గుడివాడ రూరల్, న్యూస్‌లైన్ : ప్రభుత్వం గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో), గ్రామ రెవెన్యూ సహాయకుడి (వీఆర్‌ఏ) పోస్టులకు భర్తీకి శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లాలో 64 వీఆర్వో, 403 వీఆర్‌ఏల పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేస్తున్నారు. వీఆర్‌ఏలు డివిజన్‌ల వారీగా బందరు 96, గుడివాడ 104, నూజివీడు 88, విజయవాడ 115 పోస్టులు రిజర్వేషన్లు వారీగా కేటాయించారు. దీనికి సంబంధించి మార్గదర్శకాలు కూడా విడుదల చేశారు. వాటి ప్రకారం.. జిల్లా కేంద్రంగా వీఆర్వోలు, గ్రామ కేంద్రంగా వీఆర్‌ఏల ఎంపిక జరుగుతుంది.
గతంలో వీఆర్‌ఏ పోస్టుకు దరఖాస్తు చేసే అభ్యర్థులు మండలంలో నివాసం ఉన్నవారైతే సరిపోతుంది. ప్రస్తుతం దానిని మార్చి పోస్టు మంజూరు చేసిన గ్రామవాసి అయి ఉండాలని నిబంధన విధించారు. దీంతో పాటు పుట్టిన స్థలం, నివాస, రేషన్ కార్డు, నాలుగు నుంచి ఏడేళ్లలోపు స్టడీ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. 36 సంవత్సరాల లోపువారు మాత్రమే ఈ పోస్టుకు అర్హులు. వివాహ మైన మహిళలు తమ స్వస్థలం గాని, భర్త అడ్రసుతోగాని దరఖాస్తు చేసుకోవచ్చు. వీఆర్వో, వీఆర్‌ఏ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు ఓసీ, బీసీలు రూ.300, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారు రూ.150 చెల్లించాలి.
వికలాంగులు ఎటువంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. దరఖాస్తు రుసుం జనవరి 12 లోపు చెల్లించాలి. దరఖాస్తులు అందించాల్సిన గడువు జనవరి 13తో ముగుస్తుంది. జనవరి 19 నుంచి ఫిబ్రవరి 2 వరకు హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి రెండోతేదీ ఉదయం 10 నుంచి 12 వరకు వీఆర్వోలకు, మధ్యాహ్నం 3 నుంచి 5 వరకు వీఆర్‌ఏలకు పరీక్షలు ఉంటాయి.
100 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షల్లో జనరల్ స్టడీస్ 60, అర్థమెటిక్స్ 30, లాజికల్ స్కిల్స్ 10 మార్కులకు ఉంటాయి. దరఖాస్తులను ఆన్‌లైన్‌లోనే స్వీకరిస్తారు. దగ్గరలో ఉన్న మీ సేవ, ఈ సేవలలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే జిల్లాలోని అన్ని మండల కేంద్రాలు, రెవెన్యూ కార్యాలయాలకు నోటిఫికేషన్ మార్గదర్శక ఉత్తర్వులు పంపించారు.
‘వీఆర్వో, వీఆర్‌ఏ’లకు నోటిఫికేషన్
Published Sun, Dec 29 2013 1:09 AM | Last Updated on Sat, Sep 2 2017 2:04 AM
Advertisement