వీఆర్ఓ, వీఆర్ఏ ఫలితాలు విడుదల: మహంతి
హైదరాబాద్: గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్‌ఓ), గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్‌ఏ) పరీక్ష ఫలితాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి శనివారం విడుదల చేశారు. ఈ ఫలితాల వివరాల జాబితాను ccla.cgg.gov.in వెబ్సైట్లో ఉంచామని ఆయన అన్నారు. వీఆర్ఓ, వీఆర్ఏ పరీక్ష ఫలితాల జాబితాను జిల్లా కలెక్టర్లకు పంపించామని మహంతి చెప్పారు. అయితే ఈ నెల 2న జరిగిన ఈ పరీక్షలకు 14లక్షల మందిపైగా విద్యార్థులు హాజరైన సంగతి తెలిసిందే.
వీఆర్ఓ పరీక్ష రాసిన అభ్యర్థులు 88,609 లక్షల మంది కాగా, వీఆర్ఏ పరీక్ష రాసిన అభ్యర్థులు 11.84 లక్షల మంది హాజరైనట్టు మహంతి తెలిపారు. ఈ నెల 27లోగా ఉత్తీర్ణులైన వారి ధృవీకరణ పత్రాలు పరీశీలించనున్నట్టు మహంతి పేర్కొన్నారు. వీఆర్‌వో, వీఆర్‌ఏ ఫలితాల్లో మొదటి మూడు ర్యాంకులలో నిలిచిన అభ్యర్ధుల వివరాలు..
వీఆర్‌వో ఫలితాల్లో...
చిత్తూరు జిల్లాకు చెందిన నరేందర్‌రెడ్డి మొదటి ర్యాంకు సాధించగా, నల్గొండ జిల్లాకు చెందిన శ్యాంసుందర్ రెడ్డికి రెండో ర్యాంకు, అనంతపురం జిల్లాకు చెందిన యోగానందరెడ్డి మూడో ర్యాంకు సాధించాడు.
వీఆర్‌ఏ ఫలితాల్లో...
అనంతపురం జిల్లాకు చెందిన ప్రభాకర్ మొదటి ర్యాంకు సాధించగా, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కృష్ణారావుకు రెండో ర్యాంకు, నిజామాబాద్ జిల్లాకు చెందిన రామకృష్ణ మూడో ర్యాంకు సాధించాడు.