్ట ‘పరీక్ష’! | Lucky 'test'! | Sakshi
Sakshi News home page

అదృష్ట ‘పరీక్ష’!

Published Mon, Feb 3 2014 4:17 AM | Last Updated on Sat, Sep 2 2017 3:17 AM

Lucky 'test'!

  •     చిరు ఉద్యోగానికి ఎన్ని వ్యయప్రయాసలో..
  •      వీఆర్‌ఓ, వీఆర్‌ఏ పరీక్షలు ప్రశాంతం
  •      జిల్లాలో 89.34 శాతం హాజరు  
  •      సుదూరం నుంచి తరలివచ్చిన అభ్యర్థులు
  •      కిక్కిరిసిన పరీక్షా కేంద్రాలు
  •  సంగారెడ్డి/కలెక్టరేట్, న్యూస్‌లైన్: నిరుద్యోగ యువతీయువకులు కడలి ప్రవాహంలా కదిలొచ్చారు. ఉద్యోగన్వేషణలో విసిగివేసారిన నిరుద్యోగులు రాకరాక వచ్చిన ఒక్క అవకాశాన్ని ఒడిసి పట్టుకోడానికి హోరాహోరీగా పోటీపడ్డారు. ఒక్కసారిగా వందలు, వేల సంఖ్యలో తరలివచ్చి అదృష్టాన్ని ‘ప రీక్షించుకున్నారు’. చిరుద్యోగమైనా ప్రభుత్వ ఉద్యోగమే నయమని భావించి వ్యయప్రయాసలు పడ్డారు.

    ఆదివారం నిర్వహించిన వీఆర్‌ఓ, వీఆర్‌ఏ పరీక్షలకు మొత్తం 60,477 మంది హాజరు కావాల్సి ఉండగా, 54,034 మంది పరీక్ష రాయడంతో జిల్లాలో 89.34 శాతం హాజరు నమోదైంది. సిద్దిపేటలోని ఓ పరీక్ష కేంద్రంలో ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తూ అక్కాతమ్ముళ్లు అధికారులకు పట్టుబడ్డారు. వీరిపై స్థానిక పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ ఘటన మినహా జిల్లాలో పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి.
     
    వీఆర్‌ఓకు 57,834 మంది దరఖాస్తు చేసుకోగా 51,731 మంది పరీక్ష రాశారు. దీంతో 89.44 శాతం హాజరు నమోదైంది. 6,102 మంది గైర్హాజరయ్యారు.
         
    వీఆర్‌ఏకు 2,643 మంది దరఖాస్తు చేసుకోగా 2,302 మంది పరీక్ష రాశారు. 87.09 శాతం హాజరు నమోదైంది. 341 మంది హాజరుకాలేదు.
     
    కష్టనష్టాలకు ఓర్చి..

    నిరుద్యోగ యువతీయువకులను ఊరించిన వీఆర్‌ఓ, వీఆర్‌ఏ ఉద్యోగాల రాత పరీక్షకు భారీ స్పందన లభించింది. సుదూర ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలుండటంతో అభ్యర్థులు కష్టనష్టాలు ఓర్చి ఎట్టకేలకు పరీక్ష రాశారు. కొందరు అభ్యర్థులు ముందు జాగ్రత్తగా ఒక రోజు ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకుని బస్టాండ్‌లు, లాడ్జీల్లో బస చేశారు. చాలామంది అద్దె వాహనాల్లో వచ్చి పరీక్షలు రాశారు. బస్సులు సమయానికి రాకపోవడంతో కొందరు అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకోలేకపోయారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించవద్దనే నిబంధన మేరకు అధికారులు వీరిని పరీక్ష రాయడానికి అనుమతించలేదు. పరీక్షలు జరిగే ప్రాంతాలకు వెళ్లే బస్సులన్నీ కిక్కిరిసిపోయి కనిపించాయి. ఒక్కసారిగా వేల మంది తరలిరావడంతో హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో ఆహార పదార్థాలు లభ్యం కాక ఇబ్బంది పడ్డారు.  
     
    కలెక్టర్ సందర్శన
     
    కలెక్టర్ స్మితా సబర్వాల్ సంగారెడ్డి పట్టణంలోని సెయింట్ ఆంథోని పాఠశాల, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, మండల పరిధిలోని ఎంఎన్‌ఆర్ కళాశాలను సందర్శించి పరీక్షల నిర్వహణను పరిశీలించారు. కరుణ హైస్కూల్‌లో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్  తనిఖీ చేశారు. సమీకృత కలెక్టరేట్ ఆవరణలోని సెయింట్ ఆంథోనీ పాఠశాల కేంద్రాన్ని సాంఘిక సంక్షేమ శాఖ సంయుక్త సంచాలకులు శ్రీనివాస్‌రెడ్డి తనిఖీ చేశారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement